“శ్రీ చక్రంలోని మొదటి ఆవరణలో ‘ప్రకట’ అనే యోగినీదేవతగా ఉన్నది శ్రీమాత.
అందరికీ ‘నేను’ అనే భావం అనుభవంలో ఉన్నదే. అహం ప్రత్యయమైన జ్ఞానం దేవికి ఆకృతి. ఆమె “ప్రకటాకృతి” భారతీవ్యాఖ్య.
ఆత్మస్వరూపిణి అయిన శ్రీమాత చరచరాత్మకమైన ప్రకృతిలో నిండి ఉన్నది. కనుక ఆ తల్లి ప్రకటమైన ఆకృతి కలది. ‘ప్రకటాకృతి’ అయిన శ్రీ లలిత జీవులందరిలో ‘నేను’ అనే భావంతో ప్రకటితమవుతోంది. కనుక శ్రీ లలితాభట్టారిక ‘ప్రకటాకృతి’. అన్నిరూపాలలో, అంతటా ప్రకటితమవుతున్న శ్రీలలితాదేవి ప్రకటాకృతి. శ్రీమాత ‘బహురూప’. కనుక అన్నిరూపాలలో తానే ప్రకటితమవుతున్నది. అయితే, అజ్ఞానాంధకారంలో ఉన్న మనం ఆమెను గుర్తించలేకపోతున్నాం. జ్ఞానులు అంతటా శ్రీమాతను దర్శించగలుగుతారు. వారికి సాక్షాత్కరిస్తున్న శ్రీలలితాదేవి ‘ప్రకటాకృతి’.
“అమ్మ” – ‘ప్రకటాకృతి’. “నేను నేనైన నేను” ‘నేను’ అంటే అనసూయను అని కాదు అని చెప్పి, ఇంకా స్పష్టత కోసం “అన్ని నేనులూ నేనే” అని చెప్పిన “అమ్మ” – ప్రకటాకృతి. “నేను నేనైన నేను” అంటే “నీవు లేని నేను” అని కూడా చెప్పింది “అమ్మ”. “నీవు లేని నేను’ అంటే అంతా ‘నేను’ – అంటే ఆత్మ స్వరూపమే. అన్నింటి యందు ఉన్న ‘ఆత్మ’ పదార్థం వేరు వేరుగా కనిపిస్తూ, ఎవరికి వారు ‘నేను’ అనే అహంకారంతో ప్రవర్తించేలా చేస్తోంది. కాని నిజానికి అందరిలో ఉన్న ‘నేను’ – ఒక్కటే. ఆ సత్యాన్ని మనందరికీ ఎన్నో సందర్భాలలో, ఎన్నో రకాలుగా తెలియచేసిన “అమ్మ” ‘ప్రకటాకృతి’.
‘అమ్మా! కుమారి స్మారక చిహ్నం ఏమిటి?’ అని అడిగిన ఒకరితో “నేనే” అని సమాధానం చెప్పి, “అమ్మ” తన పరతత్త్వాన్ని ప్రకటించింది. ‘మేమంతా ఎవరు? నువ్వు చెప్పు – “మీరంతా నేనే, మీదంతా నేనే, ఇదంతా నేనే” – అని మన అజ్ఞానపు పొరలను తొలగించడానికి శ్రీమతి మల్లాప్రగడ శ్రీవల్లి, విజయవాడ కుండబద్దలు కొట్టినట్లు చెప్పిన “అమ్మ” అన్ని రూపాలలోనూ తన ఉనికిని స్పష్టం చేస్తూ – తన నివేదన కని తెచ్చిన మామిడిపళ్ళను ఎలుక కొరికితే – “ఎలుక రూపంలో అమ్మే వచ్చి తిన్నదేమో” అని అంటూనే, ఆ పళ్ళలో నుంచి ఒక పండు తీసుకుని తిన్న తల్లి ‘ప్రకటాకృతి’.
