మన సంప్రదాయంలో దైవం ఐదురూపాలలో వ్యక్తం అవుతుంటాడని ఆగమశాస్త్రం తెలియ జేస్తున్నది. పర, వ్యూహ, విభవ, అంతర్యామి, అర్చావతార రూపాలు. ఇందులో పరరూపం మనకు అందుబాటులో వుండదు. విష్ణుమూర్తి అయితే వైకుంఠంలో, పరమేశ్వరుడైతే కైలాసంలో, అమ్మవారైతే మణిద్వీపంలోనో ఎక్కడో వుంటారు. అందువల్ల మామూలు మానవుడు ఆ రూపాన్ని దర్శించలేడు.
ఇక వ్యూహరూపం వేదాలలో, ఉపనిషత్తులలో దాగి వుంది. వేదోపనిషత్తులతో దాగిన రూపం నిజానికి రూపం కాదు – రూపం లేని రూపం. అంటే నిర్గుణమైన, నిరాకారమైన నిరంజనమైన పరతత్వమే. అది జ్ఞానమార్గం ద్వారా తప్ప మామూలుగా తెలుసుకునే అవకాశం కలిగింది కాదు.
మూడవది విభవ రూపం. అమ్మే చెప్పింది. “రూపం పరిమితం – శక్తి అనంతం’ అని. ఈ అనంతమైన శక్తి పరిమితమైన రూపం చాటున దాగి వుంటుంది, అన్ని రూపాలలోనూ దాగి వుంటుంది. “ఇందు గలడందు లేడను సందేహము వలదు. అన్నట్లు. పైకి ఆ రూపం కనపడుతుంది, లోపల పరమాత్మ తత్త్వం దాగి వుంటుంది. అలా వున్నదాన్ని అంతర్యామి అన్నారు. ఇది కూడా సామాన్యమానవులకు అందుబాటులో వుండేది కాదు. ఎందుకంటే దీనికోసం విశేషమైన సాధన చేస్తే తప్ప పైకి కనబడే వస్తువు చాటున వాస్తవంగా వున్న పరమాత్మను దర్శించటం సామాన్య మానవుడికి సాధ్యం కాదు కాబట్టి. పోనీ విభవ రూపం సాధ్యమా అంటే, ఎప్పుడో త్రేతాయుగంలో అయోధ్యలో వున్నవాళ్ళు రాముడిని చూడగలిగారు. ద్వాపరయుగంలో బృందావనంలోనో, రేపల్లెలోనో, నందగోకులంలో వున్నవాళ్ళు కృష్ణుణ్ణి చూడగలిగారు. అందరికీ సాధ్యమా? అన్ని యుగాలలో సాధ్యమా? కనుక అందరికీ సౌకర్యం కోసం –
“అర్చావతార విషః సర్వేషాం ప్రాణినా మిహ” అందరు ప్రాణులకూ, సామాన్యులకు సైతం అందుబాటులో వుండడానికి వీలుగా వున్నది. అర్చావతారమూర్తి అంటే ఆలయాలలో మనం ప్రతిష్ఠించుకునే విగ్రహం ఆ విగ్రహానికి మన ఇళ్ళల్లో, మన పూజామందిరాల్లో వున్న చిన్న చిన్న ప్రతిమలు.. కాని, మరొకటి కాని ఇవికూడ దైవం యొక్క ప్రతిరూపాలే. గుణాలతో సంబంధం లేని పరమాత్మ ఆకారంతో సంబంధం లేని పరమాత్మ, రంగుతో సంబంధం లేని పరమాత్మ సామాన్య మానవుడు – ఆరాధించడానికి అనుకూలం కాదు కాబట్టి, మనం ధ్యానం చేయడానికి వీలుగా ఒక రూపం వుంటే సౌకర్యంగా వుంటుంది కాబట్టి గుణాలు కలిగిన, ఆకారం. కలిగిన వాళ్ళం మనం కాబట్టి మనం మనకి వీలుగా ఒక రూపాన్ని కోరుకుంటాం. ఏ రూపాన్ని కోరుకుంటాం? ఎవరి మనస్సుకి ఏ రూపం నచ్చితే ఆ రూపాన్ని కోరుకుంటారు –
