గుంటూరుజిల్లాలో నక్సలైట్
ఉద్యమకారుల హిట్లెఫ్లై మొదటి పేరై వారి తీవ్రపదజాలంలో అడవులదీవి జమీందారీలు ఆడవారి మెడల బంగారు పట్టెడలన్నీ (నగలు) తీని కాడిని తగిలించి వీధుల వెంట ఊరేగిస్తామని ఘోషించుకొన్న, ఘోషా స్త్రీల కోవకు చెందిన సుశీలక్కయ్య విశ్వకుటుంబ సభ్యురాలిగా జిల్లెళ్ళమూడిలోని విశ్వజననికి అందరింటికి సేవలు చేసే స్థాయికి చేరిందంటే. ఆమె మనస్సులో వారి కుటుంబంలో అమ్మ. ఎంత నిశ్శబ్ద విప్లవం తెచ్చిందో ఊహించుకుంటేనే ఆశ్చర్య ఆనందాలతో కళ్ళవెంట ఆనందాశ్రువులు రాలుతాయి.
సుశీలక్కయ్యవి ఎంత నిశ్చితమైన అభిప్రాయాలో, అమ్మ పట్ల ఎంత విశ్వాసమో మాటలలో చెప్పటం కష్టం. సున్నితమైన ఆమె మాటలలో ఎంత ఆలోచన, ఎంత పరిణతి కనిపిస్తుందో ఆమెతో బాగా అనుబంధం ఉన్నవారికి ఒకటికి నాలుగుసార్లు మాట్లాడిన వారికే తెలుస్తుంది. వంటింటి కుందేళ్ళుగా, ఏ పరాయి మగవాడిని కన్నెత్తి చూచే అవకాశమూ, అలవాటూలేని జమీందారీ కుటుంబంలో పుట్టి జమీందారీ కుటుంబంలో మెట్టి వివాహమైన నాలుగేళ్ళకే (తన 20 ఏటనే) భర్తను కోల్పోయి అసూర్యంపశ్యగా పెద్దలు చెప్పు చేతలలో జీవించిన సుశీలక్కయ్యలో ఎంత ఇంటి పెద్దలనైనా సున్నితంగా ఎదిరించి నిలబడ గల ఆత్మవిశ్వాసాన్ని అమ్మ నింపిందో ఆలోచిస్తే అమ్మ చేసి చూపించిన నిశ్శబ్ద విప్లవం అవగాహనకు వస్తుంది.
1925 ఫిబ్రవరిలో గుంటూరుజిల్లా వల్లూరు గ్రామంలో ఆ ఊరికరణం (ఆ రోజులలో గ్రామకరణం అంటే ఊరికి మకుటం లేని మహారాజులు – పైగా జమీందారులు) శ్రీ వల్లూరి బసవరాజు, శ్రీమతి వరలక్ష్మీలకు నాల్గవ కుమార్తెగా జన్మించింది. పుట్టింది, పెరిగింది, వానాకాలపు విద్య వరకు నేర్చింది. వల్లూరులోనే. ఆంధ్రప్రదేశ్లో మంత్రిగా పనిచేసి రాజకీయ చతురునిగా పేరుగాంచిన వల్లూరి బసవరాజుదీ ఆ కుటుంబమే. సుప్రసిద్ధ హైకోర్టు న్యాయవాదిగా, కుర్తాళ శ్రీ సిద్ధేశ్వరీపీఠ ఉత్తరాధికారిగా అయిన శ్రీ విమలా నందనభారతీస్వామి (శ్రీ వల్లూరు వెంకటేశ్వర్లు) వారిదీ ఈ కుటుంబమే.
పదహారేళ్ళు కూడా గట్టిగా లేని యుక్తవయస్సులో అడవులదీవి గ్రామకరణాలైన శ్రీ యల్లాప్రగడ సత్యనారాయణగారి (మంత్రులుగాని, కలెక్టరులుగాని ఎవరు వచ్చినా ముందు వారింటికి వచ్చి వారి ఆతిథ్యం తీసుకొనే బయటకు వెళ్ళేవారు) పెద్దకుమారుడు వెంకటలక్ష్మీనరసింహశర్మతో 1941లో వివాహమైంది. రెండేళ్ళకే కుమారుడు (మధు) జన్మించాడు. మధుకు రెండేళ్ళు రాకముందే భర్త స్వర్గస్థుడైనాడు. నాలుగేళ్ళ అనురాగ దాంపత్యంలో భర్తను కోల్పోయి అంతులేని దుఃఖంలో మానసికంగా కృంగి కృశించి శరీరం మీద తెల్లటి బట్ట మాత్రమే ధరించి కన్నబిడ్డను పెంచి పెద్దచేయటం సామాన్యమైన విషయం కాదు.
