“ఈ లోకంలో తల్లిలేని వారెవరూ లేరు. నేనే అందరికీ తల్లిని అందరూ నా బిడ్డలే”అని ప్రకటించింది. అమ్మ. ఒకసారి తమిళనాడు నుంచి ఒక పత్రికా సంపాదకులు అమ్మ వద్దకు వచ్చారు. వారు అమ్మతో సంభాషణలు చేసి చివరగా ‘అమ్మా! లోకంలో అందరినీ బిడ్డలుగా చూసిన వారు ఎక్కడా ఏ పురాణాలలోనూ ఏ అవతారాలలోనూ కన్పించలేదు. మీరు ఏ సాధన చేయకుండా ఈ మాతృత్వభావన మీకు ఎలా వచ్చింది?” అని అడిగారు. దానికి అమ్మ “ఏమో, నాన్నా! నాకేమీ తెలియదు. ఏ శాస్త్రం చదివి సాధన చేసి ఆ భావం పొంద లేదు. సహజంగానే ఎవరిని చూసినా బిడ్డే అన్పిస్తుంది. ఎక్కడోవుట్టారు, ఎవరో కన్నారు. ఇక్కడకు వచ్చారు – అన్పించదు. నేనేకని మీమీ తల్లులకు పెంపుడు ఇచ్చానని అన్పిస్తుంది” అన్నది. ఇది వినగానే ఎవరికయినా ఒక సందేహం కలుగుతుంది. మనని నవమాసాలు మోసిన మన కన్నతల్లులు మనకు ప్రత్యక్షంగా కన్పిస్తున్నారు కదా! అమ్మ ఇలా అంటున్నదేమిటి? అన్పిస్తుంది.
కానీ “నన్ను విడిచి మీరు, మిమ్మల్ని వదిలి నేను లేను, మీరందరూ నాయందే నాలోనే ఉన్నారు. అందువల్ల అన్నీ అయి ఉన్నాను” అని ప్రవచించే అమ్మ విశ్వగర్భ. విశ్వమంతా అమ్మ గర్భంలో నుంచే ఆవిర్భవించింది. సముద్రంలోని కెరటాలు లాగా అమ్మ గర్భనుంచే విశ్వమంతా వ్యక్తమయింది. అందుకే అమ్మ ఈ సృష్టి నాది అన్నది – అంటే నేను కన్నది అని. అందుకే నేనెప్పుడూ చూలింతనూ, బాలింతనూ అంటూ నేను ఆదెమ్మను అని తెలియపరిచింది.
‘కడుపు లోపల నున్న పాపడు కాల దన్నినఁ గినతో నడువ బోలునె క్రాఁగి తల్లికి? నాథ! సన్నము దొడ్డునై యడగి కారణ కార్యరూపము నైన యీ సకలంబు నీ కడుపులోనిది గాదె? పాపడుఁగాక యేవడి యెవ్వడన్ ?’
(దశమస్కంధం)
కడుపులో ఉన్న బిడ్డ కాలితో తన్ని బాధపెట్టినా. తల్లి కోపగించి కొట్టదు కదా! స్థూలమూ, సూక్ష్మమూ అయి కారణ కార్య రూపమూ అయిన ఈ సృష్టి అంతా నీ కడుపులోనిది అయినప్పుడు మరి నేను నీ బిడ్డనేకదా! అని బ్రహ్మదేవుడు కృష్ణపరమాత్మతో అన్న మాటలివి. అంటే సృష్టికర్త బ్రహ్మ అయితే ఆ బ్రహ్మనే కన్నవాడు. విష్ణుమూర్తి, ‘విశ్వం విష్ణుః’ అని విష్ణుసహస్రంలోని నామం. ‘విశ్వమాతా’ అని అమ్మ నామం. కనుక ‘విశ్వమాత’ అయిన అమ్మ సృష్టికర్త బ్రహ్మదేవునిలాంటి మన తల్లులందరికీ కూడ తల్లి. ఆ తల్లులను కన్న తల్లులకు కూడా తల్లి అమ్మే.
