మాఘ పూర్ణిమ 1958 ఫిబ్రవరి 4వ తారీకు అవుతుంది, అందరినీ 3 వ తారీకు సాయంత్రానికే రమ్మన్నారు అమ్మ. 3వ తేదీ రాత్రి అందరూ భోజనాలు చేసి హాయిగా నిద్రించారు.
షుమారు 2 గంటలకు అమ్మ కబురుతో అందరూ నిద్రలేచారు. కాలకృత్యాలు తీర్చుకొన్నారు. సమీప మందున్న కాల్వకు ప్రయాణమైనారు అందరూ. అమ్మ కూడ ప్రయాణానికి సిద్ధమైనారు.
వెన్నెల వెలుగు ప్రశాంతంగా హాయిగా ఉన్నది. అమ్మ కాల్వలోనికి దిగారు స్నానానికి. నీళ్లు నడుము లోతువరకు ఉన్నవి. ప్రవాహం బాగున్నది. ఆ సమయం 3-25 గంటలు. అందరూ కాల్వలోనికి దిగి స్నానాలు చేస్తూ ఉన్నారు, ఏ కొద్దిమందియోతప్ప.. ఒక అరగంట ఏ వరకు స్నానాలు చేసిన తర్వాత అమ్మ ఒకరి తర్వాత ఒకరిని తన వద్దకు రమ్మన్నారు. ఒక్కొక్కరు అమ్మ వద్దకు వెళ్ళి వస్తున్నారు. కొంతమంది వెళ్ళిన తర్వాత నేను వెళ్ళాను. నాకునూ మంత్రోపదేశం చేశారు. మా శ్రీమతికినీ చేశారు నా తర్వాత. ఆనాడు చాలామంది మంత్రోపదేశం పొందారు. నా అంచనా ప్రకారం 1000 మంది మంత్రోపదేశం పొందారను కొన్నాను. ఈ కార్యక్రమం పూర్తి అయ్యేసరికి ఇంకా వెన్నెల ఉంది. అందరు బయటకు వచ్చారు. అమ్మ మాత్రం తన వెంట ఎవ్వరినీ ఉండవద్దని చెప్పి కొంచెం దూరం వెళ్ళారు నీళ్లలోనికి. ఒక అరగంట ఉండి మరలా ఒడ్డు చేరారు.
తూరుపు దెస అరుణోదయ కాంతులు ప్రసరిస్తూ ఉన్నాయి. ఇంతలో బాలభానుడు తన కిరణాలద్వారా బంగారు రంగు వలువను జగతిపై పరచినాడా యన్నట్లు లేయెండ మిగులశోభాయమానమై హృదయా హ్లాదకరమై యొప్పారుతున్నది. అమ్మ బండి ఎక్కారు. హైమ మరి కొంతమంది ఆడవారుగూడ బండి ఎక్కారు. బండి బయలు దేరింది. బండివెంట నామం చేస్తూ మేమూ బయలుదేరి ఇంటికి చేరాము.
ఇంటికి చేరగానే అమ్మ బండి దిగి దిగటంతోడనే టెంకాయ కొట్టి అమ్మకు హారతిచ్చారు. అమ్మ నేరుగా వెళ్ళి పందిట్లో మంచంపై కూర్చొని ఉన్న లక్ష్మీకాంత యోగిగారి ఒడిలో పండుకొన్నారు- ఆదృశ్యం చాలా సుందరంగా ఉన్నది. బాబుగారు అమ్మయొక్క దైవత్వాన్ని గురించి మాట్లాడినారు. తర్వాత అమ్మ ఇంట్లోకి వెళ్లారు ఏడున్నర అయింది.
5-2-58, తారీకు. సాయంత్రం 4 గంటలయింది. అందరు వారి వారి గ్రామాలకు బయలు దేర సిద్ధమైనారు. అమ్మ మందిరంలో ఒక చాపపై ఆసీనులయ్యారు. వెళ్ళేవారందరూ అమ్మవద్ద సెలవు తీసికొంటున్నారు. సెలవు తీసికొంటున్నవారిలో లోగడ రోజు మంత్రోపదేశం పొందిన వారికి ఒక్కొక్కరికి ఎవరికి ఏ మంత్రం ఉపదేశించారో ఆ మంత్రార్థ వివరణమూ అనుష్టించవలసిన విధానమును గూర్చి చెప్పి ప్రసాదమిచ్చి పంపిస్తున్నారు. అట్లే నాకు గూడ వివరించారు.
