మార్గాలు వేరయినా చేరుకునే గమ్యం ఒకటే. అదే అమ్మ ఒడి. “మీరు నాలోనే పుట్టి నాలోనే లయమవుతారు” అని అమ్మ చెప్పినట్లుగా అమ్మలో ఐక్యమైన సోదరత్రయాన్ని గురించి ప్రస్తావించుకుందాం.
1) శ్రీ బులుసు లక్ష్మీప్రసన్న సత్యనారాయణ శాస్త్రిగారు: ‘నీవే సర్వమనిపించనీ – అమ్మ మాకు
నీ కంటె వేరు లేదనిపించనీ – అమ్మ మాకు’ – అంటూ అమ్మే సర్వస్వంగా ఉండాలని కోరుకున్న భక్తవరేణ్యులు శ్రీ శాస్త్రి అన్నయ్యగారు. అమ్మను దర్శించిన నాటి నుంచి ‘నీ పాద కమల సేవయు, నీ పాదర్చకుల తోడి నెయ్యము’ అంటూ అమ్మ శ్రీ చరణసేవలో తరించడమే కాదు. అమ్మ బిడ్డలయిన సోదరులెందరితో ఎంతో అనుబంధం పెంచుకున్న వాత్సల్య స్వరూపులు శ్రీ సత్యనారాయణశాస్త్రి గారు.
శ్రీ విశ్వజననీ పరిషత్, మాతృశ్రీ విద్యాపరిషత్తుల మూలనిధికి ముందడగు వేసినా, నిత్యాన్నప్రసాద వితరణ పధకానికి తమ వంతు శాశ్వతనిధి ఏర్పాటు చేసినా, కళాశాలలో ప్రధానభాగమైన గ్రంథాలయ నిర్మాణం చేసి సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దినా, అందరింటి ఆవరణ పచ్చగా ఉండాలని వన సంరక్షణ కార్యక్రమాన్ని చేపట్టినా, ఎందరో సోదరీ సోదరులకు వైద్యం నిమిత్తం ఆర్థిక సహాయం అందచేసినా, ఇలా ఒకటేమిటి ? ఎన్నో సేవాకార్యక్రమాల్లో ప్రధాన భూమిక వహించారు శ్రీ శాస్త్రిగారు. ఈ సృష్టికి మూలమైన పరతత్త్వమే అమ్మ – అని సంపూర్ణంగా నమ్మి అర్కపురిని అష్టమ ముక్తిక్షేత్రంగా కీర్తిస్తూ అన్ని తత్త్వాలూ అమ్మలోనే దర్శించిన తాత్త్వికులు. అమ్మ తత్త్వచింతన అక్షరాలా అన్నయ్యగారిలో దర్శిస్తాం. ఆచరణే అమ్మ అర్చనగా భావించిన అనుష్ఠాన వేదాంతి శ్రీ శాస్త్రి అన్నయ్యగార్కి నమస్సులు సమర్పించుకుంటున్నాను.
2) జన్నాభట్ల వీరభద్రశాస్త్రి గారు:
నైష్ఠికత, భక్తితత్పరత, సేవాపరాయణత త్రివేణీ సంగమంలా మూడు గుణాలు మూర్తీభవించిన విశిష్టవ్యక్తి శ్రీ వీరభద్రశాస్త్రి అన్నయ్య. భక్తి, సేవ మార్గాలలో సమాంతరంగా తమ ప్రస్థానం సాగించి ఆచరణద్వారా ఎందరికో స్ఫూర్తిని కలిగించిన ఆదర్శమూర్తి శాస్త్రి అన్నయ్య. హోమాలు, యాగాలు, అర్చనలు, అభిషేకాది కార్యక్రమాలలో ఎంత భక్తిశ్రద్ధలతో మార్గదర్శకత్వం వహిస్తూ పాల్గొన్నారో పుష్కరాల సమయాలలో గానీ, కరోనా విపత్కర పరిస్థితులలో గానీ అన్నయ్య నిర్వహించిన సేవా కార్యక్రమాలు అనితరసాధ్యమైనవి. విశేషం ఏమిటంటే వారి కుటుంబం మొత్తం ఆబాలగోపాలం ఈ కార్యక్రమాల్లో పాల్గొని తమవంతు సేవను అందిస్తారు. “నేను మీకు పెట్టడం మీచేత పెట్టించడం కోసమే” అన్న అమ్మ మాటకు ఆచరణరూపమే శాస్త్రి అన్నయ్య. ‘జ్ఞాత్వా కర్మాణి కుర్వీత’ అన్నట్లుగా సంప్రదాయ మూలాలు కూలంకషంగా తెలుసుకుని ఆలయ కమిటీ సభ్యులుగా జిల్లెళ్ళమూడిలో ఆలయాలకు సంబంధించిన విషయాలలో ప్రధాన భూమిక వహించి కార్యక్రమాలను నడిపించిన వివిధాధ్వర నిర్మల ధర్మకర్మ దీక్షా పరతంత్రులు శ్రీ శాస్త్రి అన్నయ్య.
