(గత సంచిక తరువాయి)
మ హెూదధిలో మణిరత్నాలు: 131
మరిడమ్మ తాతమ్మ నాన్నగారితో … “ఏది ప్రాప్తమున్నదో అది జరుగుతుందిలే… కొండలాంటి తండ్రిపోయాడు…”
అమ్మ తాతమ్మతో లోపలకు వచ్చి తరువాత “తాతమ్మా! కొండలాంటి తండ్రి అంటావేమిటి? తండ్రే కొండ!”
మహోదధిలో మణిరత్నాలు: 132
చాకలి బుచ్చమ్మ అనుభవాలు : 1
గరికపాడులో చాకలి బుచ్చమ్మగారి మఠము ఉంటుంది. ఆమె వృత్తిరీత్యా చాకలి. సుందరమ్మ(అమ్మ మేనత్త కూతురు) తో తన అనుభవం చెప్తుంది.
బుచ్చమ్మ : “అసలు మాట చెప్పమంటావా? ఆమె (అమ్మ) గుడ్డలు విప్పి వేస్తే ఆ గుడ్డలు ముడుచుకుంటుంటేనే ఎంతో పరిమళం వచ్చింది. ఏమన్నా అత్తర్లు రాసుకుందేమో అనుకున్నాను. పోనీ రాచుకున్నది ఎంతసేపు వుంటుంది? ఎన్నాళ్ళుంటుంది? గుడ్డలు ఉతుకుతుంటే చెరువంతా సువాసన వచ్చింది. చెరువులో ఆ నీళ్ళు పడే ఆ వాసన వచ్చిందే అనుకోండి. వాసనే రకరకాలు. ఒక్కొక్కసారి మరీ ముక్కుదగ్గర పెట్టుకున్నట్టుగా సంపెంగ వాసన వచ్చింది. గుడ్డలిచ్చి ఇంటికొచ్చిన తరువాత నేను యోగంలో కూర్చుంటే నా ముందు గజ్జెల పట్టాలతో ఘల్లు ఘల్లు మంటూ వచ్చి చొక్కా పరికిణీ తొడుక్కుంటున్నట్లు కనిపించింది. వెంటనే నేను చెయ్యి దాచినట్లు … జడకుప్పెలతో గిరగిరా తిరుగుతూ, తనతోపాటుగా తన జడ తిరుగుతంటే… ఆ పరికిణీ గుమ్మటాలు మల్లే లేచి, ఆ చిన్ని చిన్ని చేతులు, ఆ చక్కని పాదాలు భూమిమీద తిరుగుతుంటే… అసలు ఆ పాదాలే వేరు. ముఖముకంటే కూడ ఆ పాదాలు చూడ ఎంత బాగుంటయ్యో! ఆ పాదాల్లో నా నీడ కనపడ్డది. చివరకు వచ్చి అమాంతంగా నా ఒళ్ళో కూర్చున్నట్లుగా స్పర్శ తగిలింది. కళ్ళు తెరిచాను. అది కాగానే మన ఇంటికి రావాలనిపించింది. వచ్చేటప్పటికి మీరు చీకట్లోనే కూర్చున్నారు కదా సుందరమ్మగారు! మీరు ఇద్దరూ కలిసి కూర్చున్నప్పటికీ అమ్మ ముఖంలో కాంతి కనపడింది. ఇక్కడ ఏ రూపంలో చూశానో, అక్కడ ఆ రూపంతో దర్శనమిచ్చింది.”
సుందరమ్మకు ఈ మాటలు అర్ధంకావు. అమ్మను ఏదో తనకంటే ఎక్కువగా చూస్తున్నదని బాధగా వుంటుంది.
మ హెూదధిలో మణిరత్నాలు: 133
చాకలి బుచ్చమ్మ అనుభవాలు: 2
చాకలి బుచ్చమ్మ “అమ్మ”తో:
“అమ్మా! ఇంకా ఏవేవో… మంత్రాలను గురించి అడుగుదామనుకున్నాను. కాని వద్దనిపిస్తున్నది. సందేహాలు తీరిపోయినయ్. ఎందుకంటే నీకు దీన్ని గురించి (అంటే మంత్రాలను గురించి) చెప్పేటప్పుడు నీ ముఖం చుట్టూ చక్రం కోణాలతో తిరుగుతున్నట్లు, ఆ చక్రం లోపల సర్వము ఇమిడి వున్నట్లు కనపడింది. ఇంకా సందేహాలకు తావేదమ్మా? ఏది మంత్రాలవల్ల పొందుదామనుకున్నానో అది పొందాను.”
