అమ్మ చేసే భవిష్యత్ సూచన అతి సహజంగా వున్నట్టు కనపడుతూనే ఊహాతీతంగా, విశిష్టంగా వుంటుంది.
అది1983వ సంవత్సరం. నేను ఆఫీస్ పని మీద ఉదయపూర్ వెళ్ళాను..అక్కడ ఉండగా నాకు ఒక కల వచ్చింది..ఆ కలలో అమ్మ కింద పడినట్లు కనిపించింది. నా ఆందోళన వర్ణనాతీతం. మనసు పరిపరి విధాలుగా పోయింది. ఈ కల నిజమా లేక నా భ్రమా?
వెంటనే రాచర్ల లక్ష్మీనారాయణ అన్నయ్యకు ట్రంక్ కాల్ చేశాను – విషయం కనుక్కుందామని. ఆ రోజులలో ఉదయపూర్ నుంచి టెలిఫోన్ వసతులు సరిగ్గా లేవు. ఐఊఈ సేవ ఆసలే లేదు.
”అవును. .అనసూయేశ్వరాలయంలో పడింది” అని అన్నాడు. ఇంతలోనే లైన్ కట్ అయింది. తరువాత ఎంత ప్రయత్నించినా లైన్ దొరకలేదు……నా మానసిక అలజడి మీరు ఊహించగలరనుకొంటా. త్వరగా పని ముగించుకొని రెండు మూడు రైళ్లు మారుకుంటూ జిల్లెళ్ళమూడి చేరాను. పరుగు పరుగున మేడమీద ఉన్న అమ్మ గదిలోకి వెళ్ళాను. నా కోసమే ఎదురు చూస్తున్నట్లు అమ్మ ఒక్కతే వుంది. అమ్మ పాదాలకు నమస్కరించి, అమ్మ మోకాళ్ళ నుంచి పాదాలవరకూ చేతితో రాస్తూ పొంగుతున్న అశ్రుధారలతో, వణుకుతున్న కంఠంతో ”అమ్మా! నువ్వు పడ్డావని తెలిసింది……ఎలా జరిగింది? ఇప్పుడు ఎలా ఉంది.” అని అడిగాను.
అమ్మ ”ఏం లేదు నాన్నా! బాగానే ఉన్నాను. అయినా దానిదేముంది, ఎప్పటికయినా అందులో పడవలసినదానినే కదా!” అని అన్నది. ఊహించని ఈ మాటలకి ఒక్క సారి గుండె ఝల్లుమంది. భయం వేసింది. కన్నీళ్లు ఉబికొచ్చాయి. అమ్మ జరగబోయేది చెప్పడమే కాకుండా నన్ను మానసికంగా సన్నద్ధం చేసిందా అని ఇప్పుడు అనిపిస్తోంది!!
సృష్టి చరిత్రలోనే అపూర్వంగా తనకోసం ఆలయం నిర్మించుకుని తానే వెలసిన వెలలేని దేవత మన అమ్మ.