అమ్మ జీవిత మహోదధిలో వెలసిన ఉత్తుంగ తరంగం మరిడమ్మ తాతమ్మ. బంధుత్వరీత్యా అమ్మ తండ్రి సీతాపతిగారికి చిన్న మేనత్త మరిడమ్మగారు. సంసారసుఖం ఎరుగని బాలవితంతువు. ఆధ్యాత్మిక సంపన్నురాలు. భక్తురాలు. అన్నగారి కుమారుడు, మేనల్లుడు అయిన సీతాపతి శర్మగారి కుటుంబంలోనే ఒక సభ్యురాలిగా కాలం వెళ్ళబుచ్చింది. పరోపకారపరాయణిగా అందరి మేలుకోరుతూ అందరికీ సేవచేసింది.
అమ్మ పుట్టిన 29వ రోజున యాజలి నుండి వచ్చిన మరిడమ్మగారితో అమ్మ తల్లి రంగమ్మ గారు అమ్మ ఉనికిని గూర్చి భయపడుతూ చెపితే “నీ పిల్ల వంశపావని,” భయపడాల్సిన పని లేదు అని రంగమ్మను దగ్గరకు తీసుకుని ఓదార్చింది. రోజు రాత్రి పడుకున్న రంగమ్మ ముఖంలో అమ్మమ్మ ఒడిలో వుండి అమ్మ పాలుత్రాగుతున్నట్లు అమ్మమ్మ తలకు పడగ పట్టినట్లు కనపడుతుండగా “ఇంకా అనేక విచిత్రములు జరగును” అని వినపడ్డది. మొదటిసారి అమ్మ జన్మించిన తర్వాత జరిగిన విశేషం మరిడమ్మగారికే కావటం అమ్మ అనుగ్రహంలో భాగమే అంతేకాదు అటు జరుగుతున్న చిత్రములు ఇటు రంగమ్మగారు పిలుస్తున్న పిలుపు గమనిస్తూ రెండూ ఒకేసారి కాలాన్ని గుర్తించక గుర్తిస్తున్నది. దీనినే సహజ సమాధి అంటారు పెద్దలు.
ఆ రోజు నుండి మరిడమ్మగారే అమ్మకు మేలుకొలుపులు పాడుతూ నిద్రలేపటం, జోలపాడుతూ నిద్రపుచ్చటం చేస్తుండేది. అమ్మకు మూడవ నెలరాగానే పూర్ణిమనాడు ముద్దుకుడుము లిద్దామని నానబోసిన బియ్యం పిండి కొట్టమని పనిమనిషి ఖాదర్జీకి చెప్పి ఇంట్లోకి వెళ్ళింది. ఖాదర్బీకి ఈ మాట వినపడక ఏదో పని చేసుకుంటున్నది. ఖాదరీ కనుపించ లేదుగాని పోటువినపడి బియ్యం మెరిగి, పిండి అయి ఉంటుంది. బియ్యానికి మించిన పిండి ఉన్నది. జల్లెడపట్టాల్సిన అవసరం లేనంత మెత్తగా ఉన్నది. ఇదంతా తన గురువుగారు పాతగుంటూరులోని మల్లెల రత్తమ్మగారి మహిమ అనుకుంటుంది మరిడమ్మగారు. ఆమెకు ఆ రోజు ఎన్నో అనుభవాలు ప్రసాదించింది అమ్మ. సంవత్సరన్నర కూడా సరిగా నిండని అమ్మకు మరడిడమ్మగారు నిత్యం చేసే సత్కాలక్షేపం అర్థమవుతూనే ఉండేది. ఆ రోజులలోనే ఒకసారి మన్నవలో మంత్రి ప్రగడ రాజమ్మగారింట్లో దానిమ్మ చెట్టుక్రింద, తెనాలిలో అమ్మ అమ్మమ్మగారింట్లో దానిమ్మ చెట్టు క్రింద నల్లగుడ్డను పైకి పోనిచ్చి అరమోడ్పు కన్నుతో చేప నిద్రమాదిరిగా యెడమ కాలును చాచి కుడికాలును వెనక్కు పోనిచ్చి ఉచ్ఛ్వాస నిశ్వాసాలు ఆపి శాంభవీముద్రలో ఉన్నది. అమ్మ తెనాలిలో అమ్మ పెదతల్లి అన్నపూర్ణమ్మగారు అమ్మను ఎందుకట్ల కూర్చున్నావని అడిగితే అది శాంభవీముద్రలే, మరిడమ్మ తాతమ్మ చెప్పిందిలే అన్నది. చెప్పిందా చేస్తుంటే చూశావా? అంటే చేస్తుంటే చూశాను అడిగితే చెప్పింది అని సమాధానం ఇచ్చింది అమ్మ. సహజంగా యోగీశ్వరేశ్వరి అయిన అమ్మ మరిడమ్మగారికే ఆ గొప్పతనాన్ని కూర్చాలనుకున్నది. ఏమైనా మరిడమ్మగారే అమ్మకు శ్రద్ధగా అన్నం పెట్టుతుండేది. అయితే ఆ అన్నం అమ్మకు ఇమిడేది కాదు లోపలికి పోయిన రీతిలోనే బయటకు వచ్చేసేది.