1960లో అమ్మను చూచేదాకా 16 సంవత్సరాలు (సీతారాములు 14 ఏళ్ళు వనవాసక్లేశం అనుభవించారు కాని ప్రపంచం ఎలా ఉంటుందో తెలియకుండా నాలుగు గోడల మధ్య గృహవాసం చేసింది. “అమ్మను చూచిన ఆ మధురాతి మధురమైన ఆ క్షణం ఆ ఒక్కక్షణమైన చాలు. జన్మజన్మల పుణ్యఫలమిదే కాబోలు” అనేంతటి మహత్తరశక్తి సుశీలక్కయ్యలో నిండి నిబిడీకృతమైంది. ఎక్కడికీ బయటకు అడుగుపెట్టని ఆమె తన మరిది – తోడికోడలు, తెనాలిలోని ఆడబడుచువారి భర్త, వాళ్ళ పిల్లలు తన బిడ్డ మధు అందరూ బ్రతిమాలి . బలవంతం చేసిన మీదట అమ్మసన్నిధిని చేరింది. అమ్మకు అందరూ కాళ్ళు కడుగుతుంటే – “మనస్సు కదా కడగాల్సింది కాళ్ళు కడగటమేంటి” అనుకుంది అక్కయ్య. కాని ఆశ్చర్యం ఏమిటంటే అమ్మ దగ్గరకు పిలిచి నీళ్ళు తెప్పించి కాళ్ళు కడిగించుకుంటుంటే అమ్మలోని ఆ వాత్సల్యానికి ఆప్యాయతకు కళ్ళవెంట ధారాపాతంగా ప్రవహించిన కన్నీటితోనే అమ్మ కాళ్ళు కడిగింది. తాను ముత్తెయిదువ కాదు కనుక తాను తెచ్చిన చీర రవిక పసుపు కుంకుమలు తోడికోడలి కిచ్చి అమ్మకు ఇమ్మంటే ఆమె మేము ఇదివరకే ఇచ్చాం అన్నది. అమ్మ ఇది గమనించి సుశీలక్కయ్య చేత కాళ్ళకు పారాయణి పసుపు కుంకుమలతో పాటు చీరె, రవిక పెట్టించుకుంది. పూలు తలలో పెట్టించుకొంది. పెట్టిన చీరె రవిక కట్టుకొని వచ్చి చూపించింది. అప్పుడు తాను ఇంతకాలం ఆరాధించిన సీతమ్మతల్లే యీమె అనిపించింది. సుశీలక్కయ్య కోరిక ప్రకారం నాన్నగారు కూడా వచ్చి అమ్మ ప్రక్కన కూర్చొని బట్టలు పెట్టించుకున్నారు. మనస్సులోనే అమ్మను సకుటుంబంగా అడవులదీవి రమ్మని ఆహ్వానించింది. తిరిగి అడవులదీవి వెళ్ళిం తర్వాత, తన జీవితానికి అమ్మ తప్ప ఇంకేమీ లేదు అనిపించింది.
సుశీలక్కయ్యను పిలిపించుకుంది అమ్మ ఒకసారి. ఆ నృసింహజయంతి. అమ్మ ఒళ్ళో తల పెట్టుకొని హాయిగా పడుకొన్నది అక్కయ్య.. అమ్మను ముద్దుపెట్టుకున్నది. అమ్మ ప్రక్కలో పడుకున్నది. సుశీలక్కయ్య ఒడిలో అమ్మ కూర్చున్నది. సుశీలక్కయ్య చేత నీళ్ళు పోయించుకున్నది. ఖద్దరు చీర, బొట్టు పెట్టించుకున్నది. ఆడ మగా తేడా లేకుండా అందరికీ గాజులిప్పించింది అక్కయ్య చేత. బంధువులు ముఖ్యమా, దేవుడు ముఖ్యమా అనే తర్కం మనసులో కలిగినప్పుడు దేవుడే ముఖ్యం అనిపించింది. అక్కయ్యకు. తనదనుకున్న ప్రతి వస్తువూ అమ్మకే అర్పించింది.
