“మత్” అంటే నేను అని అర్థం …. ‘నేను’ అనేది ఉత్తమ పురుషైక వచనం. దీనికి బహువచనం లేదు. ఆత్మ ఒక్కటే. జగమంతా ఆవరించిన ఆత్మ ఒక్కటే. రూపాలు వేరైనా ఆత్మ ఒక్కటే. ఆత్మకు బహువచనం లేదు. అది నిత్యైక వచనమే ‘వాడు’ కు ‘వారు’, ‘నీవు’కు ‘మీరు’ బహువచన రూపాలు. కాని ‘నేను’ కు ‘మేము’, ‘మనము’ బహువచన రూపాలు కావు. ‘నేను, నీవు’ కలిసి ‘మనం’, ‘నేను, వాడు’ కలిసి ‘మేము’, ‘నేను, నేను’ కలిసి? ‘నేనే’. అందుకే అర్కపురిలోని అమ్మ “నేను నేనైన నేను” (అన్ని నేనులూ నేనే) అని ప్రకటించింది కదా! అంతటా నిండిన ఆత్మస్వరూపిణి శ్రీమాత.” భారతీవ్యాఖ్య.
మనం రకరకాలుగా చూస్తూ ఉన్న ఆకారాలన్నీ ఒకే ఆత్మకు వేరువేరు రూపాలు. అంతటా నిండి ఉన్న ఆత్మను మహనీయులు మాత్రమే గుర్తించగలుగుతారు. వారికి రూపంతో పనిలేదు. షిరిడీసాయి, రామకృష్ణ పరమహంస, రమణమహర్షి వంటివారు ఈ కోవలోని వారే. అలా అంతటా నిండి ఉన్న ఆత్మస్వరూపాన్ని సాధకులు మాత్రమే దర్శించగలుగుతారు. ఆ ఆత్మ స్వరూపం తానే అయిన శ్రీలలిత – ‘మత్తా’.
“అమ్మ” – ‘మత్త’. అంటే అంతటా వ్యాపించి ఉన్న ఆత్మస్వరూపిణి. “అమ్మ” పలువురితో చేసిన సంభాషణల్లోనూ, “అమ్మ” నడవడిలోనూ, “అమ్మ” జీవిత సన్నివేశాల్లోనూ ఈ విషయం చాల స్పష్టంగా వ్యక్తమవుతోంది.
“నేను నేనైన నేను – అంటే నీవు లేని నేను” – ఈ వాక్యం “అమ్మ” ఆత్మస్వరూపిణి అని తెలియచేస్తోంది మనకు – వాడు, నీవు, నేను (ప్రథమ, మధ్యమ, ఉత్తమ) అనే మూడు ‘పురుష’లు ఉంటాయి. కానీ, అందరిలో, అన్నింటిలో ఉన్న “అమ్మ” కు ఈ భేదం లేదు. అంతా తానే, అన్నీ తానే, అందుకే “అమ్మ”కు ‘నేను’ తప్ప ‘నీవు’ లేదు. ‘నీవు’ అనేది లేని “అమ్మ”కు ‘వాడు’ కూడా ఉండదుకదా! అన్నింటా, అంతటా తానే ఉన్నాననే అర్థం వచ్చేటట్లుగా “నేను నేనైన నేను” అని ముచ్చటగా మూడు ముక్కల్లో తాను ఆత్మ స్వరూపిణిని అని ప్రకటించింది “అమ్మ”.
