శ్రీ ప్రణవదీప్తి ! జ్ఞానచంద్రికవిరాజ!
దివ్య కళ్యాణజనని! శ్రీ వేదమాత!!
“పున్నెముల ఒడి” – “జిల్లెళ్ళమూడి అమ్మ”!
సత్య – శివ – సుందరాత్మికా! శరణు శరణు!!
విశ్వకారుణ్య కాంతుల వెలుగునట్టి,
అపర నైమిశారణ్యమై అలరునట్టి,
చల్లని తపోవనమ్ము – “జిల్లెళ్ళమూడి”!
శ్రీ లొలుకు “అమ్మ” మమతల పాలకడలి!!
పెద్ద గుండ్రని బొట్టుయై – విశ్వమెల్ల
ఫాలమున మెఱయగ; చక్రశూలములను
హస్తముల దాల్చ – భక్తజనార్తరక్ష
చేయు – “అద్వైతమాత”ను చేరిగొల్తు!!
“అమ్మ’ మాట – వేదోక్తి! దయార్ధ పూర్ణ
“మమ్మ” చూపు! “అమ్మ” నిలయ మఖిల దేవ
తాళి కొలువైన – దివ్య దేవాలయమ్ము!
“అమ్మ” – శ్రీ అనసూయేశ్వరాలయమ్ము!!
భవ్య “అం-ఆ” మహామంత్ర దివ్యమూర్తి!
మంగళకరి! రమ్య కరుణామృతఝరి! సక
ల జనకల్పవల్లి! మధురలలిత హృదయ!
అపర “లలితాంబ” = స్వర్ణ సుమాంజలులివె!!
అన్నార్తులకు కూర్మి నన్నము పెట్టి – ‘ఆ
కలి’ తీర్చునట్టి – “బంగారు తల్లి”!
గోశాల నిర్మించి – గో లక్ష్ముల కరుణ
పాలించు చల్లని – “పాలవెల్లి”!
సంస్కృతాంధ్రాగమ – శాస్త్ర విజ్ఞానాల
యాల నిర్మించిన – ఆర్షజనని!
వేదపండిత – సుకవీశ్వరులను సత్క
రించెడి – వేదధార్మిక సవిత్రి!
భాగవత – గీత – రామాయణ ప్రవచన సుధ
రమ్య “లలితా సహస్ర” పారాయణార్చ
నా ప్రియ! అఖిలభక్తజన హృదయాంత
రంగ! “విశ్వజనని! శతప్రణతులివియె!!
శ్రీ లక్ష్మణయతీంద్ర – శ్రీ శివానంద శ్రీ
సిద్ధేశ్వరముని – ఆశీఃవిరాజ!
గానగంధర్వుడా – ఘంటసాల మధుర
గీతాల నలరు – సంగీతరాజ్ఞి!
‘జమ్మలమడక’ కృష్ణభగవాను, “కరుణ-
శ్రీ” – ఉషః “శ్రీ-పదా”ర్చిత పురాణి!
విశ్వనాథ మహాకవి – “కులపతి”, మహతి
బృందావన కవితావన విహారి!
దివ్యపురుషులు సుమధుర భవ్యవాణి
నలరు “అమ్మ” దర్బారు దివ్యార్ష చంద్రి
కల – “మణిద్వీపమై” భువి వెలయ గాను;
“విశ్వకళ్యాణి!” “అపరరాజేశ్వరి!! కరు
ణార్ధ జననీ! “సువర్ణ పుష్పాంజలు”లివె!!!
“విశ్వజనని శతజయంతి” – విభవధార్మి
కోత్సవమ్ము – “అమ్మ”కు సువర్ణోత్సవమ్ము!!!
అఖిల భక్తుల – మాతృ పాదార్చనమ్ము!
భక్తకోటికి మోక్ష సోపానఫలము!!!