అమ్మ “నేను ఈ విశ్వాన్నంతనూ కన్నాను” అన్న ప్రకటనకు “నేను ఈ విశ్వాన్నంతనూ చూశాను” మరియు “నేను ఈ విశ్వాన్నంతనూ ప్రసవించాను” అనే రెండు అర్థాలనూ కూడా గ్రహించాలి. ఇది ఎలాగ?
ఎలాగో చూద్దాం. సోదరులు కొమరవోలు గోపాలరావుగారితో, ఒక అమావాస్య రాత్రి, అమ్మ మూడో అంతస్తులో పచార్లు చేస్తూ, ఆకాశంలో మిలమిలా మెరిసే నక్షత్రాలకేసి చూపించి, “నాన్నా! అవి అన్నీ నాకు గంపలో నేరేడు పళ్ళల్లా కనిపిస్తాయిరా” అని చెప్పింది.
శ్రీ ధూళిపాళ్ళ అర్కసోమయాజిగారు, కాకినాడ ఒక సభలో ప్రసంగిస్తూ తమకు ఆల్బర్ట్ ఐన్స్టీన్ సాపేక్ష సిద్ధాంతాన్ని అవగాహన చేసుకోడానికి, సుమారు ఒక సంవత్సర కాలం పట్టిందని సెలవిచ్చారు. ఆ సందర్భంలో తాము ఒక శ్లోకాన్ని వ్రాసుకున్నామని సభలో చదవి వినిపించారు.
శ్లో॥ ఆణవీయాంగతిం పశ్యాక్చక్షుషైకేన పంతితః
ఖగోళ గోళసంఘానాం చక్షుషా యేన పశ్యతే ॥
శ్లోకార్థం : అణువులగతి, వేగం రకరకాల ఎలక్ట్రాన్ మైక్రోస్కోపులు, తదితర యంత్రాలు సహాయంతో దర్శించినప్పటికీ, ఖగోళంలోని కోటానుకోట్ల గోళ సంఘాలను తమ కన్నులతో దర్శించని యెడల వారు పండితులు కారు. ఇక్కడ పండితులంటే భగవద్గీత పండితులు, అంటే “పండితాః సమదర్శినః” అని భగవద్గీత బోధించిన విషయాన్ని గమనిస్తే, పండితులంటే ఆత్మజ్ఞానులని అర్థం.
అమ్మ గోపాలరావుగారితో నుడివిన వాక్యాన్ని విశ్లేషించేకుంటే, అవి (అంటే సుదూర దూరాలలో ఉన్న
శ్రీ బులుసు లక్ష్మీప్రసన్న సత్యనారాయణశాస్త్రి నక్షత్రాలూ, నక్షత్రరాశులు నక్షత్రరాశి సముదాయాలు, గేలాక్సీలూ) తనకు గంపలో పోసిన నేరేడు పళ్ళల్లా కనిపిస్తున్నాయని చెప్పడాన్ని బట్టి చూస్తే, అమ్మది ఎంత దూరదృష్టో అమ్మ ఎట్టి పండితురాలో ఇట్టే అవగత మౌతుంది. అట్టి మహిమోపేతను జిల్లెళ్ళమూడిలో సర్వులూ భగవంతునిగా అర్చించుకోవడం సమంజసం. అమ్మ ప్రేమస్వరూపిణి, భగవంతుడు.
ఈ మాటనేనేకాదు లబ్ధప్రతిష్ఠులైన నాతోటి సోదరులందరూ “మన అమ్మవిశ్వజనని” అని తెలియచేస్తున్నారు.
ఈ నక్షత్రాలు ఆకాశంలో సుదూర దూరాల్లో అంటే కోట్ల కోట్ల మైళ్ళ కంటే ఎక్కువ కొలత అయిన పదులు, వందలు, వేలు, లక్షలు, కోట్లు, కోట్ల వెలుగువత్సరాల దూరంలో ఉన్నాయి.