మహోదధిలో మణిరత్నాలు: 134.
చాకలి బుచ్చమ్మ అనుభవాలు : 3
అమ్మ చాకలి బుచ్చమ్మతో :
“అందరిలో ఉన్నది నేను అనేదేగా! ఆ నేను “బ్రహ్మ”. నే చెప్పేది నేను బ్రహ్మ అని కాదు. ప్రతివాడూ సామాన్యంగా ఆ… నేనే అంటారే.. ఆ నేనే బ్రహ్మ. ఆ నేనే నేను ఆ అంటాడే అది అహం. ఆ అహం లేకపోతే, ‘హం’ బ్రహ్మాస్మి కాలేడు. అహం చేతనే అహంకారాన్ని పోగొట్టుకుంటాడు. నేను భగవంతుడ్ని అయివుండి, నేను భగవంతుడ్ని తెలుసుకోవటమేమిటి అన్నదే అహాన్ని తెలుసుకోవటం! తన్ను తాను గుర్తించిననాడు సర్వాన్ని గుర్తిస్తాడు.’
మహోదధిలో మణిరత్నాలు: 135 .
అమ్మ : “అందరికీ తలొక నొప్పి. భారతి పిన్నికి కాళ్ళు నొప్పులు. నాకు చేతులు నొప్పులు. మీకు మనసు నొప్పి. అందరి నొప్పులకంటే మీ నొప్పి పెద్దది తాతగారూ! ఈ ప్రపంచంలో మానవుడు లోకాన్ని మెప్పిస్తాడా? తనను తానే మెప్పించు కుంటాడా? లేక తనను తాను మెప్పించుకున్నప్పుడే ప్రపంచాన్ని కూడా మెప్పిస్తున్నాననుకుంటాడా? అట్లా లేకపోతే జగత్తు నడక ఇట్లా వుండదు గదూ?”
తాతగారు: (అమ్మను పొట్టమీదకు లాక్కుని) జగత్తుకు నేనేమి సమాధానం చెప్పేదమ్మా? నీవే జగత్తయితే!
అమ్మ : అయితే జగత్తులో వుండే కష్టసుఖాలన్నీ నాకే వుంటాయన్నమాట! అమ్మ అట్లా అనగానే తాతగారు అమ్మ తలకాయ తన గుండెలకేసి హత్తుకుంటారు.
మహెూదధిలో మణిరత్నాలు: 136
చిదంబరరావు తాతగారు అమ్మతో “అమ్మా! నీవు భారతికి కాళ్ళు పిసుకుతుంటే నాకు ప్రాణం పోయినట్లుగా వుంది.”
అమ్మ : “మీరు నాతో అట్లా చెప్పకూడదు. ఇంకా చెయ్యమ్మా! అందరికీ సేవ చేయమ్మా అని చెప్పాలి. భారతి పిన్ని నాచేత కాళ్ళు పిసికించుకున్నదంటే నాకు ఓర్పు నేర్పుతున్నదన్న మాట. నాకు నేర్పుగల ఓర్పు అక్కర్లేదు. సహజమైన ఓర్పు కావాలి.”
తాతగారు : ఏమిటమ్మా ఇట్లా మాట్లాడుతున్నావు? నా హృదయాన్ని కదిలిస్తున్నావా? అమ్మ : కదిలేదో హృదయం. హృదయాన్ని కదలించటం కాదు. హృదయమంటే చైతన్యం. ఎక్కడ ఏది జరిగినా గుర్తించేదే హృదయం. జరగటానికి హేతువైనది చైతన్యం. రెంటికీ భిన్నం లేదు. అవయవాలు మనకు తెలియకుండానే వాటంతట అవి ఆడుతుంటాయి. ఆ ఆడటం చైతన్యమే. ఆ ఆడినప్పుడు కలిగే స్పర్శలో విశేషమైన కష్టమో, విశేషమైన సుఖమో కలిగినప్పుడు గుర్తిస్తాము. ఆ గుర్తించేది. హృదయం.
మహోదధిలో మణిరత్నాలు: 137
తాతగారు అమ్మ గుండెల్లో తలపెట్టి రుద్దుతూ “నువ్వు బ్రహ్మపదార్థానివా? బ్రహ్మతత్త్వానివా? బ్రహ్మవా?”
అమ్మ : నేను మూటికి మూలమై మూడు అయినాను.
“ఆ మూడూ యేమిటమ్మా?”
