ఒకసారి శ్రీ రాజు బావ గారు అమ్మతో, “అమ్మా! ‘కాయకల్ప చికిత్స అనేది ఒక వైద్యశాస్త్ర ప్రక్రియ. కాయ శరీరదారుఢ్యానికి, కల్ప సమర్థవంతమైన, చికిత్స వైద్యము’ అని అర్ధం. ఒకసారి కాయకల్ప చికిత్స చేసుకుంటే కొత్త శరీరం వస్తుంది. సాధారణంగా రోజూ శరీరంలో ఎన్నో జీవకణాలు నశించి పోతూంటాయి. ఈ విధానంలో కొత్త శరీరం వస్తుంది. అది 60 నుంచి 80 సం॥ల పాటు దృఢంగా ఉంటుంది. 60 ఏళ్ళ తర్వాత మళ్ళీ చేసుకుంటే మళ్ళా 60 నుంచి 80 సం॥ల పాటు దృఢంగా జీవించవచ్చు” అని అన్నారు.
అందుకు అమ్మ అంటారు, నాన్నా ! దానిదేమున్నది ఏం చేయాలి ఉండి? రోజూ ఇదే పని కదా నాన్నా! ప్రొద్దున్నే లేవటం, కాలకృత్యాలు తీర్చుకోవడం, భోజనం చేయటం, మళ్ళీ పడుకోవటం – దీనికి 100 సం॥లు కావాలా చెప్పు నాన్నా! 100 సం॥లే కాదు 200 సం॥లు అయినా చెయ్యొచ్చు. ఇదే పని కదా! దీనికి సమయం కావాలా?
అప్పటికి మీరంతా ఉండరు కదా, నాన్నా! మీరంతా పోతారు. కొత్తవాళ్ళు వస్తారు. వాళ్ళకోసం, వీళ్ళకోసం ఏడ్వాలా! ఇలా ఏడుస్తూ ఉండటం ఇదేనా పని? నాన్నా చెప్పు? దానివల్ల ఉపయోగం ఏమిటో చెప్పు. ఏదైన ఒక పనిచేస్తే దానివల్ల ఈ కష్టం ఉంది. నష్టం ఉంది. లాభం ఉంది. ఇది మంచీ ఇది చెడూ.. అని ఉంటాయి కదా, నాన్నా! అవి ఏమిటో చెప్పు. ఇవే పనులు కదా మనం చేసేది. దానికి 100 సం॥లు మామూలుగా పెట్టారు. ఇదే చాలు అనుకుంటున్నారు చాలామంది. ఇది చాలక ఇంకొక వందేళ్ళు కావాలంటావా? మీరు ఎవరూ ఉండరుకదా నాన్నా! మీరు లేని తర్వాత నేనెందుకు? ఇలాంటి పిచ్చి ఆలోచనలు ఎందుకు వస్తాయిరా నీకు? అని అన్నది పైకి నవ్వుతూ లోపల బాధపడుతూ.
“మీరంతా ఉండరు. మీరు లేని తర్వాత నేనెందుకు; నేను ఏడుస్తూ ఉండాలా? అనే అమ్మ మాటలు అమ్మ దివ్య మాతృప్రేమకు దర్పణం పడతాయి. తల్లికి గర్భశోకాన్ని మించిన బాధ ఏముంటుంది.
వాత్సల్యామృత వర్షిణి అమ్మ అంటుంది. నాన్న! నేను ఉండి నువ్వులేకపోతే ఆ బాధ భరించలేను అని.
“మిమ్మలందరినీ నేనే కన్నాను. మీ తల్లులకు పెంపుడిచ్చాను” అనే అమ్మే అసలైన అమ్మ, నిజమైన తల్లిలా కాక, ఒక సామాన్య మాతృమూర్తికి, అమ్మకి చాలా భేదం ఉంది. అమ్మలో ఒక సామాన్య మాతృదేవత సహస్రాంశమే.
గర్భస్థ శిశువు మాతృగర్భంలో (Placentrex) బొడ్డు సంబంధంతో ఒక భాగంగా ఉంటుంది. బొడ్డును కోసి బిడ్డను వేరు చేయటంతో మొదలవుతుంది. తల్లీబిడ్డల మధ్యదూరం. క్రమేణా మాటలు రావటం, నడవటం, తన పనులు తాను చేసుకోవటం, చదువుకొని ఉద్యోగం చేయటం, పెళ్ళిచేసుకొని భార్యాబిడ్డలు ఏర్పడటం. ఈ క్రమంలో ఆ ఎడం పెరిగి పెద్దదవుతుంది.
