భోజనాలకు అన్నపూర్ణాలయం గంట, కాలేజీకి ఉదయం పూట విడిచే గంట ఒక్కటే. రెండవ విడత వ్యాన్ వచ్చే సమయం ఒక్కటే. అమ్మ దగ్గరకు వెళ్ళి కూర్చున్నాను. ఆ నెల మాసపత్రిక మాతృశ్రీ వచ్చింది. మొదటి కాపీ అమ్మకు చదివి వినిపించటం రివాజు. అక్కడ అప్పుడు ఎవరు ఉంటే వారు చదివి వినిపించేవారు. ఆరోజు అక్కడ ఉన్న నన్ను చదవమన్నది. అమ్మ. తూర్పువైపుననున్న గోడను ఆనుకుని అమ్మ పాదాలవద్ద కూర్చుని నేను లోపల వణుకుతూ పైకి చదవటం ప్రారంభించాను. తప్పు దొర్లినది. ఠక్కున చదవటం ఆపివేసి అమ్మవైపు చూసి తలదించుకున్నాను.
అమ్మ: “ఫర్వాలేదు చదువు” అని నోటితో చెప్పి కళ్ళతో ధైర్యం చెప్పి తగినంత సమయం ఇచ్చింది.
అంతే భావస్ఫోరకంగా, సుస్పష్టంగా, ధారగా సాగింది నా పఠనం. చదవటానికి వంచిన తల ఎత్తలేదు. ముగించి తల ఎత్తేసమయానికి చాలామంది ఉన్నారు. బిడియంతో లేచి అమ్మకు నమస్కరించి వెళ్ళిపోయాను అక్కడనుండి.
ఈ ఘటన ప్రత్యేకించి నా మనోఫలకంమీద ముద్ర చెరగకుండా ఉండిపోయింది. కారణం నా వరకు నాకు చాలా పెద్ద విషయం. మా అమ్మ ఉన్నంతవరకు పొత్తూరులో ఎంతవరకూ స్కూలుకు పంపటం జరిగిందో అంతే. మా అమ్మ అమ్మలో కలిశాక ఆదిపూడి నరసింహారావుగారు, పోతుకూచి విద్యాసాగర్ గారు, భరద్వాజ అన్నయ్య, J.M లోని పిల్లలందరినీ ఒకచోట చేర్చి చదువును యజ్ఞం వలె నూరిపోసి రేటూరు తీసుకువెళ్ళి 5th class ప్రభుత్వపరీక్ష వ్రాయించి 6th class లో చేర్పించారు. అంతదూరం నడక నాకు అసాధ్యం. అప్పటికి నా వయస్సు 9 సం.లు. నా చదువుకు గ్రహణకాలం మొదలు, వానా కాలంలా ఎప్పుడో తోచినప్పుడు మా నాన్నగారు, కాలేజీ మాస్టారు. చెప్పిన క్రమశిక్షణ లేని, పరీక్షలు లేని చదువువలన మెదడు మొద్దుబారింది.
1975 జూన్ 8 ఆదివారం రాత్రి మా నాన్నగారు కోన సుబ్బారావుగారు కూడా అమ్మలో కలిసిపోయారు. నా బాధ్యత పూర్తిగా అమ్మ స్వీకరించింది. రాత్రిళ్ళు తన మంచం దగ్గర పడుకోబెట్టుకోవటం, నా తిండి గురించి పట్టించుకోవటం ఈ క్రమంలో నా చదువు ప్రస్తావన కూడా జరిగింది. రవి అన్నయ్య తనతో తీసుకెళ్ళి ట్యుటోరియల్ కాలేజీలో చేర్చి కొంతకాలంలో మెట్రిక్ పూర్తిచేయించి చదివించటానికి పూనుకొని అమ్మతో అన్నారు. అమ్మ నా వైపు చూస్తూ ‘అది ఇక్కడే చదువుకుంటుంది’ అని తేల్చేసింది.
విద్యాప్రవీణ ఎంట్రన్స్లో చేరాను. కానీ నా మెదడు అగమ్యగోచరం. అంధకారబంధురం ఒక్కొక్కసారి ఎన్నో బల్బులు వెలిగినట్లు ఉండేది. అది నిలిచేది కాదు. గాఢాంధకారం ఆవహించేది. దాదాపుగా కాలేజి నుంచి వచ్చాక అమ్మ దగ్గరకు వెళ్లటం అలవాటు. బహుశః తనే చేసిందేమొ. ఆనాటి చదువు విశేషాలు అడిగేది. ఏమర్థమయింది అంటూ. నా బాధ చెప్పాను. ఏమీ అర్థం కావటం లేదు. నా నోట్సు తీసుకుని అంతా అని వ్రాసి ఇచ్చేది. నా ప్రతి పుస్తకంలోను, నోట్సులోను అంఆ అని కచ్చితంగా వ్రాసేది. పోర్టికోలో చదువుతుంటే పుస్తకాలు తీసుకొని చూచేది. నా మెదడు పూర్తిగా పనిచేయని దశనుంచి క్రమంగా చదువులో తాబేలులాగా అయినా సాగింది. అంటే సంపూర్ణంగా అమ్మ వ్యక్తిగత శ్రద్ధే కారణం.
