అమ్మకు దసరా నవరాత్రులలో, ఉత్తర ద్వార దర్శన సమయంలో, ఇంకా అనేక పర్వదినాల్లో శంఖము, చక్రము, త్రిశూలము, కిరీటము మొదలైనవి ధరింపజేసి ఆయా దేవతా మూర్తులను అమ్మగా ఆరాధించడం అమ్మ భక్తులకందరికీ తెలుసు.
ఇవన్నీ ఎవరో అమ్మ బిడ్డలద్వారానే సంస్థకు సమర్పించబడ్డాయి. ఆ పుణ్యాత్ముల వంశాలు అమ్మ చరిత్రలో చిరస్థాయిగా నిలబడిపోతాయి. వాళ్ల వంశాలు తరించిపోయినట్లే భావించాలి.
శ్రీమతి తంగిరాల దమయంతిగారు తమ ఇంట్లో ఉన్న వెండి వస్తువులను, జరీచీరల వెండిని కరిగించి అమ్మకి శంఖ, చక్ర త్రిశూలాలుగా చేయించారు శ్రీమతి దమయంతి దుర్గాదేవి భక్తురాలు. కనుక, అమ్మను తన ఇష్ట దైవమైన దుర్గాదేవిగా పూజించుకోవాలన్న సంకల్పంతో దివ్యమైన ఆయుధాలను సమర్పించి తమ కుటుంబ సమేతంగా 1961 సంవత్సరం ఆగస్టు 15న అమ్మని పూజించుకున్నారు. ఎంతటి ధన్యాత్ములు తంగిరాల వారి కుటుంబం !
కీర్తిశేషులు శ్రీమతి దమయంతి గారికి ఆరుగురు కుమారులు, ఇద్దరు కుమార్తెలు. 1961వ సంవత్సరం డిసెంబరులో వారి పెద్దకుమారుడు కీ.శే. వెంకట సుబ్బారావు గారి వివాహం వారి స్వగ్రామంలో జరిగింది. అమ్మ, నాన్నగార్ల అనుమతితో హైమను తంగిరాల వారి ఇంటి ఆడపడుచు హోదాలో వివాహానికి తీసుకుని వెళ్లి సకల లాంఛన సత్కారాలు చేయించిన పుణ్య చరిత కీ.శే. శ్రీమతి దమయంతి. ఆ పెళ్లి వేడుకల్లో హైమ ఉత్సాహంగా పాల్గొని అందరినీ ఆనందింపజేసింది.
తర్వాతి కాలంలో హైమ ఆలయ ప్రవేశం చేసినా ఆనాటి నుండి ఈనాటి వరకు హైమవతీశ్వరిని తమ ఇంటి ఆడపడుచుగానే భావిస్తున్నారు. హైమకు విశేష పూజలు చేస్తున్నారు.
ఆ పెళ్లి అయిన కొద్ది కాలానికి 1963 జూన్ నెలలో శ్రీమతి దమయంతి అమ్మలో ఐక్యమయ్యారు. కానీ, వారు సమర్పించిన అమ్మ అలంకార రూపమైన శంఖ, చక్ర, త్రిశూలాలుగా అమ్మ చేతిలో ఇంకా జీవించి ఉన్నారని చెప్పవచ్చు.
కీ.శే. తంగిరాల దమయంతి గారి కుమారులు కీ.శే. వెంకట సుబ్బారావు, సింహాద్రి శాస్త్రిగారు, కీ.శే. రాధాక్రిష్ణ మూర్తి, రామ్మోహన్ రావు, శ్రీనివాసరావు, వెంకట రమణ మూర్తి మరియు వారి వారి కుటుంబ సభ్యులు అందరూ అమ్మ విశేషమైన దయతో మంచి జీవితాలు గడిపారు, గడుపుతున్నారు.
ఈనాటికీ అమ్మ సేవలో ముందుండే శాస్త్రన్నయ్య, రామ్మోహన్ రావు అన్నయ్య, వారి కుటుంబీకులు బహుధా ప్రశంశనీయులు.
అమ్మని సకలాలంకార భూషితురాలుగా చేసి మనకు కనువిందు చేయిస్తున్న తంగిరాల వారి కుటుంబం ధన్యమయ్యింది !