కాలాంతరమందు ఈ మాఘపూర్ణిమా ప్రసక్తి వచ్చి అమ్మ అన్నారు- ఆనాడు వచ్చినవారి సంఖ్య 1000 అనీ, అందులో మంత్రోపదేశం చేయబడ్డవారు 600 మంది అనీ. ఆనాటి విశేషాన్ని గురించి చెపుతూ ఇంకా అన్నారు. మంత్రోపదేశ సమయంలో ఒక్కొక్కరికీ కనీసం ఒక్కొక్క నిముసం పట్టిందనీ. వెంటనే నాలో కొన్ని భావాలు మెదిలాయి. మరి 600 మందికి 600 నిముషాల కాలము గదా పట్టింది. అంటే 10 గంటల కాలం-అది కనీసమే, పట్టిందన్నమాట. కాల్వకు బయలుదేరినది 2.45 గంటలకు. ఇంటికి చేరినది 7-00 గం.లకు – కొద్ది కాలవ్యవధిలో 10 గంటలకాలం ఇమిడిపోయిందన్న మాట. ఇది వినటానికి విడ్డూరంగా తోచవచ్చు. కానీ ఇందెంతో తర్కాతీతమైన రహస్యం ఇమిడియున్నది. ఆలోచనకు అందనిది. అద్భుతమైనది. లోకంలో ఇట్లా జరగటం సంభవమా? అని మానవ మానసానికి శంక కలగవచ్చు. కాని అమ్మకు ఇది ఒక లెక్కలోనిదికాదు. స్త్రీలలో కొందరు పతియే దైవమని నమ్మి త్రికరణ శుద్ధిగా ఆచరించి సముపార్జించిన పాతివ్రత్య మహిమచే అనేక అద్భుతకార్యాలు చేసినట్లు మన పురాణాదులలో కన్పిస్తున్నదిగదా! పురాణాల్లోనే కాదు. అమ్మ సంగతి అట్లుంచుదాం. ఈ రోజులలో గూడ నేనెరిగిన సజీవు లయిన మహనీయులలో సైతం ఒకేక్షణంలో అనేకచోట్ల ఒకేసారి కనబడ్డవారితో నాకు పరిచయమున్నది. అదీగాక ప్రత్యక్షంగా ఋజువుపరచుకొన్నాను. అయినా యీ మహనీయులంతా భక్తకోటిలోనివారే.
ఇక అమ్మగా అవతరించిన సాక్షాత్పరమేశ్వరికి ఈ సంఘటనలన్నీ సహజం. మనకు విశేషంగా కన్పడేవి అమ్మకు సహజంగా ఉంటాయి. అమ్మను వాడు అనీ అతడని అనటం నాకు అలవాటు. వానిసృష్టిని గుఱించి ఆలోచిస్తేనే పరమాద్భుతంగా ఉంటుంది గదా. అంతకంటే ప్రపంచంలో విచిత్ర మేముంటుంది? సృష్టిలో ఏ ఒక్క అంశాన్ని ఆలోచించినా ఊహకు అందనిదేకదా! ఇక మంత్రోపదేశ సందర్భంలో 5 గంటల మధ్య 10 గంటల కాలాన్ని స్తంభింపజేయటం ఏమంతగొప్ప – అమ్మకు?
ఒక్కసారి భాగవత దశమస్కంధం తిలకిద్దాం.
నాటి కృష్ణావతారమందు గోపాలకృష్ణుడు బృందావనమందు సమవయస్కులైన గోపబాలురతో గోవత్సములను మేపుకొనే సమయంలో ఒక పెద్ద పామునుజంపి అందు జిక్కువడిన గోవత్సారకుల గాపాడిన ఉదంతం విన్న బ్రహ్మ-గోవత్సార్భకుల నందరినీ మ్రింగ సమర్థమైన పామును చంపగలిగిన ఈ కుఱ్ఱవానిచర్య తన్ను చకితుణ్ణి చేసిన కారణంగా ఆ బాలకుని (శ్రీకృష్ణుని) శక్తిని పరీక్షించే నిమిత్తం కృష్ణుడూ గోపబాలకులూ చల్దులుగుడిచే సమయంలో పచ్చికలు మేస్తూ దూరంగా పోతున్న గోవత్సలను, తన మాయచే దాచేశాడు. దూడల్ని వెతకటానికి కృష్ణుడు బయలుదేరి వెళ్ళగానే ఇటు బాలురనూ దాచేశాడు. ఇదంతా చూచాడు శ్రీకృష్ణుడు. బ్రహ్మకు పాఠం చెప్పాలను కున్నాడు. దాచిపెట్ట బడ్డ గోవత్సార్భకుల ఆకారాలను తానే ధరించి మందకు వెళ్ళాడు. ఆవిధంగా ఆ ఆకారాలతో సంవత్సరం సంచరించాడు బృందావనంలో.
