కొండముది రామమూర్తిగారు
జరీ పేటంచు ఖద్దరు పంచె, ఖద్దరు లాల్చీ, నుదుటన కుంకుమబొట్టు, పెదవులపై చెదరని చిరునవ్వు, నిరంతర కర్తవ్య దీక్షాపరాయణత, కార్యనిర్వహణ దక్షత, జిల్లెళ్ళమూడి సోదరీసోదరుల పట్ల ఎనలేని ఆప్యాయత, ఆర్తులను ఆదుకొనే మనస్తత్వం, తన యింటిని మరొక జిల్లెళ్ళమూడిగా మలచటం, ఆకర్షణీయమైన వ్యక్తిత్వం వెరసి శ్రీ కొండముది రామమూర్తిగారు. అనటం ఉచితం. అందరి తలలోని నాల్కగ మసలుతూ అమ్మకు హాయినీ, విశ్రాంతినీ కలిగించారు రామమూర్తిగారు. అమ్మ చెప్పకుండానే అమ్మ మనస్సు ఎఱిగి తగినట్లు పనులు చక్కదిద్దిన కర్తవ్య పరాయణుడు, కర్మవీరుడు.
జిల్లెళ్ళమూడిలో పనిచేసే వారి పట్ల సానుభూతి, సంస్థకు అండగా నిలచే వారి పట్ల ఆదరణ, సంస్థ బాగోగుల విషయంలో నిశ్చితమైన అభిప్రాయాలు, వాటిని సరియైన పదాలలో వ్యక్తీకరించగల నేర్పు, నిష్కర్షత రామమూర్తిగారికి పెట్టని భూషణాలు.
అమ్మ “ఎవరైనా తాను కనిపిస్తే చూస్తారుగాని లేకపోతే ప్రక్కనుండి పోతున్నా చూడలేరన్నది. అంటే తాను కావాలనుకుంటేనే తన వద్దకు ఎవరైనా వస్తారు. అని అర్థం. రామమూర్తిగారికి అమ్మ సేవలో పాల్గొనే అదృష్టం అమ్మ కల్పించిందే.
1960లో మొదటిసారి శ్రీ వల్లూరి రామమోహనరావుతో కలసి జిల్లెళ్ళమూడి వచ్చి అమ్మను దర్శించారు. విచిత్రమేమిటంటే అమ్మ ఎవరి మనసులపై ఎలా ఎప్పుడు ప్రభావం చూపుతుందో చెప్పలేం. వీరికి తెలియకుండానే అమ్మ ముద్రవీరిపై పడింది.
ప్రకాశం జిల్లా ఇంకొల్లు గ్రామంలో కొండముది లక్ష్మీనరసింహం – రత్తమ్మ దంపతులకు 1923లో జన్మించిన రామమూర్తిగారు గుంటూరు హిందూకాలేజీలో చదువుకొని 1943లో రైల్వేశాఖలో ఉద్యోగంలో చేరారు. సుప్రసిద్ధ గ్రంథాలయోద్యమ సేవకులు, వేటపాలెం గ్రంథాలయ వ్యవస్థాపకులలో ఒకరు అయిన శ్రీ అడుసుమల్లి శ్రీనివాసరావుగారి మేనల్లుడు శ్రీరామమూర్తిగారు. శ్రీనివాసరావుగారి అల్లుడు, చీరాలలో హైస్కూలు ప్రధానోపాధ్యాయులు అయిన రాజుపాలెం రామచంద్రరావుగారి ద్వారా 1959లోనే అమ్మను గూర్చి విన్నారు. వారి మరొక మేనమామ శ్రీహర్షరావుగారు కూడా అమ్మ వద్దకు తరచూ వస్తుండేవారు.
