“యుక్తాహార విహారస్య యుక్త చేష్టస్య కర్మసు | యుక్తస్వప్నావ బోధస్య యోగోభవతి దుఃఖహా”|| అని భగవద్గీత ప్రపంచానికి తెలియజేశారు. మానవీయ విలువలను పెంపొందించే దిశగా గీతా జయంతిని పురస్కరించుకొని ది. 12, ఆగష్టు, 2019న విశ్వజననీ పరిషత్ మరియు మాతృశ్రీ ప్రాచ్య కళాశాల ఆధ్వర్యంలో కళాశాల కరస్పాండెంట్ శ్రీ జి.వి.యన్.బాబుగారు మరియు ప్రిన్సిపాల్ డా.వి. హనుమంతయ్యగారు అన్నపూర్ణాలయం వద్ద సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సభలో ఎమ్. దినకర్ గారు పాల్గొన్నారు. కళాశాలను ఒక ఉన్నతమైన లక్ష్యంతో అమ్మ స్థాపించిందని ఆ లక్ష్యానికి అనుగుణంగా ఇక్కడ విద్య, భోజన, వైద్య సంరక్షణ సదుపాయాలు కొనసాగుతున్నాయని రామబ్రహ్మం గారు తెలియజెప్పారు. సంస్థ ప్రెసిడెంట్ యమ్. దినకర్ గారు మాట్లాడుతూ భగవద్గీత మానవతా.. విలువలను పెంపొందించే ఒక అద్భుతమైన గ్రంథమని పలు ఉదాహరణలతో సవివరంగా తెలియజెప్పారు. కళాశాల పక్షాన డా॥ సుధామవంశి, డా॥ కె.వి.కోటయ్య, డా॥ ఎ.హనుమత్ ప్రసాద్ లు భగవద్గీత ప్రాశస్త్యాన్ని విద్యార్ధులకు వివరించారు. సంస్కృత, ఆంధ్ర, ఆంగ్లములతో విద్యార్థులు తమకు తెలిసిన విషయాలను చక్కగా చెప్పారు. ఈ కార్యక్రమాన్ని తెలుగు అధ్యాపకులు పి. మధుసూదన్ గారు నిర్వహించారు. సంస్కృత ఆంధ్రాలను అభ్యసిస్తున్న మనమందరం సంస్కృతిని, భగవద్గీతలోని అంతర్యాన్ని భావితరాలకు వ్యాపింపజేయాలని రామబ్రహ్మంగారు పిలుపునిచ్చారు. శాంతి మంత్రంతో ఈ కార్యక్రమం ముగిసింది.
సంస్కృతాన్ని పరిరక్షించండి
సంస్కృత భాషను దశదిశలా వ్యాపింపజేయాలని, అందుకు సంస్కృతాన్ని అధ్యయనం చేసే మనమంతా. కృషిచేయాలని, ‘సంస్కృత భారతి’ ప్రాంత అధ్యక్షులైన శ్రీ దోర్బల ప్రభాకరశర్మగారు పిలుపునిచ్చారు. 2.12.2019 సోమవారం మాతృశ్రీ ఓరియంటల్ కళాశాల జిల్లెళ్ళమూడిలో జరిగిన సభలో సంస్కృతభాషా ప్రాశస్త్యం గురించి విద్యార్ధులనుద్దేశించి ప్రసంగించారు. కళాశాల ప్రిన్సిపల్ డా॥ వి. హనుమంతయ్య గారి అధ్యక్షతన జరిగిన ఈ సభలో వారు మాట్లాడుతూ, ప్రతి ఒక్కరూ సంస్కృతంలో మాట్లాడాలని కోరారు. ఒక్కొక్క విద్యార్ధి ఐదుగురికి సంస్కృతం నేర్పుతూ అలా గ్రామంలోని వారందరిచేత సంస్కృతంలో మాట్లాడించాలని తద్వారా జిల్లెళ్ళమూడిని ‘అర్కపురి’ అని పిలిచేలా చేయాలనీ, పిలుపునిచ్చారు. అందుకు తమ సహాయ సహకారాలను అందించాలని డా॥ హనుమంతయ్య గారిని ఈ కార్యక్రమంలో కోరారు. సంస్కృత విభాగంలోని విద్యార్థులు పాల్గొన్నారు.
కళాశాల మరియు పాఠశాల విద్యార్థులకు అల్పాహార పంపిణీ ప్రారంభం
“ఆకలే అర్హత”గా అన్నం పెట్టమన్న విశ్వజననీ అమ్మ ఆశయాలకు అనుగుణంగా కళాశాల మరియు పాఠశాల విద్యార్థినీ విద్యార్థులకు సాయంత్రం వేళ అల్పాహార పంపిణీ కార్యక్రమాన్ని 12.12.2019 గురువారం నుండి కళాశాలలో ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి అమ్మ ఆశీస్సులతో మరియు సంస్థవారి సహాయ సహకారాలతో నిర్విరామంగా కొనసాగాలని కళాశాల ప్రిన్సిపాల్ డా॥ వి.హనుమంతయ్య ఆశించారు. ప్రిన్సిపాల్ గారు నూతనంగా చేపట్టిన ఈ కార్యక్రమానికి స్పందిస్తూ కొంతమంది కళాశాల పూర్వ విద్యార్థి సంఘం తరపున వారి సహకారాన్ని అందిస్తామని మాట ఇస్తూ తొలుతగా రూ. 2000/ నగదును ప్రిన్సిపాల్ గారికి అందజేశారు.