అమ్మ తల్లి రంగమ్మగారు పోయింతర్వాత పిల్లలని ఎవరు పెంచాలి అనే సమస్య వచ్చింది. అమ్మను అందరూ తీసుకెళ్ళుతూవుంటారు గాని రాఘవరావుమామయ్యను ఎవరూ తీసుకెళ్ళటానికి ఇష్టపడకపోతే మరిడమ్మగారు ఒక సంవత్సరం దాకా ఎవరో ఒకరు చూస్తే యేతల్లో ఒక తల్లి కాచి పోస్తుందిలే అని సీతాపతి తాతగారికి రెండవ పెళ్ళి ప్రస్తావన తెస్తుంది. తాతగారు ఒప్పుకోరు. అమ్మను తెనాలిలోని అమ్మ మాతా మహులు తీసుకెళ్ళుతామంటే తాతగారు నాకూ బాధ్యత తీరుతుంది తీసుకెళ్ళమంటారు. మరిడమ్మగారు సీతాపతి తాతగారితో “నీకున్న బాధ్యత నీకున్నది పిల్లను వారితో పంపించేసి పిల్లాడి పెళ్ళి చేసేద్దామనుకోగానే బాధ్యత తీరిపోదు. దేనికైనా కాలం కలిసి రావాలి” అంటుంది.
గంగరాజు పున్నయ్యగారు అమ్మను కృష్ణునిగా దర్శించి తెలిసీ తెలియని స్థితిలో ఉండగా చిదంబరరావుగారు అమ్మతో మాట్లాడుతుంటే మరిడమ్మగారు కల్పించుకొని మీగొడవే మీదా! పున్నయ్య సంగతి ఏమైనా ఆలోచించారా? అన్నది. అందుకు అమ్మ ఆలకించలా, లాలించానన్నది. లాలించట మేమిటి బ్రహ్మాండమై నప్పుడు పాలించదూ అన్నారు చిదంబరరావుగారు. బ్రహ్మాండమైనప్పుడు పాలించే తీరుతుంది అన్నది అమ్మ. మరిడమ్మతో అమ్మ “మా అన్నయ్య ఇంకా అన్నానికి రాలేదు. అందరం తిన్నాం తల్లికి ఒక బిడ్డ రాకపోయినా దిగులే” అన్నది. అదేమిటి అన్నయ్యను పట్టుకొనిబిడ్డ అంటావు? వాడు అన్నంతినకపోతే బాధపడే తల్లి దాటిపోయిందిగా? అన్నది మరిడమ్మగారు. “వాడు అన్నం తినకపోతే బాధ పడే తల్లిపోయినా ఎవరు అన్నంతినకపోయినా బాధపడే తల్లి ఉన్నది?” అన్నది. “పెంచిన మమకారం నీకు ఈ మాట చెప్పే అమ్మ అమ్మగా అర్థంగాకుండానూ ఉన్నది” అన్నది అమ్మ. మరిడమ్మగారికి అమ్మ ముఖంలో తన గురువుగారు మల్లెల రత్తమ్మగారు వచ్చి చెబుతున్నట్లున్నది. చిదంబరరావుగారు మరిడమ్మగారితో మీ నాయనమ్మ అమ్మాయమ్మగారు, అన్నగారు చలపతిరావు, అందరికీ సేవచేసే నీవు మీ ముగ్గురి సాధన చతుష్టయ సంపత్తి సారం అమ్మగా (అనసూయ) అవతరించింది అంటే ఆనందంతో మరిడమ్మగారు కళ్ళనీళ్ళు పెట్టుకొని ఈ ఉద్దేశం చెదరకుండా నీలో చేర్చుకో తల్లీ! మళ్ళీ మాయను కప్పవద్దని స్తోత్రం చేసింది. అమ్మ పుట్టినప్పటి నుండి జరిగిన విశేషాలు తలచుకొని మహాపురుషుడు పుట్టేటప్పటి లక్షణాలున్నయ్యనుకుంది.