కానీ అమ్మ- అమ్మ సంతాన బంధం స్థితివేరు. అమ్మ విరాట్స్వరూపం నుంచి ఏ జీవి ఏ క్షణం లోనూ ఏ కాలం లోనూ ఎన్నడు ఏ స్థితిలోనూ విడివడదు. ఇంకా సూటిగా చెప్పాలంటే పుట్టిన ప్రతిప్రాణీ అమ్మ ఒడిలోనూ, గిట్టిన ప్రతిప్రాణి అమ్మ ఉదరంలోనూ ఉంటుంది. అంటే అమ్మ ఒడి, అమ్మ బొజ్జ పరిమాణం అనూహ్యం. ఈ అంశాన్ని వివరిస్తూ మహాకవి కాళిదాసు రఘవంశంలో సాగరవర్ణన సందర్భంగా
తాంతాం అవస్థాం ప్రతి పద్యమానం స్థితం దశ వ్యాప్య దిశో మహిమ్నా విష్ణోరివ్యాస్యానవధారణీయం ఈ దృక్తయా రూపమియత్తయా వా’ అని అంటారు. ఆ ప్రమేయమే స్వీయశక్తి ప్రభావంచేత ఆది పురుషుడైన శ్రీమహావిష్ణువు దశదిశలా వ్యాపించి ఉన్నాడు. సముద్రుని ఆకారం, పరిమాణం గణనకి అందవు- అని
కాగా అమ్మ యొక్క అసాధారణ అలౌకిక స్థితిని వివరించటానికి అసంఖ్యాక ఉదాహరణలు ఉన్నాయి. ముఖ్యంగా సర్వజ్ఞత్వం, సర్వవ్యాపకత్వం, సర్వశక్తి మత్వలక్షణాలు అమ్మ దినచర్యలో భాగాలే; అమ్మకి కాస్త సన్నిహితంగా మెలిగే సోదరీ సోదరులకు అవి మామూలే. ప్రస్తుతం రెండు ఉదాహరణలను ఉటంకిస్తాను.
- అమ్మ స్వీయచరిత్రని శ్రీ యార్లగడ్డ భాస్కరరావు అన్నయ్యకి చెప్పేది. అన్నయ్య వ్రాసే వారు. అంతే కానీ ఇది కేవలం ఉక్తలేఖనం (Dictation) మాత్రమేకాదు. అమ్మ ఆయా సంఘటనలను వివరిస్తున్నప్పుడు అలనాటి వ్యక్తుల సంభాషణలు వారి వారి కంఠధ్వనులతో యధాతథంగా అన్నయ్యకి వినిపించేవి.
- అమ్మ స్వీయ అనుభవాన్ని శ్రీ రాజుబావగార్కి చెప్పేది. వింటున్న రాజు బావగార్కి అమ్మ అనుభవం తన అనుభవం అయ్యేది. ఆ సమయంలో తాను ప్రత్యక్ష సాక్షిగా ఉండటం అంటే తన కళ్ళముందే ఆ సంఘటన జరుగుతున్నట్లు, అమ్మ కదలికలు హావభావాలు, సుఖఃదుఖాలు, స్థితిగతులు సర్వం అవగతమయ్యేవి. ఒక్కమాటలో చెప్పాలంటే అమ్మ బావగార్ని తన శరీరంలో ఒక భాగంగా చేసికొని తన అనుభవాన్ని ప్రసారం చేసేది. వాస్తవానికి ఒక అనుభవాన్ని కాని, జ్ఞానాన్ని కానీ ప్రసారం చేయటానికి అమ్మకి సంకల్పమే. చాలు. మాటలతో పనిలేదు. రాజు బావగారు ఒక అద్భుతగీత మనోహారాన్ని అనుభవసారాన్ని రచించటంలో రహస్యం ఇదే.
ఆ సమయంలో వారి మది నిండుగా పొంగేది thought కాదు; Thoughtfulness.
ఇందు మూలంగా స్పష్టమయ్యే అంశం ఏమంటే అమ్మకి ‘భూత భవిష్యత్ వర్తమాన కాలములు వర్తమానమే. కానీ ఒక ప్రాకృత మానవుని కూడా 50 ఏళ్ళ వెనక్కి తీసికొని వెళ్ళి నాటి చరిత్రను నేటి అనుభవంగా రూపొందించటం. అట్టి ఘటనాఘటన సమర్థ అమ్మ.
కానీ తాను తరింపచేసే తల్లిని అని, ఒక నిర్వచనానికి హామీని ఇచ్చింది. మనల్ని అనుక్షణం కంటి రెప్పల వలె సంరక్షిస్తూన్న అవ్యాజ కరుణాసాగరోత్తుంగ అమ్మను నీవిచ్చిన ఈ జన్మకు విలువ కట్టుకో అని అంజలి ఘటించి వేడుకోవటమే నిజమైన కాయకల్ప చికిత్స. నూరేళ్ళు లేక వెయ్యేళ్ళు శ్వాసించటం అనేది ప్రధాన అంశం కానే కాదు. పుణ్యస్వరూపులు కొన్ని సంవత్సరాలే జీవించారు.
“జిహ్వేకీర్తయకేశవం, మురశిపుం చేతభజ శ్రీధరం,
పాణిద్వంద్వ సమార్చయ, అచ్యుత కథా : శ్రోతద్వయత్వంశృణు,
కృష్ణంలోకయ లోచన ద్వయం, హరేః గచ్ఛాంఘియుగ్మాలయం,
జిఘ్రాఘ్రాణముకుంద పాదతులసీం, మూర్ఖన్నమాధోక్షజమ్”
అన్నట్టు శరీరంలోని ఒక్కొక్క అవయవానికి ఒక్కొక్క పనిని నిర్దేశిస్తూ హంసలా ఆరు నెలలు జీవించటం, జగన్మాత సేవలో శరీరధారులంతా చరిత్రహీనులే.