మంగక్కయ్యని గురించిన నా జ్ఞాపకాలను పంచేక్రమంలో ముందుగా నాటి ‘అందరింట’ ఉంటూ, అమ్మసేవ చేసుకొంటూ ఆ ప్రాంగణంలో నిరంతరం మారుమ్రోగే అక్కయ్యపేర్లను ముందుగా తలుచుకొందాం. ఆలయప్రవేశం చేసి నిరంతరం అందరిచే అభిషేక అర్చనలు అందుకొంటున్న “హైమక్క” మొదలుగా రుక్మిణక్కయ్య, కృష్ణవేణమ్మక్కయ్య, గజేంద్రమ్మక్కయ్య, లక్ష్మీనరసమ్మక్కయ్య, రాజ్యలక్ష్మమ్మక్కయ్య, స్వరాజ్యలక్ష్మక్కయ్య, సత్యవతక్కయ్య, చంద్రమ్మక్కయ్య, సుబ్బమ్మక్కయ్య, భాగ్యమ్మక్కయ్య, ఆదెమ్మక్కయ్య, ప్రభావతక్కయ్య, వసుంధరక్కయ్య, కాత్యాయనక్కయ్య, వల్లూరి బాలక్కయ్య, వరలక్ష్మక్కయ్య, చిదానందమక్కయ్య. “మంగక్కయ్య”, రవణక్కయ్య, జానకక్కయ్య, పెదరాజ్యం అక్కయ్య, చినరాజ్యం అక్కయ్య, మన్నవబాల అక్కయ్య, రాముడక్కయ్య, కోటమ్మక్కయ్య, కొండమ్మక్కయ్య, శారదాంబగారు, లలితాంబగారు, శాయమ్మగారు, కామేశ్వరమ్మమ్మ, విద్యాధరి అక్కయ్య, సరోజినక్కయ్య, ఉషక్కయ్య, కుమారక్కయ్య, అన్నపూర్ణక్కయ్య ఇలా అనేక మంది అక్కయ్యల పేర్లు నిత్యం అందరింట జరిగే సేవాకార్యక్రమాలలో నిత్యం మారుమ్రోగేవి. అన్నయ్యలు, తమ్ముళ్ళు, చెల్లెళ్ళు అందరింట సేవలు చేయలేదనికాదు. నాకంటే పెద్దవారయి నాకు గుర్తున్న అక్కయ్యలను గురించిన 1970 కి ముందునాటి సమాచారం మాత్రమే
ఇది. 1960 దశక ప్రారంభంలో ‘అందరింట’ భవన నిర్మాణ ప్రారంభదశలో అమ్మ సన్నిధిన కులమత, లింగ భేదరహితంగా ఏకోదరులై అంకిత భావంతో కులాల అవసరం లేకుండానే అకుంఠిత సేవాభావంతో, అందరూ నిరంతరం సేవలతో అమ్మను అర్చించుకొంటూ తరిస్తున్న రోజులవి. నీవీ పనిని తప్పక చేయాలి! అని శాసించేవారు గానీ, మీకు ఈ పనులు అలవాటులేవంటే పని చేయ కుండా ఆగేవారుగానీ లేని అద్వితీయ అలౌకికానందం నిండిన అందరింటి అమ్మసన్నిధి. అది ఎప్పుడూ ఏరకమైన శారీరకమైన శ్రమచేయటం అలవాటు లేనివారు సైతం శారీరకశ్రమ చేయటంలో నైపుణ్యం కలవానితో సమంగా పోటీపడి అమ్మ సేవచేసుకొంటూ ఆనందించిన కాలం. నా తల్లిదండ్రులు అందరిలో అలా జిల్లెళ్లమూడిలో అమ్మ సేవలో ఉండటాన, నాయనమ్మ సంరక్షణలో చదువుకునే మేము స్కూలుకి శలవలు ఇచ్చిన మరుక్షణం ప్రక్కనే ఉన్న మా గ్రామంనించి నడిచివచ్చి జిల్లెళ్లమూడిలోని అందరింటికి చేరేవారం. ఒకనాడు అలా నడిచివచ్చి అందరింట కాలుమోపిన నాకు, అందరింటి నిర్మాణంలో పునాదులదగ్గర ఇసుక లారీలలోని ఇసుకను అన్లోడ్ చేసే కొందరు సోదరీసోదరులు నా