“నన్ను చూడటమే నన్ను పొందడం” – అన్నది అమ్మ. ఇందు మొదటి ‘నన్ను’ అంటే అనసూయమ్మ అనీ, రెండవ ‘నన్ను’ అంటే నేను నేనైన నేను సర్వాంతర్యామి అనీ అర్థం. కనుక అమ్మ దర్శన సద్యః ఫలం పరాత్పరి అమ్మ నిజసాయుజ్యప్రాప్తి.
అసలు అమ్మ ఎవరు ? ఎందుకు వచ్చింది? ఒక సందర్భంలో శ్రీ చిదంబరరావుగారు అమ్మను ప్రశ్నించారు, “నీవు ఎందుకు వచ్చావో, నీ అవతార మేమిటో చెప్పమ్మా’ అని. అందుకు అమ్మ “నాది అవతారమని ఎవరు చెప్పారు ? నేనేదీ పెట్టుకు రాలేదు. నాకేమీ తెలియదు. ప్రత్యేకించి ఒక పని అంటూ లేదు. సృష్టి ఏ ఉద్దేశంతో జరుగుతున్నదో…” అని అర్ధోక్తిలో ఆపేసింది.
అమ్మ స్వయంగా ఆవిర్భవించింది, ప్రభవించింది – అంటే అంతా తానైన అనంతశక్తి పరిమిత రూపంలో ప్రకటితమైంది. మరి అమ్మ ఏ లక్ష్యంతో వచ్చింది? ప్రత్యేకించి ఒక పని అంటూ పెట్టుకురాలేదని అన్నదికదా!
అమ్మ అవతరణానికి కారణాన్ని పూజ్యశ్రీ సద్గురు శ్రీ శివానన్దమూర్తిగారు విశదీకరించారు – “అసహాయ స్థితిలో ఉన్న జీవులను, ఎటువంటి సాధనా చేయలేని జీవులను, అనేక జన్మల నుండి ముక్తిని కోరుకుంటున్న వారిని తీసుకు వెళ్ళడానికి కాలస్వరూపిణియై తాను అమ్మ. ప్రత్యక్షంగా వచ్చింది. తల్లి కనక పరదేవత అయితే, పరదేవతే మనకి తల్లి అయితే ఏ విధంగా ఆ ‘అమ్మ’ వల్ల లాభం పొందుతామో ఆ లాభాన్ని మనందరికీ ఇవ్వడానికి అమ్మ వచ్చింది” అని. ఇదే అచ్చంగా “మాతృధర్మం కోసం వచ్చాను” అని కృపతో అమ్మ అనటంలో తాత్పర్యం.
మరింత వివరించుకోవాలంటే తనను గురించి అమ్మ చేసిన నిర్వచనాలే ఆధారం – తల్లి అంటే తరింప జేసేది”. – అని. అంటే జీవాళికి ఏదో తరణోపాయాన్ని ఉపదేశించటం కోసం కాకుండా మార్జాల కిశోర న్యాయంగా జనన మరణ రూప భవభయ బంధనాల నుండి శాశ్వతంగా విముక్తి ప్రసాదించటానికి అమ్మ వచ్చింది.
కృప, వాత్సల్యం కట్టలు త్రెంచుకుని ప్రవహించగా బేషరతుగా “అందరికీ సుగతే” అని ఒక వాగ్దానం చేసినపుడు, ఒకరు “నాస్తికుడికీ సుగతి ఉన్నదా, అమ్మా?” అని ప్రశ్నించారు.
“నాస్తికుడైనా ఆస్తికుడైనా ఎవరైనాసరే – నేను ఇవ్వదల్చుకున్నాను అన్నప్పుడు ‘వాడి సుగతి’ అనేదెక్కడ ఉంది? వాడికి ఉన్నందువలన నేను ఇవ్వటమా? నేను ఇస్తే వాడికున్నదా?” అని ఎదురు ప్రశ్న వేసింది. అంతేకాదు. “పాదాలుపట్టని వాడికీ సుగతేనా, అమ్మా?”. అనే సందేహాన్ని వెలిబుస్తే “వాడు పట్టడం కాదు, పట్టించుకోవడమే అయినప్పుడు ఆ ప్రశ్నకు తావే ముంది?” అంటూ బాధ్యత జీవునిపై కాదు దేవునిపైనే ఉన్నదని చాటిన ఆశ్చర్యకర వాత్సల్య అమ్మ.
అంతేకాదు.
“నాన్నా! మంచిపనులే చెయ్యండి. మీరు మళ్ళీ పుట్టరు” అని ఘంటాపథంగా చాటింది. పునర్జన్మ గురించి. భయపడవద్దని అభయదానం చేసిన అకారణ కారుణ్య అమ్మ.
