(గత సంచిక తరువాయి)
“నువ్వు ఎంతగా చేస్తున్నానని నీకనిపించినా ఆ శక్తి అనుకోనిదీ చేయించనిదీ నువ్వు అనుకోలేవు చేయలేవు” అని జగన్మాత సార్వభౌమాధికార విశేషాన్ని సరళంగా సూటిగా స్పష్టంగా చెప్పింది అమ్మ. తన ప్రమేయం వల్లనే సంభవించినట్లు ఒక్కొక్కసారి బాహాటంగా చాటి చెబుతుంది. ఒక ఉదాహరణ –
ఒకనాడు. అమ్మ పడుకుని విశ్రాంతి తీసు కుంటోంది. వెలుపల వరండాలోంచి రెడ్డి సుబ్బయ్య ‘అమ్మా! నిన్ను నేను చూడాలనుకుంటున్నాను’ అన్నాడు. అందుకు అమ్మ “బయటి నుంచీ చూడగలవు” అన్నది. ‘ఎలా చూడగలనమ్మా?’ అని ప్రశ్నించాడు సుబ్బయ్య. “నేను చెపుతున్నాను కనుక నువ్వు చూడగలవు” అన్నది అమ్మ.
ఒక్కొక్కసారి మాయతెరను అడ్డువేస్తుంది. అమ్మ దయ ఉంటే తెరతొలగి వాస్తవం (అమ్మ చేయూత) సుబోధకం అవుతుంది. ఇందుకు రెండు ఉదాహరణలు-
1) శ్రీమతి బెండపూడి రుక్మిణక్కయ్య అనుభవం అలౌకికం దురవగ్రాహ్యం. ఆమెకు సంతాన యోగం లేదని వైద్యులు ధృవీకరించారు. కాగా ఆమె ఏనాడూ సంతాన భిక్ష పెట్టమని అమ్మని అభ్యర్థించలేదు. అవసరమనుకుంటే అమ్మే ప్రసాదిస్తుందని ఆమె విశ్వాసం; అది వాంఛనీయము శ్లాఘనీయము.
వైద్యశాస్త్రానికి సవాలు అన్నట్లు ఆమె గర్భవతి అయ్యింది. అమ్మ ఆజ్ఞ అప్రతిహతమైనది, అమోఘమైనది కదా! సుఖప్రసవం కావటం అసంభవమని వైద్యులు నొక్కి వక్కాణించారు. పాపం ! వాళ్ళ శక్తి, తెలివి, సామర్థ్యం పరిమితం కదా!
నెలలు నిండాయి. కదలటానికి వీలులేదని చెప్తున్నా. ఏమైనా సరే – ఒక్కసారి అమ్మను దర్శించు కోవాలన్నది. ఆమెను టాక్సీలో జిల్లెళ్ళమూడి తీసుకు వచ్చారు. ఆ రాత్రే నొప్పులు ఆరంభమైనాయి.
1965 ఫిబ్రవరి 24న రుక్మిణక్కయ్య సుఖప్రసవమై మగబిడ్డకు జన్మనిచ్చింది. రెండవ బిడ్డ తన గర్భంలోనే ఉన్నది. టాక్సీలో బాపట్ల తీసుకుని వెళ్ళి ఆస్పత్రిలో చేర్పించారు. డాక్టర్లు దిగ్భ్రాంతి చెందారు. ‘రెండవ శిశువు గర్భంలోనే మరణించి కొన్ని రోజులైందట. మొదటి కాన్పు ఎలా జరిగింది? తల్లీ బిడ్డా ఎలా బ్రతికి ఉన్నారు ఆ స్థితిలో?’ అని.
అమ్మ అనుగ్రహపాత్రురాలైన అక్కయ్యకు ప్రమాదమూ అశుభమూ ఎందుకుంటాయి? అసలు సంగతి అసలు (అమ్మ)కే తెలుసు. అక్కయ్య అసలు ప్రసవవేదన అనుభవిస్తే కదా తెలియటానికి? నాటి రాత్రి అమ్మ విపరీతమైన బాధ ననుభవించింది – తన బిడ్డ కోసం మమకార బంధం, మహిమ, మాధురి అది. అవతార మూర్తులలో ఇట్టి ఆర్ద్రత్రాణ పరాయణత్వం స్పష్టంగా గోచరిస్తుంది. ఒకరు అమ్మను ప్రశ్నించారు. “అలా అంత బాధను అమ్మా! ఎందుకు అనుభవించాలి?” అని.
“అక్కడ ఆ బాధను తీసివేయగలదానను నేను మాత్రం ఎందుకు అనుభవించాలి?” అంటూ అమ్మ చిరునవ్వు చిందిస్తూ ఎదురు ప్రశ్న వేసింది; మాయా మానుషవేష.
