వటపత్రశాయి శ్రీకృష్ణుడు, పద్మపత్రశాయి మన అనసూయమ్మ. ‘బాల ముకుందాష్టకం’లో –
‘కరారవిందేన పదారవిందం ముఖారవిందే వినివేశయంతం |
వటస్యపత్రస్య పుటేశయానం బాలం ముకుందం మనసా స్మరామి॥
సంహృత్య లో కాన్వటపత్రమధ్యే శయానమాద్యంతవిహీనరూపమ్ |
సర్వేశ్వరం సర్వహితావతారం బాలం ముకుందం మనసాస్మరామి ॥
– అనేవి మొదటి రెండు శ్లోకాలు. వాటి అర్థం –
ఆద్యంత రహితుడు, సర్వేశ్వరుడు, సర్వహితుడు, అచ్యుతుడు అయిన శ్రీకృష్ణుడు లోకాలన్నిటినీ తనలో లీనం చేసుకుని వటపత్రంపై పసివానివలె పవళిస్తూ ప్రధాన శైవక్రీడ మాదిరిగా తన సుకుమార పావన సుందర పాదాన్ని తన ముఖంలో ఉంచ ప్రవేశపెట్టే బాలకృష్ణుని మనసారా స్మరిస్తున్నాను. అది జగన్నాటక సూత్రధారి లీలలో ఒక లీల.
మన అనసూయమ్మ పద్మపత్రశాయిగా ఒక దివ్యదర్శనాన్ని శ్రీమతి బెండపూడి రుక్మిణక్కయ్యకి ప్రసాదించింది –
“ఒకరోజు అమ్మ మంచం మీద కూర్చున్నది. అక్కయ్య అమ్మ మంచం ప్రక్కనే కూర్చున్నది. అమ్మ చేతిని ఉన్న ఉంగరం సుదర్శనచక్రంలా దివ్యదర్శనాన్ని ప్రసాదించింది.
ఒక కొలను ఆ కొలనులో ఒకతామరాకు. ఆ ఆకుపై ఒక పసిపిల్ల. ఆ పిల్ల ఆకుపై నుండి లేచి 10 సంవత్సరాల బాలికగా మారింది. అక్కయ్యను తన వెంట రమ్మన్నది. ఎక్కడెక్కడికో తీసుకుని వెళ్ళింది.
ఒకచోట పెక్కుమంది ఋషులు ఉన్నారు. వారందరూ లేచి నిలబడి ఆ బాలికకు నమస్కరించారు. బాలిక వారితో ఏమో మాట్లాడింది. తనకు అర్థం కాలేదు.
ఇంకొక చోటకు తీసుకువెళ్ళింది. అక్కడ పరమేశ్వరుడు ఉన్నాడు. అక్కడ కూడా ఆ బాలిక వారి అభినందనం అందుకుని ఏమో మాట్లాడింది. తరువాత ఒక చెట్టుక్రిందకు తీసుకు వచ్చింది. అక్కడ ఆ బాలిక అమ్మ ఆకారం దాల్చింది. తన వక్షస్థలంలో అతఃపూర్వం దర్శించిన దృశ్యాలన్నీ తిరిగి దర్శింపజేసింది -‘ అంతవరకు రుక్మిణక్కయ్య బాహ్యస్మృతిలో లేదు. అవును. అవాజ్మానస గోచరమైన పరతత్త్వ దర్శనం అనుభవైక వేద్యమేకానీ ఈ చర్మ చక్షువులకు కానరాదు; మాటలకు మనస్సుకు అందదు. బాహ్యస్మృతిలో లేదు’ – అన్నారు. ఏ స్థితిలో ఉన్నదో చెప్పగలమా? ఏతద్విషయమై కొన్ని సమాంతర సదృశ సందర్భాల్ని గుర్తుచేసుకోవాలి –
– ప్రస్తుత కుర్తాళం శ్రీ సిద్ధేశ్వరీ పీఠాధిపతులు శ్రీ సిద్ధేశ్వరానంద భారతీ స్వామి వారు సిద్ధులు, సిద్ధాశ్రమాలు, సిద్ధమండలాల గురించి ప్రస్తావించారు.
శ్రీ పరమహంస యోగానంద విరచితమైన ‘ఒక యోగి ఆత్మకథ’ గ్రంథంలో శ్రీ మహావతార్ బాబాజీ గురించి వివరించారు. బాబాజీ కొన్ని వేల సంవత్సరాలుగా తమ బృందంతో కలిసి హిమాలయాల్లో ఒక చోట నుండి మరొకచోటికి సంచరిస్తూంటారు. బాబాజీ కోరినప్పుడే (సంకల్పించినపుడే) ఇతరులకు కనపడతారు లేక వాళ్ళు వారిని గుర్తిస్తారు. బాబాజీ పాతికేళ్ళకు మించని యువకునిలా కనిపిస్తాడు. పసిడి ఛాయ, సుందర ధృఢకాయంతో తేజస్స్వరూపంగా ప్రకాశిస్తూ అనుగ్రహిస్తూ ఉంటారు. వారి నేత్రాలు నల్లగా ప్రశాంతంగా ప్రేమామృత ధారల్ని వర్షింపజేస్తూ ప్రసన్నంగా ఉంటాయి – అని చెప్పబడింది.