HEALTH IS WEALTH AN AWARENESS CAMP
“ఆరోగ్యమే మహాభాగ్యం” అను నానుడిని విద్యార్థులలో అవగాహన కలిగించి, దైనందిన జీవితంలో ఆరోగ్యసూత్రాలను పాటిస్తూ మంచి శారీరక మానసిక ఆనందంతో ఎదగాలని ప్రముఖ మానసిక వైద్యనిపుణులు డా॥ జి.పద్మజ గారు సోదాహరణంగా తెలియజేసారు. విద్యార్థులతో మమేకమై వారి సమస్యలను తెలుసుకొని పరిష్కారాలను సూచించారు.
డా॥ వి.హనుమంతయ్య గారికి పూర్వ విద్యార్థి సంఘం తరపున స్వాగత సన్మానం
నెల్లూరు వేద సంస్కృత కళాశాల నుంచి మాతృశ్రీ ఓరియంటలే కళాశాల ప్రిన్సిపాల్గా నూతనంగా బాధ్యతలు స్వీకరించిన డా॥ వి. హనుమంతయ్య గారిని 19-12-19న “పూర్వ విద్యార్థి సమితి” తరపున ప్రార్ధనా మందిరంలో అధ్యాపకులు మరియు విద్యార్థులు సమక్షంలో ఘనంగా స్వాగత సన్మాన కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా ప్రిన్సిపాల్ గారు మాట్లాడుతూ అమ్మ ఆశీస్సులతో, గురువుల క్రమశిక్షణలో విద్యాధికులై దశదిశలా వ్యాపించి అమ్మ తత్త్వ సుగంధాన్ని విశ్వవ్యాప్తం చేస్తున్న (అ) పూర్వ విద్యార్థులు మాతృసంస్థలకు మూలస్థంభాలు లాంటివారని కొనియాడారు.
అమరజీవికి ఘన నివాళులు
ఆంధ్రరాష్ట్ర అవతరణకు ప్రాణాలు సైతం లెక్కచేయక అమరజీవి శ్రీ పొట్టి శ్రీరాములు గారి వర్ధంతి సందర్భంగా 15.12.19 ఆదివారం మాతృశ్రీ ఓరియంటల్ కళాశాలలో సభను ఏర్పాటు చేశారు. ఈ సభలో కళాశాల ప్రిన్సిపాల్ డా॥ వి. హనుమంతయ్య గారు మాట్లాడుతూ అంతరాలు లేని జీవితం అందరికీ అందాలని కలలుకన్న ప్రాణత్యాగి పొట్టి శ్రీరాములు గారని తెలియజేశారు. లక్షమందిని ఏక పంక్తిన భోజనం చేస్తే చూడాలనుకున్న అమ్మ ఆశయం మహాద్భుతమైనదని ఈ సందర్భంగా వారు గుర్తుచేసుకున్నారు. విశ్రాంత ప్రిన్సిపల్ గారు డా॥ బి.ఎల్.సుగుణ, అధ్యాపకులు డా॥ కె.వి.కోటయ్యగారు భక్తిప్రపత్తులతో శ్రీరాములుగారి చిత్రపటానికి పూలమాలను వేసి నివాళులు అర్పించారు. కార్యక్రమంలో అధ్యాపకులు, అధ్యాపకేతర సిబ్బంది, విద్యార్ధులు పాల్గొన్నారు.
మాతృశ్రీ ఓరియంటల్ కళాశాలలో మానవతా విలువలు
చేతికి గాయమైన కారణంగా అన్నం తినలేని అభిలాష్ (8వ తరగతి) కి గత కొద్ది వారాలుగా హనుమాన్ (బి.ఏ మొదటి సం॥) విద్యార్థి ఆప్యాయంగా నోట్లో ముద్దను పెట్టి తినిపిస్తున్న సన్నివేశం ‘ఆకలిగావున్న వారికి అన్నం పెట్టమన్న’ అమ్మ మూల సిద్ధాంతానికి ఈ చిత్రం నిదర్శనం. ఇలాంటి దృశ్యాలు మానవతా విలువలకు అద్దం పట్టేవనేకం జిల్లెళ్ళమూడిలో దర్శనమిస్తుంటాయి.
