“ధర్మ స్వరూపం కలది శ్రీమాత. ఆనందాను భవమే దానికి ధర్మం. అ లాంటి ధర్మస్వరూపిణి శ్రీమాత. తాను ధర్మధారిణియై భక్తులచే ధర్మాల నాచరింప చేసేది” – భారతీ వ్యాఖ్య.
సృష్టిలోని ప్రతి పదార్థానికీ దాని ధర్మం దానికి ఉంటుంది. అయితే ‘ధర్మం’ అంటే ఏమిటి? అంటే – స్వభావం అని అర్థం చెప్పుకోవచ్చు. ఎందుకంటే ‘ధర్మం’ ఎంత గొప్పదంటే, ఏ భాషలో కూడా దీనికి సరిపోయే పదం మరొకటి” కన్పించదు. ‘ధర్మం’ అనే పదానికి సమానార్థకమైన వేరొక పదం సంస్కృత భాషలో కూడా కనబడదు. ధర్మానికి సాటి మరొకటి లేదు కనుక, ఆ పదానికి కూడా మరొక పదం మనకు దొరకదు. ‘రామో విగ్రహవాన్ ధర్మః’ – అని మూర్తీభవించిన ధర్మమే రామచంద్రప్రభువుగా మనం కీర్తిస్తున్నాము. అలాగే శ్రీలలిత ధర్మస్వరూపిణి. ధర్మమే స్వరూపంగా గల శ్రీ లలితను ‘ధర్మిణి’గా కీర్తించి, తరించే అవకాశం అమ్మ బిడ్డలమైన మనకు లభించిన అరుదైన అదృష్టం.
“అమ్మ” – ధర్మిణి. గృహిణిగా తన ధర్మాన్ని తాను నిర్వర్తిస్తూ, మనందరికీ ఆదర్శంగా నిలచిన “అమ్మ” – ధర్మిణి. ధర్మమే తానుగా రూపుదిద్దుకున్న “అమ్మ” – ధర్మాన్ని గురించి ఎన్నో సందర్భాలలో, ఎన్నో విధాలుగా, ఎందరికో వివరించి చెప్పింది.
“ధర్మం కోసం తల్లికాదు, తల్లి ధర్మం చూపించ టానికే” అని తాను మానవిగా మనందరి మధ్య మసలినట్లు తన మాటల్లో “అమ్మ” స్పష్టం చేసింది. ఈ భూమ్మీదకు తనరాకకు కారణం తానే తెలియ చేసింది. “అమ్మ”. తల్లి (యొక్క) ధర్మం ఏమిటో తన ప్రవర్తన ద్వారా మనకు తెలియ చేయడానికే మన మధ్య మనలో ఒకతెగా మనతో కలిసి మెలసి జీవించింది. ఏ తల్లి అయినా తన బిడ్డలపట్ల ఎలాంటి ప్రేమను చూపించ వలసి ఉంటుందో, తన నడవడి ద్వారా “అమ్మ” మనకు నేర్పింది.
“మీలో కాదు, మీరుగా దైవాన్ని దర్శిస్తున్నా”నని చెప్పి, ప్రతి ఒక్కరిలో పరమాత్మను దర్శించమనే ధర్మాన్ని ప్రబోధించింది. చీమలో దోమలో కాదు; చీమగా దోమగా ఉన్నది ఆ పరమాత్మయే అని చెప్పి, సాటి ప్రాణులలో పరబ్రహ్మను దర్శించమనే సుదర్శనాన్ని అనుగ్రహించిన “అమ్మ” – ధర్మిణి.
‘మీరింత మందికి అన్నదానం చేస్తున్నారు’ అని ఒకరు అడిగినపుడు “తల్లి ధర్మం నెరవేరుతున్నది. దానం చేయడం లేదు. దానం వల్ల, ధర్మం వల్ల పుణ్యం సంపాదించుకొందామని కాదు… మీరు మీ పిల్లలకు ఎట్లా పెట్టుకుంటున్నారో ఇదీ అంతే…” అని స్పష్టంగా చెప్పి, తాను చేస్తున్న ‘అన్నం పెట్టడం’ అనే పనిని దానంగా కాక, తన ధర్మంగా, తల్లిధర్మంగా చెప్పుకున్న “అమ్మ” ధర్మిణి. ప్రతి తల్లీ ఎంత ప్రేమగా, ఆప్యాయంగా తన పిల్లలకు గోరుముద్దలు తినిపిస్తుందో….” అలా తన దగ్గరకు వచ్చిన ప్రతివారినీ భోజనం చేసి రమ్మని, ఆ తర్వాతే పూజగానీ, మరొకటి గానీ అని నొక్కి వక్కాణించేది “అమ్మ”. ఈనాటి సమాజంలో రకరకాల కాలక్షేపాలకు బానిసలైన తల్లులు తమ బిడ్డల భోజన భాజనాలను పట్టించుకునే స్థితిలో లేరు. ఇలాంటి తల్లులందరికీ “అమ్మ” ఇచ్చే ఆచరణాత్మకమైన సందేశం “ఆదరంగా పెట్టుకో” – అని.
