“దేవి బాహ్యరూప వర్ణనను భావించి చూస్తే విశాలమైన కన్నులు గలది అని ఈ నామానికి అర్థం. కాశీక్షేత్రంలో గల దేవత విశాలాక్షి . విశ్వరూపమే శ్రీమాతగా భావిస్తే, విశాలదేశమే ఆమె కన్నులు….”
– భారతీవ్యాఖ్య.
విశాలమైన కన్నులు గల శ్రీమాత విశాలాక్షి. విశాలమైన సూర్యచంద్రమండలాలే కన్నులుగా గల తల్లి కనుక శ్రీమాత విశాలాక్షి. విశాలమైన కన్నులు గల ఆ తల్లి చూపులు ఎంత దూరమైనా, ఎక్కడికైనా ప్రసరించ గలవు. అంటే శ్రీదేవి ఎప్పటికప్పుడు మనల్ని గమనిస్తూ ఉంటుందని భావం. విశాలాక్షి అయిన అమ్మవారి దృష్టి నుంచి ఎవరమూ తప్పించుకోలేము. ఎందుకంటే అమ్మవారి ఒక కన్ను సూర్యుడు, మరొక కన్ను చంద్రుడు. పగటివేళ మనం చేసే ప్రతి పనీ సర్వసాక్షిగా సూర్యుడు గమనిస్తూ ఉంటాడు. రాత్రి సమయంలో చంద్రుడు మన చేష్టలకు సాక్షీభూతుడుగా ఉంటాడు. కనుక అమ్మవారి దృష్టిపథం నుంచి మనం తప్పించుకునే ప్రసక్తే లేదు. అలాంటి కన్నులు గల శ్రీ లలితాదేవి “విశాలాక్షి”.
“అమ్మ” – “విశాలాక్షి” “అమ్మ” కన్నులు మనపై ప్రేమామృతధారలను వర్షించే మేఘాలు, మన బాధలను తొలగించే కరుణారసార్ణవాలు. విశాల దృష్టి కల “అమ్మ” విశాలాక్షి. “అమ్మ” దృష్టి విశాలమైనది. కన్నులు చూపులకు నిలయమైనవి. మన దృష్టి సంకుచితం కానంత వరకూ మన నేత్రాలు విశాలమైనవనే అర్థం. విశ్వజనని “అమ్మ” దృష్టిలో – ఈ సృష్టిలో భేదం లేదు. పేద-ధనిక, పండిత-పామర, బాల-వృద్ధ, స్త్రీ-పురుష వంటి తేడాలు లేని “అమ్మ”కు మన గుణగణాలతో కూడా సంబంధం లేదు. వర్ణ, వర్గ, జాతి భేదాలు పాటించని తల్లి కనుక “అమ్మ” విశాలాక్షి. మానవులనే కాదు పశుపక్ష్యాదులను, క్రిమికీటకాదులను ప్రేమించిన తల్లి విశాలాక్షి కాక మరెవరు? ఈ సృష్టిలోని సమస్త చరాచరములను సమదృష్టితో ఆలోకించిన “అమ్మ” – విశాలాక్షి.
“అమ్మ” దృష్టిలో కనిపించేదీ, కనిపించనిదీ అంతా దైవమే. ప్రజ్ఞానమూ బ్రహ్మే అజ్ఞానమూ బ్రహ్మే. అన్నంలోనూ, అశుద్ధంలోనూ పరబ్రహ్మనే దర్శించింది. భగవంతుణ్ణి చూపించమని అడిగిన ఒకరితో “నాన్నా! కనిపించేదంతా ‘అదే’ అయినప్పుడు, భగవంతుడు ‘ఇది’ అని దేన్ని చూపించనూ?” అన్నది. “ఎంత వెతికినా నాకు ‘అది’ కానిది కనిపించడం లేదు” అని పలికిన “అమ్మ” అవలోకనం ఎంత విశాలమైనదో కదా! “ఆత్మ సాక్షాత్కారం అంటే సర్వమూ ఆత్మగా అంటే సర్వమూ దైవంగా కనిపించడం” అన్నది. జగత్తునూ, జగన్నాథుణ్ణి ఒకటిగానే దర్శించిన “అమ్మ” “కృష్ణుడు కూడా విశ్వరూపం అంటూ ఈ సృష్టినేగా చూపించాడు?” అని సందేహానికి తావు లేకుండా స్పష్టం చేసింది. “మాధవుణ్ణి గుర్తించి, అన్ని వస్తువుల్లోను మాధవుణ్ణి చూసిన మానవుడే మాధవుడు” అని పలికిన “అమ్మ” – మానవిగా పుట్టి, మనకు మార్గనిర్దేశం చేసిన మాధవి.