అమ్మ కర్పూరపు ముద్దచూపించి ఇది ఎవరు తీసుకుంటారంటే ఎవరూ ముందుకురాలేదు. సుశీలక్కయ్య నాకివ్వమ్మా అన్నది. అమ్మ కర్పూరం, అగ్గిపెట్టె, ఎండుకొబ్బరి చిప్ప ఇస్తూ ఇవి ప్రతిష్ఠకు ఉంచాలి అన్నది. ‘నీ దయ ఉంటే అలాగే’ అన్నది సుశీలక్కయ్య. అమ్మ విగ్రహప్రతిష్ఠకు వాటిని వినియోగించారు.
సుశీలక్కయ్యతో అమ్మ నీవు చింతించనవసరం లేదు నీ బిడ్డ బాధ్యత నేను తీసుకుంటున్నాను. మధు బరువు బాధ్యతలను తన నెత్తికెత్తికొని అన్నీ జరిపించింది. అడవులదీవిలో పెద్దలకెవరికీ ఇష్టం లేకపోయినా ఒక్కగానొక్క కొడుకు మధు పెళ్ళి జిల్లెళ్ళమూడిలో చేసింది అమ్మ. ఆ పెళ్ళిలో అన్నీ తానై అమ్మే చేసింది. నాన్నగారితో మా అబ్బాయి పెళ్ళి అని చెప్పి అందరినీ పిలిపించింది. ఆ పెళ్ళిలో ‘హైమమ్మ’ ఆడబడుచు 16 రోజులూ పెళ్ళి సందడే బాపట్ల నుండి తూములూరి కృష్ణమూర్తిగారు వచ్చి పెళ్ళి వరుస పాటలు పాడారు. రోజూ పెళ్ళిసందడే – వింధుభోజనాలే మరమరాల దండలు, పాపటిబిళ్ళలు. ఇంట్లో ఉన్న (అడవులదీవిలో వెండివస్తువులన్నీ తెచ్చి అమ్మకు హైమకూ ఇచ్చారు. అమ్మ మాత్రం మీరు తెచ్చినవేవీ వద్దు అన్నీ నేనే ఇస్తాను అంటూ కాళ్ళు కడిగే ఇత్తడి పళ్ళెం దగ్గర నుండి అమ్మ తెప్పించి ఇచ్చింది. ఆఖరికి 16 రోజుల పండగై అడవులదీవి వెళ్ళేటప్పుడు బాపట్లలో కేశవశర్మ వాళ్ళ ఇంట్లో విడి విందుభోజనం. ముందు అమ్మకు, నాన్నగారికి హైమకు అప్పగింతలైన తర్వాతే మిగతావారికి. కాపురానికి వచ్చినపడు కృష్ణవేణమ్మ – గజేంద్రమ్మ – రుక్మిణమ్మక్కయ్యకు సారె – అంతేకాదు మధు పిల్లల వ్యవహారం పెళ్ళిళ్ళ వ్యవహారం అంతా అమ్మే చూసింది. ఆఖరికి ఆరోగ్యంగా బాగోలేక మధు భార్య లలితకు బిడ్డలు పుట్టకుండా ఆపరేషన్ చేయించాలనుకుంటే ఒక మగబిడ్డ పుట్టనివ్వండిరా అని వరపుత్రుని ప్రసాదించింది. అమ్మ వద్దకు వచ్చిం తర్వాత సుశీలక్కయ్య ఇంట్లో పచ్చతోరణం కట్టింది లేదు అన్నీ జిల్లెళ్ళమూడిలోనే.
మధు వాళ్ళ నాన్న ఆబ్దికం జిల్లెళ్ళమూడిలోనే పెట్టించింది. అమ్మ ఇచ్చిన చీర కట్టుకొని సుశీలక్కయ్య పూజ చేసుకొన్నది. మధుచేత వడ్డన చేయించుకొని అన్నీ కలిపి అందరికీ ప్రసాదం పంచి ఇక తద్దినాలు పెట్టక్కరలేదు అంది.
సుశీలక్కయ్య అమ్మకు ఒక్కరోజున ఆరుసార్లు స్నానం చేయించిన రోజులున్నాయి. హైమకు కూడా అక్కయ్య స్నానం చేయించేది. హైమ ఒక రోజు అక్కయ్యను అడిగింది. “నన్ను చూస్తే నీకేమనిపిస్తుంది?” అని. అక్కయ్య తడుముకోకుండా “తల్లిగొబ్బెమ్మ దగ్గర పిల్ల గొబ్బెమ్మలాగా ఉన్నది” ఎంత గొప్ప పోలిక.