‘పీఠాధిపతులు గానీ, మరేస్వాములవారు కానీ ఇట్లా ఇంత దగ్గరగా రానివ్వరమ్మా మీరేమిటీ ఇట్లా ఉన్నారు?’ అని ప్రశ్నించిన ఒకరితో “వాళ్ళు అట్లా ఉండటం ధర్మం, నేను ఇట్లా ఉండడం ధర్మం” అని సందేహ నివృత్తి చేసిన తల్లి ధర్మిణి. ప్రతి బిడ్డా తల్లి ఒడి నుంచే బయటి ప్రపంచాన్ని చూస్తాడు. ఆ తల్లి. సంరక్షణలోనే బాల్యం లోని మధురానుభూతులను ఆస్వాదించ గలుగుతాడు. విశ్వజనని అయిన “అమ్మ”కు ఆడ్డాల బిడ్డ దగ్గర నుంచీ గడ్డాల తాతల వరకూ అందరూ పిల్లలే. అందుకే “అమ్మ” వయో తారతమ్యం లేకుండా అందరినీ అంత ఆప్యాయంగా, ప్రేమగా పలకరిస్తుంది. కడుపు నిండుగా అన్నం పెట్టి వారి ఆకలి తీరుస్తుంది. ఒంటినిండా కప్పుకునేందుకు బట్టలనిచ్చి ఆదరిస్తుంది. ఎందుకు? ఇలా తాను ఆచరిస్తూ, మనలను అనుసరించమని మార్గ నిర్దేశం చేసింది “అమ్మ”. తల్లిగా తన ధర్మాన్ని నిర్వర్తించి, ధర్మిణిగా సాక్షాత్కరించింది.
“రాముడు ఏకపత్నీవ్రతం – రాజధర్మం కోసం పుడితే….” అంటూ ఏ రాజైనా ధర్మబద్ధమైన జీవితం గడుపుతూ, ధర్మప్రభువుగా, రాజధర్మాన్ని పాటించాలనీ, రాముడే అందుకు ఆదర్శమనీ వివరించింది. రాముడుగా అవతరించిన శ్రీ మహావిష్ణువే శ్రీకృష్ణుడిగా జన్మించినప్పుడు ఆచరించిన ధర్మాన్ని గురించి – “కృష్ణుడు యుద్ధం ఎట్లా చేయవలసిందీ నేర్పటానికి….” వచ్చినట్లుగా చెప్పింది. ఆ అవతారపురుషులను గురించి ప్రస్తావించే సందర్భంలోనే తన్ను గురించి “ఇక్కడ తల్లిధర్మం” అని చెప్పి, తాను భువి మీదకు రావడానికి తల్లి (యొక్క) ధర్మాన్ని నిర్విర్తించడం కారణంగా వివరించిన ధర్మిణి “అమ్మ”.
“ధర్మంలో కట్టుబాట్లు ఉన్నాయి. ప్రేమలో కట్టుబాట్లు లేవు” – అని ధర్మాన్ని ఆచరించడం అంత తేలికైన విషయం కాదని, ధర్మం ఎన్నో నియమ నిబంధనలకు లోబడి ఉంటుందని, ఆ కట్టుబాట్లకు కట్టుబడి ధర్మబద్ధమైన జీవితం గడపడం అంటే అంత సులభంగా సాధ్యమయ్యే విషయం కాదని కూడా స్పష్టపరచింది “అమ్మ”. ఏకపత్నీవ్రతుడైన రాముడు ప్రాణాధిక అయిన సీతను, నిరపరాధను రాజధర్మానికి కట్టుబడి అడవులపాలు చేశాడంటే ఎంత వ్యధను అనుభవించి ఉంటాడు. ధర్మ నిర్వహణ అంటే పూల బాట కాదు. అందుకే – ధర్మానికి కట్టుబాట్లు ఉంటాయి అని చెప్పింది ధర్మస్వరూపిణియైన “అమ్మ”.
“ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే” అని గీతాచార్యుడు చెప్పినట్లుగా ఈ యుగంలో తల్లిధర్మాన్ని స్థాపించడానికి అవతరించిన “అమ్మ” – ధర్మిణి.
అర్కపురిలోని అందరింటిలో, అనసూయేశ్వరా లయంలో ధర్మిణిగా కొలువై ఉన్న “అమ్మ”ను దర్శించి, స్మరించి, అర్చించి, తరించుదాం. జయహోమాతా!