కంటబడ్డారు. ఆడా, మగా అందరూ నడుముకు గోచీలు బిగించి పారలతో లారీలోని ఇసుకను క్రిందకు విసురుతున్నారు. షుమారు 10, 11 సంవత్సరాల వయసుకల నేను అక్కడే నిలబడి ఆసక్తిగా వారినే చూస్తున్నాను. అందులో తెల్లని మేనిఛాయతో షుమారు 18 సం|| వయసుకలిగి, సన్నగా నాజూకుగా, రివటలా ఉండి నడుముకు బిగించిన వస్త్రాలతో, చకచకా పారతో చలాకీగా లారీలోని ఇసుకను క్రిందకి విసిరే ఒక సోదరి నా దృష్టినాకర్షించింది. చూచే వారికి ఇలాంటి పనులు ఈవిడేం చేయగలదనిపించేలా ఉన్నా, ఆ పనులు అలవాటైన దృఢకాయులతో తీసిపోనివిధంగా ఆవిడ పారపట్టి లారీలోని ఇసుకను క్రిందకు విసిరే వైనం, ఆ చలాకీతనం, నేర్పు చూసి ఆవిడయందు ఏదో తెలియని ఆసక్తి కలిగింది. అలా నేను మొదటిసారిగా సోదరి మన్నవ అలివేలుమంగతాయారు (మంగక్కయ్య)ని మొదటిసారి చూశాను. ఈవిడది కూడా అమ్మ జన్మించిన ‘మన్నవ’ గ్రామమే. తండ్రి శ్రీ మన్నవ బాలకృష్ణశర్మగారు, తల్లి శ్రీమతి రంగనాయకమ్మ. ఈవిడ అమ్మ సన్నిధిన అందరింటి వాగ్గేయకారుడుగా అందరిచే కీర్తింపబడే శ్రీ మన్నవ బుచ్చిరాజుశర్మ (రాజుబావ గారి 4వ సోదరి. ఆమె SSLC పూర్తి అయ్యాక, ఈ మధ్యనే అమ్మ సన్నిధికి చేరి అమ్మసేవని అందరితోకలిసి చేసుకొంటున్నారని తర్వాత నాకు తెలిసింది.
క్రమంగా అందరితోపాటే నాకూ మంగక్కయ్యతో కలిసి అమ్మసేవలొనర్చే అవకాశం కలిగింది. ఆ రోజులలో అందిరితో కలసి మంగక్కయ్య అందరింటి పునాదులు తీయటం, కట్టుబడులకు ఇటుకల తయారీ కార్యక్రమంలో పాల్గోవటం, పారలతో కాంక్రీటిని కలపటం, అలా కలిపిన వన్నీ బొచ్చలకువేసి మోయటం. అందరింట వ్యవసాయ సేవలలో నాట్లు వేయటం, కలుపుతీయటం, కోతలుకోయటం, కుప్పనూర్పిళ్ళలో పాల్గొనటం, ఎండాకాలంలో పొలంలోని మెరకను తీసే మట్టిపనిలో పాల్గోటం. నాటి అన్నపూర్ణాలయ అవసరాలకు, అమ్మ స్నానానికి కావాల్సిన నీటిని బిందెలతో చెరువునించి చేరవేయటం, అందరింట నిత్యం జరిగే సుప్రభాత, సంధ్యావందనకార్యక్రమాలలో పాల్గొనటం. పూజాసమయాల్లో అమ్మ సన్నిధిన చక్కగా పాటలు పాడటం, అమ్మ ఆదేశంతో శ్రీ అన్నపర్తి కృష్ణశర్మగారు అందరింట అందరికీ నేర్పిన శ్రీసూక్త, మంత్రపుష్పాదులు నేర్చుకొని అందరితోపాటు స్వరయుక్తంగా అమ్మ సన్నిధిన పూజాసమయాల్లో చదవటం, ఇలా ఒక పని ఏమిటి? అందరింట అందరితో కలిసి ఎప్పుడు, ఎక్కడ, ఏపని అవసరం అయితే ఆయా పనుల్లో పాల్గొంటూ నిరంతర సేవలు అమ్మకందించింది శ్రీమతి మంగక్కయ్య.