హైమక్కయ్యకు లక్ష గాజులతో పూజాకార్యక్రమం, దుర్గాష్టమినాడు సువాసినీ పూజ మొదలైన కార్యక్రమాలలో ఆ ఉత్సవాలకు ఒక ప్రత్యేకతను సంతరింపజేశారు శాస్త్రి అన్నయ్య.
‘ప్రతి ఇల్లు అన్నపూర్ణాలయం కావాలి’ అన్న అమ్మ మాటను అక్షరాలా ఆచరించి వారి ఇల్లు మరో అన్నపూర్ణాలయమే అని అమ్మ మెప్పు పొందిన కుటుంబం జన్నాభట్ల వారిది. నాణేనికి ఇరువైపులా అన్నట్లుగా భక్తి, సేవ మార్గాలలో తరించిన ధన్యజీవులు శ్రీ జన్నాభట్ల వీరభద్రశాస్త్రి అన్నయ్య.
డా॥ ఎస్.వి.సుబ్బారావు గారు:
జిల్లెళ్ళమూడికి సంబంధించిన సోదరీ సోదరు లెందరో డా॥ సుబ్బారావు గారి విశిష్ట వ్యక్తిత్వాన్ని గురించి చెప్తూ ఉంటారు. వైద్యం నిమిత్తం అమ్మ నెల్లూరులో వారింటిలో ఉన్నపుడు జిల్లెళ్ళమూడిలో జరిగే పర్వదినాలన్నీ అక్కడ ఎంతో వైభవంగా నిర్వహించారు. ఎందరో సోదరీసోదరులు అమ్మ దర్శనార్థమై నెల్లూరు వెళ్ళేవారు. వారందరికీ ఎవరికి ఏది అవసరమో అది ఏర్పాటు చేసేవారు. ఆదరణ ఆప్యాయతలతో కూడిన వారి ఆతిథ్యం అందరి హృదయాలలో చెరగని ముద్ర వేసింది. అక్కడ అమ్మ ఉన్న రోజులన్నీ నిత్య కల్యాణం పచ్చతోరణంగా భగవంతుని సేవ భాగవతుల సేవ చేసి తరించిన ధన్యజీవులు డాక్టర్ గారు.
అమ్మ వైద్యులయిన సుబ్బారావు గార్కి అమ్మ ఫోన్ చేసి తన అస్వస్థతను గురించి చెప్తే వారు నెల్లూరు నుండి వచ్చేటప్పటికి అమ్మ హాయిగా నవ్వుతూ ఉండేది. ‘ఇదేమిటమ్మా!’ అంటే, “పాముల నరసయ్య చెవిలో మంత్రం చెప్పినట్లుగా నీకు చెప్పగానే నాకు తగ్గిపోతుంది, నాన్నా!” అనేది. అలా అమ్మ అనుగ్రహం పొంది ‘వైద్యోనారాయణో హరిః’ అన్న మాటను సార్థకం చేసిన ఆదర్శ వైద్యులు.
అమ్మ పట్ల భక్తితో ‘నీవెలా ఆజ్ఞాపిస్తే అలా చేస్తాను” అంటూ అమ్మ ఆదేశం మేరకు అమ్మకు ఎంతో ఇష్టమైన అన్నపూర్నాలయం షెడ్డు నిర్మాణం చేపట్టి, వైద్యపరంగానూ సేవాకార్యక్రమాలలోనూ అమ్మను అర్చించి, “కర్తవ్యమే దైవం” అని అమ్మ ప్రబోధించినట్లుగా వైద్యవృత్తినే దేవతార్చనగా భావించి తన దగ్గరకు ఎన్నో బాధలతో వచ్చిన రోగులకు వైద్యసేవతోనూ ప్రేమపూర్వక పలకరింపులతోనూ వారికి ఉపశమనం కలిగించిన సేవాపరాయణులు డా॥ సుబ్బారావు గారు.
అమ్మను చేరిన ఆత్మీయ సోదరత్రయానికి నమస్సులు సమర్పించుకుంటూ … జయహోమాతా!