1981-82 శిక్షా శాస్త్ర తిరుపతి విద్యాపీఠంలో చదవటానికి అమ్మతో బొట్టుపెట్టించుకుని వెళ్ళాను. కాని నా మెదడునిండా పురుగులు పాకుతున్నట్లుగా ఉండేది. నా రూమ్మేట్ ఇందిర నాకు చాలా సహాయంగా ఉండేది. ఆమె ఆర్ధిక స్థితి, మనస్సు మంచితనం నన్నెంతో బాధించేవి. అమ్మ దగ్గరకు వచ్చి అన్నీ చెప్పి బాధలు, కష్టాలు వద్దనటం లేదమ్మా తట్టుకునే శక్తి నివ్వమ్మా అడిగాను. “అదే వస్తుంది. ఇందిరను మన దగ్గరకు పిల్చుకుందామా” అన్నది.
తిరిగి తిరుపతి వెళ్ళాక బస్టాండులోనే మా రిక్షావాడు చెప్పాడు ఇందిరమ్మ కడుపునెప్పితో పోయిందమ్మా. నా కళ్ళకు అమ్మ తప్ప ఎవ్వరు కనిపించలేదు.
పరీక్షలు ఏమాత్రం బాగా వ్రాయలేదు. ప్రత్యేకించి స్టాటిస్టిక్స్. రిజల్టు వచ్చే రోజు.
అమ్మ స్నానం చేసి ఎ.సి రూమ్లో ప్రశాంతంగా కూర్చున్నది. అమ్మ దగ్గర కూర్చున్న నన్ను “పాస్ అయితే నీవు నాకేమిస్తావు?” “తప్పితే నన్ను ఏమి ఇవ్వ మంటావు?” – అమ్మ నన్ను అడిగిన ప్రశ్నలు.
‘పాస్ సంగతి అట్లాఉంచు, తప్పితే మనఃశాంతి ‘ఇవ్వమ్మా’ అన్నాను. గది శుభ్రం చేస్తున్న మా వదిన వైపూ కళ్ళు ఎగరేసింది నవ్వుతూ, నా మనస్సు స్థాణువులా ఐపోయింది.
కారణం ఈ పరీక్షలో 1 పేపరుపోయినా మళ్ళీ 5 పేపర్లు రెగ్యులర్ స్టూడెంటుగానే ఉండి వ్రాయాలి.
సంగీత రూపిణి అమ్మ. అంఆ అమ్మా అన్నీ తానైన తల్లిని ఏ తీరునర్చింతునో ఉచ్ఛ్వాస నిశ్వాసాలు తానుగా, తల్లిగా, జ్ఞానమయిగా, వరప్రదాయినిగా, కోరి వరాలు ఇచ్చే అవ్యాజ కరుణామూర్తిగా ఎన్ని, ఎన్నెన్ని జన్మల తపఃఫలంగా నీతో నాకీ బంధం తల్లీ. అంతేనా మరువరాని మరుపులేని మరో అమృతధార. అద్భుతమైన సంగీత ప్రపంచం పరిచయం చేసింది. రాధన్నయ్యకు గట్టిగా చెప్పి అన్నయ్య కాదనలేని రీతిలో కట్టిపడేసి నాకు సంగీతం చెప్పించింది.
తెల్లవారుఝామున స్నానం చేసి పెద్దగుడి గర్భగుడిలో ప్రణవసాధన, సూర్యోదయంవరకు చేసి పాలలో మిరియాలు కలిపి త్రాగించారు. మధ్యాహ్నం పానకం. సాయంత్రం కీర్తనలు సాధన – హాస్పిటల్ తోటలో.
అప్పుడు లలితాంబక్కయ్య. పాపక్కయ్య మేడమీద ఉండేవారు. రాత్రి అప్పుడప్పుడూ ఇవాళ రాధ పాఠం చెప్పాడా అని అడిగేది.
ఎవ్వరూ నమ్మలేని నిజం! ‘రాధ దానికి ఎంతవరకు నేర్పించావో వింటాను మొదలు పెట్టండి’ అంది అమ్మ. ఆ రోజు రాధన్నయ్య J.M చేరిన రోజుట. పూజ చేసుకుందామని వచ్చాడు. ఇద్దరం కలసి కీర్తన మొదలుపెట్టాము. ఒకదాని తరువాత ఒకటి కీర్తనలు. సాగిపోయినవి. రాధన్నయ్య అమ్మ నామమే సంగీతంలోకి తీసుకెళ్ళి తనతో నన్నూ తీసుకుపోయారు. భావ తీవ్రతతో ఇద్దరం వెక్కివెక్కి ఏడుస్తూ అలసిపోయి ఆపాము. ఈ ఘటన నా జీవికకు అమృతధార.
81 ఫిబ్రవరిలో నాన్నగారు ఆలయం ప్రవేశం, నా తిరుపతి ప్రయాణం. సంగీతమపి సాహిత్యం సరస్వత్యాఃస్తనద్వయం.
కానీ ఇదీ అమ్మ నాకు అందించిన అమృత జీవనధార.
“ఏ మమ్మా! నీ మాయ సామ గానప్రియా!
సదయా! అనసూయా!
చదువు లేదంటావు – చదువు రాదంటావు.
చదువులో సారాలు- చాటి చెబుతుంటావు.
చదివినా మానినా సారస్వతివి నీవె
ఎద చీకటులు బాపే చదువు కోసము తల్లీ
ఏమమ్మా! నీ మాయ సామగానప్రియా !
సదయా! అనసూయా!
(నూతలపాటి నరసింహారావుగారు నేర్పిన పాట)*