1943లో రైల్వేశాఖలో ఉద్యోగంలో చేరిన రామమూర్తిగారు మద్రాసులో ఉద్యోగరీత్యా ఉంటున్న సమయంలో శ్రీ వల్లూరు రామమోహనరావుకు కూడా రైల్వేలో మద్రాసులోనే ఉద్యోగం రాగా రామచంద్రరావుగారి సలహాపై రామమూర్తిగారితో కలసి ఒకే ఇంట్లో ఉండటం తలస్థించింది. రామమోహన రావు చీరాలలో ఉన్న రోజులలో ప్రతి శని, ఆదివారాలు జిల్లెళ్ళమూడికి వచ్చి అమ్మ సేవలో పాల్గొన్నవాడు కావటంతో మోహనరావు ప్రభావం రామమూర్తిగారి మీద బాగా పడ్డది. అమ్మను గూర్చిన చర్చ, చింతన వారి మధ్య బాగా జరిగేది. రామమూర్తిగారికి హైదరాబాద్ బదిలీ అయింది.
రామమూర్తిగారు మద్రాసులో ఉంటున్న రోజులలోనే అమ్మ 1973 స్వర్ణోత్సవాల తరువాత కోటిమందికి దర్శనం ప్రసాదించే ప్రణాళికలోని భాగంగా మద్రాసు వెళ్ళిన సందర్భంలో అమ్మ రామమూర్తిగారింటికి వెళ్ళి అక్కడే స్నానాదికాలు ముగించుకొని వారిని ఆనందాంబుధిలో ఓలలాడించింది. మాటల సందర్భంలో అమ్మ రామమూర్తిగారితో పదవీ విరమణ తర్వాత జిల్లెళ్ళమూడి రమ్మని చెప్పింది. ఏదో మాటల సందర్భంలో చెప్పిన యీ మాట మామూలుగా అయితే మనం మరచిపోతాం. కాని వారి మనసులో అప్పుడే నిర్ణయం జరిగిపోయింది. అమ్మది తోలునోరు కాదు కదా! తాలు మాట రావటానికి.
మేనమామ అడుసుమల్లి శ్రీనివాసరావుగారి దౌహిత్రులు, రాజుపాలెం రామచంద్రరావుగారి కుమారులు అయిన (శేషు) శేషగిరిరావు, రామకృష్ణరావు (కిష్టు)లతో కలిసి తరచు అమ్మ రెండవ కుమారుడు ‘రవి’ రామమూర్తిగారిని కలుస్తూ ఉండేవాడు. అది రానురానూ బాగ ఆత్మీయతగా బలపడింది. దానికి మరొక సంఘటన కూడా దోహదం చేసింది. రామమూర్తిగారి రెండవ కుమారుడు శ్రీనివాసమూర్తి యం.టెక్ చదివి ఐ.డి.పి.యల్లో పనిచేస్తుండేవాడు. ఒక రోజు అకస్మాత్తుగా ఎవరికీ చెప్పకుండా ఇంటి నుంచి వెళ్ళి పోయినాడు. అతడి కోసం విచారించాల్సిన అన్ని చోట్ల విచారించారు. ప్రయోజనం శూన్యం. ప్రయోజకుడైన కొడుకు కనిపించకపోతే తల్లిదండ్రుల పరిస్థితి, బాధ వర్ణనాతీతం. ఆ పరిస్థితులలో ఆ లోటును కొంత పూడ్చటానికి అమ్మ రెండవ కుమారుడు బ్రహ్మాండం రవి తోడ్పడ్డాడు. రామమూర్తిగారు రవిలో వాళ్ళ కుమారుని చూసుకుంటుండేవారు. రవి హైదరాబాద్ లో ఉద్యోగం చేసే రోజులలో రామమూర్తిగారి ఇంటికి దగ్గర ఉండటంలోని ఆంతర్యం రామమూర్తిగారి అనారోగ్యంతో పాటు ఇది కూడా ఒకటి.