ఇలా అన్ని సేవాకార్యక్రమాలలో పాల్గొనే మంగక్కయ్య అంటే శ్రీమతి రావిపాటి గజేంద్రమ్మ అక్కయ్యకి వల్లమాలిన ప్రేమ ఏర్పడింది. సంతానం లేని ఆమె మంగక్కయ్యని తన సొంతకూతురిలాగా ప్రేమించింది. మంగక్కయ్యకూడా అందరితో కలిసి పనిచేసే సమయాల్లో తప్ప ఎక్కువగా శ్రీమతి గజేంద్ర మ్మక్కయ్య కుటీరంలో ఉండసాగింది. గజేంద్రమ్మక్కయ్య ప్రేమ ఎంత పరాకాష్ఠకు చేరిందంటే సరదాగా మంగక్కయ్యతో ఎవరన్నా మాట్లాడినా సహించలేనంతగా! ఆ ఇరువురి మధ్య అంతటి అనురాగబంధం ఏర్పడింది. అందరింట అందరూ వయోబేధం లేకుండా అన్నయ్య, అక్కయ్య అని సంబోధించుకోవటం పరిపాటి. అందరూ అమ్మా! అని ఒక్క అనసూయమ్మనే పిలుస్తారు. కానీ మంగక్కయ్య అమ్మతోపాటు గజేంద్రక్కని కూడా అమ్మా! అని సంబోధించేంతగా వారి మధ్య అనుబంధం కొనసాగింది.
“హైమక్కయ్య”ఆలయ ప్రవేశానంతరం మంగక్కయ్య అనారోగ్యంతో శారీరక శ్రమకోర్చి పని చేయలేని పరిస్థితి ఏర్పడింది. తర్వాత కొన్నాళ్ళు అమ్మ దినచర్య (Dairy) రాసే బాధ్యతను స్వీకరించింది. అనంతరం అమ్మ 1969 లో ‘అందరింట’ సోదరీసోదరులు కొందరిని బాపట్లలోని ‘మాతృశ్రీ ప్రింటర్స్’లో సేవ చేసే నిమిత్తం బాపట్లకి పంపింది. అలా అమ్మ బాపట్ల ప్రెస్కి పంపినవారిలో ప్రథముడు మానాన్న కీ॥శే॥ రావూరి లక్ష్మీనరశింహం. ఆయన 1966 లో ఆ ప్రెస్ ప్రారంభ దశనుంచి అక్కడ సేవలందిస్తుండగా, కొన్నాళ్ళకి కీ॥ శే॥ శ్రీ పోతుకూచి రవి, దేవరకొండ పార్థసారధి, కటిక హనుమయ్య, శ్రీ అచ్యుతుని రామకృష్ణశర్మ గారు. ఆ తర్వాత 1968 నుంచి నేనూ, హరి మల్లిఖార్జునరావు, వల్లూరి సత్యం వారికి జతచేరాము. 1969లో ఇప్పుడు అమ్మ మాతోపాటుగా నా పెద్దసోదరి రమాకుమారి, చాలాకాలం అమ్మ Diary రాసి, అర్కపురి విశేషాల గ్రంథ రచయిత అయిన భవానీకుమారి, మంగక్కయ్యలను బాపట్ల ‘మాతృశ్రీ ప్రింటర్స్’లో సేవలకి పంపింది. మేమందరం ఉండేందుకు బాపట్లలో ఒక ఇల్లు అద్దెకు తీసుకొన్నారు. మాకు అందరికీ వండిపెట్టేందుకు సోదరి శ్రీమతి లంక ప్రసన్నక్కయ్యని కూడా పంపించటం జరిగింది.
