“ఆకృతి అంటే శరీరం, ప్రవర్తన, జ్ఞానం. ఈ మూడూ పవిత్రంగా గలది దేవీ స్వరూపం. పవిత్రమైన ఆకృతి గలది కనుక శ్రీమాత ‘పావనాకృతిః’… ఆమె దర్శనం చేతనే పాపాలు నశించి, పవిత్రభావన కలుగుతుంది. అందుకే “పుణ్యమహో పుణ్యమహో పుణ్యం తవదర్శనం” – అని భక్తులు విశ్వజననిని కీర్తిస్తూ ఉంటారు” భారతీవ్యాఖ్య
పవిత్రమైన ఆకృతిగల తల్లి శ్రీలలిత. ఆకృతి అంటే శరీరం, ప్రవర్తన, జ్ఞానం అని చెప్పారు పెద్దలు. “చిదగ్నికుండ సంభూతా” అయిన శ్రీమాత పావనాకృతిని మనం చెప్పగలమా? “నిష్పాపా.”, “నిష్కళంకా,” అయిన తల్లి, శ్రీలలిత “పుణ్యకీర్తిః”, “పుణ్యల భ్యా”, “పుణ్యాపుణ్య ఫలప్రదా”. కనుక ఆ తల్లి “పావనాకృతిః”. తన నాశ్రయించిన భక్తులకు జ్ఞానాన్ని ప్రసాదించి, వారిలోని పాప సంకల్పాలను తొలగించే శ్రీదేవి “పావనాకృతిః”, ఆ తల్లి “జ్ఞానదా” కదా మరి.
“అమ్మ” “పావనాకృతి’, “అమ్మ”ను చూసీ చేసింది. చూడగానే ఎలాంటివారికైనా పూజ్యభావం కలుగుతుంది. అసంకల్పితంగా వారి కరద్వయం ఆ తల్లికి అంజలి ఘటిస్తుంది. వారికి తెలియకుండానే వారి శిరస్సు ఆమె పాదాలను తాకుతుంది. వారి ప్రమేయం లేకుండానే ఆ పవిత్రాకృతిని దర్శించిన మరుక్షణం ఆనందంతో వారి కన్నుదోయి చల్లగాలికి మేఘంవలె వర్షిస్తుంది. వారి మనస్సు “అమ్మ”కు కైవనమయిపోతుంది. వారి సర్వస్వమూ “అమ్మ”కు అర్పణమవుతుంది.
పూర్వజన్మలో ఎంత పుణ్యం చేసుకుని ఉంటేనో “అమ్మ” దర్శనభాగ్యం కలుగుతుంది. అందుకే హైమక్క నిరంతరం “ఏ పూర్వపుణ్యమో నీ పొందుగా మారి” అని – మనసారా నీలిమేఘాలలో తేలియాడే స్వరంతో మధురంగా పాడుకునేది. “పుణ్యమహో పుణ్యమహో పుణ్యం తవదర్శనం” అని నోరారా మనం పాడు కుంటున్నాం ఆ ‘పావనాకృతి’ నుద్దేశించి, ఇన్ని మాటలు ఎందుకు? “నన్ను చూడటమే (వాళ్ళకు) పుణ్యం” అని సాక్షాత్తూ “అమ్మే” ప్రకటించింది.
రూపమే కాదు “అమ్మ” ప్రవర్తించిన తీరు ప్రతి చిన్న సన్నివేశంలోనూ పరమోత్కృష్టంగా ప్రస్ఫుట మవుతుంది. “అమ్మ” – విశ్వజననిగా జగత్ప్రఖ్యాతి | గాంచక పూర్వమే “అమ్మ” ఉత్తమగృహిణిగా తన బాధ్యతలను సక్రమంగా నిర్వహించిన తీరు ఆమెలోని మహనీయతను స్పష్టం చేస్తుంది. తన కోసం వచ్చిన బిడ్డలకు స్వయంగా వండి, వడ్డించిన అన్నపూర్ణమ్మ మన “అమ్మ”. ఇంటిపని, పాచిపని, పశువులపని చూసు కుంటూనే ఎవరికి ఏ సమయంలో ఏది అందించాలో వారికి అవి సమకూర్చిపెట్టి, మహిళ లందరికీ తన నడవడిక ద్వారా ఇల్లాలు ఎలా ఉండాలో నిరూపించిన
పేద, ధనిక భేదం లేకుండా అందరినీ సమదృష్టితో కనిపెట్టిన తల్లి. పేదవారింటికి, వారు బాధపడకుండా ఉండటానికి అన్నీ తనే తీసుకుని వెళ్ళి వాళ్ళకు “అమ్మ”కు ఏమీ పెట్టుకోలేకపోయామని బాధ కలుగకుండా చేసిన “అమ్మ” -ఆచరణ ద్వారా తన సందేశాన్ని తెలియచేసింది.