2) 1975 డిసెంబరు 30వ తేదీ. అర్ధరాత్రి. అందరింటిపై నక్సలైట్లు దాడి చేశారు. దౌర్జన్యంగా తలుపులు పగులగొట్టి లోనికి చొచ్చుకుని వచ్చి దుర్భాషలాడుతూ గోపాలన్నయ్యపైకి ఒకడు బరిసె ఎత్తాడు. అన్నయ్య చెయ్యి పైకి ఎత్తి ‘అమ్మా!’ అని కెవ్వున కేకవేశాడు. ‘మీ అమ్మా గిమ్మా నిన్ను రక్షించే వారెవరూ లేరు. నువ్వు నా చేతుల్లో చస్తున్నావు’ అంటూ బరిసె విసిరాడు. అది అన్నయ్య చేతివ్రేలున ఉన్న ఉంగరాన్ని, అరచేతిని, చొక్కాను చీల్చుకుని నేలను తాకింది. అంతే. అమ్మ అవ్యక్తంగా సుదర్శన చక్రాన్ని అడ్డువేసింది. ఆ దుండగుని దృష్టి ఉంగరం మీద పడింది. ‘ఆ ఉంగరం ఇవ్వరా’ అని అరిచాడు. ఉంగరం ఇస్తుంటే వాడి దృష్టి చేతి గడియారంపై పడి, అమ్మని లాక్కున్నాడు. నగదు, నగలు ఉన్న గదిలోని బీరువా తాళాలు ఇమ్మని అడిగారు. అన్నయ్య తనకు తెలియదన్నాడు.
‘పొడవండిరా’ అన్నాడొకడు. బుసలు కొడుతూ బరిసెలు అన్నయ్య మీదికి లేచాయి. మళ్ళీ అమ్మ రక్షక కవచాన్ని కప్పింది. ‘వాడిని పొడిచేదేమున్నది? ఆ బీరువా బద్దలు గొట్టండి’ అన్నాడొకడు. బీరువా పగులగొట్టి నగలు దోచుకుని వెళ్ళిపోయారు. ఆ తర్వాత స్థితి మరింత హృదయ విదారకం, ఆత్మార్పణ విధానం. ఆ ముష్కరులు హైమాలయంకు పోయి హుండీ పగులగొట్టి సొమ్ము కాజేసి తమ వాహనంపై నిష్క్రమించారు.
ఈ వైనం తెలియని గోపాలన్నయ్య ఒక్కడూ వరండాలో కూర్చొని ఇలా ఆలోచించాడు. ‘వాళ్ళ దోపిడీ నేరానికి నేను మాత్రమే సాక్షిని. నేను ఇక్కడే ఉంటే సరి. వాళ్ళు నన్ను చంపే పోతారు. నేను ఇక్కడ లేకపోతే వాళ్ళు వచ్చి నన్ను వెతుక్కుంటూ అమ్మ గది మీద దాడి చెయ్యొచ్చు’ అని తన ప్రాణాల్ని తృణప్రాయంగా ఎంచి బరిసెల పోట్లకి గురికావటానికి సిద్ధంగా ఉన్నాడు.
కొంతసేపటికి సద్దుమణిగింది. డాక్టర్ కోన సత్యం అన్నయ్య వరండాలోకి వచ్చి అన్నయ్యను లోపలకి తీసుకు వెళ్ళాడు. అక్కడ అమ్మ ఉన్నది. గోపాల్ అన్నయ్యను చూడగానే “నాన్నా! నువ్వు వేసిన కేక నాకు వినబడ్డది. నేను వద్దామనుకున్నాను. వీళ్ళు నా రెండు కాళ్ళు పట్టుకుని వదలలేదు” అన్నది. అందుకు అన్నయ్య ‘అమ్మా! నువ్వు రాకపోతే నేమి? నేను రక్షించబడ్డాను కదా! నీ సొమ్ముని నగల్ని రక్షించలేక పోయాను. నా కళ్ళముందే వాళ్ళు దోచుకుని పోయారు” అని దుఃఖించాడు. అందుకు అమ్మ “నాన్నా! డబ్బు పోతే మళ్ళీ వస్తుంది. బిడ్డపోతే తేగలమా?” అని అన్నయ్య క్షేమంగా ఉన్నందుకు సంతోషించింది.
ఆ విధంగా అన్నయ్య మృత్యువును జయించటంలో అమ్మ రక్షణ పూర్తిగా ఉన్నది. విధి విధానాన్ని తిరగ రాసింది. ఎలా? ఆ దుండగుల దృష్టి ఉంగరం, వాచీ, నగలు, నగదు మీదికి తిప్పింది. ఆ ముష్కరులకు కావలసిన సొమ్ము వాళ్ళకి అందించింది, తనకు కావలసిన బంగారు కొండను తాను దక్కించుకున్నది.
ఇది అమ్మ విధానం, మహత్వం, మహిమాన్వితరీతి. ***
– (సశేషం)