అమ్మ, అమ్మ మాటలు అర్ధం కాక నైరాశ్యోపహతుడైన ఆ పిల్లతండ్రి తిరిగి తిరిగి అదే మాట – “అమ్మా! చేతిలో దమ్మిడీ లేదు. ఎవరితో ఏమని ఎలా చెప్పుకోను?” అన్నాడు. అందుకు అమ్మ “అవన్నీ నా కనవసరం. మూడు ముళ్ళు కదా! నేను వేయిస్తాను” అని మరల మరల హామీ నిచ్చింది. “క్రిందికి వెళ్ళి ఆఫీసులో పిల్ల, పిల్లవాడి వివరాలు చెప్పి రాయించు” అని సలహా నిచ్చింది.
అతడు పునః పునః అమ్మకు నమస్కరించుకుని మేడమెట్లు దిగి క్రింద ఆఫీసువైపు వెళ్ళాడు. ఆ అమ్మాయి, ఆ అబ్బాయి కూడా వారిని అనుసరిస్తున్నారు. తీరా ఆఫీసుకు వెళ్ళి ఆయన వివరాలు చెప్పి రిజిష్టరులో వ్రాయించిన తర్వాత “రేపు ఉదయం కావలసిన సామగ్రి సమకూర్చుకుని మీరు రావచ్చును” – అని చెప్పారు. హతాశుడై ఆయన గబగబా వచ్చి నా భుజం పట్టుకుని “చూశారా? అమ్మ అలా అంటే, వీళ్ళు ఇలా అంటున్నారు. నా స్థితి గతులు ఏమాత్రం సహకరించవని అమ్మతో వివరించటం మీరు విన్నారుగా? నేనేం చేసేది?” అని వాపోవ సాగాడు.
‘అయ్యా! అమ్మ మీరు ఏ రకంగా భావన చేస్తుంటారు? అని అడిగాను. “మహాతల్లి… రాజరాజేశ్వరి” – అన్నాడు. “ఎవరినయితే మహాతల్లిగా రాజరాజేశ్వరిగా తలపోస్తున్నారో వారి నోట వచ్చిన మాట వరదాయకం. మీ సమస్యల నన్నిటిని ఒక్క మాటతో స్వస్తి చెప్పగలిగిన మహాతల్లి ఏమైనా చెయ్యగలదన్న నమ్మకంతో అమ్మ నామం చేసుకుంటూ ఈ రాత్రి గడపండి” – అన్నాను.
అంతకన్న తనకు మార్గం లేదని బాధపడుతూ కళ్ళ నీళ్ళు తుడుచుకుంటూ హైమాలయం వైపు పయన మయ్యారు ఆ ముగ్గురూ!
నాటి రాత్రి అన్నపూర్ణాలయంలో భోజనాలు చేసి, ఆఫీసు ముంగిట వరండాలో ఆ ముగ్గురూ విశ్రమించారు.
తెల్లవారు జామున నాలుగు గంటలకు ఎవరో వచ్చి వారిని లేపి అమ్మ పిలుస్తున్నదని చెప్పారు. తొందర తొందరగా ఆయన స్నానం చేసి ఆ చిరంజీవులను తీసుకుని 10 ని॥లలో అమ్మ సన్నిధికి చేరుకున్నారు.
అమ్మ వధూవరులకు తలమీద నూనె పెట్టి, నూతన వస్త్రాలు తెప్పించి వారికి అందించి, స్నానాలు చేసి కొత్త బట్టలు కట్టుకుని రమ్మని ఆదేశించింది. వారంతా వెళ్ళారు. వసుంధర అక్కయ్యను పిలిచి – ” ” బీరువాలో మంగళ సూత్రాలు, పాలకాయ పూస కూడా ఉంది. అవీ, దారపు రీలు తీసుకునిరా” అని ఆదేశించింది. అమ్మ స్వయంగా దారపు పోగులు కూర్చి, పసుపు రాసి, పేని, సూత్రములు, పూస అన్నీ గుచ్చి కొబ్బరి బొండాం మీద పెట్టింది. నూతన వస్త్రాలు ధరించిన వధూవరులను తోడ్కొని ఆ వృద్దుడు వచ్చి అమ్మ శ్రీచరణాలకు నమస్కరించారు.
అమ్మ వారందరికీ బొట్టుపెట్టి, “చూడు, నాన్నా! ఈ పెళ్లి అంతా నువ్వు బాధ్యతగా చేస్తున్నావు. ఆవరణలోని వారంతా మన బంధువర్గమే. వాళ్లందరికీ నువ్వు కూడా వడ్డన చేసి, కాఫీ, ఫలహారాలు సౌకర్యాలు కనిపెట్టి చూసుకోవాలి మన ఇంట్లో పెళ్ళి కదా, నాన్నా!” అని చెబుతుంటే ఆతని కళ్ళ వెంట ఆనందాశ్రువుల జల జలా వర్షించి అమ్మ పాదాలను అభిషేకించిన దృశ్యానికి నేను ప్రత్యక్ష సాక్షిని, ధన్యుణ్ణి. ఇదే అవతారమూర్తి, అమ్మలో విశేషం – తనే స్వయంగా అన్నీ చేస్తుంది. కానీ కర్తృత్వాన్ని అంగీకరించదు.
తన కన్న కూతురు వివాహం తానే చేసుకుంటున్నాను అనే సంతృప్తిని ఆ వృద్ధునికి కలిగించింది. మనింట్లో పెళ్ళి – అందరూ మన బంధు వర్గమే – అంటూ విశాల వాస్తవ దృక్పథాన్ని అనుగ్రహించింది. పురాణ ఇతిహాస కథలలో, గాధలలో దైవం ఏదో రూపంగా లోకకళ్యాణాన్ని, లీలల్ని ప్రదర్శించినట్లు విన్నాం. నేడు కళ్ళారా చూస్తున్నాం.
తెల్లవారింది. మే 5వ తేదీ. అమ్మ కల్యాణోత్సవ పర్వదినం. సర్వమంగళ, సౌభాగ్యదేవత అమ్మ వేదిక నధిరోహించింది. సుముహూర్తం, సూత్రధారణ, అక్షతారోపణ … అన్నీ స్వయంగా నిర్వహించింది. వధూవరుల హృదయాల్లో ఉప్పొంగే ఆనంద రసహేలా, కన్యాదాత నిలువెల్లా పులకరించి పరవశించిన తన్మయత్వమూ తానే అయి అమ్మ అందరిపై శుభ ఆశీః పరంపరలను వర్షించింది.
ఈ సందర్భంగా సారాంశము, ఉపదేశము ఏమంటే దిక్కులేని వారికే కాదు, అందరికీ దిక్కు కారుణ్యామృత వర్షిణి అమ్మ – అని. అంగబలం, అర్థబలం అన్నీ ఉన్నా అనుకున్నవి అన్నీ జరగవు; లేకున్నా ఆగవు !!!
(సశేషం)