ఈ సంవత్సరం నాన్నగారి ఆరాధనోత్సవ వార్షికోత్సవ సందర్భంగా జిల్లెళ్లమూడిలో ధాన్యాభిషేకం మహా వైభవోపేతంగా నిర్వహింపబడటం అమ్మ కారుణ్య వాత్సల్యానికి ఒక మచ్చుతునక.
ఒకప్పుడు అమ్మ జన్మదినోత్సవ వేడుకలకి జిల్లెళ్లమూడిలో వేల సంఖ్యలో యాత్రికులు రావటం, పందిళ్లు, పండుగ సంబరాలు అమ్మ కళ్యాణోత్సవం ‘వరకూ వేడుకగా నిర్వహింపబడటం వాడుక.
అమ్మ నిష్క్రమణానంతరం 1987 డిసెంబరులో ధాన్యాభిషేక కార్యక్రమానికి నిర్మల హృదయులైన మాన్యసోదరులు శ్రీ పి.ఎస్.ఆర్. ఆంజనేయప్రసాద్ గారి మనసులో అమ్మ కలిగించిన ప్రేరణతో అంకురార్పణ జరిగింది. అప్పటినుండి ప్రతి సంవత్సరం “ఇంతింతై వటుడింతై . ” అన్న చందాన “నాన్నగారి ఆరాధనోత్సవ” సందర్భంగా నిర్వహింపబడే ధాన్యాభిషేక కార్యక్రమానికి జిల్లెళ్లమూడిలో అత్యంత ప్రాధాన్యత ఏర్పడింది.
గత సంవత్సరం పొడుగునా కరోనా మహమ్మారి కలిగించిన భయాందోళనల వల్ల ఏర్పడిన నియంత్రణల కారణంగా జిల్లెళ్లమూడి రాలేకపోయిన అనేకమంది సోదరీ సోదరులు ఈ సంవత్సరం కార్యక్రమానికి విచ్చేసి పాల్గొనటం ముదావహం.
దాదాపు రెండువేల మంది సోదరీ సోదరుల మధ్య గౌరవనీయులు మాన్య మహోదయులు ఆంధ్రప్రదేశ్
శాసనసభ ఉప సభాపతి శ్రీ కోన రఘుపతి గారు ఈ సంవత్సరం ధాన్యాభిషేక కార్యక్రమాన్ని ఫిబ్రవరి 17 ఉదయం 11.00 గం.లకు సంప్రదాయ బద్ధంగా ప్రారంభించారు.
నిజానికి శ్రీ కోన రఘుపతి గారు నాన్నగారి ఆరాధనోత్సవ కార్యక్రమం ప్రారంభించటం ఎంతైనా సముచితం. కారణం, వారి పితృదేవులు స్వర్గీయ శ్రీ కోన ప్రభాకరరావు గారు నాన్నగారికి అత్యంత ప్రియమిత్రులు, సన్నిహితులు. వారిద్దరూ బాల్యమిత్రులు. ధాన్యాభిషేక కార్యక్రమానంతరం గౌ॥ కోన రఘుపతిగారు రవి అన్నయ్య స్వగృహానికి విచ్చేసి వారి తండ్రిగారికి, నాన్నగారికి గల సాన్నిహిత్యాన్ని గుర్తుచేసుకున్నారు. శ్రీ విశ్వజననీ పరిషత్ తరఫున రవి అన్నయ్య శ్రీ రఘుపతి గారికి చిరు సత్కారం అందజేశారు.
ప్రతి సంవత్సరం జరిగే ధాన్యాభిషేక కార్యక్రమంలో అత్యంత ప్రేమానురాగాలతో సోదరీ సోదరులు సమర్పించే ధాన్య విరాళాలు అన్నపూర్ణాలయ నిర్వహణకు వెన్నెముకగా సంస్థకు పట్టుకొమ్మగా ఏర్పడుతాయి. గత సంవత్సరం కలిగించిన కరోనా ప్రకంపనలు, ప్రకృతి వైపరీత్యాల వల్ల ఏర్పడిన నష్టాల మధ్య ఈ సంవత్సరం కార్యక్రమం ఎలా జరుగుతుందోనన్న భయాందోళనలకు తావులేకుండా సోదరీ సోదరులందరూ అత్యంత ఉత్సాహంతో
ఈ కార్యక్రమంలో పాల్గొనడం ఒక గొప్ప విశేషం.
అంతకన్నా విశేషం ఈ సంవత్సరం పూర్వ విద్యార్థి బృందం ఎంతో ఉత్సాహంతో ముందుకు వచ్చి ఈ కార్యక్రమానికి చేయూత నందించటం. ఎప్పుడో ఇక్కడ చదువుకుని ప్రయోజకులై సంస్థపై కృతజ్ఞతతో, అమ్మపై భక్తి విశ్వాసాలతో, గురువులపై గౌరవంతో వారు అందించిన చేయూతకు శ్రీ విశ్వజననీ పరిషత్
అభినందనలందజేస్తున్నది.
వారిని అడుగడుగునా ప్రోత్సాహపరుస్తూ కవితా రూపంలో అభినందిస్తూ మాన్యులు శ్రీ మల్లాప్రగడ శ్రీమన్నారాయణ మూర్తిగారు, పూర్వవిద్యార్థి బృందానికి అడుగడుగునా మార్గదర్శకురాలై ఉత్సాహపరుస్తూ డా. శ్రీమతి) సుగుణ గారు అందించిన సేవలకి శ్రీ విశ్వజననీ పరిషత్ హృదయపూర్వక కృతజ్ఞతాభివందనములు సమర్పిస్తున్నది.