మెడిసిన్ చదువు అయిన తర్వాత నేను నరసాపురం మిషన్ హాస్పిటల్లో పనిచేస్తుండేదానిని. ఎక్కువగా డెలివరీ కేసులు చూసేదానిని. జనరల్ మెడిసన్ మీద అంతగా దృష్టిపెట్టలేదు.
కానీ అమ్మ నామీద దృష్టి పెట్టింది; తన అనుగ్రహాన్ని నా మీద వర్షించింది; నా జీవితానికి ఒక అర్థాన్ని, పరమార్థాన్ని ఇచ్చింది. నరసాపురం డాక్టర్ కేశవరావుగారి ద్వారా కబురు చేసింది. తక్షణం వెళ్ళి నెల్లూరు డాక్టర్ యస్.వి.సుబ్బారావు గారి ఆస్పత్రిలో పనిచేయమని ఆదేశం. మిషన్ హాస్పిటల్లో ఉద్యోగానికి రాజీనామా చేసి నెల్లూరు వెళ్ళి డాక్టర్ గారి ఆస్పత్రి ‘అన్నపూర్ణ క్లినిక్’ లో చేరాను.
Dy.S.P. అన్నయ్యగా జగమెరిగిన ఎమ్.సత్యనారాయణ గారు నా బావగారు, శ్రీమతి లలితాంబ అక్కయ్య నా తోబుట్టువు. వారందరూ అమ్మ సేవలో తరిస్తున్నవారే. అప్పట్లో నాకు అమ్మను గురించి పెద్దగా తెలియదు.
డాక్టర్ గారి వద్ద ఉన్న పదిగంటలలో ఎనిమిది గంటలు వారు అమ్మసన్నిధిలో దర్శించిన విశేషాలు తను పొందిన దివ్యఅనుభూతులు వివరించేవారు. అట్టి మహాభక్తుని వద్ద వైద్యం నేర్చుకోవటం కోసం అమ్మ నన్ను నెల్లూరు పంపింది. అమ్మ ప్రణాళిక వేరే ఉన్నది.
ఆస్పత్రికి రోజూ 100 మంది రోగులు వచ్చేవారు చికిత్స కోసం. అయినా అమ్మ దగ్గర నుండి ఒక ఫోన్ కాల్ వస్తే ఆగమేఘాల మీద పరుగెత్తే వారు. ఎంతో తెలివైన, కర్తవ్యపరాయణులైన, భక్తివిశ్వాస పరులైన వ్యక్తిని వ్యక్తిత్వాన్ని ఒక వ్యక్తిలో మనం చూడలేము; చాలా అరుదైన మూర్తిమత్వం (Dersonality).
ఆయన అమ్మకి స్వయంగా వైద్యసేవలు అందించిన అదృష్టవంతులు. వైద్యం నిమిత్తం అమ్మ నెల్లూరులో వారింట్లో మూడు నెలలు ఉన్నది. అమ్మ ఉన్నదంటే అమ్మ వెంట బిడ్డలు (భక్తులు) ఉంటారు కదా! ఎవరు ఏ సమయంలో అమ్మ దర్శనార్థం వచ్చినా డాక్టర్ గారు, వారు సతీమణి శ్రీమతి అన్నపూర్ణ అక్కయ్యలు చెదరని చిరునవ్వుతో వారిని ఆదరించి, ప్రేమగా భోజనాలు పెట్టేవారు. ఆ మూడునెలలు వారిల్లు అందరిల్లు, వారి డైనింగ్ హాల్ అన్నపూర్ణాలయం. అమ్మకి వైద్యం చేస్తున్న రోజుల్లో నన్ను ఆస్పత్రిలో Out Datients పూర్తి బాధ్యత శ్రీ తీసుకోమన్నారు. అమ్మని తలుచుకొని వైద్యం చేయాలని మార్గదర్శనం చేశారు.
ఆరోజుల్లో Heart Failure సమస్యతో ఒక హృద్రోగి వచ్చాడు. నాకు పూర్తిగా అవగాహన లేదు. అయినా సరియైన చికిత్సను అందించడం ఆ రోగి పూర్తిగా కోలుకోవటం అమ్మ కృపే.