ఒకసారి ఒక సోదరులు అమ్మను ‘మీ తల్లికి కూడ మీరు అమ్మేనా?’ అని అడిగారు. “నేను అందరికీ అమ్మనే కనుక ఆమెకూ అమ్మనే. కాని ఆమె గర్భాన పుట్టాను కనుక ఆమె నాకు అమ్మే. ఆమె బిడ్డనే నేను. కానీ ఆమె నాకు బిడ్డే” అని సమాధానమిచ్చింది. అందుకే అమ్మ ‘తల్లి అంటే తొలి’ అని నిర్వచించింది. ఈ విషయాన్నే శ్రీ పన్నాల రాధాకృష్ణశర్మగారు ‘అంబికా సహస్ర నామస్తోత్రం’లో ‘సర్వభూత సమాహార కేంద్రీభూత మహోదరా’ సమస్త ప్రాణికోటి అమ్మ గర్భంలోనే ఉన్నదని స్తుతించారు. హైమక్కయ్యను గురించి చెప్తూ హైమను నేనే కన్నాను, నేనే పెంచాను, నేనే చంపుకున్నాను’ అని ప్రకటించిన అమ్మ “మీ అందరిలో హైమను చూస్తాను” అన్నది; అంటే అందరూ అమ్మ బిడ్డలే. మన అందిరిలో హైమక్కయ్యను చూడడం అంటే మానవత్వానికి సంబంధించిన మాతృత్వపు మమకారం. “మీరంతా నాలో పుట్టి నాలో పెరిగి నాలోనే లయమవుతారు”అన్నది. అమ్మ దివ్యత్వం – ఈ మానవతా . మాధవత్వ మధుర సమ్మేళనమే అమ్మ. అమ్మ విశ్వమాతే కాదు; జగద్ధాత్రి కూడ. అమ్మ బాల్యంలోనే “ఏమిటో ఈ మహారాణిగారు తీర్మానం చేస్తున్నారే’అని చిదంబరరావు తాతగారు అంటే “నేను మహారాణిని కాదు, తాతగారూ! సర్వసృష్టికారిణిని” అన్నది.
ఒక తాత “ఈ సర్వసృష్టిలయకారిణివమ్మా” అన్నాడు. కనుక అమ్మే జన్మకారిణి, స్థితికారిణి, లయకారిణి. అమ్మ విశ్వగర్భ కనుకనే ఇది కన్నకడుపు. మిమ్మల్ని నేనే కని మీమీ తల్లులకు పెంపుడిచ్చాననీ”అని ఎరుక పరిచింది. అంతేకాదు. విశ్వగర్భ అంటే విశ్వంలో ప్రత్యణువునందూ ఉన్నది అమ్మే; తత్ సృష్ట్వా తదే వానుప్రావిశత్’ – తానే సృష్టించి తానే అంతటా వ్యాపించి ఉండటం. భాగవతంలో విష్ణుమూర్తి అవతారం అయిన కపిలాచార్యుడు తన తల్లి అయిన దేవహూతికి అబ్జాక్షి! నిఖిల భూతాంతరాత్ముడను’ -నేను సమస్త జీవులలో అంతర్యామి అయి ఉన్నాను. అని ఆత్మ తత్వాన్ని ఉపదేశిస్తాడు.
‘సర్వం యస్మిన్ శేతే – సర్వస్మిన్ యశ్శేతే’ అని చెప్పినట్లుగా అన్నీ ఎవరియందు ఉన్నాయో అన్నిటి యందూ ఎవరున్నారో వారే పరమాత్మ. ఆ పరమాత్మే. మన అమ్మ. కనుక మనందరం అమ్మలో ఉన్నాం; అమ్మ మనందరిలో ఉన్నది. అదే సర్వాతర్యామిత్వం.
సముద్ర ధర్మమే అలలో ఉన్నట్లుగా విత్తనం తత్త్వమే చెట్టుకాయన్నింటిలోనూ ఉన్నట్లుగా సకల సృష్టి దైవమే అయినపుడు ఆ తత్త్వమే అందరియందు ఉంటుంది. ఒకే దీపం వేర్వేరు ప్రమిదల్లో వెలిగినట్లుగా ఒకే తత్త్వం అందరియందు వెలుగొందుతోంది. అందుకే అమ్మ ‘తత్త్వమే జీవతత్వం’ అన్న వాక్యం ద్వారా అందరియందు అన్నిటియందు ఉన్నది భగవత్తత్త్వమే అనీ, ‘మీరంతా దైవస్వరూపాలే, మీరే నా ఆరాధ్య మూర్తులు’ అంటూ లోకాన్ని దైవంగా ఆరాధించమని ఆచరణాత్మకమైన ప్రబోధాన్ని అందించింది.
ఆరాధించడం అంటే ప్రేమించడం. నిస్వార్ధంగా నిర్వ్యాజంగా సాటిమనిషిని ఎంతగా ప్రేమించగల్గితే మనం అమ్మకు అంతగా దగ్గర అవుతాం. విశ్వమానవప్రేమయే అమ్మ అవతార ప్రయోజనం.