ప్రియమైన సోదరీసోదరులకు –
అనంతమైన అమ్మ మన మధ్యకు వచ్చి ఇప్పటికి వంద సంవత్సరాలు! ఈ శతాబ్ది ఉత్సవాలలో ప్రత్యక్షంగా, పరోక్షంగా పాల్గొంటున్న వాళ్ళు ఎంత అదృష్టవంతులు!! అమ్మ ప్రేమలో, అమ్మ ఆశీస్సులతో మనం అందరం జిల్లెళ్ళమూడిలో ‘అందరిల్లు’లో ఉంటున్నాం. మనమధ్య ఎన్ని తేడాలు, భేదాలు, ఆలోచనలు ఉన్నా, ఎంతో అభివృద్ధి చెందుతున్న ఈ అందరింట్లో అమ్మని ఆరాధిస్తూ ఉంటున్నాం. అయితే, ఈ శతాబ్ది మహోత్సవాల సందర్భంగా ఒక్కసారి మనం అందరం మన జీవితాల్లో అమ్మ ఏమిటో హృదయపూర్వకంగా మన భావాలను పంచుకుందాం. దానిద్వారా మన బంధాన్ని మరింత గట్టి చేసుకుందాం. రాబోయే తరానికి సరయిన వారసత్వాన్ని అందిద్దాం. శతాబ్ది మహోత్సవాలలో నిర్వహిస్తున్న అనేక కార్యక్రమాలలో దీనిని కూడా భాగం చేద్దాం.
ఈ పుణ్యభూమిలో ఒకొక్క ప్రదేశానికి ఒక్కో ప్రాముఖ్యత, ప్రత్యేకతా ఉన్నాయి. మరి మన జిల్లెళ్ళమూడి నిజమైన ప్రాముఖ్యతలేమిటి? ముందుగా చెప్పాల్సింది – దాదాపు మరెక్కడా లేని ‘మాతృతత్వం’! నిజానికి ఇది పుణ్యక్షేత్రం మాత్రమే కాదు; ఇదొక ‘ఆదరణ క్షేత్రం’ అనవచ్చు. ఇంకా చెప్పాలంటే ఇదొక ‘ప్రేమ క్షేత్రం’!!
అయితే, సాధారణంగా ఇక్కడ మన బంధం ఎక్కువగా మానసిక స్థాయిలో, ప్రాపంచిక విషయాలచుట్టూ మాత్రమే తిరుగుతున్నట్లు అనిపిస్తుంది. అమ్మ ఒడిలో, ఆమె ప్రేమలో జీవితాన్ని సార్థకం చేసుకోవాల్సిన మనం, చాలా సందర్భాలలో అమ్మనే మన ఆలోచనా పరిధిలోకి తీసుకువచ్చి, అనంతమైన అమ్మ పరిధిని మనకి మనమే కుదించుకొని చూస్తూ తృప్తి పడుతున్నామా? ఎప్పుడైనా మన అనుభవాలని పంచుకోవలసివస్తే చాలా భాగం ప్రాపంచిక విషయాలనే చెబుతున్నాం. ఇది మన ఎదుగుదలకి ఏమేరకు ఉపయోగపడుతుంది?
‘ప్రేమ’లో మనం పొందేది కేవలం స్వేచ్ఛా, చనువు, స్వాతంత్య్రం లేదా అలాంటిది ఏదో మాత్రమేనని మనం భావిస్తాం. నిజానికి ప్రేమ ఉన్నచోట ఎక్కడైనా, ఎప్పుడైనా, ఎవరికైనా ఉండాల్సింది క్రమశిక్షణ, నమ్మకం, నిజయితీ. ఇది ఏ రూపమైన ప్రేమకైనా వర్తిస్తుంది. ముఖ్యంగా ఇంత పెద్ద కుటుంబంలో స్వీయక్రమశిక్షణ ఎంతైనా అవసరం కదా! ఏ కుటుంబంలో అయినా ఎవరో ఒకరు ఎదిగితే చాలదుకదా; అందరూ ఎదగాలి. అందుకు కొంత క్రమశిక్షణ, అవగాహన, ఓరు తప్పక ఉండాలి కదా!
