(గత సంచిక తరువాయి)
అనేక ప్రాంతాల్లో ఉన్న వారికి అవసరాన్ని బట్టి తాను తినడం ద్వారా ఆహారాన్ని అందించడమే కాదు వివిధ స్థలాల్లో వివిధ సమయాల్లో అమ్మ చిత్రపటానికి సమర్పించిన నివేదన జిల్లెళ్ళమూడిలో ఉన్న అమ్మ స్వీకరించినట్లు ప్రకటించిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. ఒకసారి అన్నంరాజు దుర్గాంబగారు అమ్మ దర్శనానికి వచ్చి నమస్కరించుకుని అమ్మను చూసిన ఆనందంతో ఉండగా, అమ్మ ప్రసంగ వశాన “కొందరు దూరప్రాంతాల్లో ఉన్నా, ఏం చేసుకున్నా నాకు పెట్టిన తరువాతనే వారు తిందామని అనుకుంటారు. కానీ జిల్లెళ్ళమూడికి బయలుదేరబోయే ముందు వారి పిల్లలకు ఇడ్లీలు పెట్టాలన్న ఆత్రుతలో నెయ్యి, పచ్చడి లేని వట్టి ఇడ్లీలను నాకు పెట్టారు” అన్నది. తమ ఇంట్లో జరిగిన ఆ విషయాన్ని అమ్మ ప్రస్తావించేసరికి వారు ఆశ్చర్యానందాలకు లోనయ్యారు. అంతేకాదు. ఒకసారి దుర్గాంబగారు జిల్లెళ్ళమూడిలో ఉన్నప్పుడు ఆమె భర్త మాధవరావుగారు గుంటూరులో పులిహోర చేసి అమ్మకు నివేదన పెట్టారు. ‘అబ్బాయి పులిహోర చేశాడు. చాలా బాగుంది’ అని చెప్పింది అమ్మ దుర్గాంబ గారితో. ఆమె ఇంటికి వెళ్లిన తరువాత భర్తను అడిగితే అవును నేనే చేశాను. అన్నారు. అన్నింటిలో అందరిలో ఉన్నది అమ్మేకదా! అమ్మకు తెలియనిది ఏముంది?
అలాగే హైద్రాబాద్లో బి.హెచ్.ఇ.ఎల్ రామచంద్రపురంలో సోదరులు శ్రీ కొండేపూడి సూర్యనారాయణ గారి ఆధ్వర్యంలో ప్రతి శుక్రవారం రాత్రి, వారానికి ఒకరి ఇంట్లో అమ్మపూజ, భజన, నివేదన జరుగుతూ ఉండేవి. ఒకసారి అక్కడ నుండి కొందరు సోదరులు జిల్లెళ్ళమూడి వచ్చి అమ్మ దర్శనం చేసుకుని మూడు రోజులు ఉందామని వచ్చారు. వారు అమ్మతో మాట్లాడుతూ ‘ఇప్పుడు మా ఊళ్ళో పూజ జరుగుతూ ఉంటుందమ్మా!’ అన్నారు. అప్పుడు రాత్రి 10. గంటలు అయింది. పడుకుని ఉన్న అమ్మ వెంటనే లేచి కూర్చుని “కాదు నాన్నా! ఈ రోజు సూర్యనారాయణకి ఒంట్లో బాగుండలేదు. జ్వరం వచ్చింది. అందువలన తొమ్మిదిన్నరకే త్వరగా పూజ, భజన ముగించారు” అన్నది అమ్మ.
అమ్మ మాటలను నమ్మలేనట్లు వారు అమ్మ వంక చూశారు. “ఈరోజు శెనగ గుగ్గిళ్ళు చేశారు. వాటిలో ఉప్పు ఎక్కువయింది అందువలన వాటిని తినలేక రోడ్డుమీద పడవేస్తూ అందరూ వెళ్తున్నారు” అని వివరించింది అమ్మ. వారు అమ్మ మాటలు నమ్మక, రుచించక మూడు రోజులు ఉందామని ఆసక్తితో వచ్చిన వారు మరునాడు ఉదయమే ప్రయాణమై వెళ్ళిపోయారు. రామచంద్రాపురం వెళ్లగానే సూర్యనారాయణ గారింటికి వెళ్లి పూజ విషయం ప్రస్తావించారు. ఆశ్చర్యం! అమ్మ ఏం చెప్పిందో సూర్యనారాయణగారు అదే చెప్పారు. వారికి ఆశ్చర్యంతోనూ, భయంతోనూ, శరీరాలు స్వేదసిక్తమయ్యాయి. వెంటనే గోడనున్న అమ్మ ఫొటో దగ్గరకు వెళ్లి నమస్కరించి క్షమించమని వేడుకున్నారు.
