(నదీరా)
1934లో గోదావరిజిల్లా ముమ్మిడివరంలో నవుడూరి వీరభద్రం రత్నమాణిక్యమ్మల గర్భశుక్తి ముక్తాఫలంగా జన్మించినవాడు శ్రీ నదీరా. బాలయోగి జన్మించిన ముమ్మిడివరంలోనే ఈ కవియోగి, కీర్తనా నిర్మాణయోగి జన్మించడం యాదృచ్ఛికం అని అనలేము. అమ్మ అనురాగ రాగం ఆరూపంలో ప్రస్ఫుటమైంది.
మాతృసంకీర్తనాచార్యుడు మన్నవ బుచ్చిరాజుశర్మ (రాజుబావ) అయితే, ఆ సంకీర్తనా సామ్రాజ్యానికి క్రొంగొత్త తళుకులద్దినవాడు నదీరా. తల్లిదండ్రులు పెట్టిన పేరు వెంకట సోమసుందరశర్మ. మరి “నదీరా” అనే పేరెలా వచ్చింది. అది అతని కలం పేరుగా ఎలా రూపుదాల్చింది. విచిత్రమైన విషయం నవకవితాదీక్షా రాజే నదీరా అయినాడా! నటరాజ దీపిక శబ్దారామమే నదీరాగా. రూపుదాల్చిందా! కాదు కాదు నదీరా అనే పేరు ఎలా వచ్చిందో ఒక విషయం ద్వారా తెలిసింది.
విజయవాడ లయోలా కాలేజిలో ఇతను చదువుకొనే రోజులలో కవిసమ్రాట్ విశ్వనాథ సత్యనారాయణగారు వీరికి తెలుగు పాఠాలు చెప్పేవారు. ఒకసారి వ్యాసరచన పోటీలు పెడితే ఇతను వ్రాసిన ‘అనార్కలీ’ వ్యాసానికి ప్రథమ బహుమతి వచ్చింది. అనార్కలీ అసలు పేరు ‘నాదిరా’. ఆ స్ఫూర్తితో కొద్దిగా ఆ పేరును సంస్కరించుకొని తన కలం పేరు ‘నదీరా’గా పెట్టుకున్నాడు. నిజానికి కరుణశ్రీ పేరు, శ్రీశ్రీ పేరు వాళ్ళ పేర్ల కన్నా ఎంత ప్రఖ్యాతి కాంచాయో ఇతని పేరుకున్నా ఈ నదీరా పేరే లోకంలో స్థిరపడిపోయింది.
నదీరా అమ్మను గూర్చి 1970లో విన్నాడు. సుప్రసిద్ధ వ్యాపారవేత్తలు శ్రీ ఆకెళ్ళ శ్రీరామమూర్తిగారు (ఏ.ఎస్.ఆర్. మూర్తి), శ్రీ జి.కె. రావుగారు అమ్మవద్దకు వచ్చే సోదరులు. ఇతని పాటలు, ఇతని మాటలు ఇతను వ్రాసిన బుఱ్ఱకథలు విన్న ఆ సోదరులు అమ్మ జీవిత చరిత్ర కూడా బుఱ్ఱ కథగా వ్రాయిస్తే బాగుంటుంది అనుకున్నారు. మాతృశ్రీ జీవిత మహోదధి తరంగాలు పుస్తకాన్నిచ్చి బుఱ్ఱకథగా వ్రాయమని కోరారు. అప్పటికి నదీరా అమ్మను చూడలేదు. అయినా అనతికాలంలోనే అమ్మ చరిత్రలోని కొన్ని ఘట్టాలను ఏరుకొని బుఱ్ఱకథగా మలిచాడు. నదీరా కన్నా భౌతికంగా నదీరా వ్రాసిన బుఱ్ఱకథే అమ్మ ముందు గానం చేయబడింది.
“ఈశ్వరుని కన్ను కన్న- కవీశ్వరుని పెన్ను మిన్న
ఇంద్ర చంద్రపదవులే – కవీంద్ర పదవి కన్న చిన్న” అన్న నదీరా మాటలు అక్షర సత్యాలై నిలిచాయి.
అతని బుఱ్ఱకథ రచనా పద్ధతి, మిత్రులు పాడిన తీరూ విని, అక్కడున్న ఆనాటి సోదరీ సోదరులంతా “నిరుపమ కవితాగానం – నిర్మలగంగా స్నానం. మహిమాన్విత కవితాదరణం – మాతృమూర్తి కరుణావరణం” అనుకున్నారు.