‘మీరు మాలో దైవాన్ని చూస్తారా?’ అని ప్రశ్నించిన ఒకరితో “మీలో కాదు, మీరుగా” అని స్పష్టంగా చెప్పింది. ఇదే ప్రశ్నను – ‘పరమాత్మ అంటే?’ అని వేరే విధంగా ప్రశ్నించిన మరొకరితో “తాను కాకుండా ఇతరం లేనివాడు” అని జవాబిచ్చింది “అమ్మ”. అంటే అన్నింటిలో, అందరిలో ఉన్నది ‘వాడే’ అనే కదా అర్థం. పరమాత్మ గురించి ఎవరు ఎలా ప్రశ్నించినా, “అమ్మ” సమాధానం ఒకటే. ప్రశ్నను బట్టి వాక్యనిర్మాణం మారవచ్చునేమో కాని అర్థం మారదు. ‘పరమాత్మ అంటే?” “తాను కాకుండా లేనివాడు, అంతా తానైన వాడు” అనేది “అమ్మ” ఇచ్చిన సమాధానం.
‘జగన్మాత’ అంటే “జగత్తే మాత” అని నిర్వచించిన “అమ్మ”కు చరాచర సృష్టి అంతా భగవత్స్వరూపమే. అందుకే అందుకే “అమ్మ” దృష్టిలో “అంతా చైతన్యమే కాని జడమే లేదు”. “మీరు దైవం జగత్తు కంటె వేరు అంటారు. నేను ఈ జగత్తే దైవం అంటాను. మలయమారుతాలు, కోయిల కూజితాలు, విరబూసినపూలు, సరోవరాలే కాదు, పెంట, పేడ, చీము, నెత్తురు అన్నీ కలిసిన ప్రకృతినే పరమేశ్వరుడు అనుకుంటున్నాను” అని చెప్పిన తల్లి విశాలాక్షి కాక మరెవరు?
ఇది ఒక కోణం, అయితే మరొక కోణంలో నుంచి ఆలోచించినా “అమ్మ” విశాలాక్షి అని అనిపించక తప్పదు. “అమ్మ” చూపు ఎంత దూరమైనా ప్రసరించ గలదు. ఆ చూపులో అభయం ఉన్నది. ఆ కన్నుల్లో కరుణారస సాగరాలు పొంగిపొర్లుతూ ఉంటాయి. ఆ తల్లి కటాక్షవీక్షణ ప్రసారంలో ప్రేమామృతధారలు స్రవిస్తూ ఉంటాయి. “అమ్మ” చూపులు విశిష్టమైనవి. అవి మనల్ని గమనిస్తూనే ఉంటాయి. “మీరు ఇక్కడికి వచ్చి నన్ను చూస్తారు. నేను మిమ్మల్ని ఎప్పుడూ చూస్తూనే ఉన్నాను”, “అందరూ ఎప్పుడూ చూడరు నన్ను, నేనందరినీ ఎప్పుడూ చూస్తాను”, “నన్ను చూడడానికి మీరు రావాలి. మిమ్మల్ని నేను చూసుకోగలను”, “అదేమిటో నాకు ఎవరూ చూడనట్లుండరు. అంతా చూసినట్లే ఉంటారు.” “నేను మిమ్మల్ని ఎప్పుడూ చూస్తాను. కానీ, నేను చూస్తున్నా ననేది మీకు ఎప్పుడు అర్థం అవుతుందంటే – మీరు చూస్తున్నప్పుడు నేను చూసినట్లు కనిపించినప్పుడే” – అనే మాటల్లో “అమ్మ” విశాలాక్షి అనే విషయం మనకు స్పష్టమవుతుంది.
