శ్రీ బి.యల్.యస్.శాస్త్రిగారు:
‘సర్వాత్మత్త్వమితి’ బోధ జనయిత్రీమ్
సర్వభూత భోగ మోక్ష ‘సంధాయినీమ్’
అర్కపుర్యష్టమ స్థాన ఘటయిత్రీమ్
భజే_హం శ్రీ అనసూయాదేవి నామ్నీమ్’ అని సర్వాత్మనా అమ్మను స్తుతించారు, సంభావించారు, అర్చించారు తరించారు.
‘అదికానిదేదీ లేదు’ అని అద్వైతసారాన్ని బోధించే, సకల జీవులకు ఇహపరసౌఖ్యాలను ప్రసాదించే, జిల్లెళ్ళమూడిని అష్టమ ముక్తి క్షేత్రంగా తీర్చిదిద్దే అనసూయమాతని ఆరాధిస్తాను అని నిశ్చయాత్మక భక్తి తత్పరతతో చాటారు.
జిల్లెళ్ళమూడిలో ‘యయా శక్త్యా బ్రహ్మా…” అని ప్రార్థిస్తాం; దానినే ప్రపంచంలో ‘ఎవ్వనిచే జనించు’ అని శరణాగతిని ప్రస్తావిస్తారు’ అని నేను అన్నాను. తక్షణం
శ్రీ శాస్త్రిగారు
‘పరుడై ఈశ్వరుడై మహామహిముడై ప్రాదుర్భవ స్థాన సం
హరణ క్రీడనుడై త్రిశక్తియుతుడై యంతర్గత జ్యోతియై
పరమేష్ఠి ప్రముఖామరాధిపులకున్ ప్రాప్తింప రాకుండు డు
స్తర మార్గంబున దేజరిల్లు హరికిం దత్త్వార్థినై మ్రొక్కెదన్’
అనే మరొక భాగవత పద్యాన్ని ఉటంకించారు. అంతటి ధారణశక్తి గలవారు. కాకినాడలో బ్రహ్మవిద్యా మహోదధి బ్రహ్మశ్రీ రాణి నరసింహశాస్త్రి గారి ముఖతః ప్రస్థాన త్రయ జ్ఞానాన్ని ఆకళింపు చేసుకున్నారు. ఫలితంగా ‘కృష్ణం వందే జగద్గురుమ్’, ‘మాండూక్యగీతమ్’ మున్నగు గ్రంథాల్ని రచించారు.
అమ్మ అవ్యాజప్రేమతత్వానికి, అపూర్వ తత్త్వ ప్రబోధానికి అంజలి ఘటించి ‘తెలుగులో మహావాక్యం’ (నేను నేనైన నేను), ‘బోధే కార్యం కథం భవేత్’ అనే గ్రంథాలను రచించారు. త్రికరణశుద్ధిగా అమ్మను ఆరాధించారు. అమ్మ భక్తులను అభిమానించారు, ఆదరించారు. ‘పదార్చన’ మూడు భాగాలు రచించి అమ్మ సేవా నిరతులకు అంకితం చేశారు.
నేను తొలిసారి శ్రీ విశ్వజననీపరిషత్ అధ్యక్షునిగా బాధ్యతలు స్వీకరించినపుడు శ్రీ శాస్త్రిగారు ఉపాధ్యక్షులుగా నాకు సర్వదా సర్వథా సహాయ సహకారాలనందించారు. అమ్మ స్థాపించిన సేవా సంస్థల అభివృద్ధికి కృషిచేయడమే ‘అమ్మపూజ’ అని భావించారు. మాతృశ్రీ ఓరియంటల్ కళాశాల విద్యార్థులకు ప్రతి సంవత్సరం దుస్తులు దుప్పట్లు ఇచ్చేవారు. గ్రంథా లయానికి భూరి విరాళం ఇచ్చారు. శ్రీ అనసూయే శ్వరాలయంలో టైల్స్ వేయించటం, ముఖద్వారాన్ని తయారు చేయించటం, వేదపాఠశాల స్థాపనకి కృషి చేయటం, అందరింటికి మరమ్మతులు చేయించటం, ఆంజనేయస్వామి మందిర నిర్మాణానికి తోడ్పడటం వంటి పలు బహుళార్ధకసాధక సేవా కార్యక్రమాల్లో ముందు నిల్చారు. అమ్మను తమ మనోమందిరంలో ప్రతిష్ఠించుకుని, ‘అర్కపురి అష్టమమోక్షపురి’ అని ఎలుగెత్తి చాటారు. అమ్మ స్థాపించిన అందరింటి ప్రాంగణంలో సొంత ఇల్లును ఏర్పాటు చేసుకున్నారు. సంస్థారూపంగా అమ్మను అర్చించుకున్న ఉపాసకులు. 16-5-2021న అమ్మలో ఐక్యమయ్యారు. శ్రీ మాతృసాయుజ్యాన్ని పొందారు.
శ్రీ జె.వి.బి.శాస్త్రి :
శ్రీ వీరభద్రశాస్త్రి అనగానే సనాతనధర్మం, సత్సంప్రదాయం, సదాచారం, ఉత్సవాలు – ఉపచారాలు గుర్తుకు వస్తాయి. ఉపాసన (దైవం ప్రత్యక్ష సన్నిధిలో ఉంటూ సేవించటం)కి ఉదాహరణ శ్రీ వీరభద్రశాస్త్రి. దసరాల్లో త్రికాలపూజలు, శ్రీ సూక్త జపహోమాలు, సహస్ర ఘటాభిషేకాలు, లక్ష బిల్వాలతో లక్ష గాజులతో అర్చన, వేదస్వస్తి ఇత్యాది ఆలయ విధుల్లో ప్రధాన పాత్రధారులు వారు.
గోదావరి, కృష్ణా పుష్కరాల్లో యాత్రికుల సౌకర్యార్థం ‘అమ్మ ప్రసాద వితరణ’ అనే సేవను ఒక యజ్ఞంగా భావించి నడుంబిగించి నిర్వహించిన తీరు అద్భుతం,ఆదర్శప్రాయం. ‘నలుగురికి ఆదరణగా పెట్టుకో’ అనే అమ్మ వాక్యం వారికి మహోపదేశం. అట్టి నమ్మిన సిద్ధాంతం కోసం అలుపెరగని క్రమశిక్షణ గల సైనికునిగా నిర్విరామంగా శ్రమిస్తారు. ఆవేశం లేకుండా, సహేతుకంగా, చెప్పదలచుకున్న విషయాన్ని సూటిగా స్పష్టంగా చెప్పటం వారిలోని మరొక విశేష లక్షణం.
అమ్మ పట్ల, అమ్మ సంస్థ పట్ల వారి అంకిత భావం, సేవానిరతి బహుధా శ్లాఘనీయం, అందరికీ ఆదర్శ ప్రాయం. శ్రీ జె.వి.బి.శాస్త్రిగారు 18-5-2021 న అమ్మలో ఐక్యమైనారు. శ్రీ మాతృ నిజ సాయుజ్యభాగ్యాన్ని పొందారు. వారు కన్నులు తెరచినా, కన్నులు మూసినా అమ్మ ఆరాధనలోనే శ్వాసిస్తున్నారు.
పూజ్య సోదరులిరువురికీ ఇదే సాశ్రునివాళి.