అమ్మా! రోజూ నిన్నొకసారయినా చూడాలని, కొంత సేపయినా నీ సన్నిధిలో కూర్చోవాలని, నీ పాదపద్మాలు 1 స్పృశించాలని, నీ మాటలు వీనులవిందుగా వినాలని, అప్పడప్పుడు నీవు చెప్పినట్లు ఆచరించాలని అనిపిస్తోంది. దీంట్లో ఏదో అసంతృప్తి, అశాంతీ ఉన్నట్లున్నాయి. సదా నిన్నే స్మరిస్తూ నీ మాటలు వేదాలని భావించి ఆచరిస్తూ ఉండగలిగేటట్లు ఎందుకు చేయవమ్మా?
నీ చుట్టూ అమృతప్రవాహం – అనల సందోహం, మృదు హృదయులు ఆటవికులు, సుగంధం. దుర్గంధం, అపరిమితత్వం – పరిమితత్వం, ఆనందం అశాంతి రెండూ కాపురమున్నాయని మనస్సుకు అనిపిస్తోంది. ఇది సంపూర్ణసత్యం కాదని బుద్ధి వారిస్తోంది. ఈ ద్వైత భావన పోయే మార్గమేదమ్మా!
నీవు దేవతవో, సామన్యమానవివో, అంతా అయినదానివో, కొంతే అయినదానివో, సర్వజ్ఞురాలవో, కించిజ్ఞురాలవో, నీ గమ్యమో కాదో? నిర్ణయించుకోలేని నిస్సహాయస్థితిలో గిలగిలలాడుతున్నాను. దారి చూపించమ్మా!
నీవు రోగాల రాశివని, రోగనివారిణివని, అనారోగ్యం పుట్టవని, సదా ఆరోగ్యమే నీ లక్షణమని, బాధల భగవంతుడవని, అంతా సుఖమే నీ అనుభవమని, శాంతిదాయినివని, అశాంతికారిణివని, మంచితనమే నీ స్వరూపమని, మోసమే నీ లక్షణమని మనస్సు ఆందోళన పడుతోంది. ఏది యథార్థమో? అనుభవంలో నిలువనీయమ్మా!
నీలోనూ, నీ చుట్టూ ఇలా భిన్నత్వాన్ని వీక్షిస్తూ ఎంతకాలం ఉండమంటావు? ఏకత్వం సృష్టిలో అనుభవంలో దొరకనే దొరకదా?
ఏకత్వమే సృష్టి నిజ స్వరూపమా ? భిన్నత్వం చూడడం నా దృష్టి లోపమా? లేక ఈ భిన్నత్వం, ఆ ఏకత్వం రెండూ ఒకే నాణానికి బొమ్మా బొరుసూలాంటివా! భిన్నత్వంలో ఏకత్వం చూడటమే పరమార్థమా? అయితే అది ఎవరికైనా ఆచరణలో ఉన్న విషయమేనా ? “అంతా అదే” అనే నీ సూత్రం పూర్తి. సత్యమా? ఏదీ నిర్ణయించుకోలేకపోవడం నా అసామర్ధ్యమా? – నీ కరుణ లేకపోవడమా? లేదా ఈ సంఘర్షణే మానవ జీవితమంతా నిండియున్నదా? తేల్చి చెప్పమ్మా! నా అంతట నేను నిశ్చయించుకునే శక్తిని ప్రసాదించమ్మా!
ఇది నీకు చేతకాదని నీకే ఆ నిలకడ లేదని తఱచుగా నీవు చెప్తూన్నా, నా మనస్సు శంకిస్తూన్నా, ఏ మూలనో కనీసం అప్పుడప్పుడైనా నీవు సర్వసమర్ధురా లవని, నీవు తల్చుకొంటే ఇది నీకు చాలా అల్ప విషయమని, నీలో పరిమితత్వం చూడటం తెలివి తక్కువ అని మెరుపు మెరసినట్లు అనిపిస్తుందేగాని ఆ భావం స్థిరంగా లేదమ్మా! దానికి నిన్ను ప్రార్ధించటం తప్ప ” వేరే మార్గం కూడా నా కిప్పుడు కనిపించడం లేదు.