పోటీ ప్రపంచం-పరుగుల విజ్ఞానం
ప్రపంచీకరణంలో పరుగులు తీస్తున యువత అన్ని రంగాలలో జ్ఞానాన్ని సంపాదించాలని ప్రతి సంవత్సరం. డిసెంబర్ నెలలో మాతృశ్రీ ఓరియంటల్ కళాశాలలో క్విజ్ పోటీలను నిర్వహిస్తున్నారు. విద్యార్థులలో దాగివున్న విద్యుత్ కాంతులను ప్రశ్నల ద్వారా బహిర్గతం చేసి వారిని పోటీ ప్రపంచంలో ముందు వరుసలో ఉండేలాగా చేయాలని ఈ సందర్భంగా ప్రిన్సిపాల్ డా॥ వి.హనుమంతయ్య గారు పిలుపునిచ్చారు. ఈ క్విజ్ పోటీలను 20.12.19 వ తేది శుక్రవారం ప్రిన్సిపాల్ గారు ప్రారంభించగా అధ్యాపకులు దానిని కొనసాగించారు. కార్యక్రమం చివరన విజేతలను ప్రకటించారు.
వనం – మనం
ఈ రోజు అనగా డిసెంబర్ 9 వ తేదిన మాతృశ్రీ ఓరియంటల్ కళాశాలలో ‘వనం ‘మనం’ కార్యక్రమం కింద ప్రిన్సిపాల్ డా. వి.హనుమంతయ్యగారి పర్యవేక్షణలో జరిగిన కార్యక్రమంలో కళాశాల అధ్యాపకులు విద్యార్ధులు పాల్గొన్నారు. చెట్లను పెంచితే పర్యావరణ పరిరక్షణతో పాటు సహజ పరిరక్షణ కూడా జరుగుతుందని హనుమంతయ్య గారు వివరించారు. ఈ సందర్భంగా అధ్యాపకులు, విద్యార్థులు అందరూ కలిసి కళాశాల విశాలమైన ప్రాంగణంలో మొక్కలు నాటి విద్యార్థులను ఉత్సాహపరిచారు.
కార్తీక వనమహోత్సవము
కార్తీక వనమహోత్సవము సందర్భంగా నవంబరు 26-11-2019న మాతృశ్రీ ఓరియంటల్ కళాశాల ప్రాంగణంలో ప్రత్యేక పూజా కార్యక్రమం జరిగింది. పరస్పర సహకారం, మైత్రీ భావములను పెంపొందించే విధంగా ఉండాలని ఈ కార్యక్రమం చేపట్టినట్లు, కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ ఎ. సుధామవంశీ పేర్కొన్నారు. ఈ కార్యక్రమానికి సంస్థ పెద్దలు అడవుల దీవి మధు అన్నయ్యగారు, వై.వి.శ్రీరామమూర్తిగారు, దేశిరాజు కామరాజు గారు, చక్కా శ్రీమన్నారాయణ గారు, ఎమ్. శరశ్చంద్రగారు, బూదరాజు శ్యామ్ దంపతులు, మన్నవ నరసింహారావు గారు పలువురు కళాశాలకు విచ్చేశారు. అమ్మ చిత్రపటానికి పుష్పాలు అలంకరించి, నమస్కృతులు సమర్పించారు. విద్యార్థులను నిరంతరం అధ్యయనం చేసి ఉత్తమ ఫలితాలను సాధించాలని పెద్దలు తెలియజేశారు. కళాశాల అధ్యాపకులు, అధ్యాపకేతర సిబ్బంది అందరూ ఈ కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేశారు.
హైదరాబాద్ లో “అమ్మ” స్టాల్ ప్రారంభం
7.1.2020 న హైదరాబాద్ లో నాంపల్లి వద్ద All India Industrial Exhibition లో “అమ్మ” Stall ప్రారంభమగును. Stall రోజూ సా|| గం. 6.00 నుండి గం.8.30/గం. 9.00 వరకు 40 రోజులపాటు నిర్వహించబడును. అమ్మ తీర్థ ప్రసాదములు, అమ్మ సాహిత్యము, అమ్మ సినిమా C.D లు, అమ్మ డైరీలు, అమ్మ కాలెండర్లు లభించును. Stall నిర్వహణకు నలుగురైదుగురు స్వచ్ఛంద సేవా తత్పరులు కావలెను. పూలు, దండలు, పులిహోర ప్రసాదం మున్నగు వానికి రోజుకి రూ. 1000/- లు ఖర్చు అగును. Stall నిర్వహణకోసం సోదరీసోదరులు తమ సహాయ సహకారములందింప విజ్ఞప్తి చేస్తున్నాము. కనీసం 10 రోజులు పాల్గొనే ఆసక్తిగల స్వచ్ఛందసేవకులకు Free Entry Pass లభించును. వివరములకు సంప్రదించండి: 94412 62927, 9492925315.
– జిల్లెళ్ళమూడి అమ్మ సేవా సమితి, హైదరాబాద్.