కోదండం పట్టుకున్న రాముడు కొందరికిష్టం. మురళి చేతపట్టి ముక్తికి త్రోవ చూపే ముకుందుడు మరికొందరికిష్టం. త్రిశూలం చేతపట్టి జటాజూటధారిగా వున్న పరమేశ్వరుడు మరికొంతమందికి ఇష్టం. మణిద్వీపంలో చతుర్భుజాలతో రమావాణీ సంసేవితగా వున్న లలితా పరమేశ్వరి కొందరికి ఆరాధ్యం. అభిరుచులు..వేరు. ఏ రూపంలో వున్నా దైవం ఒక్కడే కాబట్టి, ఆ దైవానికి మనకు నచ్చిన రూపాన్ని కల్పించుకుని, మనకు ఇష్టమైన పేరు పెట్టుకుని ఒక రూపాన్ని కల్పించుకుని, మనకు ఇష్టమైన పేరు పెట్టుకొని ఒక రూపాన్ని ఏర్పాటుచేసుకుని ఒక విగ్రహాన్ని ఏర్పాటు చేసుకుని మనం ఆరాధిస్తున్నాం. ఎందుకు అంటే, ఒక రూపం కనిపించకపోతే, ఒక నామం వినిపించక పోతే మన మనస్సుని కేంద్రీకరించటం సామాన్యుడైన వాడికి కష్టం కాబట్టి. ఇలా సామాన్యుడైన వాడు క్రమంగా మనస్సును కేంద్రీకరించుకుని దైవతత్త్వాన్ని అర్ధం చేసుకుని ఆరాధించడానికి అనువుగా విగ్రహారాధన సంప్రదాయం ఏర్పడింది. అంతటా నిండి వున్న దైవం విగ్రహంలో మాత్రం ఎందుకు వుండడు? విగ్రహంలో మాత్రమే వున్నాడనుకుంటే పొరపాటు తప్ప విగ్రహారాధన పొరపాటు అనుకోవలసిన అవసరం లేదు.
విగ్రహారాధనతో ప్రారంభమై, ఈ విగ్రహంలో వున్న పరమాత్మ అంతటా నిండి వున్నాడని క్రమంగా మనం దైవానికి మన మనస్సు చేరువకావడానికి ఆ నిగ్రహం సంపాదించుకోవడానికి విగ్రహం దోహదం చేస్తుంది అన్నది మన సంప్రదాయం చెప్పినమాట. ఆ విశేషాన్నే అమ్మ “నిగ్రహం కోసమే విగ్రహారాధన” అన్నది. మన సంప్రదాయం ఒకమాట చెప్పింది – “ఉపాసకానామ్ కార్యార్థం బ్రహ్మణో రూపకల్పనా” అన్నారు వ్యాసులవారు. ఒక రూపం ఏమిటి? ఎన్నో రూపాలు పొందాడు. ఎందుకని? ఆరాధించే వారు ఎందరో కాబట్టి, వారి అభిరుచులు వేరువేరుగా వుంటాయి కాబట్టి, వారి విశ్వాసాలు వేరువేరుగా వుంటాయి కాబట్టి; ఎవరి అభిరుచి మేరకు, ఎవరి ఆసక్తి మేరకు, ఎవరి ఇష్టం మేరకు వారి వారికి కావలసిన రూపాలు దిగివచ్చాయి. అందువల్ల, ఇది ఎందుకు వచ్చిందంటే మనం ఏకాగ్రతను పొందడానికి, ఒక నిగ్రహాన్ని సంపాదించుకోవటానికి.