అమ్మ మరిడమ్మగారితో మీ అమ్మ అమ్మాయమ్మగారి సంగతి చెప్పు అనగా “మా అమ్మ అమ్మాయమ్మే యీ అమ్మ అయితే ఇంకా చెప్పేదేముంది? నీకు తెలియందేమున్నది” అన్నది. అందుకు అమ్మ నాది తెలిసీ తెలియని స్థితి అన్నది. అది నీవంటి వాళ్ళకు వర్తిస్తుందటమ్మా? అది చిన్న పిల్లల్ని అనే మాట అంటూ కృష్ణుని సుద్దులు పాడుతూ అమ్మకు తలంటి స్నానంచేయించింది, మరిడమ్మ తాతమ్మ. ఒకసారి తాతమ్మ అమ్మను తీసుకొని గుంటూరు పోతుండగా తాటిపర్తి దగ్గర ఒక ఘోషాయి కనిపించి అమ్మకు నమస్కారం చేశాడు. అమ్మ అతన్ని కుశల ప్రశ్నలు వేసింది. తాతమ్మతో సన్యాసమంటే ఏమిటి? గృహస్థంటే ఏమిటి? ఘోషాయి అంటే ఎవరు? అంటూ రకరకాల ప్రశ్నలు వేస్తూ ఆరాలు తీస్తుంటే ప్రహ్లాదుడు, ధృవుడల్లే అవుతావేమో! అంటుంది అమ్మతో. అమ్మ పినతల్లి శేషమ్మగారు అమ్మను వాళ్ళింట్లో అట్టిపెట్టుకుంటానికి తీసుకు రమ్మంటే తాతమ్మ అమ్మను తీసుకొని చీరాల వెళ్ళింది. అక్కడ నూనె పానకాలుగారి తోటలో మౌనస్వామి ఉన్నారని తెలిసి అమ్మ, తాతమ్మ అక్కడికి పోయి వచ్చారు. తర్వాత అమ్మ మౌనస్వామితో మాట్లాడి మౌనం వీడి తనతో మాట్లాడినందుకు సంతోషిస్తుంది. మరిడమ్మగారితో కలిసి మంత్రోపదేశమైన సుబ్బాయమ్మగారు సన్యాసి జీవితం గడుపుతూ పోయింది. ఆరాధన అంటే యేమిటో చూద్దామని అమ్మ కూడా తాతమ్మతో చేబ్రోలు వెళ్ళింది. అప్పుడే రెడ్డిపాలెం కాంతయ్యగారి ఆశ్రమానికి కూడా తాతమ్మతో వెళ్ళింది. తిరిగి వస్తూ కాలువ గట్టున నడిచి వస్తుండగా చిన్నపిల్ల అమ్మను నడిపిస్తున్నందుకు తాతమ్మ బాధపడ్డది. అమ్మ తాతమ్మతో నేనే బాటలో నడిచినా చింతలు కనబడుతుంటయ్యేం? చింతలున్న బాటలో నేను నడుస్తున్నానా? నేను నడిచే బాటలో చింతలున్నయ్యా? ఏమైనా నా వెంట చింతలు తప్పవు, అంటూ దాహం వేస్తున్నది అన్నది. తాతమ్మ తన వద్ద ఉన్న ఒక నారింజ పండు యిచ్చింది. అది వొలుస్తుంటే ప్రక్కనే ఉన్న. కాలువలో పడ్డది. అక్కడ ఒక కొండ చిలువ ఉన్నది. దారిన పోయే ఒక అబ్బాయి దగ్గర తాబేటి కాయ ఉంటే పిల్లకు మంచి నీళ్ళుకావాలని అడిగింది. అవీ లేవు అయిపోయినవి అంటాడు. అప్పుడు అమ్మ “ఎంత ప్రేమగల వాళ్ళున్నా, ఎన్ని ఉన్నా బాధపడే యోగ్యత ఉన్ననాడు ఎవరూ తప్పించలేరు” అన్నది తాతమ్మతో.
