అమ్మను అరవై సంవత్సరాలక్రితం అమ్మ జన్మస్థల మైన మన్నవలో దర్శించిన అన్నంరాజు మురళీకృష్ణ అన్నవతారమైన అమ్మలో కలిసిపోయాడు మార్చి 31, 2018 అర్ధరాత్రి. నేను సర్వభ్రష్ట లక్షణ సంపన్నుడనండీ! అన్ని అవలక్షణాలు ఉన్న నన్ను ఉద్ధరించటమే ఒక మిరికల్ (అద్భుతం)’ అంటుండే వాడు.
అన్నంరాజు ముర ళీ కృష్ణ అన్నంరాజు మాధవరావుగారు, కనకదుర్గమ్మల పెద్ద కొడుకు మురళీకృష్ణ. మనకందరికీ సుపరిచితమైన కుసుమా చక్రవర్తి వారి చెల్లెలే. మన్నవలో తండ్రితో కలసి అమ్మను దర్శించిన మురళీకృష్ణ అమ్మ అరటిపండు కొద్దిగా తీసుకొని ప్రసాదంగా ఇస్తే ఇదేమిటి ఎంగిలిపండు ఇస్తుంది అని సందేహిస్తుంటే అమ్మ. ఎంగిలి అని సందేహిస్తున్నావా? అని అడిగితే అమ్మో! ఈమె మనసులో మాట గ్రహిస్తుందే అని గుటుక్కున మింగేశాడు.
తరువాత కొమరవోలు గోపాలరావు గారి పెద్దకూతురు పద్మ పెళ్ళికి బంధువుగా జిల్లెళ్ళమూడి వెళ్ళి రెండవసారి అమ్మను చూచాడు. మురళి పెళ్ళి మరొకవారం రోజులలో జరుగబోతుండటంతో అమ్మ మురళిని పెళ్ళికొడుకుని చేసింది. ఆ తర్వాత తరచు అమ్మను చూడటానికి జిల్లెళ్ళమూడి వెళ్ళుతుండేవాడు.
ఒకసారి మురళి నాన్నగారు మురళిని గూర్చి అమ్మతో “వాడు విపరీతంగా తాగుతున్నాడమ్మా! వాడెట్లా?” అంటే “పరుగెత్తి కెళ్ళేవాడ్ని పట్టుకోలేం. వెళ్ళనియ్యి. పరిగెత్తి పరిగెత్తి అలసిపోతాడుగా. అప్పుడు పట్టుకుందాం” అన్నది.
ఉప వారి కంపెనీలో, రాలీస్ ఇండియాలో పనిచేస్తూ ఒకచేత్తో రమ్ బాటిల్, మరోచేత్తో కారు డ్రైవింగ్ చేస్తూ ఉద్యోగాలు పోగొట్టుకొని భార్యా పిల్లలందరినీ తీసుకొని జిల్లెళ్ళమూడి అమ్మవద్దకు చేరాడు. అమ్మ తన కడుపులో శ్రీ పెట్టుకొని పిల్లల యోగక్షేమాలు విచారిస్తూ ఒక సంవత్సరంపాటు కాపాడింది. ఆ సమయంలోనే ఒకరోజు మురళి కనిపించకపోతే వాడేడమ్మా, కనిపించలేదంటే భార్య శశి బాపట్ల వెళ్ళాడని చెప్పింది. బాపట్ల నుండి తాగి వచ్చాడు మురళి. ఆ రోజుతో మురళిని ఉద్దరిద్దామనుకున్నది. ఈ తాగుడు నీవు మానకపోతే, నీవు కుటుంబాన్ని పోషించవలసిన పనిలేదు. నేను నీ కుటుంబాన్ని, మీ నాన్నను చూచి ఇక్కడ ఉంచుకున్నాను అని బాగా కోప్పడ్డది. రోషంతో మురళి కూడా ‘నిన్ను దేవతవనుకున్నాను. నీ దగ్గరకు వచ్చాను. నాకు ఆ దురలవాటు తీసివేయాల్సిన బాధ్యత నీదే. ఆ బుద్ధి పుట్టించకుండా చేయాల్సింది నీవే’ అని అమ్మతో అన్నాడు. ఆ తర్వాత త్రాగుడు మీద, సిగిరెట్టు మీద విరక్తి పుట్టేట్టు చేసింది అమ్మ. ఆ రోజు నుండి ఏ చెడు లక్షణాలు లేకుండా బుద్ధిమంతుడైనాడు. మురళి అమ్మ రక్షణలో. అంత తాగుబోతు ఒక్కసారిగా మానేస్తే అనారోగ్యం చేస్తుంది, నెమ్మదిగా మానెయ్యాలని చాలామంది సలహాలిచ్చారు. అయినా ఏ మాత్రం ప్రలోభ పడకుండనే అమ్మ నామ పానం చేస్తూ కాలం గడిపేవాడు. వాళ్ళ నాన్న గారు మాధవరావుగారు పోయినప్పుడు బార్లన్నీ వెతికి పట్టుకు రావాల్సిన స్థితిలో ఉన్న మురళి ఇంత బుద్ధిమంతుడైనాడంటే ఎవరూ నమ్మలేరు. ఏ గుణనిధో, సుకుమారుడో, నిగమశర్మో, నిరంకుశుడో కావ్యాలలోని ప్రబుద్ధులు జ్ఞాపకం వస్తుంటారు మురళి కథ వింటే.