అట్టి విశ్వం యొక్క కొలతలు కట్టలేక, మన ఋషులు దీన్ని “అనంతం” (ఆంగ్లభాషలో Infinity) అన్నారు. దీనినే తైత్తిరీయోపనిషత్తు (కృష్ణ యజుర్వేదం) “సత్యం జ్ఞాన మనంతం బ్రహ్మ” అని బ్రహ్మను (బ్రహ్మదేవుడు కాదు) నిర్వచించింది. అదే భగవంతు డంటే, అదే పరమేశ్వరుడు, అదే పరనారాయణుడు ఇది ఎన్నివేల, లక్షల, కోట్ల సంవత్సరాల నాటి మాట!
విశ్వాన్ని మన అమ్మ గంపలో నేరేడు పళ్ళల్లా దర్శనం చేసుకుంది. ఐన్ గ్రీన్ అంటాడు బహుదూరాల్లో ఉన్న బ్రహ్మాండగోళ్లల్లో జరిగే ఘటనలను ఏకకాలంలో (సమకాలంలో)దర్శించడం మనకు వీలు పడదు, ఎందుచేతనంటే, పాపం వెలుతురు సెకండ్లో 1,86,000 మైళ్ళ దూరం మాత్రమే ప్రయాణం చెయ్యగలదు కనుక ! కోటానుకోట్ల వెలుగు వత్సరాల దూరంలో జరిగిన ఘటనలను, సమకాలంలో దర్శించే వీలు సాధారణ మానవులకు లేదు ! కాని భగవంతుడైన వారికి ఉండవచ్చుకదా!
అమ్మ దివ్యదర్శనానికి రెండు సజీవ ఉదాహరణ లను ఇస్తున్నాను. తమ పెళ్ళైన ఒక యువజంట, గుంటూరులో కాపురం ఉంటూ తరచు జిల్లెళ్ళమూడి వచ్చి అమ్మను దర్శించుకునేవారు. ఆ జంట ఒకసారి గుంటూరులో అద్దెకుంటున్న చిన్న ఇంటిలో పడుకుందామనుకుని, తమ పడకగదిలో ఉన్న అమ్మ ఫోటోను చూసి, ఆ ఫోటోలోంచి అమ్మ చూస్తుందేమో అనుకుని, ఆ ఫోటో తీసి ప్రక్కగదిలో పెట్టివచ్చి, ఆనందించి, నిద్రించారు.
ఆ జంట కొద్ది రోజుల తరువాత జిల్లెళ్ళమూడి వచ్చి అమ్మ దర్శనం చేసుకున్నారు. అమ్మ గదిలో నుండి అందరూ వెళ్ళిపోగా ఈ జంట మిగిలారు. అప్పుడు అమ్మ “నాకు కనిపించదనుకున్నారా! మీరుపడుకోకపోతే నా సృష్టికార్యం ఎలా సాగుతుందిరా! నేను తలస్తేనే మీరుపడుకునేది” అని అందిట. ఆ జంట సిగ్గు దొంతర్లలో ముడుచుకుపోయారు. ఆ జంటకు బంగారం వంటి పిల్లలు పుట్టారు. పుట్టక ఏం చేస్తారు.
ఇంక ఇంకో సంఘటనలో, నేను జిల్లెళ్ళమూడి వచ్చిన సందర్భంలో విశాఖ సోదరులు నరసింహరావు, తదితరులూ అమ్మను విశాఖపట్టణం రమ్మనమని ప్రార్థిస్తున్నారు. అపుడు “అమ్మా ! నిన్ను 1974లోనే కాకినాడ రమ్మనమని ప్రార్థించాం. ‘వీలుబట్టి నేనే వద్దా మనుకుంటున్నాను” అన్నావు. అమ్మా విశాఖపట్టణం వెళ్ళేటప్పుడు కాకినాడ మీదుగా వెళ్ళమ్మా, మధ్యలో చెందుర్తి గ్రామం ఉంది. పెమ్మరాజు సత్యనారాయణ గారి ఊరు” అన్నాను.
“అవును. ఆయన ఆ ఊళ్ళో రావిచెట్టు క్రింది తిన్నె మీద కూర్చుని తత్వాలు పాడేవారు” అంది అమ్మ. వెంటనే నేను “అమ్మా! నువ్వు చెందుర్తి చూడలేదు కదా! ఎలా చెబుతున్నావు” అని అడిగాను నవ్వుతూ.
“నేను మనస్సుతో చూశాను” అంది అమ్మ చాలా గంభీరమైన స్వరంతో.