అమ్మ కారుణ్యం నదీరాపై ప్రవహించింది. కొద్దికాలానికే అతడు జిల్లెళ్ళమూడి చేరాడు. అమ్మ వాత్సల్య గంగలో స్నానం చేశాడు. పుంఖాను పుంఖంగా గీతాలు వ్రాశాడు. 1971లో మొదటిసారిగా అమ్మవద్దకు వచ్చిన నదీరా తరచూ అమ్మను చూడటానికి కుటుంబంతో సహా హైదరాబాద్ నుండి వచ్చిపోతూ ఉండేవాడు. 1973లో అమ్మ స్వర్ణోత్సవాల అనంతరం జిల్లెళ్ళమూడి సకుటుంబంగా వచ్చి ఒక సంవత్సరంపాటు జిల్లెళ్ళమూడిలోనే ఉన్నాడు. అమ్మ సమక్షంలో నిత్యకళ్యాణం, పచ్చతోరణంలాగా ఉండేది. నిత్యం పుట్టినరోజులో, నామకరణాలో, అన్నప్రాశనలో, అక్షరాభ్యాసాలో, ఉపనయనాలు, పెళ్ళిళ్ళు, సీమంతాలో, హేమంతాలో ఒకటేమిటి అన్నీ పండుగలే’ సంప్రదాయంగా జరిగే ఉగాదులు, సంక్రాంతులు, శివరాత్రులు, శ్రీరామనవమిలు, హైమాలయోత్సవాలు, అమ్మ జన్మదినోత్సవాలు, అమ్మ కళ్యాణ దినోత్సవాలు, దసరాలు, దీపావళి వంటి పండుగలన్నీ కన్నులారా చూచాడు. పెన్నులారా వాటిపై గీతాలు వ్రాశాడు. అమ్మకు నివేదించాడు. అతడు వ్రాయటమే కాదు అతడి పాటలన్నీ సద్యః ప్రసారంగా పాడబడేవి. కూడా. శబ్ద సౌందర్యం, రాగతాళజ్ఞానం కలిగినవాడు కావటం వల్ల నదీర పాడి వినిపించేవాడు. ఇతడు వ్రాసిన పాటలు కొన్ని అమ్మ సినిమాలో కూడా చిత్రించబడ్డాయి. శ్రీరావూరి ప్రసాద్, మల్లాప్రగడ సీతారామాంజనేయులు గారి కూతురు (లక్కరాజు) విజయ ఎంతో మధురంగా పాడి వినిపించే వారు అందరికీ. సినిమాలో సుప్రసిద్ధ ప్లేబాక్ గాయని జానకి, ఇంకా ఎందరో గాయనీ గాయకులు ఇతని పాటలు పాడారు. పాడేకొద్దీ, క్రొత్తపాటకూ వాడే కొద్దీ కత్తిపీటకూ పరువం పదునూ ఎక్కుతుందని అతని విశ్వాసం. అక్షరం అక్షరం కలిస్తే మంత్రమూ, కలమూ గళమూ కలిస్తే మంత్రపుష్పము అవుతుందని అతని నమ్మకం. వివిధ రాగతాళాలలో, విభిన్న వినూత్న బాణీలలో గాయకులకు తర్ఫీదిచ్చి పాడించేవాడు. అమ్మ బుఱ్ఱకథను రెండు జట్లుగా తయారుచేశాడు. రావూరి ప్రసాద్, రావూరి లక్ష్మీనారాయణ, జొన్నాభట్ల రాము ఒక బృందంగా – రావూరి వాణి, కొమరవోలు కుసుమ, కొమరవోలు రవి ఒక బృందంగా తయారయ్యారు. లక్షమందికి ఒకే పంక్తిన తన స్వర్ణోత్సవాలలో భోజనం పెట్టిన అమ్మ – కోటి మందికి దర్శనం ప్రసాదించటానికి బయలుదేరిన సందర్భంగా ఈ రెండు బృందాలు అమ్మ దర్శనం ఇవ్వటానికి ముందు బుఱ్ఱకథను గానం చేసేవి. కొన్ని సందర్భాలలో నదీరా పాల్గొన్న సన్నివేశాలున్నాయి. వాల్మీకి రామాయణానికి కుశలవులు కంఠాలుతోడై గానం చేసినట్లు నదీరా పాటలకు ఈ సోదరసోదరీ బృందాలు వన్నె చేకూర్చాయి.
అమ్మ స్వర్ణోత్సవాలు జరిగి దాదాపు మూడు దశాబ్దాలు గడుస్తున్నా ఈ నాటికి ‘అటు జనములు ఇటు జనములు ఎటు చూచిన యోజనములు జనగణముల భోజనములు – జననికి నీరాజనములు” – ఉదయమిదే స్వర్ణోదయం శుభోదయం – సుధామయం – మాతృశ్రీ స్వర్ణోత్సవ మహోదయం అంటూ నదీరా వ్రాసిన పాటలు ఇప్పటికీ చెవులలో రింగుమంటూనే ఉంటాయి. ఇక ఆయన వ్రాసిన “అన్నదాతా ! సుఖీభవ – అనసూయ మాతా సుఖీభవ – జన్మదాతా జయీభవ విజ్ఞానప్రదాత విజయీభవ” అన్న పాట నిత్యం అందరి నోళ్ళల్లో నానుతూనే ఉంటుంది.
