లోకం పోకడ ప్రపంచమార్గం ‘తెలిసీతెలియని రెండుపదుల -ప్రాయంలో మాతృశ్రీ ఓరియంటల్ కళాశాలలో ఆంధ్రోపన్యాసకురాలిగా అడుగుపెట్టాను నేను. ఆలోచనా లోచనాలు విచ్చుకొని నా చుట్టూ ఉన్న సమాజాన్ని పరికించి చూసిందీ, జీవితంపట్ల నాదయిన దృక్పథాన్ని ఏర్పఱచుకున్నదీ అమ్మ సన్నిధిలోనే అని చెప్పాలి.
బాల్యం నుండి ఎక్కడ ఆర్తి కనిపించినా అవసరం అనిపించినా అక్కునచేర్చుకొని ఓదార్చటం, ప్రేమగా చేయూతనిచ్చి ఆదుకోవటం అమ్మకు సహజసిద్ధమైన లక్షణాలు. చిన్నతనంలోనే “మామీద నీకెందుకింత ప్రేమ అనసూయా?” అని అమాయకంగా ప్రశ్నించిన లోకనాథం బాబాయితో ‘మీరేదో చెయ్యాలని నేను అనుకోను. నాకు ఎవరిని చూసినా అలానే అనిపిస్తుంది. ప్రేమ నాకు సహజం’ అని చెప్పిన అమ్మకు చరాచరజగత్తు తన ఒడిలోనిదేనని సంభావించిన అమ్మకు నిరుపేద విద్యార్థులను ఉత్తమ పౌరులుగా తీర్చి దిద్దాలనే సంకల్పంతో స్థాపించిన కళాశాల విద్యార్థుల పట్ల ఎనలేని ప్రేమ. ఇది సార్వకాలిక సత్యం.
ఏ తల్లికి అయినా అన్నీ సవ్యంగా అమరి ఉన్నవారికంటే కించిత్తయినా కొరతవున్నవారిపట్ల శ్రద్ధ ఎక్కువగా ఉండటం సహజం. 1975 సం. డిశంబర్ 30వ తేదీ అర్ధరాత్రి వేళ కొందరు దుండగులు నక్సలైట్ల ముసుగులో అమ్మ నివాసమైన అందరింటిపై దాడిచేసి కొన్ని గంటలపాటు నానా భీభత్సం సృష్టించారు. వచ్చినవారెవరో ఎలాంటివారో ఎటువంటి దారుణానికి ఒడిగడుతున్నారో తెలియని అయోమయస్థితిలో ఎవరికివారు దిక్కుతోచక ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని నిలుచుండిపోయారు. ఆ స్థితిలో అమ్మ అంగవైకల్యమున్న ఒక విద్యార్థినిని గురించి ప్రస్తావించి ఎక్కడుందోనని కలవరపడటం విశేషించి విద్యార్థుల యోగక్షేమాలపట్ల ఆ తల్లి మనసు పడే తపనకు తార్కాణం.
లక్షమంది భోంచేసినా ఒక్కరు భోజనం చేయకపోతే బాధపడే స్వభావం అమ్మకు సహజసిద్ధమని మనందరికీ తెలిసిందే. ఘనంగా జరిగిన ఒక పెండ్లి వేడుకలో వ్యక్తిగత కారణాలవల్ల విందుభోజనం కాదుగదా ఆకలికి అన్నంకూడా తినకుండా ఒక విద్యార్ధిని ఉండిపోయింది. అది తెలిసిన అమ్మ హృదయం పరిణతి చెందని ఆ చిన్నారి మనస్సు పడ్డ ఆవేదనకు కలతచెంది కరిగి కన్నీరై జాలువారింది. బాల్యంలో అందరూ భోజనాలు చేసి రాఘవరావు మామయ్య కోసం ఎదురుచూచే సందర్భంలో ‘వాడు అన్నం తినకపోతే బాధపడే తల్లి కాస్తా పోయింది కదా!’ అన్న మరిడమ్మ తాతమ్మతో ‘ఎవరు అన్నం తినకపోయినా బాధపడే తల్లి ఉన్నది’ అన్న అమ్మ మాట అక్షర సత్యమై సాక్షాత్కరిస్తుంది. ఈ సన్నివేశంలో.
