అది 1982 సంవత్సరము. కార్తీక పూర్ణిమ. అందరింటి ఆవరణంతా ప్రముఖుల ఉపన్యాసాలు – జనసందోహంతో సందడిగా ఉన్నది. సింహాసనాసీనయై అమ్మ చిరునవ్వులు చిందిస్తోంది. దివ్యదర్శనాన్ని అనుగ్రహిస్తోంది, ఆశీర్వదిస్తోంది; చివరలో అందరినీ ‘అన్నం తినమ’ని చేతులతో సైగ చేసి నిష్క్రమించింది.
ఆ జనసమూహంలో ఒక భక్తుడు – బిడ్డ – పెద్దాయన ఒకరు ఉన్నారు. ఆయనకి రక్తపోటు (B.P.) అధికంగా ఉంది. నిత్యం వాడుకునే మందులు తెచ్చుకోలేదు. ఆ స్థితిలో అమ్మను కలవాలని ఎంతగా ప్రయత్నించినా వీలుపడలేదు.
వెళ్ళి వెళ్ళి హైమాలయ ప్రాంగణంలో అడుగు పెట్టారు. నింగిలో పూర్ణచంద్రుడు ప్రశాంత శీతల జ్యోత్స్నలను విరజిమ్ముతున్నారు. ఇలలో హైమవతీదేవి కృపావృష్టిని కురిపిస్తోంది. ఆ పెద్దాయన ప్రక్కన చాలామంది ఉన్నారు. ఏమిటో వారందరూ ఆ | వ్యక్తినే పరిశీలనగా చూస్తున్నారు. ఒళ్ళు తెలియని స్థితిలో ఆయన ఓ మూల నిద్రకి ఉపక్రమించారు. వారు నిద్రిస్తున్నారో, చనిపోయారో వైనం వారెవరికీ తెలియటం లేదు.
రాత్రి గం.12.00 ప్రాంతం. ఒక కన్య – ఆ పవిత్రత, తేజస్సు, ప్రశాంతత – చూస్తే వరాల దేవత అనిపిస్తోంది. ఆమె సకల కళ్యాణ సంశోభితయై తెల్లని చీరె ధరించి పరిమళభరితమైన పుష్పమాలలను ధరించి అతణ్ణి సమీపించిందింది. ఆమె హృదయం ద్రవించింది. ఆతని దీనావస్థని చూచి సారనయన అయింది. అవి కన్నీళ్ళు కాదు, కారుణ్య సింధువులు. వెంటనే తన పావన కోమల హస్తంతో ఆ భక్తుని తాకింది. అంతే! మరుక్షణం B.P. చక్కబడి మామూలు స్థాయికి వచ్చింది. తన ఆర్తత్రాణ పరాయణత్వ ధర్మాన్ని నిర్వర్తించి ఆ దేవత గుడిలోకి అదృశ్యమైంది.
ఆతడు కళ్ళు తెరిచాడు. కొత్త ఊపిరి పీల్చుకుని, కొత్తలోకంలోకి అడుగు పెట్టినట్లుంది. అది నిజమా? కలా! లీలా ! తెలియదు.
తెల్లవారింది. కాలకృత్యాలు తీర్చుకుని ఆయన హైమవతీశ్వరికి భక్తితో కృతజ్ఞతతో ప్రదక్షిణలు ఆచరిస్తున్నాడు. ఒక అపస్మార స్థితిలో గతరాత్రి వారిని చూచిన కొందరు ఆ దృశ్యం చూసి ఆశ్చర్యచకితులై “నువ్వు బ్రతికే ఉన్నావా? రాత్రే పోయావనుకున్నాము. హైమమ్మ నీకు పునర్జన్మని ప్రసాదించింది” అన్నారు.
నిజమే ! కారుణ్యాంతరంగ, కామితార్థ ప్రదాయిని అయిన హైమవతీశ్వరి కాక మరి ఎవరు రక్షించారు? ప్రాణదాయిని అయిన హైమతల్లి. చరణాలకి సాష్టాంగ నమస్కారాలు ఆచరించారు ఆయన.
ఆయన మరెవరో కాదు – నేనే.