బాపట్ల ప్రెస్ లో షుమారు ఒక సంవత్సరంపాటు మంగక్కయ్య సేవలందించింది. మా అందరితోపాటు Telugu, English composing & Disposing, Book Binding, Cutting తదితర సేవలందించింది. ఆ రోజులలోనే సోదరులు శ్రీ ఎక్కిరాల భరద్వాజగారుకూడా అమ్మ సన్నిధిన ఉంటూ ‘Matrusri’ English మాసపత్రికకు ఎడిటర్గా సేవలందించేవారు. ప్రతినెలా ‘English’ magazine printing సమయాన వారు రోజూ జిల్లెళ్లమూడి నుండి బాపట్ల ప్రెస్కి వచ్చి నెలలో వారం, 10 రోజులు మా అందరితో కలిసి పనిచేసి Magazine print అయి పోస్టు అయ్యేవరకూ మాతో సేవలొనర్చేవారు. ఇలా ప్రతినెలా సోదరులు సర్వశ్రీ కొండముది రామకృష్ణ, శ్రీ ఎక్కిరాల భరద్వాజ, శ్రీకొండముది గోపాలకృష్ణ, శ్రీ తంగిరాల కేశవశర్మ, ఒక్కోనెల శ్రీపాద గోపాలకృష్ణమూర్తిగార్ల ఆధ్వర్యంలో అందరం కలిసి మాతృశ్రీ తెలుగు, ఇంగ్లీషు మాసపత్రికలనే కాక, అనేక అమ్మ సాహితీ ప్రచురణలు కొరకు కలిసి కృషిచేసిన సమయ, సందర్భాలు, జీవితంలో మరువలేనివి, మరపురానివి. నాటి ఆ మధుర స్మృతులు నేటికీ జ్ఞాపకాల మడతల్లో పదిలంగా ఉన్నాయి.
అనంతర పరిణామాల్లో సోదరులు శ్రీభరద్వాజ జిల్లెళ్లమూడిలో అమ్మ సన్నిధివీడి, గూడూరుదగ్గర విద్యానగర్లో లెక్చెరర్గా join అయ్యారు. అక్కడ అందరి సహకారంతో ఒక శిరిడీశాయిబాబా ఆలయాన్ని నిర్మించారు. అనంతర కాలపరిణామాల్లో శ్రీ భరద్వాజ పెద్దల అనుమతితో 06-03-1975 న కర్నూలు జిల్లా, ‘బనగానిపల్లి’లో ‘మంగక్కయ్య’ని వివాహంచేసుకొన్నారు. తర్వాత ఉద్యోగవిరమణచేసి ఒంగోలులో మరొక ‘శాయిబాబా’ ఆలయ నిర్మాణాన్నిగావించి అక్కడే నివసించసాగారు. తమ రచనలద్వారా, ఉపన్యాసాల ద్వారా శ్రీ శిరిడీశాయిబాబా ఆలయ నిర్మాణాలద్వారా ఆంధ్రదేశంలో పలుచోట్ల శ్రీ భరద్వాజగారు విరివిగా శ్రీ శిరిడీ బాబాను గురించిన ప్రచారం సల్పారు. అనతికాలంలోనే సోదరులు శ్రీ భరద్వాజ వందలాది మంది అనుయాయులకు గురుతుల్యులుగా ప్రసిద్ధి చెందారు. వారి సహధర్మచారిణిగా శ్రీమతి మంగక్కయ్య కూడా గురుపత్నిగా మాస్టర్ భరద్వాజ శిష్యులందరికీ మాతృ సమానురాలై, అనేక మందిచే నీరాజనా అందుకోసాగారు.
కాలగమనంలో మాస్టర్ భరద్వాజ అలుపెరుగని శిరిడిశాయి ప్రచారసాధనలో 12-04-1989 న పరమపదించారు. ఆ తర్వాత దిగ్రమతో దిక్కుతోచక విలపించే శిష్యగణానికి, గురుపత్నిగా దిశానిర్దేశాలు చేస్తూ, నీరాజనాలందుకొనే మంగక్కయ్యను 1999 లో నేను ఒంగోలు వెళ్ళినపుడు చూచాను. అనారోగ్యంతో లేచినడువలేని స్థితిలో మంచంమీద కూర్చొనే అందరికీ దర్శనాలిస్తున్నారు. ఆమెను ‘బాగున్నారా? నన్ను గుర్తు పట్టారా?’ అంటూ పలకరించాను. “అరె! ప్రసాదువు కదూ? అంతా బాగున్నారా?” అంటూ ప్రక్కనే ఉన్న వారబ్బాయి నుద్దేశించి, “ఈ అన్నయ్య, నేనూ జిల్లెళ్ళమూడిలో అమ్మదగ్గర అనేక సేవలు చేశాం” అంటుంటే, అతడు నన్ను పరీక్షగా చూచాడు. తర్వాత నా భార్యతో 2 రోజులు ఉండేటట్లు ఆమె రమ్మనమనటం, నేను సరేనంటూ శలవు తీసుకోవటం జరిగింది.