“అందరి పిల్లల్నీ ప్రేమిస్తే విశ్వమాత కదూ?” అని చెప్పి మనలోని మానవత్వాన్ని, మాతృత్వాన్ని తట్టి లేపింది. అందరి పిల్లల మాట అలా ఉంచితే, మన తోబుట్టువుల పిల్లలనే మనపిల్లలతో సమానంగా చూసుకోగల మనస్సు మనలో ఎంతమందికి ఉంది? అలాంటి మనస్సు గల “అమ్మ” ‘పావనాకృతి’. “తన పిల్లల వరకే పరిమితంగా ఉంటే పామరత్వం. అందరి యందూ ఉంటే భగవంతుడు”, “తన బిడ్డయందు ఏం చూస్తున్నామో అందరి యందూ దానిని చూడటమే బ్రహ్మస్థితిని పొందటం” అని సరళసుందరంగా, ఆచరణ యోగ్యంగా చెప్పి, తను ఆచరించి చూపిన “పావనాకృతి” “అమ్మ”. ఈ స్థితిని కలిగించమని “అమ్మ”నే వేడుకుందాం.
“దైవత్వం అంటే నాలుగు చేతులూ, కిరీటమూ కాదు”, “సర్వత్రా ఉండే మమకారం మాధవత్వాన్ని గుర్తింప చేస్తుంది”, “భిన్నత్వం లేని మనస్తత్వమే దైవత్వం”, “ఎదుటివారిలో దైవత్వాన్ని చూస్తున్నంతసేపూ మనలో దైవత్వం కలుగుతుంది”, “సర్వత్రా పూజ్యభావాన్ని చూడగలిగినవారే పూజ్యులు” – చిన్న చిన్న వాక్యాల్లో ఎంతలోతైన భావాన్ని అందించిందో కదా! ఒక అర్థం కాని పదం కాని, వ్యర్థమైన పదం కానీ లేకుండా సూటిగా గుండెల్లోకి దూసుకుపోయేలా “అమ్మ” పలికిన ఈ వాక్యాలు అనర్ఘరత్నాలు. ఈ ముత్యాలమూటల్లోని ఒక్క ముత్యాన్నైనా మనం శిరసావహించగలిగితే ఆ ‘పావనాకృతి’కి మన గుండెల్లో గుడికట్టిన వారమవుతాం. “అమ్మ” ఉన్న మనస్సులో భిన్నత్వానికి చోటేది?
“అమ్మ”కు కారులో వచ్చినవారు, కారు నడిపిన డ్రైవరూ ఒకటే. రిక్షా తోలినవాడూ, రిక్షాలో తన దర్శనం కోసం వచ్చినవాడూ సమానమే. అందుకే ఈ రెండు వర్గాలవారినీ సన్మానించింది. మనకు సన్మార్గాన్ని నిర్దేశించింది. వైద్యుడూ నారాయణుడే, రోగీ నారాయణ స్వరూపమే. అందుకే “గుణభేదమే లేని నాకు కులభేద మేమిటి?” అంటుంది ఆ తల్లి.
“ఉన్నది ఉన్నట్టుగా అర్థం చేసుకోవటమేగా జ్ఞానం”, “నువ్వూ, నేనూ అనేది పోనంతవరకూ అంతా ద్వైతమే, “రెండుగా కనపడటం అజ్ఞానం” -ఇలా జ్ఞాన సంబంధమైన ఎన్నో విషయాలను కరతలామలకం చేసి పెట్టిన “అమ్మ” జ్ఞానస్వరూపిణిగా ఉన్న ‘పాపనాకృతి’.
ఇలా తన శరీరాకృతిలో, ప్రవర్తనలో ‘పావనా కృతి’గా గోచరించిన “అమ్మ” నుంచి వెలువడిన జ్ఞానదీపికలు ఎన్నో? అందులోని ఏ ఒక్కటి అయినా మనకు కరదీపిక కాగలిగితే మన జన్మధన్యం.
ఇలా ఎన్ని చెప్పుకున్నా, ఇంకా ఎన్నో మిగిలి ఉండే “అమ్మ” జీవిత మహోదధిలోని తరంగాలకు అంతు ఏ లేదు కదా!
అర్కపురిలోని అందరింటిలో అనసూయేశ్వరాలయంలో ‘పావనాకృతి’గా కొలువై ఉన్న మాతృశ్రీ అనసూయా మహాదేవిని దర్శిస్తూ, స్మరిస్తూ, భజిస్తూ, తరించుదాం. జయహోమాతా!