అవతారమూర్తులు ప్రపంచంలో ఎప్పుడు ఎక్కడ ఆవిర్భవించినప్పటికీ వారి ఉనికి వల్ల సమకాలీన సమాజం ప్రభావితం కావడమే కాకుండా వారి ప్రబోధం, సందేశం ముందు కాలాల వారికి మార్గదర్శకం అవుతాయి.
ఆర్షరుషుల కఠోర తపఃఫలితాలు ఆధ్యాత్మిక విజ్ఞాన సర్వస్వాలు అయిన వేదాలూ, ఉపనిషత్తులూ చెప్పని సత్యం వేరే ఎందులోనూ లేని మాట యదార్థమే. అయినా అవి పాలలో నెయ్యిలాగా, సముద్రజలాల్లో ఉప్పులాగా అంతర్లీనంగా ఉన్నవి. నేటికాలానికి తగిన విధంగా మానవుణ్ణి వెలుగుబాటలో నడిపి గమ్యాన్ని చేర్చేందుకు అవసరమైన సందేశాన్ని అమ్మ అరటిపండు వొలిచి చేతిలో పెట్టినట్లు, తల్లి బిడ్డకు గోరుముద్దలు తినిపించినట్లు సుస్పష్టంగా, సరళంగా, నిర్ద్వంద్వంగా, ఆచరణాత్మకంగా, సుబోధకంగా అందించడం విశేషం. అది జగత్తుకే మహాభాగ్యం. 20 వశతాబ్దంలో మానవేతిహాసంలో చోటుచేసికున్న మహాద్భుత సంఘటన అమ్మ ఆవిర్భావం అనడం అతిశయోక్తి కాదు.
మన భౌతిక నేత్రాలకు కనిపించినా, కనిపించకున్నా. ఉన్నదంతా దైవస్వరూపమే నన్న సత్యాన్ని అమ్మ అనేక సమయాల్లో అనేక రీతుల్లో ఉద్ఘాటించింది. ఎంత వెదికినా దైవంకానిది –
తనకు కనిపించని దివ్యదృష్టి అమ్మది.దివ్యదృష్టి అంటే – మన సామాన్య నిఘంటువులలో భవిష్యత్ను గురించిన జ్ఞానాన్ని కలిగి ఉండడం. కానీ అమ్మ అన్నదీ – దివ్యదృష్టి అంటే, అంతా దివ్యంగా కనిపించడమని. ఎన్నో కొంగొత్త నిర్వచనాలను వివరణలను సొంత అనుభవ భాండాగారం నుంచి వెలికి తీసి లోకానికి ప్రసాదించింది అమ్మ.
ఆత్మ సాక్షాత్కారం అంటే విశ్వమంతా ఆత్మగా కనిపించడమట !
సర్వజ్ఞత్వ మంటే – అన్ని విషయాలనూ తెలుసుకోవడంగా మనం భావిస్తాము. అమ్మ ఎంత అందంగా ప్రవచించిందో చూడండీ – సర్వమూ దైవమే అని తెలియడమట !
ఈ స్థితి కలిగితే పొందవలసింది పొందినట్లే. గమ్యాన్ని చేరినట్లే. ఆ దృష్టికి అంతా అద్వైతమే అన్నం అశుద్ధం, ప్రజ్ఞానం-అజ్ఞానం, ఆనందం-దుఃఖం, సత్తు-అసత్తు, వెలుగు-చీకటి, మంచీ-చెడ్డ, మిత్రుడు శత్రువు, జయము-అవజయమూ, సత్కారమూ – అవమానమూ, స్తుతీ -నిందా, జననమూ- మరణమూ, అమృతమూ-హాలాహలమూ అన్నీ సమానమే. అన్ని బాధలకూ కారణం భేద దృష్టే కదా. సమదృష్టి కలిగిన వాళ్ళకు అంతా ఆనందమే. అదే విజ్ఞానానికి పరాకాష్ఠ ఆ వ్యక్తీ సచ్చిదానంద స్వరూపుడు. అతడ్నే మనం సద్గురువుగా పూజిస్తాం, అవతార వ్యక్తిగా ఆరాధిస్తాం.
అమ్మది ఆస్థితి. అమ్మే స్వయంగా చెప్పింది- రెండుగా కనిపిస్తుంది. ఒకటిగా అనిపిస్తుంది అని. అందువల్లనే అమ్మ దృష్టిలో జడమే లేదు. అంతా చైతన్యమే అమ్మకు బాధకూడ భగవంతుడే. మహోజ్వలమైన యీ దివ్యమకుటంలో కోహినూరు కంటే ప్రకాశవంతమైన రత్నం – సర్వమాతృత్వభావన. జగత్సర్వాన్నీ దైవ స్వరూపంగా చూడడంతో పాటు – మరో మహాద్భుతమైన, మహోన్నతమైన భావన అమ్మ హృదయంలో శతపత్రకుసుమమై వికసించింది. దాని కమనీయ పరిమళాలే అమ్మ వాత్సల్య తరంగాలు, అమ్మ సర్వమాతృత్వ భావన అపూర్వమైనది “ఎవరిని చూసినా నా బిడ్డే అనిపిస్తుంది’ అన్న వాత్సల్యామృత తరంగం అమ్మ హృదయ క్షీరాబ్ధిలో మాత్రమే సముత్పన్నమైన అపూర్వసృష్టి.
అమ్మ మనుషులనే కాక పశుపక్ష్యాదులనూ, క్రిమి కీటకాదులనూ, చెట్టుచేమనూ, రాయీ రప్పనూ – సర్వసృష్టినీ తన ముద్దుబిడ్డగా ప్రేమించి అనుక్షణం ఆనందపులకాంకిత అయింది.