నీలో కేవలం పరిమితత్వమే ఉన్నట్లయితే ఇంత తర్జన భర్జన ఎందుకమ్మా! ఎప్పుడో దూరంగా పోయే వాణ్ణి కదమ్మా! ఎప్పటికయినా నీ సన్నిధిలో ఆ భావం అంటే ఏకత్వాన్ని చూసే స్థితి వస్తుందని – కాదు కాదు, ఇస్తావని వేయికళ్లతో ఎదురుచూసినా లభ్యం కావటం లేదమ్మా ! నా ఆశ అడియాస చేయకమ్మా!
కాసేపు నవ్విస్తావు, మరి కాసేపు ఏడ్పిస్తావు. నాకంటే ధన్యుడు లేడు. ఈ జన్మకు అమ్మదర్శనమే – గమ్యం అని ఒకసారి అనిపిస్తుంది. మరి అమ్మను అసలు చూడకపోతేనే బాగుండుననీ అనిపిస్తుంది. ఏమిటమ్మా ఈ పద్దతి? ఇది నీకు ఆట కావచ్చుగానీ నాపాలిట ప్రాణసంకటమే! నీవేదో శాంతినిస్తావని, నీదగ్గర హాయిగా ఉండవచ్చునని, వచ్చి కష్టమో, ‘నిష్ఠురమో ఉంటూ ఉంటే ఇదేనా నీవిచ్చే ప్రతిఫలం? అయితే “ఎంత చేస్తున్నా పోట్లాడే వాడు బిడ్డ – పోట్లాడుతున్నా చేసేదే తల్లి” అనే నీ మాట నిజమో, అబద్దమో కాని నన్ను నోరెత్తకుండా చేస్తున్నది. అయినప్పటికీ ఊరుకోకుండా నిన్ను పదే పదే ప్రార్ధిస్తున్నా, నీతో వాదిస్తూ ఉన్నా ప్రయోజనం కన్పించటం లేదు. నన్ను ఏం చెయ్యమంటావు, ఇది నా లోపమే అని ఎంత సరి పెట్టుకున్నా నీవుకూడా పూర్ణమైన దయతో నన్ను ఆదరించలేదనే భావం ఎంతగా కాల్చి వేస్తోందో నీకు ఎలా చెప్పటం? అమ్మకు పక్షపాతం అనీ, సమత్వం ఉందని వచ్చి మోసపోయానేమో అని అనిపిస్తోంది. ఎలాగ? దీనికి పరిష్కారం ఏమిటి?
నీవు ముళ్ళమధ్య గులాబీ వని, బురదలో పద్మాని వని అప్పు డప్పుడనిపిస్తున్నా ఎలాగో నేర్పుతో నిన్ను చేరవచ్చని ఎంత ప్రయత్నిస్తున్నా సాధ్యం కావటం లేదు. నీ చుట్టూ ఉన్నది బురద కాదని, నీ ప్రక్క నున్నవి ముళ్ళు కావని, అవి నిన్ను చేరడానికి మెట్లని గ్రహించ గలిగేది. ఎప్పుడమ్మా? అయితే నీ ఎత్తుకు ఎదగడం పూర్తిగా అసంభవమా? నీవే అనుగ్రహ బుద్ధితో నన్ను అక్కడికి చేరుస్తావా? ఏదో తేల్చి చెప్పమ్మా!