– శ్రీ రాజుపాలెపు రామచంద్రరావుగారు వ్రాసుకున్న డైరీలలో – ‘అమ్మ తన జన్మప్రభృతి 10-12 ఏళ్ళ వయస్సులో గల కొందరు వ్యక్తుల్ని ఎన్నుకున్నది తన పరికరాలుగా, వాళ్ళు ఎక్కడెక్కడో పర్వతాలపైనో అరణ్యాల్లోనో తపస్సు చేస్తూ ఉన్నారు. వాళ్ళకి ఆహారం ఎట్లా? అమ్మకైతే ఆహారం అవసరం లేదు. బాల్యం నుంచీ ఆ మహనీయులతో సంఘటనల్ని నాకు వివరించింది. వాళ్ళు ఎక్కడ ఉన్నారని అడిగితే ఫలానాచోట ఉన్నారని వివరం చెప్పింది. తన కవసరమైనపుడు వారు ప్రకటితమౌతారని చెప్పింది. వారికి ఆహారం కావాలంటే అమ్మ తన సంకల్పం మాత్రం చేత పంపిణీ చేసేది’ – అని ఉన్నది.
అనుదినం సంధ్యావందనము చేయునపుడు – ‘గంగా యమునయోః’ మధ్యే యే వసంతి తే మే ప్రసన్నాత్మానః చిరంజీవితం వర్ధయంతి’ –
ఓం నమో గంగాయమునయోర్మునిభ్యశ్చ నమః’ – అంటే – ‘హిమాలయ వింధ్యపర్వత ఇత్యాది పర్వతశ్రేణుల్లో అత్యల్ప భయంకర ఉష్ణోగ్రత వద్ద నిరాహారులై వందల యేండ్ల తరబడి తపస్సు చేస్తూన్న మహితాత్ములు నేడూ ఉన్నారు. వారి శ్రీచరణాలకు నమశ్శతములు’ – అంటాం.
ఈ సందర్భాలనన్నింటినీ సమన్వయం చేసుకుంటే అర్థమయ్యేది –
జగత్కర్త. జగద్భర్త అయిన పరదేవత ‘అమ్మ’గా అవతరించింది. దిగివచ్చేటప్పుడు తన పరివారాన్నీ, పరిచారకుల్నీ వెంట తెచ్చుకున్నది. విశ్వకళ్యాణకారక సంకల్పం చేసింది. అనేకులకు అలౌకిక దివ్యానుభూతుల్ని ప్రసాదించింది. అష్టసిద్ధులు అమ్మ శ్రీచరణాలమ్రోల లాస్యం చేస్తాయి.
కాగా అమ్మ ఐచ్ఛికంగా మహిమల్ని చేయదు. తాను మానవాతీత మహిమ ప్రదర్శన పరాఙ్ముఖి. జ్ఞానబోధ చేయదు. అవసరం అనుకుంటే జ్ఞానప్రసారం చేస్తుంది సంకల్పమాత్రం చేత. అమ్మ చర్యలు దివ్యము, అలౌకికము. కనుక అవి అమ్మకి సహజం, మనకి విశేషం. వాటిని మాహాత్మ్యాలు (MIRACLES) అని మనం కీర్తిస్తాం, భావిస్తాం. ఉదాహరణకి బిడ్డల ఆకలి బాధ నివారణార్థం అన్నపూర్ణాలయాన్ని ప్రతిష్ఠించింది. అంతేకాని నిరతాన్నప్రదాత్రి అనే కీర్తి ప్రతిష్ఠలు నాశించి కాదు.
కీర్తి ప్రతిష్ఠల మాటకొస్తే అమ్మ త్యాగానికి పరాకాష్ఠస్థితి. తనను, తన బిడ్డను కట్టుకున్న భర్తను విశ్వకళ్యాణకారక మహత్సంకల్పం సాకారం చేయటానికి కర్పూర హారతి పట్టింది. అమ్మస్థితి, క్రియ అనూహ్యం, అగ్రాహ్యం. మన అడుగడుగు గండాలను గడియలో తొలగిస్తుంది. భరించలేని స్థితికలుగ కుండా కాపాడుతుంది, మానవాళి వాసనాతతిని, మాలిన్యాలను కడిగి సద్గతిప్రాప్తికి రాచబాటలు వేస్తుంది.
మన శ్రేయస్సు, శాంతి, నిశ్రేయసం కోసం బృహత్ప్రణాళికను రచించుకుని అమలు చేస్తున్నపుడు మన కర్తవ్యం ఏమిటి? మన మాతృసంస్థ, కేంద్రసంస్థ, జిల్లెళ్ళమూడి సంస్థ – శ్రీ విశ్వజననీ పరిషత్. దాన్ని పటిష్ఠం చేసుకోవాలి. అది NUCLEUS కేంద్రకము. అమ్మ వాత్సల్యతత్వాన్నీ, సర్కోత్కృష్ట తత్త్వాన్నీ పదిమందికీ పంచాలి.
సద్గురు శ్రీ శివాసన్దమూర్తిగారు నిర్దేశించినట్లు – ‘అమ్మ దర్శనార్థం వచ్చే వారందరికీ ఇతోధికంగా ఆదరణగా భోజనం, వసతి సౌకర్యాలను జేయాలి. కలుగ చేయాలి.
ఈ రీతిగా అమ్మను సేవించుకోవటానికి ‘పద్మపత్రశాయి’ అయిన అమ్మనే ప్రార్ధిద్దాం. SVJP అనే మట్టిచెట్టుకి ఊడలుగా ఎదిగి ఆధారస్తంభాలుగా నిలిచి, కొంత వరకు మాతృఋణం తీర్చుకుందాం.
Select Bibliography (ఉపయుక్త గ్రంధావళి)
- ‘మాతృశ్రీ’ మాసపత్రిక, జూన్ 1966, పేజీలు 67, 68
- ‘ఒక యోగి ఆత్మకథ’, శ్రీ పరమహంస యోగానంద, పేజీలు 374, 375
- ‘అమ్మతో అనుభవాలు- 2, పేజీలు 236, 237