ఇవన్నీ ఇక్కడ ఒక ఇంకొకరికి చెబుతున్న’ విషయాలు కాదు. మనం అందరం కలసి ఆలోచించుకోవలసిన కుటుంబ విషయాలు. ఇక్కడ ఉన్న ఒక ముఖ్యమైన ప్రత్యేకత – ఈ విషయాలలో మనని నడిపించడానికి ప్రత్యేకంగా ఎవరూ ఉండరు. కాబట్టి, అలాంటప్పుడు మనమధ్య ప్రేమతో కూడిన ఎంతో అవగాహన ఉండాలి! కేవలం ఆ అవగాహన కోసమే ఇదంతా. ఇది చదివి నిజంగా, బాధ్యతగా, మనస్ఫూర్తిగా, మీ హృదయ స్పందన తెలియచేయండి. దానిని మనం అందరం పంచుకొని (షేర్ చేసుకుని) తద్వారా మన ప్రయాణాన్ని మరింతగా కలిసి సాగిద్దాం. పాతతరం పోయి కొత్త తరం వస్తూ ఉంటుంది. రాబోయే తరానికి మనం దీని ద్వారా సరయిన వారసత్వాన్ని అందిద్దాం. దీనిని ఇంకే విషయాలతో ముడి పెట్టకండి. మరేవిధంగానూ చూడకండి. దీనిని దీనిగా చూడండి.
ఇంత పెద్ద కుటుంబంలో కొన్ని పరిస్థితులు సాధారణం కావచ్చు. కానీ మనది చాలా ప్రత్యేకమైన కుటుంబం అనుకుంటున్నప్పుడు దానికి తగ్గట్టుగా మనం ఉండాలి కదా! అందువల్ల ఒక్కసారి మనం అందరం మనసు విప్పి, అన్నీ ప్రక్కన పెట్టి మనని మనం వ్యక్తీకరించుకుందాం. దీని ద్వారా మీరు వ్యక్తంచేసే విషయాలు మిగిలిన వారికి ఎంతో ఉపయోగపడతాయని ఆశిస్తున్నాము. మనం ఎవరినీ అనుకరించవద్దు – స్ఫూర్తిని మాత్రమే పొందుదాం.
మన జ్ఞాపకాలలో, ఆలోచనలలో కాకుండా కేవలం మన హృదయంలో అమ్మని చూసుకుందాం. మనం ఎక్కడ ఉన్నా, ఎక్కడికి వెళ్ళినా ఎదుటివాడికి మనలో అమ్మని చూపుదాం. ప్రచారంతో కాకుండా మనని చూసి మరో సోదరో, సోదరుడో మన వెంట రావాలి. ఎవరైనా మనని చూసి అందరింటికి రావాలి, మన కుటుంబం అలా పెరగాలి. ‘మనం’ వెనక్కి తగ్గి, అమ్మని ముందుకు పెడదాం – ఫొటోల్లో, మాటల్లో కాదు బాహ్యంగా మన ప్రవర్తనలో, లోపల అంతరంగంలో. – అప్పుడు మన జీవితాలని అమ్మే నడిపించదా! ఆస్థితిని మనకి మనం కలిసి తెచ్చుకుందాం. అమ్మ తన పిల్లలని చూసుకుని మురిసిపోయేలా ఎదుగుదాం తద్వారా ఆమె ఋణం కొంతయినా – తీర్చుకుందాం.
చివరిగా –
మన అంతరంగంలోని అద్భుతమైన నిశ్శబ్దం, ప్రశాంతతే ‘అమ్మ’.
నా తోటివాడిపట్ల నా హృదయంలో కలిగే స్పందనే ‘అమ్మ’.
నా బిడ్డను చూస్తే కలిగే స్పందనే, అనుభూతే ఇంకెవరి బిడ్డని చూసినా కలిగే స్థితే ‘అమ్మ’.
నాకు ఆకలి లేక పోయినా- ఆకలి, వేదన అంటే ఏమిటో తెలియటమే ‘అమ్మ’.
‘సర్వత్రా అనురాగం, దాని ద్వారా వచ్చే విరాగమే ‘అమ్మ’.
జననీ!
నిన్ను నేను తెలుసుకునే లోపే
నేను ప్రేమించే ప్రతి ఒక వ్యక్తీ
నీవు ఈ భౌతిక ప్రపంచం నుండి వెళ్ళిపోయావు.
కానీ,
నిన్ను పూజించే ఒక పువ్వుతో సమమని తెలుసుకున్నాను. అందుకే
ఆ పువ్వులతో నీకు
శత సహస్ర నామార్చనలు చేసుకోవాలని
వాటిని ప్రోగుచేసుకుంటున్నాను.
రచయిత : వై.వి.చలపతిరావు,
సెల్ నెం: 7093085638