జిల్లెళ్ళమూడి అందరింటి చరిత్రలో శ్రీ అయ్యగారి శ్రీ చక్రవర్తి, శ్రీమతి కుసుమా చక్రవర్తిలకు ఒక ప్రత్యేక స్థానమున్నది. వారిద్దరూ అమ్మ భక్తులు, దంపతులు. అమ్మ పట్ల అపార విశ్వాసం కలవారు. భక్తి అంటే తెలియంది ఏముంది? ఆ దేవతను వదిలి ఉండ లేని స్థితేగదా!
అమ్మతో శ్రీ ఎ.యస్. చక్రవర్తి, శ్రీమతి కుసుమ చక్రవర్తి
అంత మాత్రాన వాళ్ళు కష్టాలు పడలేదని – సుఖాలు పొందలేదనీ కాదు. కొండముది రామకృష్ణ అన్నయ్య అన్నట్లు కష్టాల కడలి లోతులూ సంతోషపు టాకాశాల ఎత్తులు చూపించిందనీ కాదు. రామకృష్ణ అంతకాక పోయినా కొంత ఆ కష్టసుఖాల అనుభవాల బలాలు రుచి చూచిన వారే వీరు కూడా.
ఒకనాడు ఆంధ్రదేశంలో ప్రధానమైన ఆంధ్ర సైంటిఫిక్ కంపెనీ నిర్మాతల యజమానుల వారసుడు చక్రవర్తి. సుప్రసిద్ధమైన అన్నంరాజు వారింటి ఆడబడచు కుసుమ, ఆ చక్రవర్తి గృహిణి. పైగా ఇద్దరూ అపారమైన తెలివితేటలు గలవారు. ఎంతవారైతేనేం? కాలం కలిసిరాకపోతే లక్ష్మీదేవిని వక్షస్థలంలోనే పెట్టుకొన్న విష్ణుమూర్తి తరిగి పొట్టివాడై మూడడుగుల నేల బిచ్చుమెత్తుకోవాల్సి వచ్చింది. కుబేరుడంతటి మిత్రుడు, సర్వశక్తి ప్రదాయిని అయిన సతీదేవిని తన శరీరంలో సగభాగాన నిలుపుకున్న పరమేశ్వరుడంతటి వాడు చెట్టు తొఱ్ఱలో దాక్కోవలసి వచ్చింది.
“వాయువశంబులై యెగసి వారి ధరంబులు మింటకూడుచున్
పాయుచునుండు కైవడి ప్రపంచము సర్వము కాలతంత్రమై
పాయుచు కూడుచుండు ఒక భంగి చరింపదు కాలమన్నియున్
చేయుచునుండు కాలము విచిత్రము దుస్తర మెట్టివారికిన్”
అందుకే “కాలమే భగవంతుడు నాన్నా!” అంటుంది కాలస్వరూపిణి అయిన అమ్మ. తాను కూడా కాలానికి కట్టుబడి అన్నీ అనుభవించింది. మనం దేవుళ్ళనుకునే విష్ణుమూర్తి, మహేశ్వరుడంతటి వాళ్ళకే తప్పలేదు కాలానికి లొంగక శ్రీ చక్రవర్తి, శ్రీమతి కుసుమాచక్రవర్తి కూడా కాలం వక్రించి ఒక కారు షెడ్డులో నివాసముండవలసిన పరిస్థితి ఏర్పడ్డరోజులున్నాయి. అదే చక్రవర్తి ఒక ఇల్లు కట్టుకొని సొంతంగా ఒక కంపెనీ పెట్టుకొని, అమ్మకు ఒక ఆలయం కట్టించి నిత్యనైవేద్య దీపధూపాదులు స్వయంగా చేస్తూ, ఒక పది పుస్తకాల దాకా అమ్మ అనుగ్రహాన్ని, వైభవాన్ని చరిత్రను వ్రాసి ప్రచురించగలిగిన దాకా ఎదిగారంటే, నలుగురికి అమ్మ హైమల నామ మంత్రాల ద్వారా, మందుల ద్వారా అనారోగ్యాన్ని పారద్రోలి ఆరోగ్యాన్ని కలిగించే స్థాయికి ఎదిగారంటే ఎంత గుండెధైర్యం, ఎంత విశ్వాసం, ఎంత సహనం కావాలి? కష్టసుఖాలు రెండూ అమ్మ ఇచ్చినవే అని చూడగలిగిన సమ్యక్ దర్శనం అందుకో గలిగారంటే వారికి చేతులెత్తి నమస్కరించాల్సిందే.