అలాగే ఒకరోజు శేషగిరావన్నయ్య అమ్మను అడిగాడు “మద్రాస్ మౌంట్ రోడ్డులో నీ నామం స్మరిస్తూ వెళుతుంటే నీకు ఏమనిపిస్తుంది” ? అని. అమ్మ ‘నా ఎదురుగా నడిచి వెళ్తున్నట్లు ఉంటుంది’ అన్నది. సర్వ వ్యాపిని అయిన అమ్మకు దగ్గర-దూరం అని లేదు. అమ్మ ఒక సందర్భంలో అన్నది ‘నేను ఈ మంచం మీద కూర్చున్నాననీ నాకేమీ తెలీదని అనుకుంటున్నారు. కానీ నాకు గోడ చాటులేదు’ అని. కనుక ఎక్కడో జరిగిన విషయాలకు కూడ ప్రత్యక్ష వ్యాఖ్యానం చేస్తుంది అమ్మ. అమ్మ బాల్యంలో అమ్మ అమ్మగారు (రంగమ్మ గారు) మరణించినపుడు ఇంటి దగ్గరే ఉన్న అమ్మ శ్మశానంలోని దృశ్యమంతా కళ్లకు కట్టినట్లు విపులంగా వర్ణించి చెప్పింది. అలాగే అమ్మ బాల్యంలోనే బాపట్లలో చిదంబరరావు గారి ఇంట్లో దీపావళి పండగ వచ్చింది.. అమ్మ తలంటి స్నానం చేస్తుండగా కళ్లలో నురుగు పడింది. అయ్యో! అంటూ చిదంబరరావు గారు పెద్దగా కేక వేసి అమ్మ తలపై నీళ్లు పోయబోయారు. కళ్లలో నురుగుపడ్డా ఏదో ఆశ్చర్యకరమైన సంగతి జరిగితే చూస్తున్నట్లు అమ్మ కళ్లు తెరచి చూస్తూ ఉన్నది. చిదంబరరావు గారు పిలిచినా అమ్మ పలకలేదు. “ఎక్కడ ఆలోచిస్తున్నావు, ఏమిటా విశేషం?” అన్నారు. క్రమేణ అమ్మ దృష్టి ఏదో ప్రమాదం జరుగుతుంటే చూస్తున్నట్లు పరివర్తన చెందింది.
ఒక స్త్రీ శోకాలు పెడుతూ పరుగెత్తుకుంటూ చిదంబరరావు గారింటికి వచ్చింది; ఆమె కోడలు గాయపడింది. ఆమె రాగానే “మీ కోడలికి ఎట్లా ఉంది”? అని అమ్మ అడిగింది. అంతేకాదు. ఈ రోజు ఇంకా ఎన్ని జరిగాయో! రేపు మీరే వింటారు” అన్నది అమ్మ. ఎక్కడెక్కడో జరిగిన సంఘటనలను తన కళ్లముందే జరుగుతున్నట్లు చూసింది అమ్మ. ఆ తరువాత ఎన్నో ప్రమాద సంఘటనలు అమ్మ కళ్లు విప్పార్చి చూస్తున్న సమయంలోనే జరిగాయని తెలిసి అమ్మ సర్వజ్ఞత్వానికి ఆశ్చర్య చకితులయ్యారు చిదంబరరావు గారు.
ఇవన్నీ నమ్మలేని నిజాలు. ఇవే లీలలు. కనుకనే “నా జీవితం అబద్ధం; చరిత్ర బద్ధం” – అని ప్రకటించింది అమ్మ.
(సశేషం)