అవును! అమ్మకు మనస్సు అంతరింద్రియమే గాక బహిరింద్రియం కూడా అయిందన్నమాట.
మనకు మనస్సు ఇంద్రియాల ద్వారా దర్శిస్తేనే చూపు. కాని అమ్మకు బహిరింద్రియాపేక్షలేకుండా ఏకకాలంలో (సమకాలంలో) సర్వాన్నీ దర్శించగలదు. మనస్సు అమ్మకు విభువై సర్వసృష్టిని సమకాలంలో దర్శించగలదు. అమ్మ “నేను మనస్సుతో చూశాను” అన్న మాటను పరిశీలనగా గమనిస్తే, “నేను నేనైన నేను”కు మనస్సు ఒక పనిముట్టే కదా! “నేను చూడదలచుకుంటే ఈ గోడలు అడ్డుకావు” అనలేదూ !
అమ్మ నాకే ఇచ్చిన మరో అనుభవం గురించి వివరిస్తాను. కాకినాడలో పేరాలభరతశర్మగారూ నేనూ స్నేహితులం. ఒకసారి జిల్లెళ్ళమూడి వస్తూ బజారులో పూలూ, పళ్ళు, పటికబెల్లం కొనుక్కుని ఇంటికి తిరిగి వస్తుంటే భరతశర్మగారూ బజారుకు వస్తూ రిక్షాలో కనిపించారు. రిక్షా ఆపి, “శర్మగారూ!నేను జిల్లెళ్ళమూడి అమ్మదర్శనానికి వెళుతున్నాను” అని చెప్పాను. “అమ్మకు నా నమస్కారాలు తెలియజేయండి” అని రిక్షాలోనే నమస్కరించుకున్నారు.
నేను జిల్లెళ్ళమూడి వచ్చి అమ్మదర్శనం చేసుకుని, పూజ చేసుకుని, నా పూజ ప్రత్యేకం – నా లలాటాన్ని అమ్మకుడిపాదం బ్రొటనవేలికి తాకించడమే. భరతశర్మ గారు నమస్కారము అందివ్వటం మరచిపోయాను. క్రితం రాత్రి రైలులో నిద్రపట్టలేదు. అందుచే భోజనం చేసి గోపాలరావు గారి ఇంట్లో పడుకున్నాను. సాయంత్రం లేచి, సత్యం కొట్టుకు వెళ్ళి కాఫీ త్రాగి, సిగరెట్టు కాల్చుకుంటూ, అందరింటికి తిరిగివస్తోంటే, అమ్మ, వసుంధరక్కయ్య మూడో అంతస్తులో ఉత్తరం వైపు పచార్లు చేస్తున్నారు. చేతిలో సిగరెట్టు పారేసి భరతశర్మగారి నమస్కారాలు తెలియచెయ్యాలని మూడో అంతస్థులోకి పరుగున ఎక్కాను. నన్ను చూసి అమ్మ, వసుంధరక్కయ్య ఆగారు. వెళ్ళి అమ్మకు పాదాభివందనం చేసి “అమ్మా! భరతశర్మగారు అడిగానని చెప్ప మన్నారమ్మా” అన్నారు.
అమ్మ “ఆ” అని ఉరిమినట్లు అంది.
నేను లెంపలేసుకుని, “కాదమ్మా ! భరతశర్మగారు తమ నమస్కారాలు తెలియజేయమన్నారమ్మా” అన్నాను వణుకుతూ.
“ఊ” అని అమ్మ నాకేసి ప్రసన్నంగా చూసింది. అంతే అమ్మపాదాలకు నమస్కరించుకుని, ఒక్కఉదుటన మెట్లు దిగి క్రిందకు వచ్చి, ఈ ఘటన గురించి గోపాలరావుగారితో చెప్పితే, “మీరు ఎప్పుడైనా ఏదైనా అనుభవం కావాలని అమ్మను కోరుకున్నారా” అని అడిగారు.
నేను “లేదండి” అన్నాను. కాని నా అంత రాంతరాలలో ఏదైనా అట్టి ఆలోచన ఉందేమో ఇపుడు చెప్పలేను.
“ఈ ఘటనతో మీకు అమ్మ తన సర్వాంత ర్యామిత్వాన్ని తెలియచేసింది” అన్నారు గోపాలరావు గారు.
