(గత సంచిక తరువాయి)
సహన దేవతకును సాష్టాంగ పడుటకు
బాధలనెడు పూలు వలయు గాదె!
బాధలేని యెడల బ్రతుకెట్టు లగుననె
వెలుగుముద్ద అమ్మ విశ్వ గురువు.
ప్రేమకంటె చూడ పెద్దదౌ ధర్మమ్ము
తపనపడుట కంటె తపము గలదె?
మంచితనము కంటె మహిమలు లేవనె
వెలుగుముద్ద అమ్మ విశ్వ గురువు.
తప్పు తెలిసికూడ తప్పించుకొనలేక
తప్పనిసరి గాగ తప్పుసేయు
అప్పు తప్పు లేక అస లుండు నెవడనె
వెలుగుముద్ద అమ్మ విశ్వ గురువు.
ఆలు బిడ్డ లగునె? అసలు సంసారమ్ము
తత్త్వ మెఱుకపడును తరచి చూడ
సంకటముల దారి సంకల్ప మని తెల్పు
వెలుగుముద్ద అమ్మ విశ్వ గురువు.
వ్యాధి బాధ తీర్చు వైద్యుడే దేవుడు
నీతి ఇదియె, లోక రీతి ఇదియె;
వైద్యునికిని రోగి భగవంతు డని తెల్పు
వెలుగుముద్ద అమ్మ విశ్వ గురువు.
విశ్వ జనని మ్రోల వినమిత గాత్రుడై
సాగిలపడ బ్రతుకు సార్ధకమ్ము
అమ్మమాటలన్ని ఆచరించిన వేళ
అంతరంగమెల్ల శాంతిమయము.