“నేను ప్రతిదానిలో ఉన్నాను. పతనమనే భాగంలో ఉండకుండా లేను. అన్నిట్లోను నేను ఉన్నాను”. అని తన సర్వవ్యాపకత్వాన్ని తెలియచేసింది “అమ్మ”. దరిద్రదేవత తానే, మృత్యుదేవత తానే అని తాను కానిది ఈ ప్రపంచంలో లేదని చెప్పిన ‘మత్త’ – “అమ్మ”. ఇంకా స్పష్టం చేస్తూ “అంతటా ఉన్న అమ్మ తెలియటానికే ఈ అమ్మ” అని వివరించింది”. “నేను ప్రత్యేకించి ఏ ఒక్కటీ కాను” అని తాను ప్రత్యేకంగా ఏ ఒక్కటీ కాదని చెప్పింది. ఏ ఒక్కటీ కాదు అంటే అన్నీ తానే అనే కదా అర్థం. అన్నీ తాను అంటే అదే ఆత్మస్వరూపం.
“నాలుగు గోడల లోపల మంచం మీద కనబడుతున్న రూపం పరిమితమూ, బయట అనంతమూ” అని తన చిన్నగదిలో బుల్లిమంచం మీద కూర్చున్నదే “అమ్మ” అని నాలాంటి మందమతులు అనుకుంటారేమో అని – ఆ మంచం మీద కూర్చున్న “అమ్మ” మనకు కనిపించడం కోసం తన రూపాన్ని పరిమితం చేసుకున్నదనీ, బయట విశాల విశ్వంలో కనిపిస్తున్నదంతా “అమ్మ” రూపంలో కనిపించకపోయినా తన ఆత్మతత్త్వమే అంతటా నిండి ఉన్నదని చెప్పడానికే “బయట అనంతమూ” అన్నది “అమ్మ”. “చెట్టులో పరమాత్మ ఉన్నాడు కాని చెట్టే పరమాత్మ కాడు” అని విశ్వవ్యాప్తమైన చరాచరము లన్నింటిలో ఉన్నది ఆత్మతత్త్వమే అని ప్రబోధించింది.
“జగన్మాత అంటే జగత్తుకు తల్లి కాదు; జగత్తే తల్లి” అని నిర్వచించింది “అమ్మ”. ఆత్మజ్ఞానం కలిగిన వారికి మాత్రమే ఈ వాక్యార్థం బోధపడుతుంది. అందుకే “అమ్మ” అందరికీ తెలియటానికి “నేను మీకంటే భిన్నంగా లేను” అని మనందరిలో ఉన్నది “అమ్మ” అని స్పష్టంచేసింది. ఇంకా బాగా అర్థంకావాలనేమో “మీలో కాదు, మీరుగా” దైవాన్ని దర్శిస్తానని చెప్పింది. అంటే మనందరిలో ఉన్న ఆత్మ – “అమ్మే”. అందుకే “అమ్మ” “జగన్నాథుడిలో జగత్తును చూడలేరు; జగత్తులో జగన్నాథుణ్ణి చూడలేరు” అని మనకు జ్ఞానోపదేశం చేసింది. “మీరంతా నేనే, మిదంతా నేనే; ఇదంతా నేనే” అని, “మీరు కానిది నేనేదీ కాదు నాయనా” అనీ ఆత్మరూపంలో మనందరిలో ఉన్న పరమాత్మ తానే అని మనలోని అజ్ఞాన తిమిరాన్ని పటాపంచలు చేసింది. “నేను నేనైన నేను – నేను అంటే అనసూయను అని కాదు, అన్ని నేనులూ నేనైన నేను” అని ఏమాత్రం సందేహానికి తావులేకుండా ఆత్మ తత్త్వాన్ని అనుగ్రహించింది.
“సర్వవ్యాపకంగా ఉన్న శక్తిని గుర్తించటానికి అవకాశం లేదు కనుక ఈ రూపం కావలసి వచ్చింది” అని చెప్పటంలో కూడా ఈ రూపాన్ని ఆరాధించడంతో ఆగిపోక, అంతటా నిండి ఉన్న “అమ్మ”ను దర్శించమనే అర్థం అంతర్లీనంగా ఉన్నది. “అంతా ఆత్మ అనుకున్నప్పుడు జిల్లెళ్ళమూడి ఎంతో, సరిహద్దులు దాటేక అంతే” అని సర్వత్రా వ్యాపించి ఉన్న ఆత్మ తత్త్వాన్ని జిల్లెళ్ళమూడికే పరిమితం చేయటం సరికాదనే సూచన చేసిన “అమ్మ” – ‘మత్త’.