తరువాత బ్రహ్మదేవుడు గోపాలకృష్ణుని మహిమ తెలియనేరక తనచే దాచి పెట్టబడ్డ వారివలే ఉన్న గోవత్సర కులగాంచి వారల పోలికల పరీక్షించు సమయంలో పరమేశ్వరుడు ప్రదర్శించిన విశ్వరూపం బ్రహ్మదేవుని నిశ్చేష్టాపరుని చేసివైచింది. అంతే. శ్రీకృష్ణుడు ప్రదర్శించిన విశ్వరూపోపసంహారానంతరమే బ్రహ్మకు తెలివి కలిగి భగవానుని స్తుతించి వెడలిపోయినాడు- దూడలను, బాలురను వదలి. ఆ బాలకులు శ్రీకృష్ణుని చూచారు. ఎట్లున్నాడు స్వామి,
కడుపున దిండుగా గట్టిన వలువలో
లాలిత వంశనాళంబు జొనిపి
విమల శృంగంబును వేత్ర దండంబును
జాతిరానీక చంక నిఱికి
మీగడ పెరుగుతో మేళవించిన చల్ది
ముద్ద డాపలిచేత మొనయ నునిచి
చెలరేగి కొసరి తెచ్చిన యూరుగాయలు
వేళ్ళ సందులయందు వెలయ నిఱికి
దూడలను వెదుకబోయిన కృష్ణుని లాగే వారికి కన్పించి నాడు. అమాయకులైన ఆ బాలకులు సంతోషంతో జరిగిన గాథ ఏమాత్రం తెలియనివారలై
‘చెలికాడా! అరుదెంచితే యిచటికి సేమంబునం గ్రేపులు
నెలవుల్ సేరె నరణ్యభూమి వలన; నీ వచ్చునందాక జ
ల్దులు వీరించుక యెవ్వరుం గుడువ రాలోకింపు;
రమ్ము రమ్మని పిలుస్తారు శ్రీకృష్ణుణ్ణి. భక్త సులభుడైన భగవానుడు ప్రేమమూర్తిగాన మందహాసం చేస్తూ చల్దులు గుడుస్తాడు వారితో నడుమ నడుమ నర్మ సంభాషణలు సాగిస్తూ.
సాయంత్రం మందకు బోయిన బాలకులు వారి తల్లి దండ్రులతో అంటారు- “ఈ ఉదయం కృష్ణుడు పెద్ద పామును చంపి మమ్ముల కాపాడినాడు” అని. చిత్రంగా లేదూ ఇది!
ఈ గాథ పరీక్షిత్తునకు శ్రీ శుకులవారు విన్పిస్తూ
క్రించుదనంబున విధి దము
వంచించిన యేడు గోపవర నందను లొ
క్కించుక కాలంబుగ వీ
క్షించిరి, రాజేంద్ర: బాలకృష్ణుని మాయన్.
“ఏ మహాత్ము మాయ నీ విశ్వమంతయు
మోహితాత్మకమయి మునిగి యుండు
నట్టి విష్ణుమాయ నర్భకు లొక్క యే
డెఱుగ కుండిరనుట యేమి వెఱుగు ?”
ఆ విష్ణువే అమ్మగా ఆవిర్భవించి కాల్వవద్ద 10 గంటల కాలమును ఎవరికీ తెలియ రానీయకుండా గడవ చేసిందంటే మన బోంట్లు తెలుసుకోలేక పోయినా మనుట సహజమేకాని అందు అసహజ మేమాత్రం లేదు. అమ్మ కావలెనని వివరించినప్పుడే తెలిసిందిగానీ లేకపోతే ఇదైనను మన బుద్ధికి గోచరము కాలేదుగదా!
పూర్ణిమకు లోగడ రోజు నీరు తక్కువగా ఉన్నది కాల్వలో. పూర్ణిమనాడు బాగా ఉన్నది నీరు.
అమ్మ మంత్రోపదేశ మేల చేయాలి? వారేదను కుంటే అది అవుతుంది గదా అను ప్రశ్న బయలు దేరుతుంది.
ఈ మంత్రోపదేశం అమ్మ కావలెనని చేసింది. కాదు. దేశిరాజు రాజమ్మ గారి కోరికపై చేసిన మంత్రోపదేశాలే. వారికిచ్చిన మాట ప్రకారం తనకు 33 వ ఏడు వచ్చిన తర్వాతనే చేశారు.
కాలాంతరమందు అమ్మ కాల్వకు స్నానార్ధము బయలుదేరినప్పుడల్లా కాల్వ పొంగుతుంటుంది. అంతకుపూర్వ మాలోతు ఉండదు. 1958 ఫిబ్రవరి 4వ తారీకున కాలాన్ని స్తంభింపచేయటంగానీ, కాల్వను పొంగులు వారించటం గానీ అమ్మకు సహజమైన కార్యాలలోనివే.
ఘటనా ఘటనలు మానవులకుగానీ సృష్టికర్తకు ఏమిటి ?