(గత సంచిక తరువాయి)
“ఇదుగో. నిన్ను ఈ గండం నుంచి గట్టెక్కిస్తున్నాను. ఈ నీ నిస్సహాయస్థితిలోంచి నేను నిన్ను ఆదుకొని కొత్త జీవితాన్ని శక్తిని ఇస్తున్నాను. మళ్ళీ ప్రాణం పోస్తున్నాను” అంటూ అమ్మ ఉద్ధరిస్తుంది. ప్రత్యక్షంగా ప్రకటిస్తుంది తత్త్వతః. అందుకు కొన్ని ఉదాహరణలు.
1) 1956 సంవత్సరము దేవీ నవరాత్రులకి జిల్లెళ్ళమూడిలో ఉన్నారు రాజుబావ. వారితో అమ్మ “నాన్నా! పూజ చేసుకుందువు గాని, డ్రైస్కి వెళ్ళి స్నానం చేసిరా” అన్నది. అప్పట్లో రాజుబావకి తల తడిపితే ఉబ్బసం వచ్చేది. కనుకనే, “నేను తలమీద స్నానం చెయ్యనమ్మా. చేస్తే నాకు ఉబ్బసం వస్తుంది. ఆయాసం వస్తుంది. తల తడపను. వేడినీళ్ళతో ఒంటిమీదే స్నానం చేస్తాను” అన్నారు.
“నువ్వు అన్నింటికీ ఏదో మనస్సులో పెట్టుకుంటావురా. అదేమీ ఉండదు. వెళ్ళిరా. నేను చెబుతున్నాను కదా! వెళ్ళి స్నానం చేసిరా. మూడు మునకలు వేసిరా పో” అన్నది. అది అమ్మ ఆజ్ఞ. రాజుబావ స్నానం చేసి వచ్చారు. ఆయాసం కానీ ఉబ్బసం కానీ రాలేదు. ఆశ్చర్యం. నాటి నుంచి ఆయన ఊపిరి ఉన్నన్నాళ్ళూ స్నానం అంటే తలమీద చేసేవారు 100 – డిగ్రీలు జ్వరం ఉన్నా సరే. స్నానం అంటే తలమీదే. “అమ్మ చర్యలు, అమ్మ అనుగ్రహం సర్వదా అగ్రాహ్యములు” అని అంటారు ఆయన.
వారికి అమ్మ ఏ ఔషధం ఇవ్వలేదు. తాయెత్తు కట్టలేదు, కంటికి కనిపించే పదార్థ రూప ప్రసాదాన్ని పెట్టలేదు. కేవలం నోటి మాట. అదీ సాధికారికంగా చెపుతోంది. “నేను చెపుతున్నాను కదా! వెళ్ళి స్నానం చేసిరా. అదేమీ (ఉబ్బసం– ఆయసం) ఉండదు” అన్నది.
అంతే. అమ్మ మాటే శాసనమా? విధికి అవశ్యం అనుసరణీయమా? అమ్మ అన్నదల్లా అవుతుందా? ఆఁ అయితీరుతుంది. మరి మనం అనేవి, అనుకునేవి. జరగటంలేదే! అమ్మ ఒక వ్యక్తి కాదు, మహాశక్తి. అనంతశక్తి పరిమితరూపంలో మనవలె కనిపిస్తోంది, అనిపిస్తోంది. “అదేమీ ఉండదు” అనే ఒక్కమాటతో రాజుబావని పట్టి పీడిస్తున్న ఉబ్బసం – ఆయాసం రోగాల్ని సమూలంగా నిర్మూలించింది. అది ఒక విధంగా వైద్యశాస్త్రానికి సవాలు అంతుపట్టనిది. అమ్మ అ లౌకికశక్తికి ఒక ఉదాహరణ. ఎంత ధీమాగా అన్నది. “అదేమీ ఉండదు” అని ! ‘ఋషీనాం పునరాద్యానాం వాచమర్థ నుధావతి’ – అంటారు. అవతారమూర్తులు సిద్ధపురుషులు, అద్వైతమూర్తుల ముఖతః ఏ పలుకు వస్తుందా అని సృష్టి కార్యకలాపాలు ఎదురు చూస్తుంటాయి. దానిని తక్షణం ఒక Ordinance గా జి.ఒ.గా అమలు చేస్తాయి. వారిమాటల్ని అర్థం అనుసరిస్తుంది అంటారు. ఒక్క మాటలో చెప్పాలంటే వారి మాటలు తక్షణం సాకారమౌతాయి – అని.
‘ఆశీర్వదించమ్మా!’ అని అడిగితే అమ్మ “అది ఎప్పుడూ ఉన్నది” అంటుంది. ఆ పరదేవతే మన అమ్మ, మన అమ్మే ఆ పరదేవత. ఇక మనం అడగాల్సిన అవసరం లేదు కదా!
2) తన బాల్యంలో అమ్మ చిదంబరరావు తాతగారితో కలిసి సప్తాహం జరుగుతున్న ప్రదేశానికి వెళ్ళింది. అక్కడి వారితో కలిసి మెల్లగా పాడుతూ ఉంటుంది. చిదంబరరావుగారి స్నేహితులు ప్లీడర్లు చాలామంది వస్తారు.