విశాలాక్షి అయిన “అమ్మ” సర్వసాక్షి కూడా. “నాకు అన్నీ గుర్తున్నాయంటే అవి ఎప్పుడో జరిగినట్లు ఉండవు. అన్నీ ఇప్పుడు జరుగుతున్నట్లు కనిపిస్తుంటుంది”, “నేను చెప్పడంలో విశేషం లేదు,” “నాకు అంతా వర్తమానమే” అని చెప్పిన “అమ్మ”కు ఎక్కడో మద్రాసులో మౌంటురోడ్డు మీద వెళుతున్న వ్యక్తి, తన కళ్ళముందు కదలిపోతున్నట్లు ఉంటుందంటే ఆమె చూపులెంత దీర్ఘమైనవి, ఆమె కన్నులెంత విశాలమైనవి! “అమ్మ” విశాలాక్షి మాత్రమే కాదు విశిష్టాక్షి కూడా, విశిష్టమైన “అమ్మ” కన్నులకు తాను పుట్టక పూర్వం జరిగిన సంగతులు కూడా స్పష్టంగా కనిపిస్తాయి.
గోవిందరాజులు అన్నయ్యగారితో “నిన్ను లోగడ చూశాను. మంగళగిరిలో బాలాంబగారి సత్రంలో నువ్వు అన్నం వడ్డిస్తుండగా” అని చెప్పింది. “అమ్మ”. ఆయన ఆ సంఘటన గుర్తుకు తెచ్చుకుంటే అది 1918 సంవత్సరంలో జరిగినది అని జ్ఞాపకం వచ్చింది. 1923 సంవత్సరంలో పుట్టిన “అమ్మ” వారిని లోగడ చూసినట్లు చెప్పింది. అంటే తాను పుట్టకపూర్వమే వారిని చూసిన “అమ్మ” – విశిష్టాక్షి కాదా!
మనందరిలో దైవాన్ని దర్శించిన “అమ్మ” కళ్ళకు మనమంతా బిడ్డలుగానే కనిపిస్తాం. “నాకు ఎవరిని చూసినా నా బిడ్డే అనిపిస్తుంది”, “నాకు బిడ్డగా కాక, మరో రకంగా ఎవరూ కనిపించరు” అనే “అమ్మ” వాక్యాల్లో మనం తనకు బిడ్డలం అని స్పష్టం చేసింది. “అమ్మ”. ఈ పై వాక్యంలో “ఎవరూ కనిపించరు” అని చెప్పిన “అమ్మ”కు తనకు వచ్చిన గడ్డ, పొంగి పొర్లుతూ వచ్చిన వరదనీరు, మాసపత్రిక వంటివి కూడా బిడ్డలే. అంటే స్థావర జంగమాత్మకమైన ఈ సృష్టి అంతా “అమ్మ” సంతానమే. ఇంతటి విస్తృతమైన దృష్టి కలిగిన “అమ్మ” కన్నుల వైశాల్యం ఎంతని చెప్పగలం? అందుకే “అమ్మ” – విశాలాక్షి.
అతిలోకమూ, అతిమానుషమూ అయిన “అమ్మ” దృష్టి దివ్యమైనది. “అంతా దివ్యంగా కనబడటమే దివ్యదృష్టి” అనే అపూర్వ నిర్వచనాన్ని అందించిన “అమ్మ” దృష్టి ఎంత విశిష్టమైనది. ఎంత విశాలమైనది. “విచక్షణ లేని వీక్షణ” గల ఆ తల్లి విశాలాక్షి.
అర్కపురిలోని అనసూయేశ్వరాలయంలో కొలువై ఉండి, అశేషప్రజానీకాన్ని తన విశాల నయనాలతో వీక్షిస్తూ అందరినీ అనుగ్రహిస్తూ ఉన్న విశాలాక్షి “అమ్మ”ను – విశాలాక్షిగా దర్శిస్తూ – స్మరిస్తూ భజిస్తూ తరిద్దాం.