అంతేకాదు. ప్రతిదీ, ప్రతి ఒక్కరూ కడసారి ఊపిరి విడిచిన తర్వాత తనలోనే లీనమౌతారని నొక్కి వక్కాణించిన విశ్వవ్యాపిని, విశ్వరూపిణి, విశ్వగేహిని, విశ్వాంతరాత్మ, విశ్వజనని అమ్మ..
కాగా, ద్వాపరయుగంలో శ్రీకృష్ణపరమాత్మ “బహూనాం జన్మనాం అంతే జ్ఞానవాన్ మాం ప్రపద్యతే (అనేక జన్మల అనంతరం జ్ఞాని అయినవాడు నన్ను పొందుతున్నాడు) అనీ, “మనుష్యాణాం సహస్రేషు కశ్చిత్యతతి సిద్ధయే (వేలమందిలో ఒకానొకడు మాత్రమే మోక్షాన్ని కోరుకుంటున్నాడు)….” అనీ ప్రబోధించారు.
నాడూ, నేటివరకూ భగవానుని పలుకులు సత్యం. కాగా అందరమ్మ అనసూయమ్మ ‘అందరికీ సుగతే’ నని ఒక ప్రకటన చేసింది; మహారాజ్ఞిగా ఒక రాజాజ్ఞ (Ordinance) ని జారీచేసింది – నేడు. లౌకిక దృష్టితో ఉదాహరణలు చెప్పుకోవాలంటే స్త్రీలకు చదువుల్లో ఉద్యోగాల్లో ఎన్నికల్లో 33% reservation కిలో రూపాయికే బియ్య మొదలైన రాయితీలు ఇతః పూర్వం లేనివే కదా! నేడు శాసనం చేశారు, అమలు చేస్తున్నారు కదా!!
సంకల్పసిద్ధ – సర్వసమర్థ, అలౌకిక శక్తి అన్నారు స్వరూపిణి – ప్రేమైకరసరూపిణి అమ్మ నిర్ణయానికి – వరానికి శాసనానికి అభయానికి తిరుగు లేదు కదా!
‘అమ్మా! నువ్వు రాజరాజేశ్వరివి’ – అని అంటే, ప్రేమమయి అమ్మ అంటుంది. “నాన్నా! నువ్వు రాజరాజేశ్వరిని చూశావా? హాయిగా ‘అమ్మ’ అనుకో” ‘అని ‘అమ్మ’ అనే నామం ‘రాజరాజేశ్వరి’, ‘లలితా త్రిపురసుందరి’ ఇత్యాది నామముల కంటే బరువైనది, ఉత్కృష్టమైనది.
Mother means THE ORIGIN’ ‘అమ్మ’ అంటే ఆది మూలము – అని స్పష్టం చేశారు పూజ్యశ్రీ పూర్ణానంద స్వామివారు.
అమ్మని ‘మహాలక్ష్మి’, ‘మహాసరస్వతి’ అని కీర్తిద్దాము. సంభావన చేద్దాము – అనుకుంటే వారంతా అమ్మ ఒడిలో పసిపాపలే, తన పాదాల చుట్టూ పారాడే చంటిపిల్లలే కదా!
అమ్మ అంటే ఎవరో ఏమిటో అర్థం కాని సత్యం. అమ్మను వివిధ దేవతామూర్తులతో పోల్చలేము. ఒక ఏడాది శరన్నవరాత్రులలో అమ్మ శంఖచక్ర త్రిశూలాధ్యాయుధాల్ని ధరించి దర్శనం ఇచ్చింది. ఎవరో”అమ్మా! లక్ష్మీదేవి త్రిశూలాన్ని ధరించదు కదా!” అని వెంటనే అమ్మ “ఒకరితో పోలిక ఏమిటి, నాన్నా?”అని అడిగింది.
“నాకు నేనే ఉపమానం” అని ప్రకటించింది, స్పష్టం చేసింది అమ్మ. శ్రీ పన్నాలవారు “అంబికా సహస్ర నామస్తోత్రం” లో – ‘అజా, ఏకా, కాలతీతా మహాశక్తీ, అన్వేషదుర్లభా, యోగమాయాసమావృతా, మనుష్యజనతా భాగ్యరూపిణీ….’ అంటూ అమ్మ కళ్యాణ గుణవైభవాన్ని వేనోళ్ళ కీర్తించారు. కాగా, ‘నిన్ను ఎన్ని ‘విధాల వర్ణనము నేనొరించిన గాని తృప్తి రాకున్నది’ అని స్తుతించారు డాక్టర్ ప్రసాదరాయకులపతి.