ఈ ఘటనలను సంఘటనలను పరిశీలనగా గమనిస్తే, అమ్మ మనస్సు ఎంత విభు అవగతమౌతుంది.
అమ్మ “అసలు మనస్సు తెలిస్తే బోధలేదు” అనే మహావాక్యాల్ని ప్రసాదించిన తల్లి.
అమ్మతో పోలవరం ప్రాజెక్టు నిర్మాణం గురించి వివరిస్తూ శొంఠి రామమూర్తి పంతులుగారు గురించి చెబితే అమ్మ “ఆయనది పెద్ద బుఱ్ఱరా. ఆయన్ని నేను చిదంబర రావు తాతగారి ఇంట్లో చూసిన గుర్తు” అంది.
“సర్వచైతన్య రూపాం తాం
ఆద్యాం విద్యాంచ ధీమహి
బుద్ధిం యా నః ప్రచోదయాత్”
అనే దుర్గా గాయత్రీ మంత్రంతో ప్రారంభిస్తారు దేవీభాగవత పురాణగ్రంథాన్ని వ్యాసులవారు. ఆసర్వచైతన్య రూపమే విశ్వప్రసూతి. ఆమె ఆద్య, విద్య (జ్ఞానస్వరూపం). ఆమె మన బుద్ధి వృత్తులను ప్రచోదన చేసి శుభవృత్తులుగా తీర్చిదిద్ది, మనలను తనంత వారిని చేసుకోవాలి. అందులకే ఆమెకు ప్రార్థన.
అమ్మ తనను “ఆదెమ్మ”నని చెప్పుకోలేదా! ఒకసారి సోదరులు పొత్తూరి వేంకటేశ్వరరావుగారితో మాటల సందర్భంలో చెప్పాను. అమ్మ తెలుగుభాషను సుసంపన్నం చేసిందని. ఈ విషయం వెంపరాల సూర్యనారాయణ శాస్త్రి గారు తప్ప మిగిలిన తెలుగుదేశ పండితులు సరిగా గమనించుకోలేదు. ఆ సర్వచైతన్యరూపమైన మన అమ్మే విశ్వప్రసూత్రి.
మాత అనే పదానికి తల్లి అని తెలుగుభాషలోనూ, సంస్కృతభాషలోనేగాక అని భారతీయ భాషలలోనేగాక, కొన్ని విదేశీభాషలలోనూ కూడా అదే అర్థాన్ని సూచిస్తాయి.
“మాత” అనే పదానికి తెలుగుభాషలో కొన్ని ప్రాంతాలలో ధాన్యాన్ని కొలిచేవాడు అనే అర్థం కూడా ఉంది. ఇక్కడ ఈ మాత ధాన్యాన్ని కొలుస్తున్నాడంటే “మెషర్ చేస్తున్నాడని” “వర్షిప్” చేస్తున్నాడని కూడా ! ఆధాన్యపురాశులకు ముద్రలు వేసి, హారతికూడా ఇస్తారు, మా వైపు.
ధాన్యపురాశులు మనకు ఆహారాన్ని ఇస్తున్నాయి. అందుచేత మనం ధాన్యపురాశుల్ని పూజిస్తాం కూడా, కంచాలలో గాని, విస్తీర్ణంలో గాని అన్నాన్ని కళ్ళకద్దుకుని భగవదారాధనగా నివేదిస్తాం. మనం భోజనం చెయ్యడం దేవతార్చనగా కూడా భావిస్తాం. ఎందుచేతనంటే భగవంతుడు “అహం వైశ్వానరోభూత్వా ప్రాణినాం దేహమాశ్రితః | ప్రాణాపాన సమాయుక్తః పచామ్యన్నం చతుర్విధమ్” అని భగవంతుడు చెప్పాడు కదా!
అంతేకాదు. అన్నాన్ని పరబ్రహ్మస్వరూపంగా “అన్నం బ్రహ్మేతి వ్యజానాత్”, “అన్నం నపరిచక్షిత” “అన్నం న నింద్యాత్” “అన్నం బహుకుర్వీత” అని తైత్తిరీయశృతి సెలవిస్తోంది కూడా!
