నా శ్రీమతి వివాహరీత్యా 1972 మార్చి 9 తారీఖున నా జీవితంలో ప్రవేశించి దాదాపు 42 సం||లు నాతో గడిపి, అకస్మాత్తుగా ‘అమ్మ’ ప్రేరణతో ‘అమ్మ’లో లీనం అయిపోయింది. చావుపుట్టుకలు అన్ని నిర్దేశించేది కాలస్వరూపిణి అయిన మన ‘అమ్మ’ అయినా, మా దాంపత్యం ఈ విధంగా విడిపోవడం నాకు ఆశనిపాతమే.
అందరి వలె గడిపిన వ్యక్తి, వెళ్ళిపోయిన వ్యక్తి కాకపోవటం ‘అమ్మ’ సిద్ధాంతాలని నూటికి నూరు పాళ్ళు ఆచరించి అందరిలో ‘అమ్మ’నే చూసి ఎవరిలోనూ దోషం ఎంచక దాదాపు తన జీవితంలో ఎంతోమంది అనాథలను చేరదీసి వారికి జీవనమార్గం చూపటంలో నాకంటే ఎక్కువ సహకరించిన ధన్యజీవి.
కొన్ని ఉదాహరణలు కింద పేర్కొనటం సమంజసంగా ఉంటుంది.
- మాకు వివాహం అయ్యి 11 సంవత్సరాలకి గాని సంతాన భాగ్యం కలుగలేదు. ఆ 11 సం॥లు మేము ఇద్దరం ఎప్పుడూ ఇద్దరంగానే లేము. మా బంధువర్గంలో కొన్నాళ్ళు మా బావమరిది, – కొన్నాళ్ళు. మా మేనల్లుడు, కొన్నాళ్ళు మా అన్నగారి అబ్బాయి, కొన్నాళ్ళు జిల్లేళమూడి సోదరుడైన ధనుంజయ (శ్రీకాకుళం)… ఈ విధంగా అందరిని మనస్ఫూర్తిగా ఆదరించి దానిలో ‘అమ్మ’ సిద్ధాంతాలనే చూసి తనది ఏమీ లేదని మనసుకి నిర్లిప్తత భావం అలవరచుకున్న ధన్యజీవి.
ఇదంతా ఒక ఎత్తైతే, ఒక తల్లితండ్రి లేని అనాథ బాలుడ్ని, అతని 7 సం||లు అప్పుడు (వైదీకులు) చేరదీసి అతని భోజన, భాజనాలన్ని తన సొంత బిడ్డగా చూసుకుంటూ అతనికి ఉపనయనం చేసి కేసరిగుట్ట పాఠశాలలో కొన్నాళ్ళు, బాపట్ల పాఠశాలలో కొన్నాళ్ళు ఉంచి అతనిని ప్రయోజకుడ్ని చేసింది. ఇప్పుడు అతను ఈ రోజు దాదాపు 1 లక్ష రూపాయలు సంపాదించు కుంటున్నాడు. ఎప్పుడూ మా యింట్లో పూజ కార్యక్రమా లను అతనిచే ఉచితంగా చేయించుకోక అన్ని చోట్లకు వలనే అతనికి దక్షిణ ఇచ్చేది. ‘అమ్మ’ చెప్పినట్లు తన సొంత బిడ్డయందు ఏమి చూస్తున్నారో అది అందరి బిడ్డలయందు చూస్తే అదే బ్రహ్మస్థితి అన్న దానికి మా శ్రీమతి జీవితం ప్రబల తార్కాణం.
- ఇలా ఉండగా మా కుమారుడితో చదివి హాస్టల్ ఫీజ్ కట్టలేకి ఇబ్బంది పడుతున్న ఒక (కమ్మవారి) అమ్మాయిని చేరదీసి ఆ అమ్మాయిని మా ఇంట్లోనే ఉంచుకొని 4 సం॥లు సొంత కూతురిగా ఆదరించి ఆ అమ్మాయి బి.టెక్. పూర్తి అయిన తర్వాత వివాహం అయ్యి ఇప్పుడు అమెరికాలో స్థిరనివాసం ఏర్పర్చుకుని మంచి జీవితం గడువుతోంది. ఆ అమ్మాయితో విడిపోయిన సమయంలో ఆ అమ్మాయిని పట్టుకొని భోరున విలపించిన మాతృహృదయం గల ధన్యజీవి.
ఇవన్నీ కాక ఎవరిని ఎవరు విమర్శించినా అందరిలోను భావం మార్పే గాని స్వభావం మారదనే ‘అమ్మ’ సిద్ధాంతాన్ని ఉటంకిస్తూ సర్దుకుపోయే మనిషి తన గుణగణాలను చూస్తే వంట చేయటంలో నలభీమపాకాన్ని తలపించేది. మా 25వ వివాహ దిన సందర్భంగా హైద్రాబాద్ వాస్తవ్యులైన సోదర సోదరీమణులను దాదాపుగా మా బంధువర్గంతో కలిపి 100 మంది వరకు తన చేతి మీదనే షడ్రసోపేతంగా వండి వడ్డించిన ఓర్పు గల మనిషి. ఆ రోజు అంతమందికి బొబ్బట్లు వేయటానికి సంకల్పించగా చేయి బాగా నొప్పి చేసి ఎత్తలేని పరిస్థితికి వచ్చింది. ఈలోగా ‘వర్ధని’ అక్కయ్య ఫోను చేసి ఇంతమందికి ఒక్కదానివే ఎలా చేస్తున్నావన గానే వెనకాల ‘అమ్మ’ ఉంది కదా అని ఫోను కింద పెట్టేలోగా తన చెయ్యి నొప్పి పూర్తిగా నివారణ అయిపోయింది. ‘అమ్మ’ రక్షణ అంత ఉండేది. ‘అమ్మ’ వద్ద మాతృలోకంలో అన్నపూర్ణాలయ నిర్వహణకు సోదరులు శ్రీ హనుమబాబు, శేషయ్య గార్లకు సహాయంగా వంటలో సిద్ధహస్తురాలైన లక్ష్మిని తన వద్దకు చేర్చుకుందేమో అనిపించింది.
అదే విధంగా రవి అన్నయ్య కుటుంబం హైద్రాబాదు నుంచి వెళ్ళిపోయినప్పుడు కూడా తన ఆకాంక్షతోనే జిళ్ళెళ్ళమూడి సోదరీసోదరులందరికిని విందుతో సత్కరించుకోగలిగిన అదృష్టవంతురాలు.
ఒకప్పుడు అమ్మమ్మగారి నిష్క్రమణ గురించి సీతాపతి తాతగారు వడిన వేదన, అదే విధంగా మాన్యసోదరులు శ్రీ పి.యస్.ఆర్.ఆంజనేయ ప్రసాద్ గారు వారి సతీమణి భౌతిక నిష్క్రమణ తరువాత ప్రచురించిన గీత సంపుటి దానిలో వారి ఆవేదన అన్ని ఇప్పుడు తలంపుకు వస్తున్నాయి. ఏమైనా ‘అమ్మ’ను చేరిన మా శ్రీమతి అదృష్టవంతురాలు.