“లోకంలోని ఆనందాలన్నింటికంటె గొప్పది అయిన ఆనందం పరమానందం. ప్రాపంచికమైన ఆనందాలు క్షణికమైనవి. అశాశ్వతమైన వ్యక్తినో, ప్రదేశాన్నో, పదార్థాన్నో, కారణాన్నో ఆధారంగా చేసుకుని కలిగే ఆనందం అశాశ్వతం. కాని, అన్యాశ్రయ సంబంధం లేని పరాశక్తి పరమానంద రూపిణి. ఆమెను ఆరాధిస్తే కలిగే ఆనందం శాశ్వతం. శాశ్వతమైన పరమానందాన్ని ప్రసాదించే శ్రీమాత ‘పరమానంద’ ”
- భారతీవ్యాఖ్య
ఆనందం వేరు. సంతోషం వేరు. క్షణకాలం మాత్రమే ఉండి, మరుక్షణం మాయమయ్యేది సంతోషం. ఆనందం శాశ్వతం. లౌకిక విషయాలవల్ల మనకు కలిగేది తాత్కాలికమైన సంతోషం. ఆధ్యాత్మిక ప్రగతిని సాధించిన సాధకునికి కలిగేది ఆనందం. రామకృష్ణపరమహంస వంటివారు ఆ పరాశక్తి దర్శన స్పర్శనాదులను పొంది, అలౌకిక ఆనందానుభూతిలో ఈ ప్రపంచాన్నే మరచిపోయేవారు. ఈ ఆనందం పరమేశ్వరి అనుగ్రహ ప్రసాదం. శ్రీలలితా పరాభట్టారిక ‘పరమానంద’. తన భక్తులకు కూడా ఆ ఆనందాన్ని ప్రసాదించగల ‘పరమానంద’ శ్రీమాత.
“అమ్మ” ‘పరమానంద’, “సర్వకాల సర్వావస్థలయందూ ఒడిదుడుకులు లేకుండా ఉండేదే ఆనందం” అని ఆనందాన్ని నిర్వచించిన “అమ్మ” – – ‘పరమానంద’. శైశవం నుంచీ “అమ్మ”లో ఈ ఆనందపు స్థితి నిరంతరం కొనసాగుతూనే ఉంది. “ఏది వచ్చినప్పుడు అది అనుభవించటమే ఆనందపు స్థితి. ఏదీకూడా వద్దనుకోకుండా అనుభవించటమే” అని చెప్పిన “అమ్మ” జీవితాన్ని కనుక పరిశీలించినట్లయితే, ఈ వాక్యంలోని ప్రతి అక్షరమూ ప్రత్యక్ష సాక్షిగా “అమ్మ” స్థితి లోని పరమానంద మనకు ప్రత్యక్షమవుతుంది.
“ఆనందం అంటే నవ్వు కాదు; ఆనందం సంతోషం కానిది” అని మనకు అర్థమయ్యే తేలిక మాటలతో, సరళసుందరంగా, చిన్న వాక్యంలో అనిర్వచనీయమైన నిర్వచనాన్ని అందించింది “అమ్మ”. అంతేకాదు. “ఆనందం స్థలాన్ని బట్టి వచ్చేది కాదు నాన్నా! మనస్సుకు సంబంధించినది” అని స్పష్టంగా చెప్పింది. “ఇది కావాలని లేకపోవటమే ఆనందం” అని ఆనందం అంటే ఏమిటి? ఆ ఆనందం ఎలా లభిస్తుంది?’ అనే విషయాన్ని చాల చక్కగా వివరించింది “అమ్మ”. ‘ఇది కావాలి’ అనుకుంటే అది లభించకపోతే అసంతృప్తి కలుగుతుంది. అది దుఃఖానికి కారణమవుతుంది. ‘ఇది ఇలా జరగాలి’ అనుకుంటే అలా జరగకపోతే బాధ కలుగుతుంది. అందుకే “అమ్మ” ”ఇది కావాలి’ అనే భావం లేకపోవటమే ఆనందానికి కారణమవుతుందని ప్రబోధించింది.
