అమ్మ ఆశయాలే తమ ఆశయాలుగా ఒక పరిమిత కుటుంబాన్ని విశ్వకుటుంబంగా తీర్చిదిద్ద దలచిన, అమ్మ విశ్వజనీన భావనను అమలు జరిపి ‘ఉదార చరితానాంతు వసుధైక కుటుంబం’ అన్న మాటను ఆచరించి చూపిన ఉదార హృదయులు శ్రీ నాన్నగారు. పైకి సాదాసీదాగా కన్పిస్తూనే తన ఇంటినే అన్న పూర్ణాలయంగా మార్చగలిగిన అన్నపూర్ణేశ్వరులు. అమ్మ ఏర్పరచిన అందరిల్లే నాన్నగారి విశ్వవ్యాప్తమైన విశాల హృదయానికి నిదర్శనం.
ఒకే శక్తి సృష్టి కథ నడిపించడానికి రెండు రూపాలను ధరిస్తుంది. అట్టి ఒకే శక్తి యొక్క రెండు రూపాలే అమ్మ నాన్నగారు. ఒక సందర్భంలో పూజ్యశ్రీ లక్ష్మణయతీంద్రులవారు అమ్మ నాన్నగార్ల గురించి చెప్తూ “ఒకే ప్రమిదలోని రెండు దీపకళికలు వెలుగుతున్నట్లు ఒకటే అయిన తత్త్వం ఇక్కడ రెండుగా దిగి వచ్చింది. రెండుగా కనపడుతున్నా అనుకోకుండా ఆ రెండు జ్వాలలు కలిస్తే ఒకటే జ్వాలగా ఉంటుంది. ఆ రెండింటిలో ఒకే తత్త్వం ఉంటుంది” అన్నారు. కాబట్టి లోకం కోసం రెండుగా కనిపిస్తున్నా అమ్మ నాన్నగార్లది ఒకే సంకల్పం.
లౌకికంగా చూసినా, గృహిణి సంతానానికి అన్నం పెట్టుకోవడంలో గృహస్థు సహకరించడం గృహస్థ ధర్మం. అమ్మ విశ్వకుటుంబిని; నాన్నగారు విశ్వకుటుంబీకులు. “భావం తెలుసుకుని ప్రవర్తించేది భార్య”; “బాధ్యత తెలుసుకుని ప్రవర్తించేవాడు భర్త” అని అమ్మ చెప్పినట్లుగా – నాన్నగారి ఆలోచనల కనుగుణంగా ‘సరే’ మంత్రంతో అమ్మ నడుచుకుంటే అదే మంత్రంతో బాధ్యతతో నాన్నగారు అందరికీ అన్నం పెట్టాలన్న అమ్మ ఆలోచన కార్యరూపం ధరించడానికి తన సహకారాన్ని అందించారు. ఈ విధంగా అమ్మ నాన్నగారు అనసూయే శ్వరులయి ఆది దంపతులయి అందరికీ ఆదర్శం అయ్యారు.
లోకంలో అందరికీ అమ్మ ఆరాధ్యదైవం – అయితే అమ్మకు ఆరాధ్యదైవం నాన్నగారు. అంతటి మహోన్నతులు నాన్నగారు ఆలయప్రవేశం చేసిన రోజు ఫిబ్రవరి 17. ఆరోజు నాన్నగారి ఆరాధనోత్సవంలో భాగంగా ఒక ప్రత్యేక కార్యక్రమం ఏర్పాటయింది. అదే ధాన్యాభిషేకం. అమ్మ ఆశయానికి ఆచరణరూపం అయిన అన్నపూర్ణాలయ నిర్వహణకు నాన్నగారి ఆరాధనోత్సవం నాడు జరిగే ధాన్యాభిషేకం ప్రధాన భూమిక అయింది. ఈ విధంగా నాన్నగారు తమ గృహస్థధర్మాన్ని సర్వకాల సర్వావస్థల యందు నెరవేరుస్తున్నారనడానికి ధాన్యాభిషేకమే నిదర్శనం.