అమ్మ ఒక రోజు నానబెట్టిన మినప్పప్పు కడుగుతూ తాతమ్మను ఈ నీరెందుకు పచ్చబడ్డది? పొట్టుకున్న రంగు నీటి కొచ్చింది. సాంగత్యబలం అంటే ఇదేనా? నీరే పొట్టును పప్పును విడదీసింది. కాని దాని సహజమైన రంగు మారకతప్పలా. శక్తి రకరకాలుగా ఉన్నది. ఈ శక్తేనేమో భగవంతుడంటే. భావానికి రూపం ఉన్నది. రూపానికి పేరున్నది. శక్తి ఉన్నది. ఇందులో ఏదీ తక్కువది కాదు. అంతేనా తాతమ్మా? అనగా ఎవరో అడిగినట్టు చెప్పుకు పోతున్నావు. నన్నడిగే దేమున్నది అన్నది తాతమ్మ. తాతమ్మను అడుగుతున్నట్లు ఉండి తానే తాతమ్మనలా తీర్చి దిద్దుతున్నదేమో అనిపించే రీతిలో ఉంటుంది అమ్మ తత్వచింతన.
అమ్మ పెళ్ళి విషయంలో కూడా తాతమ్మ అమ్మను నాన్నగారి కిచ్చి చేయాలని ఆశ. ఇటు తల్లిలేని పిల్ల అటు తండ్రిలేని బిడ్డ, ఆ యిద్దరినీ ఒకటి చేసి తన కున్న ఆస్తి కూడా వాళ్ళకే ఇద్దామని వాళ్ళ దగ్గరే కడతేరి పోదామని ఆమె కోరిక, అటు సీతాపతి తాతగారికి, ఇటు కనకమ్మ బామ్మకు పరిపరి విధాల చెప్పి చూస్తుంది. అందరినీ పెంచింది ఆమే కనుక అందరినీ ఒప్పించటానికి తాపత్రయ పడ్డది. నాన్నగారు అంగీకరిస్తారు తాతమ్మ మాటకు. తర్జనభర్జనల అనంతరం ఎట్టకేలకు అనుకున్నట్లుగానే అమ్మ నాన్నల కళ్యాణం తాతమ్మ ఇష్ట ప్రకారం జరిగింది.
రైతు పాపయ్యకు అమ్మ గ్రామదేవత, పోతరాజుగా కనిపిస్తుంది. తన్మయావస్థలో ఉంటాడు. మరిడమ్మగారు చూచి నిర్వికల్ప సమాధిలోకి వెళ్ళాడనుకుంటుంది. మరిడమ్మగారికి ధ్యానయోగం తెలుసు ధ్యానం ఎట్లా చేస్తావు. తాతమ్మా? అని అమ్మ అడుగగా దృష్టిని మనస్సును ఏకం చేసి చూస్తామన్నది. దృష్టిని మనస్సును ఏకం చేసేది మనస్సే కదా? అప్పుడు నీవు ఎక్కడ వుండి చేస్తావు అన్నది అమ్మ. చిన్నపిల్లైనా ఆత్మజ్ఞానం కలిగిన పిల్ల అనుకున్నది తాతమ్మ.
