అమ్మ అనుంగు బిడ్డ, ఆత్మీయ సోదరులు శ్రీ వీరభద్రశాస్త్రిగారు మంచికి మారుపేరు. ఇంటికి పెద్దకొడుకుగా తల్లిదండ్రుల సేవలో తరిస్తూ, తమ్ముళ్ళూ, చెల్లెళ్ళ అభ్యుదయంకోసం శాస్త్రిగారు అందించిన సహకారం అందరికీ ఆదర్శం. సేవా తత్త్వానికి పర్యాయ పదం శాస్త్రిగారు. నిడదవోలు సాంస్కృతిక చైతన్యానికి శాస్త్రిగారు కేంద్ర బిందువు.
ప్రతిసంవత్సరం కృష్ణాష్టమి సందర్భంగా వచ్చే వేద పండితుల బృందానికి నిడదవోలులో తమ ఇంట సకల సపర్యలతో, అతిథి సత్కారాలు చేసి, భూరి దక్షిణలు సమర్పించి వేదమాతను సేవించుకునే సంస్కార సంపన్నులు శాస్త్రిగారు. వారి ఒరవడి ఆ పట్టణంలో మరెందరికో మార్గదర్శకమై వేద సంస్కృతిని ఆరాధించే సత్సంప్రదాయం కొనసాగుతూ వస్తున్నది.
శాస్త్రిగారు మంచి ఉపాసనాపరులు. ఆచార సంపన్నులు. నిత్యమూ త్రికాల సంధ్యావందనం, మంత్ర జపదీక్షలను భక్తి శ్రద్ధలతో నిర్వహించడం వారి దినచర్యలో అనివార్యమైన అంశం.
పండుగలలో, పర్వదినాలలో నిడదవోలులోని ప్రధాన ఆలయాలలో విశేష అర్చనలు, సహస్ర నారికేళ జల అభి షేకాలు వంటి ఎన్నో కార్యక్రమాలకు అగ్రగామిగా ఉండి, పదిమందికి స్ఫూర్తిని కలిగించి, అందరూ దైవానుగ్రహానికి పాత్రులు కావటానికి బాధ్యతపడేవారు శాస్త్రిగారు. తి.తి.దే. యాజమాన్యంతో సంప్రదించి, నిడదవోలులో “శ్రీనివాస కల్యాణం” అత్యంత వైభవంగా నిర్వహించిన ఘనత శాస్త్రిగారికే దక్కుతుంది.
వ్యక్తిగతంగా నియమనిష్ఠాగరిష్ఠులై, సామాజిక జీవనంలో ఏ విధమైన వ్యత్యాసాలూ పాటించకుండా, ఎన్నో సేవాకార్యక్రమాలను నిరాడంబరంగా నిర్వహించేవారు శాస్త్రిగారు. వారిది వేదదృష్టి తప్ప, భేద దృష్టికాదు. అమ్మ సూక్తులను పరిపూర్ణంగా అనుసరించి, ఆచరించిన కొద్దిమంది సోదరులలో శాస్త్రిగారు అగ్రగణ్యులు.
నిడదవోలులో లక్ష్మీ గణపతి నవరాత్ర మహోత్సవాలను మూడు దశాబ్దాలుగా దీక్షా దక్షతలతో నిర్వహిస్తూ తాము తరిస్తూ, పదిమంది తరించటానికి బాటలు వేసిన బాధ్యతాయుతమూర్తి. దైవాన్ని పూజించేవారు ఎందరైనా ఉండవచ్చు. కాని శాస్త్రిగారి లోని అచంచల విశ్వాసం అరుదైన సంగతి.
గత పాతిక సంవత్సరాలుగా వారు నిర్వహించే గణపతి నవరాత్రులలో నిరంతరాయంగా పాల్గొన్న సోదరుడుగా, చెక్కుచెదరని నమ్మకాన్ని, మొక్కవోని ధైర్యాన్ని శాస్త్రిగారిలో గమనించాను నేను.
నిడదవోలులో వారు నిర్వహించిన గణపతి ఉత్సవాలు పొట్టి శ్రీరాములు విగ్రహం వద్ద జరిగేవి. ఆ సెంటరులో పందిరివేసి, అందమైన మట్టి గణపతిని నెలకొల్పి, ఉభయ సంధ్యలలో సంప్రదాయ సిద్ధంగా అర్చనలు నిర్వహించేవారు. ఆరు బయట సాంస్కృతిక కార్యక్రమాల వేదిక ఏర్పాటు చేసేవారు. ఆధ్యాత్మిక ప్రవచనాలు, హరికథలు, సంగీత కచేరీలు, నాట్య ప్రదర్శనలు, భువన విజయాలు, అష్టావధానాలు ఒక టేమిటి?
అన్నివిధాలైన కళా సాంస్కృతిక సేవలు స్వామికి సమర్పించే వారు. ఆ ఊరి ప్రజలేకాక, పరిసర ప్రాంతాల వారు సైతం పెద్దసంఖ్యలో ఈ కార్యక్రమాలు చూసి ఆనందించే వారు. ఆంధ్రదేశంలో అన్ని రంగాలలో ప్రముఖు లందరూ ఆ వేదికపై కార్యక్రమాలలో పాల్గొన్న వారే. ఇదిలా ఉండగా, మరో సంగతి చెప్పాలి. నేను గుర్తించిన మహత్తరమైన అనుభవం, అపూర్వమైన విషయం ఇది. గణపతి నవరాత్రులు అంటే భాద్రపద మాసంలో, అంటే ‘వర్షాకాలం’లోనే కదా!