General Medicine కి సంబంధించి రోగుల్ని పరీక్షించడం, ఇసిజి మొదలైన ReDorts study చేయడం… సంబంధించి అవగాహన, అనుభవం వారి వద్ద పొందాను. అమ్మ సంకల్పం సామాన్యులకు అర్థం కాదు. తర్వాత కాలంలో అమ్మ Matrusri Medical Centre స్థాపించి నన్ను డాక్టర్గా నియమించింది. డాక్టర్ అన్నయ్య గారివద్ద arentice చేసి ఉండకపోతే నాకు సమర్థవంతంగా పనిచేసే నైపుణ్యం కలిగేది కాదు.
Matrusri Medical Centre ప్రారంభోత్సవ సమయంలో ఒక అద్భుతం జరిగింది. అది అమ్మకి సహజం, మనకి విశేషం. అమ్మ ఆస్పత్రిలో అడుగుపెట్టి తిన్నగా వెళ్ళి Doctor Chair లో ఆసీన అయింది. ప్రక్కనేఎత్తుపీట మీద [Datient స్థానంలో డాక్టర్ సుబ్బారావు గారు కూర్చున్నారు. అమ్మ తొలి డాక్టర్, వారు తొలి Datient అన్నమాట. ఆ సమయంలో వారికి ఏ వైద్య పరీక్షలు నిర్వహించనవసరం లేకుండా అమ్మ వారికి అద్భుతమైన చికిత్స చేసింది. మామూలుగా Treatment రెండు రోజులో, వారంరోజులో ఎంతో టైమ్ తీసుకుంటుంది. కానీ అమ్మ Treat ent సెకన్లలో గుణం చూపించింది. అమ్మ వారి నాడి చూసినట్లుగా వారి కుడి మణికట్టు (Wrist) పట్టుకున్నది. అక్కడ వారికి చాలకాలం నుండి నొప్పి ఉన్నది. Thermometre ని సైతం విదిలించలేని స్థితి. అంతే. అమ్మ అమృత కరస్పర్శతో చిరకాలంగా వారిని బాధిస్తున్న నెప్పి మరుక్షణం మాయమైంది. ఆ విధానం వైద్యశాస్త్రానికి అందేది కాదు కదా!
ఈ సందర్భంగా డాక్టర్ గారి ధర్మపత్ని శ్రీమతి అన్నపూర్ణ అక్కయ్య గురించి కూడా చెప్పుకోవాలి. సహధర్మచారిణి అనే పదానికి సార్థక నామధేయురాలు; ఉత్తమ ఉదాహరణ. ఎంత సొమ్ము ఖర్చు అయినా ఏ సమయంలో ఎందరికి పెట్టాల్సి వచ్చినా కాదు అనేది కాదు. అమ్మతో పాటు, అమ్మను దర్శింప వచ్చే వారినందరినీ అలా ఆదరించడం సామాన్యమైన సంగతి కాదు. నెల్లూరులో ఒక అన్నపూర్ణాలయమే నిర్వహించి ‘అన్నపూర్ణ’ అనే పేరు సార్థకం చేసుకున్నది. నన్ను సొంత ఆడబిడ్డలా ఆదరించిన ఆ దంపతులను నేను ఎన్నటికీ మరువలేను.
నేను సెలవు తీసుకుని నెల్లూరు విడిచి జిల్లెళ్లమూడి వెళ్ళే సమయంలో డాక్టర్ సుబ్బారావు దంపతులు ఒక ఆడబిడ్డను అత్తవారింటికి పంపినట్లు సకల లాంఛనా లతో, వైభవంగా, ప్రేమగా, ఆత్మీయంగా వీడ్కోలు పలికారు. నాకు కళ్ళ నీళ్ళ పర్యంతం అయింది. డాక్టర్ అన్నయ్య గారికి నేనెంతో ఋణపడి ఉన్నాను. అవతారమూర్తి అనురాగ స్రవంతి అమ్మకి ఆ జన్మాంతం ఋణపడి ఉన్నాను. నాకు అన్న, నాన్న డాక్టర్ అన్నయ్యగారే!!