శ్రీ కొండముది దత్తాత్రేయశర్మ అంటే తెలియని అందరింటి సభ్యులు ఉండవచ్చును కానీ వారంటూ లేరు అంటే అది అతిశయోక్తి కాదు.
‘అమ్మ’ వర్ణచిత్రంలో ఆద్యంతాల్లో నాందీ వాక్యం, భరతవాక్యం పలికింది వారే. జిల్లెళ్ళమూడి పావన క్షేత్ర యాత్రికుని పాత్రలో కుటుంబసమేతంగా వచ్చి రంగప్రవేశం చేసి ‘సమాచార కేంద్రం’, ‘హైమాలయం’, ‘అఖండనామం’, ‘అమ్మసాహిత్యం’, ‘అమ్మదర్శనం’, ‘అమ్మప్రసాదం’ వంటి ప్రముఖ సందర్భాల పరిచయంలో ప్రత్యక్షంగా పాల్గొని అమ్మ మహత్వాన్ని ఆకళింపు చేసుకుని ముగింపు సమయంలో
“ఇవ్వాళ నా జీవితంలో మరపురాని మరువలేని రోజు. అమ్మను గురించి ఎంతమందో చెప్పారు; అమ్మను చూడాలని ఎన్నిసార్లో అనుకున్నాను; నేటికి గాని అమ్మ దయ నాపై ప్రసరించలేదు.
పరమేశ్వరుడ్ని కళ్ళారా చూశాను. పురాణాలూ, పుస్తకాలూ చదివేటప్పుడు ఆయా అవతారాల కాలంలో నేను లేకపోతినే అని విచారించే వాడిని. ఇవాళ ఆ విచారమంతా మాయమైంది. అమ్మతో పాటు జీవిస్తున్నాం, అమ్మను చూడగల్గుతున్నాం, మనమంతా ఎంతో ధన్యులం” అంటూ తృప్తిగా సెలవు తీసుకున్నారు. వారి అనుభవం జిల్లెళ్ళమూడి గడ్డపై అడుగుపెట్టే ప్రతివ్యక్తికి సహజం, సాధారణం.
శ్రీ దత్తాత్రేయశర్మ అమ్మ పావన పాదపద్మములకు ప్రణమిల్లి, అమ్మ మమకారతరంగాలలో తలమునక లౌతూ, ధన్యోస్మి అని భక్తిప్రపత్తులతో అంజలి ఘటించి “వేదాంత ప్రతిపాదితే భగవతే విశ్వాత్మనే శాంభవే ఆదిత్యేందు కళాభి దివ్యనయనే హర్యక్ష సంచారిణే పాదద్వంద్వము బట్టువాడ జననీ! భద్రా! మహాకాళివై మేధాశక్తి కవిత్వ పుష్టినిడి; మమ్మేలంగదే శాంకరీ” అని అభ్యర్థించారు.
అమ్మ ఆశీఃఫలంగా శ్రీదత్తాత్రేయశర్మ 1975 2000 కాలం పత్రికా జర్నలిజంలో నిజాయితీతో సిద్ధాంతపరమైన ఉన్నతబాటలో నడచిన పేరు గాంచిన సీనియర్ జర్నలిస్టుగా శ్రీ నార్ల, శ్రీ పొత్తూరి, శ్రీ చూడని పండితారాధ్యుల వంటి దిగ్గజములు సమకాలీనునిగా ఖ్యాతి వహించారు. వారి కొన్ని రచనలు : పరిష్కారం (నాటకం), కవితా త్రివేణీ గేయ కదంబము, నిత్యోత్సాహి – నిరంతర పథికుడు, వ్యాసమంజూష, అమ్మ చెక్కిన చందన శిల్పం. ‘ఆంధ్రప్రభ’ వంటి పత్రికారంగంలో ఉద్యోగం చేశారు.
‘అమ్మ చెక్కిన చందన శిల్పం’ గ్రంథం అమ్మ ఆంతరంగిక కార్యదర్శి విశ్వమానవాలయ ప్రధానార్చకుడు శ్రీ రామకృష్ణ అన్నయ్య చరిత్ర. ఇందు భగవంతుడు అమ్మను, భాగవతుడు రామకృష్ణ అన్నయ్యను మార్చి మార్చి వీక్షిస్తూ వారి వారి సంపూర్ణత్వానికి, సంపూర్ణమూర్తిమత్వానికి నిలువెత్తు దర్పణం పట్టారు.
అమ్మ : దక్షిణేశ్వర కాళిక
అన్నయ్య : శ్రీ రామకృష్ణ పరమహంస
అమ్మది : మమతల గర్భగుడి
అన్నయ్యది సమతా మమతా మానవతా త్రివేణీ సంగమస్థలి.
అమ్మ: నిఖిల రసామృతమూర్తి! కారుణ్యామృత వర్షిణి!
అన్నయ్య: అనురాగ రాగస్రవంతి! రాగజలధి!
అమ్మ : దివి నుండి భువికి దిగిన దైవమూర్తి
అన్నయ్య : భువిలో అజాతశత్రువైన అపరంజి స్ఫూర్తి అని. ‘విశ్వజనని’ మాసపత్రిక సంపాదక వర్గ సభ్యులుగా చిరకాలం సేవలందించారు. అక్షర రూపిణి అమ్మ శ్రీ చరణ సేవచేస్తూ తుదిశ్వాస వరకూ వాఙ్మయసేవ చేస్తూ అనసూయమ్మను ఉపాసించారు. అమ్మ మహత్తత్త్వానికి నీరాజనాలర్పిస్తూ ‘సంభవామి యుగేయుగే’ వంటి వ్యాసాల్ని రచించారు.
2-3-2021న తుదిశ్వాస విడిచి అమ్మలో ఐక్యమైనారు. సాహితీ సంపన్నులు సౌహార్టరూపులు అయిన అన్నయ్యకిదే సాశ్రునివాళి.