ముందు అనుకున్నట్లు అమ్మ ఈ విశ్వాన్నంతనూ ఏకకాలంలో దర్శించగల మహాచైతన్య స్వరూపం. మానవులు ఎంత దూరదృష్టి చేయగల టెలిస్కోపులను నిర్మించినా, వాటిని ఆకాశంలోకి పంపినా, అవి ఖండ విశ్వాన్నే దర్శింపచేయగలవు కాని, అఖండదర్శనం, అఖండార్థ బోధ కలిగించలేవు.
లలితా సహస్రనామాల్లో మొదటి నామం “శ్రీమాత” అంటే ఈవిశ్వాన్నంతనూ ఏకకాలంలో కొలిచే అంటే సృష్టించే, ఉంచే, గిట్టించే మహాచైతన్యస్వరూపమే! ఆ మహాచైతన్యమే – “సర్వచైతన్యరూపాం తాం ఆద్యాం విద్యాంచ ధీమహి”
భగవంతుడు నామ, రూప, గుణ, క్రియా రహితుడు. ఆయన జడస్వరూపమా అంటే, దివ్యదర్శనం చేసిన మహానుభావులు ఆయన శుద్ధజ్ఞాన స్వరూపుడు, చైతన్యమూర్తి అని తెలియజేశారు. అందుచేత వారు మనకు గురువు లయ్యారు. ఉపనిషత్తే అంది కదా ‘సత్యం జ్ఞాన మనంతం బ్రహ్మ’ అని.
అట్టి భగవంతుని మన బుల్లిబుద్ధులు ఒక పట్టాన అవగాహన చేసుకోలేవు గనుక, భ్రాంతులు కల్పించుకుని మనుగడ సాగిస్తున్నాము. అట్టి భ్రాంతి దర్శనాలను మనకు తొలగింపచేయడానికి స్మృతి ఇలా సెలవిచ్చింది.
“అచింత్యస్యా ప్రమేయస్య
నిష్కళస్య చిదాత్మనః |
ఉపాసకానాం కార్యార్థం
బ్రహ్మణోరూపకల్పనా।।
అంత విశ్వాన్ని మనం ఎక్కడ ఆకళింపు చేసుకోడానికి ఇబ్బంది పడతామేమోనని అమ్మ బుల్లి విగ్రహంగా మనమధ్యమసలి, మనచేత “అమ్మా” అని పిలిపించుకుని మనకు గోరుముద్దలు తినిపించి, మనచే పూజలనుగాని, మనలనందరనూ తనంత వారిగా చేసే బృహత్తర ప్రణాళిక జిల్లెళ్ళమూడి గ్రామంలో అమలు పరచింది, పరుస్తోంది, పరుస్తుంది కూడా!
అమ్మ తన కాళ్ళమీద పోగుపడ్డ పూల గుట్టలలో నుండి పూలను తన చేతుల్లోకి తీసుకుని, వాటి రేకులను త్రుంచి, తన కాళ్ళమీద తనే వేసుకునేది. ఈ దృశ్యాన్ని నాతో సహా, అనేకమంది సోదరసోదరీమణులు చూసే ఉంటారు. అలా చూసిన వారి సంఖ్య ఇంకా వందల్లో ఉంటుంది కూడా. అమ్మ తనను తానే కొలుచుకునేదా! అంటే పూజించుకునేదా! అవును.
ఎందుచేతనంటే “తనను కన్న వాళ్ళ మీద కన్నా తను కన్నవాళ్ళ మీద ఎక్కువ ప్రేమ” అని అమ్మ చెప్పలేదా!
పూజించడం, ఆరాధించడం అంటే ప్రేమించ డమే! అమ్మకు యావత్ సృష్టీ తన బిడ్డేగా. అందుకే దానిని తాను అమితంగా ప్రేమించింది, కొలిచింది, ఆరాధించింది కూడా మీతోనూ, నాతోనూ, అందరి తోనూ సహా ఉన్న ఈ సృష్టిని.
అందుకే అమ్మ శ్రీమాత”. అట్టి “మన అమ్మ విశ్వజనని”. తను పెట్టిన సంస్థకు “శ్రీవిశ్వజననీపరిషత్” అని నామకరణం చేసింది కదా! తను వెళ్ళిన తరువాత సంస్థే మనకు తల్లి అని చెప్పిందికదా!