ఇటీవలి కాలంలో హైదరాబాద్, నాగోలు ప్రాంతంలో ‘మంగక్కయ్య’ ఉంటున్నట్లు తెలిసింది. హైదరాబాదులో రోడ్డుమీద వెళుతుంటే 1, 2 చోట్ల ‘మంగమ్మగారి పుట్టినరోజు వేడకలు, కళ్యాణోత్సవాలు’ అనే banner ని చూచాను. 5, 6 నెలలక్రితం చాలాకాలం అమ్మ సన్నిధిన ఉండి ఇటీవలే కాలంచేసిన శ్రీవడ్డాది సత్యనారాయణగారి కుమార్తె శ్రీమతి పద్మావతిగారి నించి నాకు ఫోను వచ్చింది. ఆ మంగమ్మ అమ్మగారు మీకు ఫోన్ చేసి శ్రీభరద్వాజ మాష్టరుగారి గురించిన మీ అభిప్రాయాన్ని రికార్డుచేసి తను పంపమన్నారన్నది సారాంశం. ‘అమ్మ సన్నిధిన ఏ భేదాలు లేక కలిసిమెలసిన సోదరీసోదరులుగా నాకు శ్రీభరద్వాజ మాష్టరుగారు, శ్రీమంగమ్మక్కయ్యగారు తెలుసమ్మా! వారక్కడినుంచి వెళ్ళాక పరిణామాలు నాకు తెలియవు. అప్పటివారితోగల నా అభిప్రాయాలు మీకెంతవరకు ఉపయోగకరమోకూడా నాకు తెలియదు. అయినా అప్పటి నా అభిప్రాయం ఇప్పుడు అవసరమా?’ అంటే అమ్మగారు మీ అభిప్రాయాన్ని అడగమన్నారు. అనుమతిస్తే రికార్డుచేసి అమ్మగారికి పంపుతాను అందావిడ. నా చిన్ననాటి భరద్వాజగారితో ఉన్న జ్ఞాపకాల్ని చెప్పాక, నేనుకూడా ఈమధ్య అమ్మని దర్శించి అమ్మకి అనేక సేవలొనర్చినవారి అనుభవాల్ని రికార్డుచేస్తున్నాను. మంగక్కయ్యగారు అనుమతిస్తే నేను వచ్చి ఆవిడ అభిప్రాయాల్ని రికార్డు చేస్తానని ఆమెతో నామాటగా చెప్పమన్నాను. తర్వాత కొద్దిరోజులకి పద్మావతిగారి దగ్గరనించి నాకు ఫోనువచ్చింది రికార్డుచేసిన మీ అభిప్రాయాలు విని అమ్మగారు చాలా ఆనందించారనీ, కరోనా తగ్గాక తప్పక మీకు ఆమె ఇంటర్వ్యూ ఇస్తానని చెప్పమన్నారనేది దాని సారాంశం.
ఇంతలోనే జూన్ 3, 2021 న మంగక్కయ్య అమ్మలో ఐక్యమైనట్లు వార్త. ఈ విషాద వార్త విని, మా అనుసంధానకర్త అయిన శ్రీమతి పద్మావతిగారికి ఫోన్ చేశాను. ఆ మర్నాడు ఆమె ఫోన్ చేసి ఇప్పుడు మేమంతా చాలా బాధలో ఉన్నామండీ! అమ్మగారి దేహాన్ని ఒంగోలు తెచ్చాము. సంతనూతలపాడు సమీపానగల ‘పాల గుమ్మళంపాడు’ సమీపంలో అమ్మగారి సమాధికి తగిన స్థలంచూచి ఏర్పాట్లు చేస్తున్నారు. మీకు జిల్లెళ్లమూడి అమ్మగారు ఎంతో, మాకూ మంగమ్మగారు అంతేకదండీ! మేమిప్పుడు చాలాబాధలో ఉన్నామన్నారావిడ.