ఇక కొండమూది రామమూర్తిగారు అమ్మ అనుగ్రహించిన రీతిలో ఉద్యోగ విరమణ అనంతరం 1981లో అమ్మ సేవకై జిల్లెళ్ళమూడి వచ్చారు. శ్రీ విశ్వజననీపరిషత్ స్థానిక కార్యదర్శిగా పనిచేశారు. నిరంతరం చెరగని చిరునవ్వుతో సోదరీ, సోదరులను పలుకరిస్తూ వారిలో ఉత్సాహాన్ని నింపుతూ చేయవలసిన కార్యం పట్ల అంకితభావాన్ని కలిగిస్తుండేవారు. అన్ని పనులు సమర్థవంతంగా నిర్వహించేవారు. ఆయన కార్యదక్షతకు అమ్మ ఎంతో సంతోషించేది. అమ్మ ఆలయం ప్రవేశం తర్వాత కూడా విశ్వజననీపరిషత్ కార్యక్రమాలను నాలుగేళ్ళు 1989 దాకా నిర్వహించారు. దురదృష్టవశాత్తూ రామమూర్తి గారికి పక్షవాతం రావటంతో ఒక పుష్కరకాలం పై చిల్కు మంచానికే పరిమితం కావల్సి వచ్చింది. హైదరాబాద్లో స్వగృహంలో ఉన్నా నిరంతరం ఆయన మనస్సు జిల్లెళ్ళమూడి పరిషత్ కార్యక్రమాల చుట్టూ తిరుగుతుండేది. 1946లో వివాహమైన దగ్గర నుండి వారి శ్రీమతి సుశీలక్కయ్య సహధర్మచారిణి అనే మాటను సార్ధకం చేస్తూ వారికొనర్చిన సేవ, అతిధి మర్యాదలు ఆదర్శనీయం.
తపనే తపస్సనీ, ధ్యాసే ధ్యానమనీ అమ్మ చెప్పిన మాటలు రామమూర్తిగారి పట్ల అక్షరసత్యాలు. ఆయన తపనంతా జిల్లెళ్ళమూడి కార్యక్రమాలు సక్రమముగా జరగాలనీ, ధ్యాసంతా వైభవంగా అన్ని కార్యక్రమాలూ నిర్వహింప బడాలనీ, జిల్లెళ్ళమూడి సోదరీ, సోదరులకు పెద్ద దిక్కుగా నిండైన మనిషిగా ఉన్నారు. జిల్లెళ్ళమూడి అభివృద్ధికి వారి మనసులో ఒక ప్రణాళిక ఉన్నది. దాని అమలుకు ఆయన ఎన్నో సూచనలు చేశారు. అభివృద్ధి పథంలో పయనిస్తున్న నేటి అందరింటిని చూస్తే ఆయన ఎంతో సంతోషించేవారు. శ్రీ విశ్వజననీపరిషత్ విశ్వవ్యాప్తమై అమ్మ చూపించిన వెలుగు కిరణాలు దిగంతాల దాకా వెదజల్లాలనే వారి ఆకాంక్ష నెరవేరి, ఆ పరంవైభవ స్థితిని ఆకాశంలో ధుృవతారగా నిలచిన రామమూర్తిగారు చూచి తృప్తిగా మనల్ని ఆశీర్వదించాలని కోరుకుందాం.
మరొకటి రామమూర్తిగారు పుట్టుకలోను, అమ్మలో చేరటంలోనూ విశిష్టతనే సంతరించుకున్నారు. అమ్మ జన్మించిన 1923లో జన్మించారు. నాన్నగారు అమ్మలో ఐక్యమైన ఫిబ్రవరి 17ననే వీరూ అమ్మలో ఐక్యమైనారు. తమ 80వ యేట 2003లో ధాన్యాభిషేకం రోజున అమ్మపాదాల పై ప్రాణాభిషేకం చేసి ధన్యులైనారు. రామమూర్తిగారు ధన్యజీవి.