ఇటీవల కొన్ని రకాల ఆధునిక విధానాల్లో విగ్రహారాధనను నిరసిస్తూ, విగ్రహారాధన అనవసరమని, విగ్రహారాధన నష్టాన్ని కలిగిస్తుందని చెప్పేవాళ్ళు కూడా లేక పోలేదు. కాని జాగ్రత్తగా ఆలోచిస్తే విగ్రహారాధన పరిపూర్ణ ఫలితాన్ని పొందడానికి ప్రాధమికమైన మార్గం. పద్దెనిమిదో అంతస్తుకు వెళ్ళడానికి లిఫ్టు ఎలాంటిదో, అసలైన దైవాన్ని, రూపంలేని దైవాన్ని, నామం లేని దైవాన్ని చేరుకోవడానికి విగ్రహం కూడా అటువంటిదే అని మనం గమనించాలి. ఇటీవల కొంతమంది విగ్రహం అక్కర్లేదని, ఓ తెల్లని తెర మీద ఒక నీలపు చుక్క పెట్టి, ఆ నీలపు చుక్క మీద కేంద్రీకరించండి చాలు అంటున్నారు. నేననుకుంటాను – అంతకంటే విగ్రహమే మంచిది, సౌకర్యం అని. ఎందుకంటే ఆ తెల్లని పెద్ద తెరమీద సన్నగా ఎక్కడో మధ్యలో వున్న చిన్న నీలపు చుక్క మీద దృష్టికేంద్రీకరించే ప్రయత్నం చేస్తే, దివ్యదృష్టి ఎలా వున్నా మామూలు దృష్టిదెబ్బ తినే ప్రమాదం లేక పోలేదు. అందువల్ల దానికంటే విగ్రహమే మంచిది. విగ్రహంతో అవసరం లేని స్థితికి ఎదిగేటంతవరకూ విగ్రహం కావల్సిందే. నువ్వు ఎదిగావు, తర్వాత వాళ్ళు ఎదిగిరావటానికి కూడా ఆ విగ్రహం అవసరం. అందువల్ల విగ్రహం ఏ లక్ష్యంతో ఏర్పడిందో మనం తెలుసుకుంటే, విగ్రహారాధన చేయడం నేరం కాదు. విగ్రహారాధన దగ్గర ఆగిపోవడం మాత్రం అంతప్రయోజనం కలిగే విషయం కాదు అవి ఎవరికి – వారు తమ మనస్సును నిగ్రహించుకోవడానికి ఈ విగ్రహం ఒక ఆధారంగా వుంటుంది అనే పరమ సత్యాన్ని “నిగ్రహం కోసమే విగ్రహారాధన అన్న మాటల్లో వెల్లడించింది ‘అమ్మ’.
విగ్రహారాధన వల్ల భక్తుడికి లేదా సాధకుడికు దైవారాధన ఆసక్తికరంగా, సౌకర్యంగా పరిణమిస్తుంది. విగ్రహంపట్ల ఏర్పడిన విశ్వాసం క్రమంగా బలపడు తుంది. తన ఆరాధ్యదైవం విగ్రహరూపంలో తన విన్నపాలు ఆలకిస్తోందని, తన ప్రార్ధనలు స్వీకరిస్తోందని అనిపిస్తుంది. విగ్రహరూపంలో తనకు దర్శన మిస్తూ తనను అనుగ్రహిస్తున్నాడంటే తన ఆరాధ్యదైవం ఎంతో శక్తిమంతుడని, అతడి ప్రభావం అసాధారణమని అనిపిస్తుంది, నమ్మకం మరింత బలపడుతుంది. క్రమంగా అతడి ఆలోచనలు ఆ దైవం చుట్టూ తిరుగుతూ ఉంటాయి. అది జిజ్ఞాసకు దారితీస్తుంది. అంతటా నిండి ఉన్నాడు. కనుకనే విగ్రహం ద్వారా తనను కనికరిస్తున్నాడని అర్థమవుతుంది. అంతటా ఉన్న దైవం అనుక్షణం తనను గమనిస్తూ ఉంటాడని, కనుక, అతడికి నచ్చే విదంగా తాను ఉంటే, ఆ దైవానికీ తనకూ మరింత సాన్నిహిత్యం ఏర్పడుతుందనే భావన కలుగుతుంది. పరోపకారం వంటి మంచి గుణాలు అలవరచుకొనే అవకాశం కలుగుతుంది.
అంతటా ఉన్న దైవం సాటి ప్రాణులలో కూడ ఉంటాడని, ఉన్నాడని అనిపించి, వారిపట్ల సత్సంబంధాలు పెంపొందించుకుంటాడు భక్తుడు తద్వారా సమాజంలో చక్కని శాంతియుత సహజీవన సౌభాగ్యానికి మార్గం సుగమ మవుతుంది –
ఇదంతా ఎప్పుడు? విగ్రహానికి చేసే అర్చన మొక్కుబడిగా, యాంత్రికంగా కాక, ఆ విగ్రహరూపంలో తన ఆరాధ్యదైవం ఉన్నాడనే అనుభూతి పొందుతూ ఆరాధన సాగినప్పుడు. ఈ దశలో విగ్రహారాధనవల్ల సాధకుడు క్రమంగా తన మనస్సును అదుపు చేసుకుంటూ దైవీ గుణాలను పెంపొందించుకో గలుగుతాడు. ఈ విధంగా విగ్రహారాధన మనలో నిగ్రహం కలిగించి ఆధ్యాత్మిక అభ్యుదయానికి దోహదం చేస్తుంది.
“నిగ్రహం కోసమే విగ్రహారాధన” అన్న అమ్మ వాక్యం ఒక ఆణిముత్యం. అమ్మకు వందనం.