విద్యార్థులతో ప్రత్యేక సమావేశాలలో అమ్మ వాళ్ళ ఆశలు ఆశయాలు వ్యక్తిగత పరిస్థితులు అడిగి తెలుసుకునేవారు. దూర ప్రాంతాలనుండి వచ్చిన విద్యార్ధులలో కొందరికి సెలవులిచ్చినపుడు ఇంటికి వెళ్ళాలన్నా తిరిగి రావాలన్నా చార్జీలకోసం ఇబ్బందిపడే పరిస్థితి ఉండేది. కొందరు విద్యార్ధులు ఇళ్ళకు వెళ్ళకుండా ఉండిపోయేవారు. మరికొందరు ఎవరినైనా అడిగి తీసుకుని వెళ్ళి సెలవులలో ఏదో పనిచేసి డబ్బు సంపాదించుకొని చార్జీలకు పరీక్ష ఫీజులకు వాడుకునే వారు. కొన్ని సార్లు పని దొరకక ఇబ్బందిపడేవారు. ఈ విషయం తెలిసి వాళ్ళ అవసరాలు తీర్చలేకపోతున్నామని కలతచెందిన అమ్మ కళ్ళు కరుణారస సాగరాలుగా మారాయి. విద్యార్థుల బాగోగులను గురించి అమ్మ నిరంతరం తపించేవారు. చిన్నా పెద్దా తేడాలేకుండా వాళ్ళ ప్రతి అవసరాన్నీ మనం తీర్చగలగాలి అన్న తలంపు అమ్మది. (తలంటు పోసుకునేందుకు కుంకుడుకాయలతో సహా అన్నారొకసారి నాతో.) ఎగుడు దిగుళ్ళు ఎక్కడయినా తప్పవు. ఇది నా యిల్లు అనిపించేలా వాళ్ళను చూసుకోగలిగితే చాలు అనేవారు అమ్మ. నేను తరచుగా జున్నువండి అమ్మకు నివేదనగా తీసుకుని వెళ్ళేదాన్ని. బంతి మీద వడ్డించమనేవారు. ‘సరిపోతుందా?’ అన్న సందేహం నా ముఖంలో చూచి “మనసుంటే అదే సరిపోతుందమ్మా!” అన్నారు. అప్పటినుండి నా దృష్టిలో అమ్మకు నివేదన చేయటమంటే అన్నపూర్ణాలయంలో వడ్డించటమేనన్న భావం స్థిరపడి సాధ్యమైనంతమేరకు పరిమాణం పెంచుకునే ప్రయత్నం చేశాను.
అమ్మ 1985లో రవి అన్నయ్యగారింటికి వచ్చినపుడు అందరింటి ఆవరణలోని ప్రతియింటికీ వెళ్ళి పూజలందుకున్న శుభసందర్భంలో విద్యార్ధుల వసతి గృహాలకు కూడా అమ్మ ఆగమనోత్సవ వేళ విద్యార్థు లందరూ సమధికోత్సాహంతో టెర్రీతోటపై లంఘించి ఆకులూ, పూలూ తెచ్చి స్వాగత తోరణాలు కట్టి ఎవరి రూము వాళ్ళు పోటీపడి ఆటోపంగా అలంకరించారు. వాళ్ళ ఉత్సాహాన్నీ సంరంభాన్నీ చూచి అమ్మ ముగ్ధమోహనమైన వారి భక్తి శ్రద్ధలకు మురిసిపోయారు. ఇవాళ పిల్లలు తోటలో కాగితంపూలు కూడా మిగల్చలేదని నవ్వుతున్నప్పుడు అమ్మ ముఖంలో లాస్యంచేసిన ఆనందహేల చూడవలసిందే కాని వర్ణించ టానికి మాటలు చాలవు. విద్యార్థుల పూజలందుకుని వాళ్ళు పెట్టిన చీరను అక్కడే వాళ్ళు తాత్కాలికంగా ఏర్పాటుచేసిన తెరమాటున కట్టుకొని మరీ ‘బాగుంది. నాన్నా!’ అని ముచ్చటపడటం ఆనాటి విద్యార్ధులకు మాకు మరువలేని ఒక మధురస్మృతి. ఈ సందర్భంలో ‘పెట్టులో లోటు ఉన్నా ప్రేమలో లోటులేదు’ అన్న అమ్మ వాక్యం స్మృతిపథంలో నిలుస్తుంది.
“అన్ని బాధల్లోనూ ఆకలిబాధ ఎక్కువని నాకు అనిపిస్తుం’దని ప్రకటించిన అమ్మ, చిన్నతనం నుంచీ అన్నార్తుల ఆకలిని తీర్చటమే లక్ష్యంగా సంచరించిన అమ్మ విద్యార్ధుల భోజనం గురించి మరింతగా ఆలోచించేవారు. ‘ఆశా అసంతృప్తుల కలయికే జీవితం అన్న వాక్యం నీకు కూడా వర్తిస్తుందా? అమ్మా!’ అని సోదరులెవరో ప్రశ్నిస్తే ‘మీకు బాగా పెట్టుకోవాలనే ఆశా, పెట్టుకోలేకపోతున్నాననే అసంతృప్తి నాకూ ఉన్నాయి’ అన్నారు. ఉత్సవ సందర్భాలలో అయినా గడ్డపెరుగు వడ్డిస్తే శ్రీకృష్ణుడు గోపబాలురతో చల్దులారగించినట్లు పిల్లలు వేళ్ళమధ్య చుట్టుకున్న పెరుగును ఆనందంగా తింటుంటే కనువిందుగా ఉంటుందని మావారితో అన్నారు. అదిమొదలు ఎప్పుడు మాకు భోజనాలు పెట్టుకునే అవకాశంవచ్చినా అగ్రస్థానం గడ్డపెరుగుకే.