వినూత్నమూ, విశిష్టమూ అయిన మహత్తర కార్యక్రమం ధాన్యాభిషేకం. ‘ఏకక్రియాద్వ్యర్థి కరీ’ అన్నట్లుగా మానవసేవ, మాధవసేవ సమ్మిళితమైన కార్యక్రమం ఇది. సాధారణంగా ఏ అన్నదానమో చేస్తే మానవసేవ అవుతుంది; ఏ ఆలయంలోనో అభిషేకం – అర్చన చేస్తే మాధవ సేవ అవుతుంది. కాని ఇక్కడ ఒకే కార్యక్రమంలో రెండూ ఇమిడి ఉన్నాయి. అమ్మ నాన్నగార్లకు ధాన్యంతో అభిషేకం మాధవసేవ, ఆ ధాన్యాన్ని అన్నపూర్ణాలయంలో అన్నప్రసాద వితరణకు వినియోగించడం మానవసేవ. అమ్మ దృష్టిలో లౌకికం వేరు ఆధ్యాత్మికం వేరు కాదు. కనుకనే మాధవసేవ మానవసేవ వేరుకాదని ఈ ఉత్సవం ద్వారా అమ్మ తెలియపరుస్తోంది.
భారతంలో యక్షప్రశ్నలలో ‘దైవమంటే ఎవరు?’ అనే ప్రశ్నకు ‘దానమే దైవం’ అని ధర్మరాజు సమాధానం. అంటే – దానం చేయటం అంటే దైవారాధన చేయడమే.
ఉన్నదాంట్లో పదిమందికీ పంచాలనే భావం కంటే దైవత్వం ఏముంటుంది? దానం ఆధ్యాత్మిక ప్రగతికి శక్తివంతమైన మార్గం. ‘దానమేకం కలౌ యుగే’ అని దానాన్ని మోక్షప్రాప్తికి ముఖ్యసాధనగా చెప్పారు పెద్దలు. కనుకనే అమ్మ ఈ ధాన్యాభిషేకం ద్వారా ఆధ్యాత్మికంగానూ, లౌకికంగానూ మనిషి మహోన్నత స్థితిని పొందడానికి ఒక గొప్ప అవకాశాన్ని కల్గిస్తోంది. ‘ఆకలే అర్హత’ అన్న అమ్మకు అందరికీ అన్నం పెట్టుకోవడమే కార్యక్రమం. ‘ఎవరూ ఆకలితో ఉండ కూడదు’ అన్న అమ్మ ఆకాంక్షను నెరవేర్చే అన్నపూర్ణాలయ నిర్వహణను సుగమం చేసేది ధాన్యాభిషేకం.
అందరి చేతులూ, అందరి చేతలూ ఇందులో కలిస్తే – ‘ఈ పవిత్ర కార్యక్రమంలో మేమూ సమర్పిస్తున్న ధాన్యపుగింజ ఉన్నది’ అన్న సంతృప్తి కల్గుతుంది. ఆ ‘తృప్తే ముక్తి’; దానిని మనకు ప్రసాదించాలనేది అమ్మ ఆలోచన.
“నేను మీకు పెట్టడం మీ చేత పెట్టించడం కోసమే” అన్న ప్రబోధంలో ఆధ్యాత్మిక అభ్యున్నతి, సామాజిక సేవ రెండూ ఇమిడి ఉన్నాయి. ఈ ధాన్యాభిషేక కార్యక్రమం ద్వారా సామాజిక ప్రయోజనం ఆధ్యాత్మికతకు ఫలమని, ఆధ్యాత్మిక దృక్పధం సామాజిక సేవకు నేపధ్యమని సందేశం అందుతోంది.
ఆనాడు అమ్మ ఏర్పరచిన ‘గుప్పెడు బియ్యం పధకం’ ఒక మంత్రమై అససూయేశ్వరాలయానికి పునాది అయింది. ఆ అనసూయేశ్వరుని ఆరాధనోత్సవమైన ‘ధాన్యాభిషేకం’ ఈనాడు అన్నపూర్ణాలయానికి వెన్నెముక అయింది. అమ్మకు ఆనందం కల్గించే ఈ పవిత్ర కార్యక్రమంలో పాలుపంచుకోవడమే అమ్మ నాన్నగార్లకు చేసే పూజ అవుతుంది