మనం “అమ్మ”లో ఎవరి ఇష్టదైవాన్ని వారు చూసుకున్నాం. కాని “అమ్మ” మనందరిలో ఉన్న (పరమ) ఆత్మను దర్శిస్తూ, జీవులందరిలో నున్న ఆత్మ పరమాత్మయే అనే విషయాన్ని తన మాటల్లో, చేతల్లో ప్రకటించింది. “మీలో నేను దైవత్వం చూస్తాను. నాలో మీరు మానవత్వం చూస్తారు” అని చెప్పి, ఎదురుగా ఉన్న పరమాత్మను కూడా గుర్తించలేని మన అజ్ఞానాన్ని మనకు జ్ఞాపకం చేసింది. ‘మీరు ప్రార్థన చేస్తారా?’ అని ఒకరడిగితే “మీరంతా నేననుకోవటమే నా ప్రార్థన” అని మనందరిలో తన్ను తాను చూసుకుంటున్నట్లు చెప్పి, మనకు కనువిప్పు కలిగించాలనుకున్న ‘ప్రకటాకృతి’ – “అమ్మ”. “స్వశక్తి అన్నది నేనే” – అని స్పష్టంగా చెప్పి, మనలో రకరకాలుగా ఉన్న (ధీశక్తి, భుజశక్తి, మనస్థైర్యం వంటిది) శక్తి తానే అని ప్రకటించింది.
“వీళ్ళందరూ పిల్లలే కాదు; నా అవయవాలు” అని తాను ‘జగన్మాత’ నని స్పష్టం చేసింది. జగత్తే మాతగా ఉన్న తల్లికి ఆ జగత్తులోని సర్వమూ ఆమె అవయవాలే కదా! అందుకే “అంతటా ఉన్న అమ్మ తెలియటానికే ఈ అమ్మ” అని మరికొంచెం వివరించింది. ‘అమ్మా! మంత్రపుష్పం నీ సన్నిధిలో మాత్రమే చదవాలి కాని ఎక్కడపడితే అక్కడ చదివితే ఒక ఆందోళన చెందుతూ ఉంటే “నేను అంతటా ఉన్నా నంటూ – నా సన్నిధిని గిరిగీస్తున్నావేం?” అని ప్రశ్నించిన “అమ్మ” అన్నింటా, అంతటా తానే ఉన్నట్లు మరోసారి బోధపరచింది. ‘రామం అని చేస్తున్నాను. నా దృష్టిలో అమ్మ ఉంది’ – “రామం అమ్మ కాకపోతేగా! అమ్మ రాముడు కాకపోతే గదా! అన్ని రూపాలూ చూడలేక, అన్ని నామాలపై లక్ష్యం పెట్టుకోలేక ఒక రూపం, ఒక నామం తీసుకుంటాం” అని సందేహ నివృత్తి చేసిన “అమ్మ” ‘ప్రకటాకృతి’.
‘నువెవ్వరివో చెప్పమ్మా’ – అనే ప్రశ్నకు “వల్లగాని మిట్ట ప్రదేశం” అని “అమ్మ” సమాధానం. చరాచర భేదం లేని “అమ్మ” అచరములలో కూడా తన ఉనికిని ధ్రువం చేసిన ‘ప్రకటాకృతి’! “మీకు దరిద్రం వచ్చిందని బాధపడవద్దు. ఆ దరిద్రం కూడా నేనే” – అని మనకు వచ్చే సుఖసంతోషాలు, భోగభాగ్యాలే కాదు, కష్టనష్టాలు, దుఃఖాలు, రోగాలు, మృత్యువు కూడా తానే అని స్పష్టంగా చెప్పింది “అమ్మ”.
“అమ్మ”కు అందరూ, అన్నీ ముద్దుగానే అనిపిస్తారు (యి). వివిధ రూపాలుగా ప్రకటితమవుతూ ఉన్నా అన్నింటిలోనూ ఉన్న “ఆత్మ” స్వరూపిణి తానే కనుక. పందిపిల్ల, పేను, పాము ఒకటేమిటి? ఈ సృష్టిలోని సమస్తమూ “అమ్మ” ప్రేమకు పాత్రమైనవే. “సర్వానికీ నేనే మూలం” అని నిర్ద్వంద్వంగా ప్రకటించిన తల్లి కదా!
“అంతా ఆత్మ అనుకున్నప్పుడు జిల్లెళ్ళమూడి ఎంతో సరిహద్దులు దాటేక అంతే” అని ప్రకటించిన “అమ్మ” అర్కపురిలోని అందరింటిలో అనసూయేశ్వరిగా నడయాడి, ‘ప్రకటాకృతి’గా ప్రకాశించిన తల్లి. ఆ తల్లికి నమస్కరిస్తూ…..