నువ్వు చల్లని తల్లివని, అమ్మను మించిన దైవం లేదని చాల మంది అంటారే అది అబద్దమా? వాళ్ళ అవివేకమా? కాని అమ్మా! దయాంబు రాశిని పట్టుకొని దాక్షిణ్యం లేనిదని, అంతా అయినదానిని ఉద్దేశించి చేతకానిదని నిర్ణయించటం, తూలనాడడం నా వాచాలతా? అవివేకమో? అనిపిస్తోందమ్మా! నువ్వెందుకు నన్ను గట్టిగా మందలించవు? నువ్వు అలా చెయ్యలేవమ్మా! అందుకే నా ఆటలు సాగుతున్నాయి. నానోటికి వచ్చినట్లు మాట్లాడుతున్నాను. ఇష్టం వచ్చినట్లు నిర్ణయిస్తున్నాను. నిన్ను కచ్చితంగా అంచనా వేయడానికి నా కేమి అర్హత ఉందమ్మా? నిన్ను తూలనాడుతున్నా, స్తోత్రం చేస్తూన్నా నీవు మాతం నిమ్మకు నీరెత్తినట్లు నిలకడగా ఉంటావు. ఈ పద్దతి నాకు నచ్చ లేదమ్మా! నన్ను నువ్వు మండలించకపోతే నేను బాగుపడేదెలా? నిన్ను సరిగా అర్థం చేసుకొంటే ఏనాడో శాంతిని పొందేవాణ్ణి. నోరు మూసుకొని నీ మాటే నా బాటగా ఆచరించేవాణ్ణి. అది ఎందుకు జరగటం లేదో! అందుకే శంకరాచార్యులవారు. ‘కుపుత్రో జాయేత క్వచిదపి కుమాతా న భవతి’ (పుత్రుం ఎడు, చెడ్డవాడు కావచ్చు కాని తల్లి చెడ్డది ఉండదు) అని అమ్మను వర్ణించారు. అమ్మ చెడ్డది కాకపోతే కొడుకు చెడ్డ
వాడెలా అవుతాడు? కనుక ‘అమ్మ చెడ్డదే’ అనే శుష్మతర్కం నాకు నచ్చదమ్మా! శంకరులమాట యదార్ధం అనిపిస్తోంది. కానీ ఏం లాభం! నేనూ అమ్మలో చెడునే చూస్తున్నాను. దీనికి అంతాన్ని ప్రసాదించమ్మా!
“నీవు ఏది అడిగితే అది ఇవ్వడం కాదు. నీకు ఏది అవసరమో అది ఇవ్వడమే కరుణ” అని “ఆయా పరిస్థితుల్లో నీచేత ఆయాపనులు చేయించడమే అనుగ్రహం” అని నీ వెంత చెబుతున్నా తలకెక్కదేమమ్మా?
నీనుండి కాసులు కోరడం లేదు. భోగాలు వాంఛించడం లేదు. వాటికోసం నీ దగ్గరకు రాలేదు. అయినా ఎందుకో శాంతిని పొందాలనీ, స్థితప్రజ్ఞుణ్ణి కావాలని కోరిక నన్ను వెంటాడుతోంది. అన్న వస్త్రాలివ్వటం తేలిక నాన్నా – అద్వైతస్థితి కోరుతా వేమిటి?” అని నన్ను చులకన చేయకు. అడక్కుండా అమ్మయినా పెట్టదని లోకమంటూ ఉంటే “అడక్కుండా పెట్టేదే అమ్మ’ అని హామీ ఇస్తూ ఎందుకు జాగుచేస్తున్నా వమ్మా! అది నాకే లేదని నీ వెంత వాదిస్తున్నా, అది నీకే సాధ్యం అనే భావాన్ని మాత్రం ఎందుకు కలగజేశావు? అంత్య నిష్ఠూరం కంటే ఆది నిష్ఠూరం మేలు కదా!
క్షమించమ్మా! నువ్వెన్ని రకాలుగా చెప్పినా, ఎన్ని అనుభవాల్లో చూపించినా ఆ భావాన్ని నిలుపుకోలేని దౌర్బల్యం నాదేనేమో నమ్మా! నీ కంటే తేటగా సూటిగా ఆ భావాన్ని సూచించడం ఇతరులకు సాధ్యం కాదేమో? అయినా నా చేతకాని తనంచేత నీ విచ్చిన ఆ రత్నాన్ని నిలుపుకోలేక అంధకారంలో అలమటించడం అవివేకమే. దీనికి నిన్ను ఇంతగా విసిగించటం అనవసరమే. ‘కాలమే కర్తవ్యాన్ని బోధిస్తుందని, “తరుణమే ఋణమ’ని, ‘అందరికీ సుగతే’నని ‘తృప్తే ముక్తి’ అని శతథా నీవు చెప్పిన మాటలను. కాదు కాదు – మంత్రాల్ని మననం చేస్తూ నీ సన్నిధిలో ఉండడమే గొప్ప సాధన అని సదా అనుకుంటూ కాలం గడపడమే నా పని. మిగతాది (అంతా అదే – అన్నీ నేనే – అనే అనుభవాన్నివ్వడం) నీ వెలాగైనా చేస్తావు. దానిగురించి నాకు ఆలోచ నెందుకు? – అనే నమ్మకంతో, నిశ్చయంతో ప్రస్తుతానికి సెలవు తీసుకుంటున్నాను.