ఒక్కోసారి సాయంత్రం అయ్యే సరికి దట్టంగా మబ్బులు పట్టేవి. మరుక్షణం కుండపోతవాన తథ్యం అనిపించేది. ఎలా? మరి, ఆరుబయట వేదిక, కార్యక్రమం
రెండు, మూడు పర్యాయాలు ఆ రోజున నేను అక్కడున్న సందర్భాలు అవి. కార్యకర్తలలో కొందరు వచ్చి, విషయం వివరించటం, వేదిక మరోచోటికి మార్పు చేద్దామని అడగటం నేను స్వయంగా చూశాను. ఆ కార్యకర్తలు కొంచెం ఆందోళన వ్యక్తం చేసేవారు. శాస్త్రిగారుమాత్రం నింపాదిగా నవ్వుతూ, “మరేం ఫర్వాలేదండీ! వేదిక మార్చవలసిన పనిలేదు, వర్షం వల్ల మన కేమీ ఆటంకం ఉండదు. అంతా ‘లక్ష్మీ గణపతి చూసుకుంటాడు. నా బాధ్యత అంతా మా అమ్మ (జిల్లెళ్ళమూడి అమ్మ)దే” అని సమాధానం చెప్పేవారు. ఎప్పుడూ శాస్త్రిగారి నమ్మకాన్ని వమ్ము చేయలేదు. ఆ మబ్బులన్నీ తొలగిపోయి, ప్రశాంతంగా కార్యక్రమాలు జరిగేవి. వర్షం కారణంగా కార్యక్రమా లకు ఆటంకం ఎన్నడూ కలిగేది కాదు. ఎంత నమ్మకం! ఎంతటి భక్తి! అని ఆశ్చర్యంతో శాస్త్రిగారి అచంచల విశ్వాసానికి నమస్కరించే వాడిని నేను.
గుంటూరులో జన్నాభట్లవారి ఇల్లు చిన్న ‘అన్న పూర్ణాలయం’. ఆ వారసత్వాన్ని నిడదవోలులో కూడ కొనసాగించారు వీరభద్ర శాస్త్రిగారు. గృహిణి సహకార సౌజన్యాలతో నిత్యము అతిథిసేవలో ఆనందిస్తూ, ‘అమ్మ’ను ఆరాధిస్తూ, అనుసరిస్తూ, బ్రతుకు సార్థకం చేసుకున్న ధన్యజీవి శాస్త్రిగారు.
గణపతి నవరాత్రుల ముగింపులో అమ్మ పేరిట వారు నిర్వహించే అన్న సమారాధన కార్యక్రమాన్ని చూసి తీరవలసిందే. ఆ ఓర్పూ ఆ నేర్పూ ఆ ఆదరణా సాటి ఆ లేనివి. కృష్ణా, గోదావరి పుష్కరాల సమయంలో అమ్మసంస్థకు ప్రతినిథిగా అన్నిరోజులూ సకుటుంబంగా కృషిచేసి అక్కడ అన్నదాన మహాయజ్ఞం భక్తి శ్రద్ధలతో నిర్వహించిన సోమయాజి శ్రీ శాస్త్రిగారు.
జిల్లెళ్ళమూడిలో ఏ ఉత్సవం జరిగినా ఆలయంలో అర్చన, అభిషేకాలలో అగ్రేసరులై సేవ లందించిన అంకిత భక్తులు శాస్త్రిగారు. నిడదవోలులో ఆధ్యాత్మిక జిజ్ఞాస గలవారందరినీ సమీకరించి, ఎన్నో పర్యాయాలు ‘అమ్మ తత్త్వప్రచార సభ’లు ఏర్పాటు చేశారు శాస్త్రిగారు.
ఆ రోజున వారు నిర్వహించే అన్నప్రసాద వితరణ కార్యక్రమం సాటిలేనిది. ఆర్థిక భారాన్ని కాని, శారీరక శ్రమనుకాని ఏ మాత్రం లెక్కచేయకుండా ఆ కార్యక్రమం ఎంతో సార్థకంగా నిర్వహించేవారు శాస్త్రిగారు. ఊళ్ళో అందరినీ పేరు పేరునా పిలిచి విందుభోజనం అందించేవారు.
గత సంవత్సరం కరోనా లాక్ డౌన్ కారణంగా ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్న సామాన్య కుటుంబాల వారికి అమ్మ పేరిట నిత్యావసర వస్తువులు అందించే బృహత్తర కార్యక్రమాన్ని ఓర్పునేర్పులతో నిర్వహించారు వీరభద్రశాస్త్రిగారు. నిడదవోలు, రాజమండ్రి, కొవ్వూరు, బాపట్ల మొదలైన ఎన్నో ప్రదేశాలలో ఎన్నో పర్యాయాలు ఇలా సహకారం అందించి, అమ్మ తత్త్వప్రచారం ఆచరణాత్మకంగా చేశారు శాస్త్రిగారు.
ఇంత తొందరగా మన మధ్యనుంచి కనుమరుగు కావటం ఊహించలేదు. విధి బలీయం కదా! అమ్మే లోకమై బ్రతికిన శాస్త్రిగారు అమ్మలోకానికి చేరి, అమ్మలో ఐక్య మయ్యారు. ఆ మహనీయునికి అశ్రు తర్పణం అందిస్తూ, వారి దివ్య స్మృతికి నివాళు లర్పిస్తున్నాను.
ఈ సన్నివేశాన్ని తట్టుకుని నిలబడగల శక్తిని వారి కుటుంబ సభ్యులకు ప్రసాదించాలని అమ్మ శ్రీచరణాలంటి ప్రార్థిస్తూ..