జీవితాంతము, ఆ దేముడిని తలచుకుంటూ, ఆ పరమాత్ముడే సర్వస్వం అని భావించి ఎల్లవేళలా భగవన్నామం చేస్తూన్న మహామహా భక్తులకు కూడా బాధలు తప్పలేదు. శ్రీరాముడే సర్వం అని నమ్మి తన జీవితాన్ని తన, మన, ఆర్థిక వనరలును అతనికే సమర్పించి ఆలయ మేర్పరిచిన ఆ భద్రాచల రామదాసుకు (కంచర్ల గోపన్న) జైలు శిక్ష అనుభవించక తప్పలేదు. “ఓరామ! నీ నామ మెంతరుచిరా” అని పాడుకుంటూ కొరడా దెబ్బలను రుచి చూసాడు, ఆ మహానుభావుడు. తలపండి, పళ్లూడి కళ్లు కనపడని స్థితిలో శబరికి దర్శనమిచ్చాడు. ఆ శ్రీరామచంద్రుడు, జీవితం అంతా ఎదురుచూస్తే నిజంగా అంత్య కాలంలోనే దర్శనమిచ్చాడు.
శ్రీకృష్ణుడు పరమాత్మ, బాల్యమిత్రుడైనప్పటికీ, తన జీవితంలో ఎక్కువ భాగం దారిద్య్రంలోనే గడిపాడు. కుచేలుడు సార్థక నామధేయుడు.
శ్రీకృష్ణుడు సాక్షాత్తు విష్ణుమూర్తియని తెలిసి ఆయన సేవలో జీవితం గడిపిన పాండవులకు అరణ్యవాసం, అజ్ఞాత వాసం తప్పలేదు. ఆ పాండవ పట్టమహిషికి కూడా నిండు సభలో అవమానం తప్పలేదు. ప్రహ్లాదుడి కథ తెలిసిందే. మరి మన మనకాలంలో ‘అంఆ’ సాక్షాత్తు రాజరాజేశ్వరీ దేవి అమ్మగా జన్మించినప్పటికీ కీ.శే. శ్రీ సుబ్బారావు అన్నయ్యకు అనారోగ్యం అకాల మరణం తప్పలేదు.
పిల్లికి 9 జన్మలు అంటారు. Cat has nine lives. ‘అంఆ’ వద్ద అమ్మ చేతిలో పాలుత్రాగి, రైలు ప్రయాణం చేస్తూ కలలో ‘అంఆ’ ద్వారా పాలుత్రాగి సుమారు ఆరుసార్లు మరణం మెట్లు ఎక్కి వెనుకకు మరలి ఆధ్యాత్మిక శిఖరారోహణం చేసిన గోపాలన్నయ్య మన కందరికీ తెలుసు.
ఎంత చేసినా ఏమి చేసినా ‘అంఆ’ పరమేశ్వరియని తెలిసి తన జీవితం త్యాగం చేసాడు ‘రహి’ ఆ విధంగా చిరంజీవి అయ్యాడు.
ఇంతటి గొప్ప భక్తులకే శరీర బాధలు తప్పకపోతే ఆ దైవం ఎందుకు? ఆ దైవాన్ని నమ్మటం ఎందుకు? ఇంకా పూజించడం ఎందుకు ?
ఇదంతా గమనిస్తే నాస్తికులకన్నా ఆస్తికులకే బాధలు ఎక్కువేమో అనిపిస్తుంది.
దీనికి ఉదాహరణ – ఆ జగజ్జనని, ఆ అమ్మ, నా అమ్మ ఆ సీతమ్మ తల్లి జీవితమే చాలు. పృథ్విలో పుట్టి పృథ్వీశ్వరుని చేపట్టి కూడా అరణ్యవాసం, లంకా ప్రవేశం, అగ్నిప్రవేశం, వాల్మీకి ఆశ్రమం ఆశ్రయం తిరిగి పుట్టినిల్లు పృథ్వీలో చేరే వరకు కష్టాలతో నిండి వుంది. తిరిగి అదే ప్రశ్న ఆ అమ్మను అడుగ లేదు. కాని నాకు అడగాలని వుంది. దేముడ్ని ఎందుకు నమ్మడం?
ఇవన్నీ తలచుకుంటూ వుంటే ఒక చిన్న పద్యం గుర్తుకొస్తుంది.
అక్కరకురాని చుట్టము
మ్రొక్కిన వరమీని వేల్పు మోహరమున
తానెక్కిన బారని గుఱ్ఱము విడువ వలయు గదరా సుమతీ !
ఈ ప్రశ్న నన్ను ఎంతో కాలంగా సమాధానం దొరకక అనాథగా నా వద్ద నిలిచిపోయింది. అనాధలకు నాథుడే అమ్మ ప్రశ్నలకు సమాధానం కూడా ‘అంఆ’ యే తోపించింది.
మనం దైనందిన జీవితంలో జరిగే కొన్ని విషయాలు చూస్తుంటే ఈ ప్రశ్నకు సమాధానం దొరుకు తుందని అనిపించింది.