శ్రీ ఎ.యస్.చక్రవర్తి విశిష్టము, విచిత్రము అయిన వ్యక్తిత్వం కలవారు. తల్లిదండ్రులు రోహిణమ్మ- అయ్యగారి రామమూర్తి. చక్రవర్తిగారు వారి పెద్దకుమారుడు. ఒక తమ్ముడు ముగ్గురు సోదరీమణులు కూడా ఉన్నారు. బాల్యం అంతా బందరులోనే గడిచింది. అక్కడి నోబుల్ హైస్కూలు, హిందూకాలేజీలలో విద్యాభ్యాసం. 1932లో జన్మించిన చక్రవర్తి 1955 లోనే ఢిల్లీలో సెంట్రల్ గవర్నమెంటు ఉద్యోగంలో చేరారు. 1960 ఫిబ్రవరి లోనే కుసుమను వివాహం చేసుకొని ఉద్యోగం వదిలి బందరు వచ్చి మెడికల్ షాపు పెట్టుకున్నారు. అక్కడే అయిదు సంవత్సరాలు గడిపి 1965లో విశాఖలో వెంకటేష్ మెడికల్స్ పెట్టారు. అప్పటి నుండి విశాఖ పట్టణంలోనే జీవితాంతం గడిపారు. ఆ అనుభవంతో అశోక్ ఫార్మస్యూటికల్స్ చేరి 2022లో అందులో రిటైరయ్యేదాకా పనిచేశారు. 2000 సంవత్సరంలో ఆ కంపెనీవారే కంపెనీకి సొంత బిల్డింగ్ కట్టటానికి ప్రయత్నం చేస్తుండగా అందులో ఒక మూల అమ్మ గుడి నిర్మించుకోవటానికి స్థలం కేటాయించమని అభ్యర్థించి అక్కడ ఆలయ నిర్మాణం చేశారు. అమ్మ పాలరాతి విగ్రహాన్ని 2002లో ప్రతిష్ఠించుకున్నారు.
రిటైరైన వెంటనే పూర్వం చేసిన కంపెనీ అనుభవంతో రిగార్డియా ఫార్మసూటికల్స్ కంపెనీని సొంతంగా ఏర్పాటు చేసి దానిని అభివృద్ధి పరిచారు.
1971 ఆగష్టులో మొదటిసారి వారికి అమ్మను చూచే అదృష్టం కలిగింది. అమ్మను చక్రవర్తి దంపతులు చూశారనటం కన్నా అమ్మ వారిని చూచింది. ఆ చూపులో ఏ ఆకర్షణ వారిని వశపరచుకున్నదో అమ్మను మించిన దైవం లేదనే స్థితికి వచ్చారు.
రావూరి ప్రసాద్ ఒకసారి మాటల సందర్భంలో అమ్మ వారిచే రోజుకు 11 సార్లు అమ్మ లలితా సహస్ర నామపారాయణ చేయించింది అని చెప్పారు. చక్రవర్తిగారికి అది హృదయంలో నాటుకున్నది. అదే జీవితం అన్నింటికీ అండగా ఉంటుందని భావించారు. మాటే మంత్రంగా ఆనాటి నుండి నిత్యం 11 సార్లు లలితా సహస్ర నామపారాయణ ఎన్ని మండల దీక్షలో చేశారు. జీవితంలో ఎన్ని ఒడుదుడుకులు వచ్చినా అదే వారిని తట్టుకొని నిలబెట్టింది.
శ్రీ తంగిరాల కేశవశర్మగారు ఉద్యోగరీత్యా విశాఖకు 1965లో ఒకసారి, 1982లో ఒకసారి వచ్చారు. వారితో కలిసి చక్రవర్తి దంపతులు అమ్మ పూజలు, సంకీర్తనలు, ఉపన్యాస కార్యక్రమాలు, లలితాసహస్ర నామ పారాయణలు ఏర్పాటు చేశారు. 12 సంవత్సరాల పాటు ప్రతి దుర్గాష్టమికి 24 గంటలు అహోరాత్ర లలితా సహస్ర నామపారాయణలు చేశారు. సర్వశ్రీ ఎ.వి.నరసింహారావు గారు, సన్యాసిరావు గారు, శరభలింగం గారు, కామేశ్వరరావు గారు మొదలైన ఎంతోమంది సోదరులు సహాయ సహకారాలందిస్తూ ఒక క్రమశిక్షణ గల సైన్యంలా పనిచేసేవారు.
అప్పుడు కేశవశర్మగారు బీజం వేసిన ఆ కార్యక్రమాలను చక్రవర్తిగారు అందిపుచ్చుకొని ప్రతి సంవత్సరం బాలపూజ, కుమారీపూజ, సువాసినీ పూజ దుర్గాష్టమికి ఇప్పటికీ అమ్మ మందిరంలో జరుపుతూనే ఉన్నారు.
