71 వ గణతంత్ర దినోత్సవ వేడుకలు 26.01.2020 ఆదివారం ఉదయం మాతృశ్రీ ఓరియంటల్ కళాశాల, జిల్లెళ్ళమూడిలో కన్నుల పండుగగా జరిగాయి. ఈ ఉత్సవాలకు ముఖ్య అతిథులుగా విచ్చేసిన విశ్వజననీ పరిషత్ అధ్యక్షులు శ్రీ యం. దినకర్ గారినీ, మాజీ కరస్పాండెంట్ శ్రీ యం. శరచ్చంద్రగారినీ మరియు సంస్థ పెద్దలు వై.వి. శ్రీరామ్మూర్తిగారిని కళాశాల విద్యార్థులు ప్రధానద్వారం (Main Gate) దగ్గర నుండి ప్రిన్సిపాల్ డా. వి. హనుమంతయ్య గారు మార్చ్ పాస్ట్ తో ఆహ్వానించారు. పతాకావిష్కరణానంతరం ముఖ్య అతిథి శ్రీ యం. దినకర్ గారు విద్యార్థులనుద్దేశించి ప్రసంగించారు. రాజ్యాంగపరమైన అంశాలతో పాటు ఆర్థిక, సామాజిక అంశాలను కూలంకషంగా ప్రస్తావించి దేశంపట్ల యువత బాధ్యతలను గుర్తు చేశారు. ప్రిన్సిపాల్ అధ్యక్షభాషణం చేస్తూ దేశాభివృద్ధికి సమాజరుగ్మతలు అడ్డు రాకుండా ప్రతి ఒక్కరూ అభివృద్ధిలో దూసుకుపోయేలాగా కావలసిన జ్ఞానము, ఆరోగ్యము, సత్ప్రవర్తన అమ్మ ఆశీస్సులతో మనకందరకీ కలుగుతుందని విశ్వసించారు.
దేశమంతా Constitution Day ఉత్సవాలను జరుపుకుంటున్న సందర్భంగా మాతృశ్రీ ఓరియంటల్ కళాశాలలో భారత రాజ్యాంగ నిర్మాత డా.బి.ఆర్. అంబేద్కర్ గారి చిత్రపటాన్ని పూలమాలలతో అలంకరించారు.
కళాశాల చరిత్ర అధ్యాపకులు జి. రాంబాబుగారు రాజ్యాంగం ఆమోదం పొందడానికి ముందు ఆ తరువాత జరిగిన మార్పులను విపులంగా తెలియజేశారు. ఈ సందర్భంగా పాఠశాల ప్రధానోపాధ్యాయులు కె. ప్రేమకుమార్ గారు, అధ్యాపకులు యల్. మృదుల మరియు వాహిని గార్లు విద్యార్థులనుద్దేశించి ప్రసంగించారు. కళాశాల విద్యార్థినీ విద్యార్థులు తమ దేశభక్తిని అనేక సాంస్కృతిక కార్యక్రమాలతో చాటి చెప్పారు. పద్యధారణ, గీతాలాపన, నృత్యప్రదర్శనలతో అందరినీ అలరించారు.
ఇదే వేదికపై కళాశాల, పాఠశాల మరియు వేదవిద్యార్థులకు ప్రతియేడాది వలెనే అమ్మభక్తులైన శ్రీ తంగిరాల కేశవశర్మగారి జ్ఞాపకార్థం వారి కుటుంబం తరపున వారి కుమార్తె హైమక్కయ్య నగదు బహుమతులను అందజేశారు. విద్యార్థినీ విద్యార్థులు ఎంతో ఉత్సాహంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం గమనించిన హైమక్కయ్య అప్పటికప్పడు స్పందించి దేశభక్తిగీతాన్ని ఆలపించిన విద్యార్థులకు ప్రత్యేక బహుమతిని అందజేశారు.