అమ్మతో ఒక్కరోజు సుశీలక్కయ్య నిన్ను చూచింతర్వాత ఇంకెక్కడికీ వెళ్ళాలని అనిపించటం లేదు అన్నది. ఈ తృప్తి ఇంకెక్కడా కలగదు అని. సీతారామకళ్యాణం లాగా నాన్నగారికీ నీకూ కళ్యాణం చేస్తామమ్మా ! అన్నది. నాన్నగారిని అడగండి అన్నది అమ్మ. నాన్నగారు అంగీకరించారు. నాలుగైదు సంవత్సరాలు మాచేత చేయించుకున్నది అమ్మ అని చెప్పింది సుశీలక్కయ్య. పెళ్ళిలో ఏమి ఎలా చేయాలో అలా చెప్పి చేయించుకున్నది. పాదాలకు తలంబ్రాలు పోయటం జరిగింది. ఆ రోజు అడవుల దీవి నుండి 1000 లడ్లు చేయించి తెచ్చి నివేదన చేయటం జరిగింది.
అక్కయ్య కలలో ఒకసారి 1000 ఉండ్రాళ్ళు చేయించి పెట్టమన్నది అమ్మ. గుంటూరులో శ్రీరామరాజు కృష్ణమూర్తిగారి ఇంట్లో మేడమీది మాతృశ్రీ అధ్యయనపరిషత్ గుంటూరుశాఖ వారు అనసూయావ్రతం చేస్తుంటే సుశీలక్కయ్య కుటుంబంతో సహా వేయి ఉండ్రాళ్ళు చేసి తీసుకొచ్చి ఆ వ్రతంలో పాల్గొన్నది. నివేదన చేసిన వెంటనే ఒక ఆవుదూడ, ఆవు, కోడె మూడూ వచ్చి బయటి వాకిట్లో ఎదురుగా నిలబడి ఉన్నాయి. అమ్మ, నాన్నగారు, హైమ ఆ రూపంలో వచ్చారని ఆనందంతో నివేదన చేసిన ఉండ్రాళ్ళు పెడితే హాయిగా తిని వెళ్ళాయి. జిల్లెళ్ళమూడిలో పనిచేసేవారంతా దేవతలే – అక్కడ వాళ్ళందరికీ అడవులదీవి నుండి చెప్పులు కుట్టించి పంపించింది ఒకసారి. ఎంత విశిష్టమైన సేవ. ఆలోచన .
సుశీలక్కయ్య మొదటిసారి జిల్లెళ్ళమూడి వెళ్ళినప్పుడు అమ్మ అడవులదీవి రావాలని మనసులో కోరుకున్నది. ఆ కోరిక తీరాలి కదా ! మరి. అమ్మ రెండవ కుమారుడు రవికి అడవుదీవిలోని సుశీలక్కయ్య మరిది యల్లాప్రగడ ఉమామ హేశ్వరరావుగారి రెండవ కూతురు వైదేహిని ఇచ్చి వివాహం జరిపించటం యల్లాప్రగడవారి వంశాన్ని తరింపచేయటానికే అంటుంది సుశీలక్కయ్య. ఆ వివాహానంతరం నిద్దర్లకు అడవులదీవి ప్రయాణం ఒక బస్సు జనం తిరుణాలగా వెళ్ళారు. అమ్మ కూడా వచ్చింది. ఈ కళ్యాణ కార్యక్రమంలో సుశీలక్కయ్య పాత్ర సామాన్యమైంది కాదు.
అంతేకాదు వసుంధర తమ్ముడు డాక్టర్ కోన సత్యనారాయణమూర్తికి కూడా అడవులదీవిలోని తలగడదీవి వారి ఆడపడుచు ‘రాజ్యం’ను ఇచ్చి వివాహం జరిపించటంలోనూ అంతర్లీనంగా ఆమె ప్రోత్సాహమే కారణం.
అమ్మకు స్నానం చేయించే రోజులలో అమ్మ వాడి తీసివేసిన ప్రతివస్తువు సుశీలక్కయ్య చాలా భద్రంగా దాచుకుంది. అవే ఆమె ఆస్తిపాస్తులు. ఆంతరంగికంగా అమ్మతో ఎన్నో అనుభవాలు, అనుభూతులు పొందిన సుశీలక్కయ్య ఎవరినీ ఏ రకంగానూ కష్టపెట్టకుండా తన పనులు తాను చేసుకొంటూ నిరంతరం అమ్మ ధ్యాసలో తరించిన ధన్యజీవి. 27.10.2013న అమ్మలో ఐక్యమైంది.