“శాశ్వతంగా స్థిరంగా, ఏ కాల పరిస్థితులలోనూ తృప్తిపడగలిగిన సంతృప్తి ఏదైతే ఉందో అదే ఆనందం” అని చెప్పిన “అమ్మ” – ‘పరమానంద’. అందుకే “అమ్మ” “తృప్తే ముక్తి” అని, మోక్షమంటే ఎక్కడో ఉంది అనుకునే మనకు ఎక్కడో లేదు నీ తృప్తిలోనే ఉంది అని చిన్న చిన్న పదాలు రెండింటితో జ్ఞానదీపికను వెలిగించి, మనలోని అజ్ఞాన తిమిరాన్ని తొలగించింది.
‘ఇక్కడున్న వాళ్ళకు … ఎంతసేపూ నీ సన్నిధిలో ఉంటే చాలు ననిపిస్తుంది. ఇట్లా మా కెందు కనిపిస్తుంది?’ అక్కడే నివాసంగా ఉండేవారి ప్రశ్న ఇది. “అమ్మ” పరమానంద స్వరూపిణి. కనుక ఆమె సన్నిధానం మనకు తెలియని ఆనందాన్ని కలిగిస్తుంది. అలా “అమ్మ”ను చూస్తూ ఉంటే చాలు అనిపిస్తుంది. ఆ క్షణంలో మన మనస్సులో ఏ భయానికి కానీ, ఆందోళనకు కానీ, కోరికకు కానీ స్థానం ఉండదు. ఆమె దర్శనం మనకు బ్రహ్మానంద స్థితిని కలిగించి, తెలియని హాయితో మనస్సంతా నిండిపోతుంది. ఆ పారవశ్యంలో మన మనస్సు పులకరించి కళ్ళు వర్షిస్తాయి. అది పరమానంద స్థితి. అందుకే “అమ్మ” అంటుంది “నవ్వు సంతోషమూ కాదు; కన్నీళ్ళు దుఃఖమూ కాదు” అని.
“అమ్మ”ను ఎన్నో ప్రశ్నలు అడగాలని వచ్చిన ఒక సోదరుడు ఏమీ ప్రశ్నించకుండా, మౌనంగా ఆ దివ్యతేజోమయమూర్తిని దర్శిస్తూ, పులకితాంతరంగుడై “నీ మూర్తిని చూస్తూ ఉంటే ఆకలికూడా చచ్చి పోయింది. చక్కదనం కాదు; తెలియనిది ఏదో ఉంది నీలో. నిన్ను చూస్తే నాకు కడుపు నిండుతోంది” అని తన మధురానుభూతిని ప్రకటించాడు.
“ఈ నేను వేరు, ఆ నేను వేరు – అనుకున్నప్పుడు ఆనందం లేదు. ఈ నేనే ఆ నేను అనుకున్నప్పుడు ఆనందం ఉంది” అని చెప్పిన అద్వైతామృతవర్షిణి “అమ్మ”. “సత్తూ చిత్తూ ఒకటే అయినప్పుడు ఆనందం” అని చెప్పి, పరమానంద స్థితికి మార్గనిర్దేశం చేసిన “అమ్మ” “పరమానంద’. అంతటా ఉన్న “ఆత్మ”ను దర్శించగలిగితే పరమానంద స్థితికి చేరుకుంటామనే పరమార్థాన్ని ప్రవచించటమే కాక ఆచరించి చూపిన “అమ్మ” ‘పరమానంద’. ఆ స్థితికి చేరుకోవటానికి మనకు మార్గ నిర్దేశంచేసి, మనల్ని ఉద్ధరించాలనుకున్న ‘పరమానంద” మన “అమ్మ”.
అర్కపురిలోని అందరింటిలో అనసూయేశ్వరా లయంలో నిండుగా కొలువు తీరిన “అమ్మ”ను ‘పరమానంద’గా దర్శించి, భజించి ఆ పరమానందాన్ని అనుభవంలోకి తెచ్చుకుని, ధన్యుల మవుదాం. ఆ ఆ స్థితిని అనుగ్రహించమని “అమ్మ”ను వేడుకుంటూ జయహో మాతా!