ఒక సందర్భంలో ‘సాయంత్రం కాలేజీ నుండి వచ్చాక పిల్లలకు ఏమయినా పెట్టగలిగితే బాగుంటుంది’ అని ఆలోచించారు అమ్మ. స్కూలు నుండి వచ్చిన పిల్లలకు రాగానే ఏం స్నాక్స్ పెట్టాలా? అని తన కన్నబిడ్డల గురించి ఆలోచించే తల్లిలానే అనిపించారు. అయితే అన్నీ అమరివున్న యింట్లో పిల్లలు రాగానే ఏం పెట్టాలి? అనుకోవటం వేరు. సంస్థ పరిస్థితి వేరు కదా! అవసరాలకు తగినట్లు ఆర్థిక వనరులు సమీకరించు కోవలసిన స్థితి శ్రీ విశ్వజననీపరిషత్. మా స్వగ్రామం కొల్లూరు. ఆ ప్రాంతంలో పండే మొక్కజొన్నలు, శనగలు వంటి పంటలు పెద్దమొత్తంగా కొనుగోలు చేస్తే. బాగుంటుందన్న ఆలోచనతో సత్యప్రసాద్ గారిని పిలిచి మాట్లాడుతూ… “కాలేజి నుండి రాగానే ఏమైనా ఒక గుప్పెడు పెట్టగలిగితే అవి తిని కడుపునిండా నీళ్ళు తాగుతారు నాన్నా! ఖాళీ కడుపుతో మంచినీళ్ళు తాగలేరు” అని చెబుతున్నప్పుడు అమ్మ కంఠంలో అనూహ్యమైన ప్రకంపన! ఆ మమతల పెన్నిధి హృదయ మార్దవాన్ని ఏ మాటలతో వర్ణించగలం? ఆ తర్వాత అధ్యాపక బృందం, అడవుల దీవి సుశీలక్కయ్య మొదలగు వారు సాయంత్రం వేళ పిల్లలకు పెట్టేందుకు రకరకాల ప్రసాదాలు చేయించారు. అవి పంచిపెట్టేపుడు అమ్మ. ముఖంలో వెల్లి విరిసే ఆనందలహరిలో సుస్నాతులమైతే మన జీవితమే పునీతమైనంతటి సంతృప్తి. ‘పంచని కాడికి ఉండటం దేనికి?” అని ప్రశ్నించిన అమ్మ అవ్యాజమైన ప్రేమను అందరికీ పంచి, పంచిపెట్టటంలో ఉండే ఆనందాన్ని మనకు చవి చూపించింది.
ఈ నేపథ్యంలో అమ్మ సాన్నిధ్యం విద్యార్థులకు, అధ్యాపకులకు మధ్య విడదీయలేని అనుబంధం పరిణమించింది. అనన్యమైన ఆ అనుబంధం నిర్వచనాలకు అందనిది. ఇప్పటికే కాదు ఎప్పటికీ మా భావాలకు వారసులు విద్యార్థులే. వివాహం, సంసారం, ఉద్యోగం-అనే చట్రంలో విభిన్న భూమికలు నిర్వహిస్తూ తలమునకలౌతూ ఉన్నా అవకాశం కల్పించుకొని ఫోన్లో నైనా కలుసుకుంటూ కష్టసుఖాలలో పాలుపంచుకుంటూ ఉంటారు. సలహాలు సంప్రదింపులూ మాకు నిత్య కృత్యాలే. పదవీ విరమణ చేసిన విద్యార్థినులయితే ఎదిగిన ఆడపిల్లల్లా ఎదలోని భావాలను పంచుకుంటూ మధురస్మృతులతో మురిపిస్తూ ఉంటారు. ఆనాటి సహాధ్యాపకులు అన్నదమ్ములు లేనిలోటును పూరిస్తూ అండదండలై అభిమానపాత్రులుగా నిలిచిపోతారు.
తత్త్వచింతనకు అర్థం పరమార్థం సామాజిక స్పృహ అన్న ఎరుకతో విద్యార్థులు అమ్మ భావాలకు అంకితమై అచంచల విశ్వాసంతో అవసరం విలువ గుర్తించి విభిన్న సేవాకార్యక్రమాలు, రక్తదాన శిబిరాలు, మాతృయాగ మహోత్సవాలు నిర్వహిస్తున్నపుడు నా మనోయవనికపై విద్యార్థులు అమ్మభావాలకు ప్రతీకలుగా అమ్మప్రేమకు పతాకాలుగా దర్శనమిస్తారు. ఏ విద్యా సంస్థలలోనూ కనీవినీ ఎరుగని ఈ అనుబంధం మమతాను బంధం… అది అమ్మ ఒడిలో అమ్మ బడిలో నేర్చుకున్నవే. మనస్సును మమతల కోవెలగా మలచిన అమ్మ సన్నిధికి అంజలి ఘటిస్తున్నాను.