ఊరికే చేతులు ముడుచుకొని తింటూ కూర్చోటం మురళికి ఇష్టం లేక వ్యాపారం పెట్టుకుంటానమ్మా! అని అమ్మని అడిగాడు. ఏం వ్యాపారం చేస్తావురా? పెట్టుబడి ఎట్లా? అన్నది అమ్మ. నీవు దయతలిస్తే ఏదో ఒకటి పెడతానమ్మా నీవే పేరుపెట్టి నడిపించు అన్నాడు. అమ్మ మురళి వాళ్ల నాన్నగారి పేర “మాధవీ ఎంటర్ప్రైజస్” అని పేరు పెట్టింది. బస్ స్టాండ్ ఎదురుగా పెట్టగా “మీ వ్యాపారంలో నేనూ ఒక భాగస్వామిని రా!” అన్నది. అయిదువేలతో ప్రారంభమై ఆ వ్యాపారం ఈ రోజు అయిదు కోట్ల పైగా టర్నోవర్ మూడుపూలు ఆరు కాయలుగా వర్థిల్లుతున్నది.
మురళి భార్య శశికి ఒక కాన్పులో జుట్టంతా ఊడిపోయి నున్నగా తయారయింది తల. ఆమె చాల బాధపడ్డది. ఊడి పోయిన జుట్టు ఎందుకు ఊడిపోయిందో, వస్తుందో రాదో కూడా చెప్పలేక పోయారు డాక్టర్లు. ఆమె బాధ చూడలేక మురళి అమ్మవద్దకు తెచ్చి ‘తిరుపతి స్వామి మ్రొక్కు తీర్చలేదేమో! అందుకే జుట్టు ఊడి పోయిందేమో శశికి అంటున్నారమ్మా! అందరూ’ అని అమ్మతో చెప్పాడు. అమ్మ “మ్రొక్కు తీర్చలేదని ఆడదాని జుట్టు తీసేవాడు దేవుడెట్లా అవుతాడురా!” అని “శశిని దగ్గరకు తీసుకొని తల నిమిరింది అంతే. ఆ మర్నాటి నుండి శశికి జుట్టు రావటం మొదలై చక్కగా జుట్టు వచ్చింది. తిరుపతి వెళ్ళి తలనీలాలు ఇచ్చి వద్దామని భార్య అంటే మనకు అన్ని క్షేత్రాలూ అమ్మే అని, నీవే వెంకటేశ్వరస్వామివి నీకే తలనీలాలిస్తామమ్మా! అన్నాడు. నీకా నమ్మకముంటే నేనే తీసుకుంటానని మూడు కత్తెరలు వేసి జుట్టు తీసుకున్నది అమ్మ.
గుండేలరావుకు రామునిగా, గంగరాజు పున్నయ్యకు కృష్ణునిగా, తురుమెళ్ళ వెంకటప్పయ్యకు సత్యనారాయణ స్వామిగా, నల్లికి ఏసయ్యగా, మరియమ్మగా, లక్షణాచార్యులకు నృసింహస్వామిగా దర్శనమిచ్చిన అమ్మ ఏదికాదు కనుక. అన్నీ అయిన అమ్మ నమ్మిన వారికి ఏదైనా కాగలదు, కాపాడ గలదు. అసలు విశ్వాసమే భగవంతుడన్నది కదా!
వ్యాపారం దిన దినాభివృద్ధి చెందుతున్న రోజులలో మురళికి బైపాస్ సర్జరీ చేయాల్సి వచ్చింది. సమయానికి కావాల్సిన డబ్బు దస్కం సమకూడటమే కాక విజయవాడ పెద్ద హస్పిటల్లో ఆపరేషన్ జరిగి హాయిగా తేరుకున్నాడు అమ్మ దయతో.
