సోదరులు శ్రీ వి. విశ్వనాథమయ్య అనంతపురం జిల్లాలో ఓరియంటల్ కళాశాలలో తెలుగు లెక్చరర్ గా పని చేసేవారు. 1970-1980 ప్రాంతంలో వారు మహిమలు చూపే మహాత్ములను దర్శించి, మహిమలంటే ఏమిటో తెలుసుకోవాలనే జిజ్ఞాసతో మద్రాసులో శ్రీలశ్రీపండ్రిమలై స్వామి వారిని సందర్శించారు. విశ్వనాథమయ్యగారి బంగారు ఉంగరాన్ని తీసిమ్మన్నారు ఆయన. దానిని తమ ఎడమ అరచేతిలో ఉంచి కుడి అరచేతితో మూసి ఆ చేతులను విశ్వనాథమయ్యగారిని పట్టుకోమని ‘శ్రీ’ అని అనమన్నారు. అంతే. ఆ సువర్ణాంగుళీయకం అదృశ్యమైంది. సోదరులు ఆశ్చర్యచకితులై వారి పాదాక్రాంతులు అయినారు. అంతలో వారి ఖాళీచేతులను మూసి ఉంచి అదే రీతిలో ‘శ్రీ’ అనగానే వారి ఉంగరం ప్రత్యక్షమైంది.
అటువంటి మహిమ ‘అమ్మ’ వద్ద ఉన్నదేమో అనే కుతూహలంతో వారు జిల్లెళ్ళమూడి వచ్చారు. అమ్మను దర్శించుకున్నారు. అమ్మ మహిమలు ప్రదర్శించదని తెలుసు. కానీ మొండిపట్టు పట్టే పిల్లవానిలాగ వారిది ఒకటే ధ్యాస. ఆ సమయంలో సంభాషణ ఇలా సాగింది.
విశ్వనాథమయ్య : జడంలో చైతన్యం ఉందా?
అమ్మ : అంతటా ఒకే చైతన్యం ఉన్నప్పుడు జడంలో మాత్రం ఆ చైతన్యం ఎందుకు లేదు?
విశ్వనాథమయ్య : మరి, అది మనకు అనుభవంలో తెలుస్తుందా?
అమ్మ: జడమనుకునే వస్తువులు మనకు ఉపకరిస్తున్నాయి కదా!
విశ్వనాథమయ్య : అయితే అవి రమ్మంటే వస్తాయా?
కొంతసేపు అలా గడిచింది. వారికి ఇక అడగలేని స్థితి వచ్చింది. అమ్మ సన్నిధిలో మన ఆలోచనలు, మాటలు మన స్వాధీనంలో ఉండవు. వాటిపై అమ్మకు అప్రతిహతమైన అధికారం ఉంది. ఆ సోదరునికి మాటలు కాదు, అనుభవాన్నిస్తే మెరుగుగా ఉంటుందని భావించిందేమో!
అమ్మ చటుక్కున తన ఎడమకాలి పాదరక్షను ముందుకు విడిచి మళ్ళీ వేసుకున్నది. “చూడు నాన్నా! ఇది రమ్మంటే వస్తోంది కదా! నేను కోరిన పద్ధతిలో ఉండమంటే ఉండే స్థితి దానికుంది. ఈ కాలికీ – ఆ వస్తువు (పాదరక్ష)కు ఉండే పొందిక గమనించావా? చైతన్యం లేకపోతే పొందిక ఉండదు గదా నాన్నా!” అన్నది. వారికి నూతన వస్త్రాలనిచ్చి ఆశీర్వదించింది.
కలమునకు సిరాను ధరించే శక్తి, కాగితానికి అక్షరాలను ధరించేశక్తి, కత్తికి వస్తువులను నరికే శక్తి, ఇటుకకు దృఢంగా నిలిచే శక్తి, లోహపు పాత్ర ఒక ఉష్ణోగ్రత వరకు నిలిచేశక్తి… ఉండుట వలననే మనకు ఉపకరిస్తున్నాయి. ఆ పొందిక (adjustable, accommodating) తత్వం వాటికి వచ్చింది.
ఈ ‘పొందిక’ అనే మాటకి మరింత వివరణ అవసరం. శ్రీ కళ్యాణానంద భారతీ స్వామి వారు “మీ ఊరేమిటి? మీ తల్లి పేరేమిటి? అని అడిగినప్పుడు అమ్మ “మా అమ్మ పేరు ఆధారం. మా నాన్న పేరు అవకాశం” అన్నది.
అమ్మ ఆది, అనాది. ఆద్యంత రహిత. పుట్టుక లేనిది. ‘అజాయమానో బహుధా విజాయతే’ – అని వివరిస్తోంది వేదం. పుట్టుక లేని తత్వం పలురూపాల ప్రకాశిస్తోంది – అది. సృష్టి రచన, సృష్టి ఆవిర్భావక్రమంలో రెండు ప్రధానాంశాల్ని అమ్మ స్పష్టం చేస్తోంది. ఆధారం అంటే సర్వం సర్వానికీ ఆధారమేనని. అవకాశం అంటే అనంతమైన సృష్టిలో గ్రహాలూ – గ్రహరాజులు పరిభ్రమించటానికి ఎంత ప్రదేశం (space) కావాలి? ఊహకి అందనిది. ఈ space సృష్టి మనుగడకి, నడకకి అవకాశాన్నిస్తోంది. సృష్టి అంతా ఇందు ఇమిడి ఉన్నది, పొందికతో ఉన్నది. ఇదే జడం అని పిలువబడే పదార్థాల్లోని మహత్వం, మహత్తత్త్వం.
సృష్టిని మించిన మహిమ లేదు. ఉపయుక్త గ్రంథావళి
- ‘అమ్మ సహజ మహిమ’ – వి. విశ్వనాథయ్య, ‘మహస్సు’
- మాతృశ్రీ జీవిత మహోదధిలో తరంగాలు (Vol. II, పేజి 251)