మనం రోజూ బజారుకు వెళ్తున్నపుడు ఎందఱో ఎదురవుతారు. తెలిసిన వాళ్లు కనిపిస్తే నమస్కారం చెప్తాం, కుశలమడిగితే అందఱూ బావున్నారని చెప్తూ ముందుకు వెళ్తాము. ముఖపరిచయమున్న వాళ్లయితే చిరునవ్వుతో, చేయి వూపుతూ వెళ్లిపోతాము. మరికొద్ది దూరం సాగితే ఆప్తమిత్రుడు కనపడ్తాడు. పరామర్శల తర్వాత అతని ప్రశ్నలకు, మనం పది సమాధానాలలో ఉద్యోగం ఇంటి కష్టాలు పిల్లలు అనారోగ్యాలు, చదువులు పెండ్లిండ్లూ మనకున్న ఇబ్బందులు అన్నీ చెప్పుకుంటాము. దీనిని వివరణ వింతగా వుంటుంది. తక్కువ పరిచయం వున్న వారికి మన శుభవార్తలు చెప్తాము. క్షేమ సమాచారమే అందిస్తాం. మంచి అంతా పరిచయం తక్కువ కలవారికే పంచిపెట్టాం. మన కష్టాలన్నీ మన ఆప్తుల వడిలో పోస్తాం..
తెలియని వారికి (మంచిని) సుఖాలనే పంచుతాం. తెలిసిన వారికి దుఃఖాలను పంచుతాం. మానవులమైన మనం ఈ విధంగా ప్రవర్తిస్తే, మానవిగా అవతరించిన మహామానవి ‘అంఆ’ మాయతెరను మన మధ్య కప్పుతూ వుంటుంది. దానికి ఉదాహరణగా మంచినంతా పదుగురికి పంచిపెట్టుంది. సుఖాన్ని సర్వులకు పంచుతుంది ప్రసాదంలా, గోరుముద్దలు తన కాప్తులైన వారికి దాచిపెట్టి కష్టాలలా తినిపిస్తుంది. కష్టాలెక్కువయ్యాయంటే ‘అంఆ’కు దగ్గరయ్యామని ఆనందం, “వేడి చేసిన చెరుకు ముక్కను కొరికితే వేడిగా వున్న బాధ. తీయటి రసం నోటికి లభిస్తున్నందుకు ఆనందం. నోరుకాలినా ఆ తీయటి రసం కోసం చెరుకు ముక్కను వదలం”. అంటాడు కుసుమహరనాథుడు.
Intensity of pain is directly proportional to the intensity of closeness with AMMA. Greater the pain, the deeper the closeness to AMMA.
బరువు మోస్తూ దారిలో పోతుంటే, మోయ లేక ఎవర్ని సహాయం అడుగుతాం? ముక్కూ మొహం తెలియని వారిని దారిని పోయే వారిని అడగలేము కదా!. మనకు తెలిసిన వారినే “కొంచెం చేయి వెయ్యండి” అంటాము. మన అబ్బాయే ఎదురైతే ఆ బరువు తానే అందుకుంటాడు. మన బంధువులకే మన బాధ్యత నప్పగిస్తాము. అలాగే అమ్మ కూడా తనుమోసే బరువును మనతో పంచుకుంటుంది. తనకు ఆప్తులైన వారికే తన బంధువులకే, తన భక్తులకే తను మోసే బరువులో పాలు పంచుతుంది కాబోలు. అంఆ భక్తుల కందఱికీ బాధలే అనుకోవాల్సి వస్తుంది.
ఇంకొక విధంగా ఆలోచిద్దాం
రాత్రి పగలు వుంటేనే ఒకరోజు
కూర్చుంటేనే లేవగల్గుతాం
High Note – Low Note వుంటేనే Music అవుతుంది.
ఎండాకాలం శీతాకాలం, కలిస్తేనే సంవత్సరం
సుఖదుఃఖాలు వుంటేనే జీవనం
కారం తీపి కలుస్తేనే భోజనం
బంతిని క్రిందకు కొడితేనే పైకి లేస్తుంది..
లోయలేనిదే పర్వతం వుండదు.
కాబట్టి ‘అంఆ’ దయ అనే తీపి రసాస్వాదన చేయాలంటే బాధలనే కారం కూడా రుచి చూడాలి కదా!
మరో కోణంలో పరిశీలిస్తే ఉలిదెబ్బ తగలక విగ్రహం రాయి లాగానే మిగిలి పోతుంది. వడ్రంగి చేతి ఉలిపడకపోతే చెక్క చెక్కగానే వుండి పోతుంది. కంసాలి నిప్పు సెగసోకనిదే బంగారం నగ కాదు బంగారం సిగార అర్హత పొందదు.
బాధలు బరువు మోస్తేనే, మన జీవితాలు చక్కదిద్దిన రూపులవుతాయి. ఈ బాధలు, మన బంధాలు వదల్చడానికే, మన బుద్ధిని మార్చడానికే అంఆ మనకు తను మోసే బరువు కొంచెం ఇచ్చి తన అక్కున చేర్చుకుంటుంది. మనల్ని దిద్దుకుంటుంది. అల్లరి పిల్లవాడిని, దారి తప్పిన వాడిని ఒక లెంపకాయ వేసి ఏడుస్తే కన్నీళ్లు తుడిచి వళ్లో చేర్చుకుంటుంది.
అందుకే
భక్తులకు బాధలు ఎక్కువ బంధాలు ఎక్కువ
భావం ఎక్కువ భారం తక్కువ
నిలకడ ఎక్కువ మనుగడ తక్కువ
ఆకలి తక్కువ ఆనందం ఎక్కువ
‘అంఆ’కు దగ్గర అందరికీ అన్నిటికీ దూరం
తప్పులు నావి ఒప్పులు ‘అంఆ’వి
జయహో మాతా