వెలలేని దేవతవు కద తల్లీ! వెదజల్లి వైతు నీ కథలల్లీ” అంటూ “పచ్చడి మెతుకులు తిన్న ఒక దినమే – పచ్చటి బ్రతుకలయిపోవు ఆ క్షణమే” “అమ్మ శకమిక మొదలు – నిత్యకల్యాణము పచ్చతోరణము” అంటూ అమ్మ శకానికి నాంది పలికారు నదీరా.
ఇక అమ్మ సినిమాలో నదీరా వ్రాసిన పాటలు గానం చేయబడ్డాయి. అందులో సుప్రసిద్ధమైన హైమాలయం పాట నిజంగా హైమకు ప్రతిరూపమా అన్నట్లు, హైమను మన కళ్ళకు కట్టిస్తున్నట్లు ఉంటుంది. “అల్లదే హైమాలయం అది చల్లని దేవాలయం – పవిత్ర ప్రేమవిరాజితం ప్రఫుల్లశాంతి మహార్ణవం – మూర్తిల్లిన ప్రేమ మృత్యుంజయ హేమ – సిద్ధిపొందిన దివ్యసీమ శిల్పమై నిలచినది హైమ – అచటి రాలలో అన్ని అణువులు అమ్మ రాల్చిన అశ్రుకణములు మలచినట్టి అన్ని శిలలు మానవుని కన్నీటి అలలు – పుణ్యముల పుట్టిల్లదే పున్నమి వెన్నెల జల్లదే’ అన్న ఆ పాట ఎంత కఠినహృదయుని చేత కూడా కన్నీరు పెట్టిస్తుంది. అది అతని గుండె నుండి ఉబికిన కన్నీటిపాట. అంతేకాదు హైమను “అమ్మగన్న హైమవతీ – అమ్మ కన్న దయామతీ” అంటారు. ఎంత గొప్పభావన.
ఇక అమ్మ అద్వైత స్థితిని తాను దర్శించిన తీరు వర్ణిస్తూ నదీరా ఒక విచిత్రమైన అనుభవాన్ని “కనుగొంటినా లేక కలగంటినా – కనులు మూసుకొంటినా కనులు తెఱిచి యుంటినా – క్రాసును కన్నాను మా ఏసను కున్నాను అవును మరి అమ్మ అక్షరాల మరియమ్మ – అలా నేను చూశా అల్లా అని కేకేశా – మోజుతీర చూశా నమాజు కూడా చేశా – చంద్రముఖి అనుకొంటిని చతుర్ముఖుని కనుగొంటిని. అమ్మ కాదు బ్రహ్మ పరబ్రహ్మమే” అంటూ అమ్మను మేరీగా, అల్లాగా, బ్రహ్మగా వీటన్నింటినీ మించిన పరబ్రహ్మగా దర్శించిన నదీరాను ఏ కోవలోకి చేర్చాలి..
అమ్మను అన్నపూర్ణతో పోలుస్తూ ‘కాశీలో రాతివలె ఈ అన్నపూర్ణ కదలదు. మెదలదు ఎవ్వరేమన్నా – రాతిరూపును విడిచి నాతిరూపున నడచి” వచ్చింది. ఈ రూపంలో అంటూ “అన్ని దానములయందు అన్నదానమె ముందు అక్షయమ్మదియేను అమ్మ సన్నిధియందు” అంటాడు. “అమ్మా! నేనిన్ను వీడ నే అన్యుల వేడ” అని గుండెదిటువుగా పలుకుతూ తాను ఎవరో తను తెలుసుకున్నట్లుగా “రాగమాలికల రాముని కొలిచిన త్యాగరాజునకు తమ్ముడనమ్మా! అన్ని యెడల గోవిందుని కొలిచిన అన్నమయ్య నా అన్నయెనమ్మా” అంటూ నినువరించె నా కవితా కన్య తను తరించె ఎంతైనా ధన్య” అని తన తృప్తిని ఆనందాన్ని వ్యక్తపరుస్తాడు.
