(కీ.శే. రాజుపాలెపు రామచంద్రరావుగారు తొలిరోజుల్లో అమ్మను దర్శించుకొని దివ్యాను భూతులు పొందిన ప్రముఖులలో ఒకరు. వారు జిల్లెళ్ళమూడి అమ్మ దర్శనార్థమై వచ్చిన ప్రతిసారి అమ్మ వాక్కులను అక్షరం పోకుండా ఎంతో భక్తితో శ్రద్ధతో వ్రాసుకుని తిరిగి వారి ఇంటికి వెళ్లిన తరువాత డైరీ రూపంలో ఈ వాక్కులను తమ అవగాహనననుసరించి వ్యాసంగా వ్రాసుకునేవారు. అట్లాంటి వానిలో లభ్యమైన వాటిని కొన్ని వారి కుమారుడు రాజు పాలెపు శేషగిరిరావుగారు అందించగా సమయానుసారము వాటిని ప్రచురిస్తున్నాము – ఎడిటర్)
(గత సంచిక తరువాయి)
పై విషయములు పరికించిన అమ్మయన ‘ఆదిశక్తి’యై యుండనోపునని తోచును కదా? ప్రస్తుత విషయమున కెట్టి పూర్వాపర సంబంధముండునో ఎరుంగుటకు కోర్కె పొడసూపుటయు సహజమే.
- “సనకాదుల్ తలపోసికొనని విభున్ ఘన నిర్వాణ విభూతి యిమ్మనక
- ఏవేదంబుల గానని, దేవోత్తము గాంచి ముక్తి తెరవకగ రాజీవేక్షణ రతియడిగెను, భావింప తదీయ కర్మఫల మెట్టిదియో” – భాగవతము – కుబ్జ. అనినట్లు వీరలు సహితము పూర్వభవంబుల ఉపాసనాశీలురై, ప్రత్యక్షమగుచు ఐహిక వాంఛ నెరింగించి యుండనోపుదురు. అట్లగుట కొన్ని జన్మల కుమ్మరి ఈ జన్మలో తత్ఫలసిద్ధియు నొంద జాలి యుందురు. ఐనను పూర్వ జన్మ వాసనలుండుటంబట్టి, అవియే బుద్ధి ప్రకోపితములై, వెలువరింప బడుచుంటయు గమనార్హము.
iv గాధ :- పూర్వము షుమారు 300 సం.క్రితము, బాపట్ల మొదలగు పట్టణములు పల్లెలుగానుండ, ప్రస్తుతము గల కాల్వలు వగైరాలు త్రవ్వించి యుండనందున, బాపట్ల చెరువు అని పిలువబడు (వాద) అను పల్లపు ప్రదేశము అప్పటికే యుండెనట. ప్రస్తుతము కూడ బాపట్ల రిజర్వు అని పిలువబడు చిట్టడవి, సముద్రతీర ప్రదేశము మొదలులో వైపు 10 మైళ్ల వరకు వ్యాపించి యుండనోపును. ఇది ప్రథమతః ఈ జిల్లెళ్ళమూడి వచ్చిన ‘ఖగ్గావారు” వచ్చునప్పటి వరుకు, బంజరుగా యుండి, గుమ్మడిపండ్లు ఎండి యుంట జూచి, సారవంతమైన భూమి యని తెలిసికొని, వారు చెట్లను నరికి, భూమి చదును పరచి, ఎట్లు వ్యవసాయోపయోగమునకు తెచ్చి, తమ భూముల వ్యవసాయము చేయించుటకై, తమ కులపు వారల రావించుకొని గ్రామ మెట్లేర్పరచుకొనినదియు విని యున్నారము.