అమ్మ సందె గొబ్బెమ్మ పెడతానంటే తాతమ్మ సరేనని వడపప్పు, పానకం, జామపళ్ళు ముత్తైదువులకు ఇవ్వు అంటుంది. తమల పాకులు కావద్దూ అన్నది. అమ్మ. అవి ఈ ఊళ్ళో దొరకవు కదమ్మా అన్నది తాతమ్మ. పోనీలే వేప చిగుళ్ళు, రావి ఆకులు ఇద్దాం అన్నది అమ్మ. తమల పాకులు మంగళప్రదం. రావి ఆకులనివ్వటమేమిటి? అని తాతమ్మ అనగా అమ్మ ఏది మంగళప్రదముకాదు? ప్రతి ఆకు మంగళప్రదమే. భగవంతుడికి ఇష్టం కాని దేముంది? నివారణకే వినాయక చవితి నాడు అన్ని ఆకులతో పూజ చేయడం. ఆ సందేహ పోవడానికే ఆవు పేడతో సందెగొబ్బెమ్మను చేసి గౌరిదేవిగా పూజిస్తారు అన్నది అమ్మ. తాతమ్మ అమ్మతో ఏకీభవిస్తుంది.
కామేశ్వరమ్మ అమ్మమ్మ, అమ్మ మాట్లాడుకుంటూండగా అమ్మ అన్న మాటలు విని తాతమ్మ ప్రేమ, ద్వేషముకూడా తన కొరకే అనుకోవచ్చునా అని అడిగింది. దూషణలు, భూషణలు సర్వం తనకొరకే. సర్వం తనుగా తోచనంత వరకూ ఈ నిజస్థితి అర్థంకాదు. అంతా తన కొరకే అని తోచిన నాడు అంతా తానే అవుతాడు. అన్నది అమ్మ. తాతమ్మ కళ్ళ వెంట నీళ్ళు తిరిగి అమ్మను దగ్గరకు తీసుకొని ముద్దు పెట్టు కున్నది.
అమ్మకు దెబ్బ తగిలింది. తాతమ్మ మానసికంగా బాధ పడ్డది. ఏబాధైనా అది శరీర బాధైనా, మానసిక బాధైనా పడేది మనస్సే అన్నది అమ్మ. శరీర బాధను అనుభవించకుండా మనస్సును వేరు చేయ వచ్చు. రమణ మహర్షి అలా చేశాడు. దానిని సమాధి స్థితి అంటారు అన్నది తాతమ్మ. మనస్సుకు శరీరానికి సంబంధం లేకుండా వేరు చేయడమా? అని, అలా రమణమహర్షిలా వేరు చేయడం చేతకాక, ఏమత్తూ, తీసుకోకుండా బాధ లేకుండా ఉండే స్థితిని ఏమంటారు? అన్నది అమ్మ. సహనం అంటారు అన్నది తాతమ్మ. ఆ సహజ సహనమే దైవం! అన్నది అమ్మ. సందె గొబ్బెమ్మను కాలవలో ఓలలాడించి రమ్మంది తాతమ్మ. ఓలలాడించటమంటే నీళ్ళలో కలపటమేగా! తయారు చేసింది కాలువలో మట్టి పెట్టి. ఎక్కడ తయారందో అక్కడ కలిసి పోవటమన్నమాట. ఆ కలిసిపోయే వేడుకలో, ఆ వేడుకకు కావలసిన సామానులో దైవత్వాన్ని చూడటానికే ఇవన్నీ అన్నది అమ్మ. ఆ విషయం సందెగొబ్బెమ్మ పెడుతున్న రోజే చెప్పావు? నీకు క్రొత్తగా చెప్పేదేముంది? నీకు తెలియనిదేమున్నది? అన్నది తాతమ్మ. నిజంగా నీకు నామీద అటువంటి అభిప్రాయం ఉన్నదా? తాతమ్మా! అని అమ్మ అడగ్గా తప్పకుండా ఉందమ్మా? అన్నది తాతమ్మ.
ఈ రకంగా మరిడమ్మగారి తత్వం వింటున్నట్లు నటిస్తూ అసలు తత్వాన్ని వివరిస్తూ తనయెడల పూర్ణ విశ్వాసాన్నీ నమ్మకాన్నీ కలిగించి మరిడమ్మ తాతమ్మను తరింప చేసింది అమ్మ.
మాయా మానుష రూపిణి, లీలా నాటక విలాసినియైన అమ్మ మరిడమ్మ తాతమ్మకు శాశ్వతానందాన్ని ప్రసాదించింది.