జిల్లెళ్ళమూడికి ఏ రకమైన సహాయం కావలసినా ముందుండేవాడు. ఒక కూరగాయలు తరిగే మిషన్ కానివ్వండి, పిండి తయారు చేసే గ్రైండర్ కానివ్వండి, పెద్ద టి.వి. కానివ్వండి, పెద్ద నేమ్ బోర్డులు కానివ్వండి, అమ్మ నాన్నల పోలికలు గల పంచలోహ… విగ్రహాలు కానివ్వండి, ప్రత్యేక సంచికలకు అడ్వర్టైజ్మెంట్ కానివ్వండి దేనికైనా ముందుండి తన దాతృత్వాన్ని ముందుకు చాచేవాడు.
ప్రత్యేకించి గోపాలన్నయ్యకు, నాకు గుంటూరు నుండి జిల్లెళ్ళమూడి పోవటానికి తన కారును సర్వవేళలా సిద్ధంచేసి ఇచ్చేవాడు. మాతృశ్రీ అధ్యయన పరిషత్ అధ్యక్షునిగా గుంటూరులో అమ్మ గుడి కట్టించాలని తపన పడ్డాడు. చౌడవరం లలితా పీఠంలో అధ్యయన పరిషత్ సభ్యుల సహకారంతో ఒక చిన్న గుడి అమ్మకు కట్టించాడు కూడా. అయితే అమ్మ పోలికలు ఆ విగ్రహానికి రాలేదని మనవాళ్ళంగీకరించలేదు పెద్దగా.
తన బిడ్డలు, బంధువుల సహాయంతో అయిదు లక్షలతో ఒక లైఫ్ సైజు అమ్మ విగ్రహాన్ని మూడేళ్ళు శ్రమించి తయారు చేయించాడు. దానిలో నిజంగా అమ్మ పోలికలు బాగా వచ్చాయి. జిల్లెళ్ళమూడి అన్నపూర్ణాలయంలో ఉన్నదిప్పుడు.
దానిని గుంటూరులో ఎక్కడైనా ప్రతిష్ఠింప చేయాలని అతని చిరకాల వాంఛ. అమ్మ ఎప్పటికి నెరవేరుస్తుందో. ఆ పని మీదనే ఈ మధ్య అమెరికా నుండి శ్రీ బ్రహ్మాండం రంగసాయి వస్తే అతనిని తీసుకొని వెళ్ళి స్థలం చూపించాడు. అలాగే జేమ్స్న అభ్యర్ధించాడు. అమ్మ అనుగ్రహం ఎప్పటికి వస్తుందో. ఆ ఆలయ కార్యరూపం ఎప్పటికి నెరవేరుతుందో!
సాలోక్యం, సామీప్యం, సారూప్యం, సాయుజ్యం అని నాలుగు రకాల మోక్షాలుంటాయని చెపుతున్నారు గనుక తృప్తిగల జీవిగా మురళి మాతృలోకానికే వెళ్ళాడు కనుక అమ్మ సిద్ధాంతం ప్రకారం అక్కడే అమ్మకు సన్నిహితంగా ఉంటాడు కనుక అమ్మ అనుగ్రహాన్ని తొందరగా పొంది ఇలలో తన కోరికను సాఫల్యం చేయించగలడని భావిద్దాం.
ఈ రోజు అర్ధరాత్రి అమ్మలో ఐక్యమౌతాడనగా, క్రితం రోజు మార్చి 30న అమెరికానుండి వచ్చిన సోదరుడు శ్రీ బ్రహ్మాడం రంగసాయితో క్షేత్ర దర్శనం, పుణ్యపురుషుల దర్శనం చేసుకొన్న భాగ్యశాలి.
మురళి అమ్మలో కలిశాడని తెలిసిన ‘రవి’ (అమ్మ బిడ్డ) “మనవాళ్ళందరూ వరుసగా రామ్మూర్తి గారు, రాజు బావ, శేషు, రాజగోపాలాచారి, రామకృష్ణన్నయ్య, గోపాలన్నయ్య, మన్నవ భూషి. అన్నంరాజు రామకృష్ణారావు, కేశవశర్మ, మురళి ఇలా ఒక్కొక్కరూ అమ్మలోకానికి చేరుతున్నారు. అక్కడ అమ్మ శతజయంతికి పరిషత్ జనరల్ బాడీ మీటింగ్ పెట్టారేమో” అని అన్నమాట నిజమౌతుంద నిపిస్తున్నది.