అప్పటిలో ‘చాగంటిపాడు’ అను కుగ్రామ మొకటి ‘పల్లెవారి’ నివాసములు. వారు సముద్ర తీరమునకు దూరముగా యున్నందున, విశాలచెరువు (వాద) నీటినుండియు, లేనితరి, అచ్చటచ్చట యుండు నీటకుంటల నుండియు, చేపలు పట్టుచుండెడివారట. వారు చిట్టడవిలో పల్లెయేర్పరచుకొని యుండుట, సరియైన ‘రహదార్లు’ యేర్పడి యుండనందున తరచు ‘దారి దోపిళ్ళు’ ‘దొంగతనము’ వారి వృత్తి భాగములుగా నుండెడివట. మీదు మిక్కిలి అప్పటికే ప్రచారములో నుండిన ‘హేమకారక విద్య’ యందు వీరిలో కొందరికి అభిలాష యెక్కడట. దీనిని సాధించుటకై ఒకరు ఏదో ఒకానొక దేవత ఉపాసన ముఖ్యమని యెంచి ‘శీతలాదేవి’ని ఆరాధించు చుండెడి వారట. వారందులకై ‘ఆగమాచారములు’ గాక ‘గౌణముగా’ వామాచారులై దేవతకు మద్య మాంసములచే తృప్తి పరచు విద్యనభ్యసించు చుండిరట. వీనికై చిట్టడవి యందు మధు, మాంసముల కొరకు వెదుకుటలో ‘వేట’యు వృత్తిగా
ఇట్లు, వేట తమకంబున ఒక మంత్రకాడు (ఇతడే తిరుత్తణి యందలి కంబళివాడు యాత్రికుడట) చాగంటిపాడు వదలి ముృగములకొరకో, పిట్టల కొరకో వెదకుచు పోయి, పోయి, ప్రస్తుతము మనము చూచు ‘బ్రిడ్జి’ మూడవ స్తంభము వద్ద గల, ఒక పెద్ద మర్రి చెట్టును సమీపించినంత, అచట ఒకానొక “యోగమాత” తిరుత్తణి నుండి 26 సం॥న బయలు దేరినట్లు కనుపించెనట. ఆయమ స్ఫురద్రూపియై యవ్వనమున నుంటగాంచి మన ‘శీతలా’ మంత్ర సాధకుడగు పల్లియ, ఐహిక వాంఛా ప్రకోపుడై, డాయంజాలక, పలు దినములట్లే తరచు, ఆ యమగారెటుచనిన, అటు వెంబడించు చుండెనట. ఇట్లు కొలది దివసంబులు గడిచిన పిమ్మట, తన దురుద్దేశ్యము నెరుక పరచి, డాయంజన, ఆ మర్రి తొర్రనుండి, ఒక పెను సర్పము బయల్వెడలి, అతని బంధించి, నిస్సహాయుని చేసెనట. అట్లు భంగపడినవాడు, సంక్షేపించుకొనక తాను జేసిన మంత్ర పునశ్చరణ చాలలేదేమో అనుకొని, మరికొన్ని దినములు దీక్షగా జేసి నిజముగా ఆశక్తి నాయందు యందుగాక, సర్పరాజముడే అగునని యెంచి, దానిని కూడా నధిగమించగల శక్తి సంపాదించుటకు మంత్రోచ్చాటనలు చేసెనట. తదాది ఆయమగారెటు వెడలిన అటు వెంబడించు చుండెనట ఒకసారి ఆమె మర్రిని వీడి, తన పల్లె వైపున కేగుట గమనించి, తన ప్రయోగము సిద్ధించెనని యెంచి, తన మనోరథ సిద్ధికై ఆమెయే వచ్చు చుండెనని యెంచుకొని, వెంబడించగా ఆయమ వచ్చి వచ్చి ప్రస్తుతము మనము ‘క్రొత్తదిబ్బ’ అనుకొనుచున్న చోట ఒక తుమ్మ చెట్టు నీడను విశ్రమించి యుండగా, అదియు గమనింపుచు వెంటబడియెనట. (దీనినే దేవుని మాన్యము పేరిట మనము ప్రస్తుతము దేవాలయము క్రింద కొనుట) అంత ఆమె పూండ్ల వైపుగా ‘అనంత వరము’ వరకుపోయి, అచటి నుండి రేటూరు’ మీదుగా ‘కొల్లిమర్ల’ లాకులు (మన్నవ) దగ్గరకు వెళ్ళి, తిరిగి పల్లె మీదుగా మర్రి చేరెనట. ఇట్లు సంచరించు దినములలో నాతడును ఆమెను వెంబడించుచునే యుండెనట, కాని తన నిదివరలో వివశుని చేసిన సర్పమును గూర్చి సంశయ ముండియు, దానిని కూడా ‘వివశ’ చేయగల శక్తి సంపాదించుకొను ఉద్దేశ్యముతో కాలము గడుపుచు, ఇట్టి చోద్యము జరుగుటకు ఆమె శక్తి సంపన్నురాలై యుండ నోపుననియు, అట్టి ఆయమ తన స్వాధీనమైన, హేమకారక విద్య సులభ మగుననియు, ఇంటగలవారలకు దెల్ప, తల్లి సహితము ధనాపేక్షచే వానికి ఉత్సాహ మొసంగి యుండిరట.