ఆ సమయంలో పీసపాటి సీతారామయ్య గారనే ప్లీడర్ గుమాస్తా వస్తారు. వారు మానసిక వ్యాధి పీడితులు. “ఆయన పిచ్చివాడమ్మా” ఆయన్ను నువ్వేమీ పలుకరించ బోకు” అన్నారు తాతగారు. “నే పలకరిస్తే ఎక్కువవు తుందా? తగ్గిపోతుందా?” అని అడిగింది అమ్మ.
అమ్మ సర్వజ్ఞత్వ సర్వశక్తిమత్వాలలో విశ్వాసం గల తాతగారు “నీవు ఏదనుకుంటే అది అవుతుంది” అన్నారు. యదార్థం పలికారాయన. “నీవు తల్చుకుంటే క్షణంలో అయిపోతుంది” – అంటూ అమ్మ మహత్వాన్ని శ్లాఘించారు. ఆ మాటల్ని నిజం చేయ సంకల్పించింది అమ్మ.
అంతలో సీతారామయ్యగారు దగ్గరకు వస్తారు. వారి నుద్దేశించి అమ్మ “ఏం బాబూ! కోర్టుకు వెళ్ళలా” అని అడిగింది. ఆయన మామూలుగా ఏదో పిచ్చి ధోరణిలో మాట్లాడారు.
అప్పుడు ఒక అద్భుతం జరిగింది. వారిపై అమ్మ కృపావృష్టి కురిసింది. కనుకనే అమ్మ వారిని సమీపించి వారి పొట్టమీద చెయ్యి వేసి “ఏం బాబూ భోం చేశారా?” అని అడిగింది. సీతారామయ్య “చేశానమ్మా” అన్నారు. సరళంగా, సూటిగా, స్పష్టంగా, వారు తడుము కోకుండా తత్తరపాటు లేకుండా శాంతిచిత్తులై స్వాంతచిత్తులై అలా సమాధానం ఇచ్చేసరికి చిదంబరరావుగార్కి ఒళ్ళు జలదరించింది.
అమ్మ పావన కరస్పర్శ మాత్రం చేతనే సీతారామయ్య గారిలో ఎంతో మార్పు తెచ్చింది – కేవలం రెప్పపాటుకాలంలో. ఇది ఒక వైద్య విధానం కాదు. ఒక దివ్యశక్తి ప్రభావం – అద్భుతం. మరొకచిత్రం. సీతారామయ్య గారు అమ్మ పాదాలమీద పడి నమస్కారం చేశారు. వారి పిచ్చి పూర్తిగా నయమైంది. ఘటనాఘటన సమర్ధ కదా అమ్మ.
చిదంబరరావు గారు “ఏం కనిపించి నమస్కారం చేశావు సీతారాముడూ?” అని ఆయన్ను అడిగారు. “మా ఇలవేల్పు కుమారస్వామిలా కనబడ్డది” అన్నారాయన. “వచ్చేటప్పుడు ఎలా వచ్చానో తెలియదు గాని ఇప్పుడు నా తలలోంచి బరువు తీసివేసినట్టు ఉంది” అంటూ అక్కడున్న అమ్మ వైపు చూశారు. “ఇంత చిన్నపిల్ల ఎవరు?” అంటూ అమ్మను ఎత్తుకుని ముద్దుపెట్టుకున్నారు. అందుకు తాతగారు “నువ్వు ఇందాకటి నుంచి మాట్లాడింది ఈ చిన్నపిల్లతో కాదట్రా?” తిరగవేసి ప్రశ్నించారు. అందుకు సీతారామయ్య గారు “ఈ పిల్లకాదు. ఎక్కడా పోలిక లేకపోతే!” అన్నారు.
సీతారామయ్య గారి ఇలవేలుపు కుమారస్వామి రూపంలో కనిపించింది ఆయనకు. ఆ రూపంలో ఆయన జబ్బుని రూపుమాపింది. “నువ్వు ఏదనుకుంటే అది అవుతుందమ్మా” అనీ,
“నీవు తలచుకుంటే ఈ క్షణంలో అయిపోతుంది” అనీ చిదంబరరావు గారు వెలిబుచ్చిన విశ్వాసాన్ని నిజం చేసింది అమ్మ. ఇదంతా అమ్మ కృపా విశేషం. ముందే చెప్పింది. అమ్మకి దాపరికం లేదు. “నేను పలకరిస్తే తగ్గుతుందా?” అని అడిగింది. అ లాగే జరిగింది. అలా విధి విధానాన్ని శాసించింది అమ్మ. అమ్మ కనికరించకపోతే ఆయన చిత్తచాంచల్యంతో ఎన్నాళ్ళు ఎన్నేళ్ళు అవస్థపడేవారో!
1) “లోచూపు”, శ్రీ మన్నవ బుచ్చిరాజు శర్మ, పేజి 9
2) “అమ్మ జీవిత మహోదధి”, విశ్వజనని ట్రస్టు, పేజి 454..*** – (సశేషం)