అవునుమరి! “విశ్వాసమే భగవంతుడు” అన్న అమ్మమాట అక్షరసత్యం కదూ! అద్వైత శిఖరాగ్రాన్నించి మనందరిపై వాత్సల్యంతో తేలికగా అర్థం అయ్యే పదాలతో సామాన్యులను సైతం ఆలోచింపజేసే విధంగా ఉపనిషత్సారాన్ని చిన్నిచిన్ని మాటలతో అరటిపండు వలచి నోటికందించినట్లు, అందరికీ సులభసాధ్యంచేసిన అనురాగమూర్తి అమ్మ. “లడ్డు అవటంకంటే లడ్డుని తినటంలోనే ఆనందముంది నాన్నా!” అన్న అమ్మమాట అర్థమయిందెందరికి? లడ్డూని గుర్తించిందెందరు? ఆ లడ్డూ తీపిరుచిని ఆస్వాదించిందెందరు? అన్ని ప్రశ్నలకి ఆ తల్లి అనుగ్రహమే సమాధానం.
అమ్మ సన్నిధిన భక్తి, వినయ సంపదలతో అతిసామాన్యులుగా సంచరించి, అమ్మకు సేవలొనర్చి సోదరీసోదరులు అనంతర కాల పరిణామంలో గొప్ప ఆధ్యాత్మికవేత్తలుగా అశేషప్రజానీకం చేత కొనియాడ బడటాన్ని అవలోకించినపుడు, నాకు కీ॥శే॥ కొండముది రామకృష్ణగారి వ్యాఖ్య ఒకటి గుర్తుకొస్తుంది. “జిల్లెళ్లమూడిలోని అమ్మ సన్నిధి లోకాన్ని, జీవితాన్ని, వేదాంతాన్ని అధ్యయనం చేయదలచుకున్నవాళ్ళకి, అనువైన పాఠశాల. వేదాంత నిగూఢ రహస్యాలు ఇక్కడ సహజమై, శ్రావ్యమై నిరంతరం వినిపిస్తుంటాయి. తత్త్వజలథిలోతుల్లో కానీ లభ్యం కాని ఆ అమూల్య రత్నాలతో ఇక్కడి బాలబాలికలు ఎంతో విలాసంగా, వినోదంగా ఆడుకొంటారు.”అన్న ఆయన నాటి అందరింటి గురించిన వ్యాఖ్య అక్షరసత్యం – కదూ! అయితే అందరికీ లడ్డూ విలువ దాని రుచి తెలియకపోవచ్చు. తెలిసినా తెలియకున్నా లడ్డూలోనూ, దాని రుచిలోనూ మార్పు ఉండదు.
ఒక దశాబ్దంపాటు నిరంతరం అమ్మకు అనేక సేవలొనర్చి, ఈనాడు ఎందరిచేతనో ఆరాధింపబడే ‘శ్రీమతి మంగక్కయ్య’, శ్రీ భరద్వాజ మాష్టారులకు శ్రీమతి వేదవతి, శ్రీద్వారకానాధ్ జ్ఞానేశ్వర్ సంతానం. 01-10-1945 జన్మించిన మంగక్కయ్య 03-06-2021 న అమ్మలో ఐక్యం అయింది. ‘అంద రింటి’ సోదరీసోదరుల పక్షాన వారికుటుంబసభ్యులకు, శిష్యగణానికి ప్రగాఢసానుభూతిని తెలియజేస్తూ అందరింటి సభ్యుల చరిత్రపుటలలో మరో అధ్యాయం ముగిసిందని తెలుపుటకు విచారిస్తూ”.
“సర్వేజనాః సుఖినోభవంతు”
జయహో మాతా!