అమ్మ మాటల సందర్భంలో ఒకసారి తనకు హెూమియోపతి వైద్యం అంటే నమ్మకం అని చెప్పింది. అమ్మ చెప్పిన ఆ మాట వారి నరనరాలలో జీర్ణించుకు పోయింది. హెూమియో వైద్యం మొదలు పెట్టి కొన్ని వేలమందికి ఆరోగ్యప్రదాతగా తయారయ్యారు. డబ్బులు తీసుకోకుండా ఉచితంగా వైద్యం చేసే శక్తిని అమ్మ ప్రసాదించింది. వారికి ఒక కుమారుడు, ఇద్దరు కుమార్తెలు. అందరూ విద్యావంతులే. సమర్థులే.
చక్రవర్తిగారికి హైమవతీదేవి పట్ల అపార విశ్వాసం. ఎవరికి ఏ రకమైన బాధ కలిగినా, పిల్లలకు పెళ్ళిళ్ళ విషయంలో, ఉద్యోగాల విషయంలో దేనికైనా హైమ నామం చేయండి మీకు వెంటనే ఫలితం కనిపిస్తుందని ఉపదేశించేవారు. నిజంగానే అలా వారి మాట ప్రకారం చేసి ఎందరో అనుభూతులు పొందారు. ఈ విషయాలన్నీ వారు వ్రాసిన “క్షణక్షణం – అనుక్షణం” – అనే గ్రంథం స్పష్టంగా మనకు తెలియజేస్తుంది.
చక్రవర్తిగారు పెద్దలు, గురువు పట్ల ఎంతో పూజ్యభావంతో ఉండేవారు. శ్రీశైలం పూర్ణానందస్వామి వారు వారి ఆలయ ప్రతిష్ఠ విషయంలో ఎన్నో సూచనలిచ్చి సహకరించారు. కుర్తాళం శ్రీ సిద్ధేశ్వరీ పీఠాధిపతులు, విశాఖ శ్రీ లలితాపీఠాధిపతులు అయిన శ్రీ సిద్ధేశ్వరానంద భారతీస్వామి వారిని ఎంతో భక్తి శ్రద్ధలతో సేవించేవారు.
జిల్లెళ్ళమూడిలో విశాఖ గెస్ట్ హౌస్ శ్రీ మాత నిర్మాణ కార్యక్రమంలో ఎంతో శ్రద్ధ తీసుకొన్నారు. జిల్లెళ్ళమూడిలో జరిగే ధాన్యాభిషేక కార్యక్రమానికి విశాఖ పక్షాన నేతృత్వం వహించేవారు. విశ్వజనని మాసపత్రికకు కవరేజీ కలర్లో ప్రింట్ చేయటానికి సాయం చేయమంటే కొన్ని సంవత్సరాలుగా మిత్రులతో కలిసి సాయం చేస్తూనే ఉన్నారు.
ఇంటికొచ్చిన వారిని ఆదరించటంలోనూ, గౌరవించటంలోనూ కుసుమాచక్రవర్తులు ఆదర్శ దంపతులే. జిల్లెళ్ళమూడిలో మాతృశ్రీ మెడికల్ సెంటర్కు వారి మెడికల్ కంపెనీ ద్వారా మందులను ఉచితంగా సరఫరా చేశారు.
“విపత్తి కాలే గృహిణీ పరీక్షా” అంటారు. యుద్ధంలో నిలబడినప్పుడే సైనికులకు పరీక్ష, అగ్నిలో నిగ్గుతేలినప్పుడే బంగారానికి పరీక్ష, విద్యావంతుని నిగ్గు తేల్చడానికి భాగవతంలో పరీక్షించాలట. విపత్తులు సంభవించి కష్టాలలో సతమతమైనప్పుడు గృహిణి నిలబడగలిగితే అది గృహిణికి పరీక్ష. అమ్మ కుసుమాచక్రవర్తి దంపతులను అన్ని కష్టకాలాలలో నిలబడగల్గినందుకు వారిని ప్రశంసిస్తూ ఉండేది.
చక్రవర్తిగారు తన చివరి రోజుల్లో కూడా లలితా సహస్రనామం, విష్ణు సహస్రనామం, అమ్మ పాటలు పాడుకుంటూ కాలక్షేపం చేశారు. ప్రశాంతంగా, ఆనందంగా తన 88వ ఏట 31.8.2020న అమ్మలో లీనమైనారు. ఆయన ధన్యజీవి.
జయహోమాతా శ్రీఅనసూయా రాజరాజేశ్వరి శ్రీపరాత్పరి