“ఈ సృష్టి అనాదీ; నాదీ” అని నిర్ద్వంద్వంగా ప్రకటించిన “అమ్మ” – “కనపడుతున్న రూపమేదో – కనపడనిదీ అదీ అమ్మే” అని చెప్పింది. అంటే కనిపిస్తున్న చరాచర జగత్తులోనే కాదు, కంటికి కనిపించని శూన్యంలో కూడా “అమ్మ” ఉన్నది. అందుకే వ్రేళ్ళ మధ్యలో ఉన్న ఖాళీ స్థలంలో కూడా “అమ్మ” ఉన్నదని చెప్పింది. స్థావర జంగమాత్మకమైన సృష్టి అంతటిలో – కనిపించే వాటిలో, కనిపించని వాటిల్లో కూడా తాను ఉన్నానని చెప్పిన “అమ్మ” – ఆత్మస్వరూపిణి.
‘అమ్మా! నేను నీకేమి చేయగలను’ అని ఆర్తితో అడిగిన ఒక బిడ్డకు “అమ్మ” సమాధానం “నీవు చేసేదంతా నాకే” అని. ఎంత విచిత్రమండీ. మనం ఏ పని చేసినా అది “అమ్మ”కు చేసినట్లే అట. అంటే మనం నిత్యం చేసే ప్రతిపనీ “అమ్మ”కు మనం చేసే ఆరాధనే. అందుకే “నేను ఆధ్యాత్మికం వేరూ, ఇదంతా వేరూ అనుకోను. రెండూ ఒకటే” అని చెప్పింది “అమ్మ”. అంటే, నిత్య జీవితంలో మనం చేసే ప్రతి చిన్న పనినీ నిస్స్వార్థంగా, భగవచ్చింతనతో గనుక చేయగలిగితే అదే ఆధ్యాత్మికత. అదే “అమ్మ”కు మనం చేసే అర్చన. ఇలా అంతటా నిండి ఉన్న ఆత్మస్వరూపిణి అయిన ‘మత్తా’ మన “అమ్మ”. సర్వదా, సర్వత్రా “అమ్మ” ఉన్నదనే భావం మన మాటలలో మాత్రమే కాక,
చేతలలో కూడా వ్యక్తమయితే “అమ్మ” మనలో, మనతో ఉన్నట్లే. పుట్టుకే లేని ఆత్మస్వరూపిణి “అమ్మ”కు శతజయంతి సంవత్సర మహోత్సవ సంరంభం ఆరంభమయింది. ఈ వేడుకలు మన సంతోషం కోసం మనం చేసుకుంటున్నవే. “కాలం ఎప్పుడూ ఉన్నది. రాత్రీ పగలే కాదు. ఎప్పుడూ ప్రెజంటే నాకు” అని చెప్పిన “అమ్మ”కు ఎప్పుడూ వర్తమానమే. “ఈ అవతారం చుట్టూ మీరూ, మీకోసం ఈ అవతారం” అని చెప్పిన “అమ్మ” పుట్టినట్లుగా కనిపించి, కనుమరుగైనట్లుగా అనిపించిన “అనాది నిధన”. మనకు దిశానిర్దేశం చేయడానికి దివినుండి భువికి దిగివచ్చిన “దివ్య విగ్రహా”.
అర్కపురిలోని అందరింటిలో అనసూయేశ్వరాలయంలో కొలువు తీరిన “అమ్మ” ఆత్మస్వరూపిణి అయిన ‘మత్తా’. ఆ తల్లిని దర్శించి, స్మరించి, భజించి, తరించుదాం.
జయహో మాతా! శ్రీ అనసూయా!