“ఏ మూడు అయినా సరే. నేను బ్రహ్మనై, నీవు అనే వస్తువును ఏర్పరచుకుని, నీవు నేను మధ్యలో వుండే సంధి బ్రహ్మపదార్ధం.
“అంటే”?
“నేను నేనైన నేను. అంటే బ్రహ్మనై – నేను నీవై, ఆ నేను నీవే బ్రహ్మతత్వం. ఆ రెంటికి సంధే బ్రహ్మపదార్థం. అదే నిర్గుణం. ఈ మూటికీ భిన్నం లేదు.”
ఇవి వింటూ తాతగారు అమ్మ గుండెలమీదనే కళ్ళు మూసుకుని పడుకుంటారు. కాసేపటికి లేచి “ఎంత బరువు పుట్టిందో ఈ గుండెలకు?” అంటారు.
“నాది కండగల నిండుగుండె. నాకేం బరువు? నీ గుండెలు అన్నీ ఎముకలు.నాగుండె చూడు ఎంత మెత్తగా వుంటుందో!”
“నీది ఒక గుండె అని ఏమిటమ్మా? నీవు అంతా మెత్తనే!”
‘ఈ నా మెత్తదనాన్ని ప్రపంచం అర్ధం చేసుకోలేక వత్తేస్తుందేమో!”
మహోదధిలో మణిరత్నాలు: 138
చిదంబరరావు తాతగారు అమ్మతో: “అబ్బా! నీ విధానం ఏమి విధానమమ్మా?’
“ప్రతిదీ మరుగు పరచటమే నాకు ప్రధానం.”
“అయితే జీవితంలో ఏదీ బయటకు రానివ్వవన్నమాట!”
“జీవితంలోనివి రానియ్యకపోయినా జీవితం బయటకు వచ్చింది గదా! జీవితం వచ్చిన తరువాత జీవనం వుంది. (జీవనం అంటే నడక). ఈ రెండూ కలిసి బ్రతుకు అవుతాయి. ఎంత వద్దనుకుంటున్నా వీడి బ్రతుకుతో పాటు జీవన, జీవితాల తేడా అర్ధమవుతూనే వుంటుంది.”
మహోదధిలో మణిరత్నాలు: 139.
అమ్మ : “బ్రహ్మానందాలు అనేకముంటాయా? ఒకటేనా? ఏది నచ్చినా బ్రహ్మానందంగా వుందంటాము. అందుకే నాకు ఇంకొక ఆలోచన కూడా వస్తున్నది. అన్నీ బ్రహ్మానందంలో నుంచి వచ్చినవే గనుక ప్రతిదానికీ ఆ మాట తనకు తెలియకుండానే పడుతుంది. ఒకడు దొంగతనం చేసి తను అనుకున్నట్లుగా జరిగిగే బ్రహ్మానందంగా వుందంటాడు. తనకు కష్టమైనవాడిని కొట్టి కూడా బ్రహ్మానందాన్ని అనుభవించానంటాడు. తన నోటికి కొంచెం రుచిగల కూర తగిలినా, బ్రహ్మానందంగా వుంది కూర అంటాడు. సర్వం బ్రహ్మానందమేగా. సర్వకాలం కూడా బ్రహ్మానందం కాలేదా! సర్వకాలం బ్రహ్మానందమైనదే బ్రహ్మానందం. తాత్కాలికంగా కలిగే ఆనందం దాని ఛాయ.”
ప్లీడరు మల్లాది యజ్ఞనారాయణగారు ఆ మాటలు వింటూ అమ్మ వంకనే కన్నార్పకుండా చూస్తూ చెవులు నిక్కబొడుచుకుని వింటూ వుంటారు.
మహెూదధిలో మణిరత్నాలు : 140
అమ్మ : పీసపాటి సీతారామయ్య గారు వస్తున్నారు తాతగారూ!
తాతగారు : ఆయన పిచ్చివాడమ్మా! ఆయన్ను నీవేమీ పలకరించబోకు. “నే పలకరిస్తే ఎక్కువవుతుందా? తగ్గిపోతుందా?”
తాతగారు పకపకా నవ్వి, “ఎక్కువా కావచ్చు, తక్కువ కావచ్చు. నీవు యేదనుకుంటే అది అవుతుంది. ఎంత ‘సర్వం’ నీవనుకుంటున్నా, చిన్నమ్మాయివి, మనవరాలివనే తోస్తుంటుంది. ఆ మాయను అట్లా కప్పివేస్తుంటావా?
అమ్మ : “ఆ మాయ వేరే లేదు. యీ మాయే!”.
- సశేషం….