తదుపరి ఒకనాడు అతడు తప్పత్రాగి ఆమెగారుండు మర్రికి కొంత దూరములో గల ఒకతాటి చెట్టు నెక్కి (బహుశః ప్రస్తుతము గవర్నమెంటు అగ్రికల్చరువారు ఏర్పరచిన (రాఘవులు) పాకదిక్కున, మరల మరలత్రాగుచు, తాననుకొనిన ‘శీతలా’ ప్రయోగము చేయుచు, అప్పటికి స్వాధీనమై యుండునని యెంచి చెట్టుదిగి ఆమెను సమీపించగా ‘ఆమె’ కరస్పర్శ సోకిన వెంటనే అతడు నిహతుడగుటయేగాక ఆ చాగంటిపాడు యావత్తూ అదే సమయమున నశించెనట. అట్లు నశించుటకు నీరు, నిప్పు భౌతికమున కెంత ఔసరమో, ఆధ్యాత్మికమున కంత, అనవసరమగుట’ నాశనమే పర్యవసానమై నందున, అట్లు జరిగి యుండ నోపును.
ఇంత దనుక పూర్వగాధ నెరింగిన పిదప, తదాది, వీరు అప్పుడాయమ గారెందెందు గడిపిరో, అట్టి తావులనే జననమొంది, ఆనాటి సర్పమును లోబరచుకొను కోర్కె, మన్నవలోని ‘రామకోటయ్యగారుగా తీర్చుకొన్నదియు ఎరుంగగును. వీరు ఆంధ్ర మహా భక్త విజయములో గొప్ప సిద్ధ పురుషులుగా వర్ణింపబడి యుండిరి. కాని వీరిలోగల ప్రతిభ, “దానము” తనకేది యుండిన దానిని నిస్సంకోచముగా ఇతరులకిచ్చెడివారట. ఒకనాడు వారు వెళ్లు చుండ, పిల్లలు ఒకపామును చూచి భయపడుచుండ, “ఈ పురుగు మిమ్ములనేమి చేయును?” అని చెప్పి, తాను స్వయముగా దానిని దూరముగా చేతితో విసరి వేసి యుండిరట. ఈ అన్ని జన్మలలోను అమ్మతిరిగిన ప్రదేశములనే ‘అమ్మ’ దయయు జన్మించుటయు, ఆ సర్పమును జయించవలెనను కోర్కెయు ప్రాధాన్యముగా నుండుట గ్రహింపదగినది. ఈ కోటయ్యగారు, కాశీకి, ఎవరో తీసుకొని వెళ్లగా, అచటమరణించు తరికి, తమ భార్య గర్భవతిగా నుండి, తరువాత ప్రసవించి ‘ఆడపిల్లను’ కనుటయు ఎరుంగనగును. దీని వలన వారికెంత వరకు సిద్ధత్వ ముండెనోయను అనుమానము.
అట్లగుట ప్రస్తుత పరిస్థితి కివ్వి ఎట్లు సరిపడునో తెలియనగును. మొదటి నుండియు ‘ఆ పల్లికాపు’ ఈయమ ఏయే ప్రదేశములు దిరిగినదియో, ఆ ప్రాంతములనే జన్మించుట తిరిగి యధాస్థానమగు ‘మట్టి’ చేరినట్లు ఈ జన్మలో అదే స్థానము చేరుట చూడ, ఈ బృహన్నాటకము ‘లీల’ ఇంతటితో పూర్తి యగుననియు తోచెడిది. మన మెరింగిన ‘సనద్’ నుండి నర్సరావుపేట జమీందారులు, ఆచార్యుల వారికి, అగ్రహారము దానము చేయుచు ‘చాగంటిపాడునకు’ దక్షిణముగా అని నిర్దేశించిరి. అందు జిల్లెళ్ళమూడి యను అగ్రహారము నందు ఉత్తరోత్రా రాగల వత్సరములలో, కరణమొకరు ఔసరమగునను తలంపుతో, అట్టి కరణముల నిమిత్తము, ప్రస్తుతము దేవాలయ సత్రములు గల తావు నుండి “గడ్డి వాముల దొడ్డి” ‘సమాధులు గల పర్యంతము 4 ఎకరముల నేలను, కరణముల నిమిత్తము నిర్దేశింప బడి యుండుటయు గమనింపదగినది. అట్లయ్యును అప్పట్లోగల కరణములు (మన నాన్నగారి తాతలు, తండ్రులు) ఈ భూమిని అమ్మకొనుటయు, తదితరులు కొనుటయు తెలియును. తదాది కరణములిచ్చట ఎవ్వారుగాని స్థిరనివాస మేర్పరచు కొనలేదు. వారూర నుండియే కరణీకము మాత్రము వదలక చేయుచుండిరట.
– (సశేషం)