1980లో అతడొకరోజు అమ్మను చూడటానికి వచ్చాడు. అప్పటికే ఏదో రైలు ప్రమాదంలో అతని ఎడమ చెయ్యి తెగిపోయింది. రక్తం కారుతూ తెగిన చేయిని తీసుకొని డాక్టర్ల దగ్గరకు వెళ్ళాడు. వాళ్ళు దానిని అతికిస్తారేమోననే ఆశతో కాని వాళ్ళవల్ల కాలేదు. ఆ గాయం నయమయిన తర్వాత హైదరాబాద్ నుండి జిల్లెళ్ళమూడిలో అమ్మసన్నిధికి వచ్చి అమ్మ ప్రక్కన అమ్మకు పూజచేయిస్తున్న రామకృష్ణన్నయ్య ఎడమచేతిని తన కుడిచేతితో తీసుకొని ఆ రెండు చేతులతో నమస్కారం చేస్తూ ! అమ్మా నీకు నమస్కారం చేయటానికి వెయ్యి చేతులు కూడా చాలవు. కానీ నేను నా రెండు చేతులతో కూడా నమస్కారం చేసే స్థితిలో లేనమ్మా! అని అమ్మతో చెబుతూ అమ్మ ఒడిలో వాలిపోయాడు. ఆ బిడ్డను చూచి అమ్మ కన్నీరు కార్చింది. తలనిమిరి ఒళ్ళు ది. ఆ సన్నివేశాన్ని చూచిన అక్కడి సోదరీసోదరులంతా కన్నీరు కార్చారు.
“లాలిమా కన్నతల్లీ! అమ్మా! లాలి శ్రీ కల్పవల్లీ! పండు వెన్నెల పరుపు బాలీసులను వేసి – కొండపై జాబిల్లి గొడుగు పట్టెను నీకు” అంటూ లాలి పాటతో అమ్మను నిద్రబుచ్చిన నదీరా అమ్మను మేలుకొలుపుతూ “తెల్లార గొట్టాలి తెరలు విడగొట్టాలి దేవతల దేవతా మేలుకో “నీ ఒడిలో బాలుండె నింగిలో భానుండు నిత్యబాలెంతరో! మేలుకో ! నీ వాకిలికి వస్తే నా ఆకలికి స్వస్తి నివ్వాళి తల్లిరో మేలుకో! నిఖిల లోకములన్ని నీ ముద్దు మోమెదుట నిలువుటద్దములాయె మేలుకో!” అంటాడు ఎంత గంభీరమైన భావాలు ! ఎంత లోతైన భావాలు! సృష్టి అంతా అమ్మకు ప్రతిబింబమే కదా !
అమ్మను మేల్కొల్పటమే కాదు “రండి రండి జిల్లెళ్ళమూడి లెండి లెండి నిద్రను వీడి అన్నలారా రెండు కన్నులారా మీరు అమ్మను కంటారు అమ్మవారంటారు” వేరుదేవుల వేడగనేల ప్రేమదైవమును చూడరిదేలా? అంటూ లోకాన్నంతా అమ్మ ఒడిలోకి రమ్మని నిద్రలేపుతాడు – ఉత్తిష్ఠిత – జాగ్రత ప్రాప్యవరాన్నిబోధత అనే వేదవాక్యాలను లలిత లలితమైన గీతాలలో అలవోకగా పలికిన శ్రీ నదీరా ధన్యుడు. తాను ధన్యుడు కావటమే కాక మనల్నందరినీ ధన్యులను చేశాడు.
దురదృష్టమేమిటంటే భార్య సత్యవరలక్ష్మిని తోడులేని ఒంటరిని చేయటమే కాదు తన బిడ్డలు బంగారు శ్రీనివాసు, బంగారు పద్మావతి, వెంకట ఉషలను తండ్రి లేని పిల్లలను చేశాడు. సెక్యూరిటీ ఇన్స్పెక్టర్గా బిహెచ్ఐయల్లో పని చేసిన నదీరా తనవారందరినీ సెక్యూరిటీలేని వారిని చేశాడు. జిల్లెళ్ళమూడి అందరింటికి ఒక వాగ్గేయకారుడు లేకుండా పోయాడు. 14.2.2007న అమ్మలో కలిసిన నదీరా చిరంజీవిగా మన హృదయాలలో నిలచే ఉన్నాడు.
నవనీతం కవితాదీక్ష – నవనవరాగాపేక్ష
నదీ రాగ రమణీయ శృతి- నదీరా గీతాకృతి
అను ప్రాసతో క్రీడ అతడు కవితాప్రౌడ
శబ్దాలవి కరిగిపోయి అతని చేతి శిల్పాలాయె
అతని చేతి గీతలు పంచదార చిలకలు
నలుగురి నోళ్ళలో నానెను, దిగంతాలు ఎగబ్రాకెను
భాషాబలమే కాదు మాతృభావ బలంబే
మనస్సే ధనుస్సుగా భావాలే బాణాలుగ పయనించే కళానిగారం
అతడొక కవితా నాగారం.
తెలుసుకోండి కుతిదీరా – అతడే అతడే మన నదీరా !
నదీరా – నదీరా నదీరా..