“అమ్మ” విశ్వజనని. ఆమెది విశ్వకుటుంబం. ఇక్కడి వాతావరణం విశ్వ సౌభ్రాత్ర సౌరభాలతో గుబాళిస్తుంటుంది. విశ్వజనీన కార్యకలాపాలకు ఇది రంగస్థలం…
” అమ్మ సర్వవిద్యా స్వరూపిణి; విశ్వవిజ్ఞాన భాండాగారం అమర భాష, శ్రుతులు, స్మృతులూ, ఇతిహాసాలు, పురాణాలు, వైజ్ఞానిక, సాంకేతిక విద్యలూ సర్వమూ ఆ సంస్కృత భాషాసాగరంలో తరంగ ప్రాయాలు. సర్వభాషలకూ మాతృమూర్తి, దైవభాష. ఆద్యంతాలు లేని అఖిల జగన్నియంత్రియైన ఆ ఆదిశక్తి యొక్క బాహ్యాంతస్స్వరూప సౌందర్య విశేషం ఆ సంస్కృత భాషలో జహుధా ప్రపంచితమై ఉంది. సాధారణంగా సంస్కృతం భారతీయ సంస్కృతి, సంప్రదాయనిధియని పెద్దలు చెప్తారు. కాని ఆలోచించినకొలదీ ఆ అమరవాణి విశ్వమానవ కల్యాణ కారక విశిష్ట సంస్కృతి సమంచితంగా స్ఫురిస్తుంది.
నేడు ఉద్యోగమూ, ఉదరపోషణా విద్యాభ్యాస పరమప్రయోజనం కావటం చేత నేటి విద్యార్థి తీవ్ర నైరాశ్యానికి గుఱి అవుతున్నాడు. కాని మన పెద్దలు “విద్యా దదాతి వినయం వినయా ద్యాతి పాత్రతామ్| పాత్రత్వార్ధన మాప్నోతి ధనాద్ధర్మం తతస్సుఖమ్” – అని విద్యా ప్రయోజనాన్ని ఉగ్గడించారు. ఈ దృక్పథంలో అభ్యసింపబడిన విద్య ఐహికాముష్మిక శ్రేయస్సాధన సమర్థమవుతుంది. ఇదే వైకల్య రాహిత్య రూపమైన కైవల్యాన్నిస్తుంది.
సకల విద్యాస్వరూపిణియగు అమ్మ దివ్యతత్త్వాన్ని తెలుసుకోవటానికి వేదాలు కూడా ఒక సాధనాలు. ఆ వేదాలలో భౌతికాధ్యాత్మిక విజ్ఞానం నిగూఢంగా నిక్షిప్తమై ఉంది. అందుకే భౌతికాధ్యాత్మికాలకు భేదం లేదని అమ్మ అంటుంది. ఇదంతా అమరభాషలో సమరసంగా సముపబృంహితమై ఉన్నది. సర్వంలోనూ, పరాశక్తి స్వరూప సాక్షాత్కారమే సర్వవిద్యల పరమ ప్రయోజనం. ఆ దివ్యశక్తి లేని పరమాణువే ప్రపంచంలో లేదు. ఇటువంటి మధుర సంస్కారాన్ని అనుభవంలోనికి తేగలిన విద్య నేటి విద్యార్థులకు కావాలి.
ఇక్కడ సుశిక్షితులైన విద్యార్థులు విద్యాధి దేవతయగు జగన్మాతయొక్క విరాట్స్వరూప సౌందర్యాన్ని వివిధ కోణాలనుండి పరిశీలించి, ఆమె యొక్క దివ్య సందేశాన్ని దిగంతాలకు వ్యాపింప జేయాలి. అందుకే యీ కళాశాల స్థాపించబడింది.
ఈ విశ్వజనీన మహోద్యమంలో కార్మికులు, కర్షకులూ, కార్యసాధకులూ, విద్యాబోధకులూ, ధనదాతలూ, జననేతలూ అయిన యావత్ సోదరులూ నైతికంగానూ, భౌతికంగానూ తమ అమూల్య సహాయ సంపదల నందించి యీ కళాశాలను అత్యున్నత క్రమ శిక్షణతో ఆదర్శప్రాయమగు విద్యాసంస్థగా రూపొం దించటానికి కృషి చేయ వలసినదిగా అభ్యర్థిస్తున్నాము.
(1971, ఆగష్టు, మాతృశ్రీ సంచికనుండి)