ఒక సంవత్సరం వినాయక చవితికి జిల్లెళ్ళమూడి వెళ్ళాను. ఒక పెద్ద బుట్టనిండా చామంతి పూలు, బెంగుళూరు నుంచి తీసుకెళ్ళాను. అమ్మకు పూజ చేసుకొన్నాక ఇద్దరు మన విద్యార్థులు అక్కడకు వచ్చారు. బుట్టలో ఉన్న కొంచమే ఉన్న పూలు వాళ్ళకి ఇచ్చాను. వాళ్ళు సంతోషంగా అవి అమ్మ పాదాలపై వేసి దణ్ణం పెట్టుకొని వెళ్ళిపోయారు. ఆ తరువాత ఇంకో ముగ్గురు వచ్చారు. వాళ్ళకీ ఇచ్చాను. ఇంతలో చూద్దును కదా దాదాపుగా 50 మంది స్టూడెంట్సు వచ్చేసి ఆతృతగా ఒకళ్ళ తరువాత ఒకళ్ళు వెంటవెంటనే రావడం, పూలకోసం తమ దోసిలి పట్టడం జరిగింది. ఎంత ఫాస్ట్ గా వచ్చారంటే బుట్టలో పూలు ఉన్నాయా లేవా అని చూసుకొనే వ్యవధికూడా నాకు లేదు. నేను బుట్టలోంచి తీస్తూ ప్రతివాడికి దోసిలి నిండా పూలు ఇస్తునే పోయాను.
అందరూ నమస్కారాలు చేసుకొని వెళ్ళి పోయాక నేను కిందకు వచ్చేశాను.
ఒక పావుగంట అయిన తరువాత నాకు ‘వెలిగింది’. ఇదేమిటి నా పూజ అయినాక బుట్టలో చాలా కొంచెం పూలు మాత్రం ఉన్నాయి. వచ్చినవాడికి వచ్చినట్లు దోసిలినిందా పూలు ఇస్తూ పోయానే! ఇంతమందికి ఆ పూలు ఎట్లా సరిపోయాయి ? అమ్మ అక్షయం చేసింది కదా! ఏ ఒక్క బిడ్డ నిరాశ చెందకూడదని అలా చేసిందని అర్ధం అయింది. అమ్మ ప్రేమకు మరో నిదర్శనం.